Previous Page Next Page 
వివాహబంధాలు పేజి 31


    "ఎంత ఘోరం!" నాకు తెలియకుండానే నా నోట్లోంచి ఆ మాటలు వచ్చాయి.
    నన్ను కాదన్నందుకు సుశీలకు పాఠం నేర్పాను" అన్న ఆయన మాటలు నా మనస్సులో ప్రతిధ్వనించాయి.
    ఆయన మాటలకి అర్ధం ఇదా! వణికి పోయాను.
    "హుఁ ఘోరం! మీకూ నాకూ ఘోరం. ఆ రాక్షసుడికి వినోదం! అంతటితోనైనా నన్ను వదిలాడా! ఆయనపోయాక జీవచ్చవంలా పడి వున్న నా దగ్గరికి ఒక రోజు కల్లబొల్లి దుఃఖం నటిస్తూ వచ్చాడు. నా బతుకిలా అయిపోయినందుకు తనెంతో బాధ పడ్తున్నా నన్నాడు. నేనిలా మోడులా ఉంటే సహించలే నన్నాడు. తిరిగి నా జీవితం పుష్పింపచేస్తా నన్నాడు. తనని అపార్ధం చేసుకోవద్దన్నాడు. తన ప్రేమ నిరూపించుకోడానికి ఒక అవకాశం ఇయ్యమన్నాడు! ప్రకాశ్ మాట్టాడింది అంతా విన్నాను ఓపిగ్గా. ఆ క్షణంలో అతని మీద అసహ్యం పట్టలేక పోయారు. ఆ నీచుడ్ని చూస్తూంటే నాకు వళ్ళు ఉడికి పోయింది. చటుక్కున్న లేచి మొహం మీద తుఫ్ మని ఉమ్మాను. "నీకు నా జవాబు ఇది. గెటౌట్, ఇంతకంటే ఇంకేం చేస్తావు నన్ను! మళ్ళీ ఈ ప్రాంతాల కనపడకు. కనిపిస్తే చంపందే నిన్ను వదలను వెళ్ళు." వెర్రిగా అరిచాను నల్లబడ్డమొహంతో. పళ్ళు కొరికి క్రూరంగా చూసి వెళ్ళాడు.
    విజయగారూ ఆ రోజుతో నా జీవితంలోంచి తప్పుకున్నాడు ప్రకాశ్. అంతకంటే నన్నేం చెయ్యాలో తెలియలేదు కాబోలు" శుష్కహాసం చేసి అంది సుశీల.
    "మీ జీవితంలోంచి తప్పుకుని నా జీవితంలో ప్రవేశించాడు. మీ మీద ఎలా చూపాలో తెలియని కసి కట్టుకున్న భార్య కనక పడి ఉంటుందని నా మీద చూపుతున్నాడు" నాకు తెలియకుండా అనేశాను.
    సుశీల ఆశ్చర్యంగా చూసింది. తరువాత సానుభూతిగా, "ఐయామ్ సారీ! అతని పాలపడడం మీ దురదృష్టం. అతనికి తను చాలా అందగాడినని, ఆస్తి వుందని, ఆడపిల్లలు వెంటపడాలని కోరిక. తనని తిరస్కరిస్తే అతని అహం దెబ్బతింటుంది. అతన్ని కాదంటే అతనిలో పశుత్వం మేల్కొంటుంది. అతనికి ఎదురు తిరిగితే రాక్షసుడే అవుతాడు. అసలు అ మనిషిలో ఏమన్నా మెంటల్ గా లోపం వుందేమో అనిపిస్తుంది ఒక్కోసారి విజయగారూ!" అంది సుశీల.
    ఆ మాటలో నిజం వుందనిపించింది నాకూ. "మీరు....మీరిపుడేం చేస్తున్నారు?" అన్నాను సానుభూతిగా.
    సుశీల శుష్కహాసంచేసి "చేయడానికి ఏముంది? బతకాలిగా! ఏదో ఉద్యోగం చూసుకుని మోడులా బతుకీడుస్తున్నాను." అంది.
    వెళ్ళడానికి లేచాను.
    "విజయగారూ! ఒక్కమాట. ఎలాగో పెళ్ళి అయింది. భర్త అతన్ని మీరు భరించాలి. కనక-అతన్ని మంచిగా మార్చగలరేమో ప్రయత్నించండి. అతన్ని రెచ్చగొట్టడంవల్ల మరింత రాక్షసుడవడం మినహా ప్రయోజనం వుండదు. ఒక స్నేహితురాలిగా యిది నా సలహా." అంది అభిమానంగా.
    ఏం మాట్లాడేందుకు లేక స్నేహంగా చెయ్యి నొక్కి వచ్చాను.
    ఇంటికి వచ్చి అత్తగారితో అంతా చెప్పాను. ఆవిడ మొహం పాలిపోయింది. చెమటపట్టింది.
    "నిజం. నిజంగానా....వీడు అంత పని చేయించా డంటావా! నమ్మలేకుండా వున్నాను." గుండెలమీద భయంగా చేయి వేసుకున్నారు.
    "హు ... కన్నతల్లి కనక మీరు నమ్మలేరు. ఇంకా యిలాంటి వారితో కాపురం చెయ్యమనే అంటారా? నన్ను కోడలిగాకాక కూతురిగా భావించి చెప్పండి."
    ఆవిడ యిబ్బందిగా చూశారు. "అమ్మా, విజయా! నీవే అన్నావు. నేను కన్నతల్లిని. కొడుకు ఎలాంటివాడైనా తల్లి అభిమానించకుండా వుండలేదు. వాడి శ్రేయస్సు కోరుతూనే వుంటుంది. చిన్నప్పటినుంచీ వాడి స్వభావం వింత గానే వుండేది. ఒక్కడే కొడుకేమో! ఆడింది ఆటగా పెరగటంతో పంతం, మంకుతనం, గారాబం, కోపం అన్నీ వుండేవి. అంతేకాదు. తను చెప్పిన పని చేయని ఆయాని గిల్లేవాడు. కొరికేవాడు. నౌకరు ఏదన్నా తెమ్మన్నది తేకపోతే చేతిలోది విసిరేవాడు. వాడు అడిగింది మేం లేదంటే తిండి తినేవాడుకాదు. ఇంట్లో అన్నీ విరగగొట్టి పాడుచేసే వాడు. ఇంట్లో కుక్క పిల్లని తోకపట్టి పీకిపీకి అది కుయ్యో మంటే ఆనందించేవాడు. పిల్లి చెవులు ఎత్తిపట్టి కుదేసే వాడు. వీధిలో పిల్లలతో ఆడుతూ వాళ్ళని నానావిధాలా ఏడిపించేవాడు. ఆఖరికి పక్షి కనిపించినా రాయి విసిరేవాడు. చీమ కుట్టినా కసిగా కాలితో రాసేవాడు. ఇదంతా మా పెంపకం లోపమేమో? ముద్దుచేసి పాడుచేశాం అని బాధ పడే వాళ్ళం. ఒక్కగా నొక్కడ్ని ఏమీ అనలేక, అంటే వాడి హఠం భరించలేక వాడు అవునన్నది చేసేవాళ్ళం. అదంతా చిన్నతనం. సరే యిప్పుడు తను కావాలన్నది దొరకలేదని యింత అమానుషంగా ప్రవర్తించాడంటే యింక వాడ్ని గురించి ఏం అనుకోవాలో అర్ధంగావడంలేదు. నేనేం చెప్పను. నా కొడుకుతో కాపురం చెయ్యొద్దని ఎలా చెప్పను. నీఇష్టం తల్లీ!" అందావిడ బాధగా.
    ఆవిడ మనోవ్యధ అర్ధం అయింది.
    "చూడమ్మా! వాడి అదృష్టం ఎలా వుందో! కుదురుగా కాపురం చేసుకుంటాడో, వడ్డించిన విస్తరిని చింపి పోగులు పెట్టుకుంటాడో వాడి అదృష్టంమీద ఆధారపడి వుంది. ఆ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వాడికి ఒక్క అవకాశం యియ్యమని తల్లిగా అడుగుతున్నాను. నాకు కూతుర్లు లేరు. కూతురైతే ఏం చెప్పేదాన్నో మరి. కాని కొడుకునికాని కన్నా కడుపుతీసి తెలుసుకున్నాను. ఇంత చెప్పినా వాడిమీద మమకారం చావడంలేదు. నాకోసం వాడికి ఒక్క అవకాశం యిచ్చి చూడగలవా విజయా! ఇది ఆజ్ఞ కాదమ్మా! అభ్యర్ధన." అన్నారు ఆమె నా చేతులు పట్టుకుని.
    అంతటి సహృదయిని మాట ఎలా కాదనగలను? సరే ఆనక తప్పలేదు.
    
                                            *    *    *

 Previous Page Next Page