Previous Page Next Page 
మాయ జలతారు పేజి 31


    "మైకేలు తలుపు తీసి గదిలో లైటు వేసి నన్ను లేపాడు . లేచి చూస్తె బాగా రాత్రి అయిపొయింది. నా ముందు మైకేలు , సైతానులా కనిపించాడు. మళ్ళీ ఏదో ప్రమాదం మూడుతుందని శంకించాను. 'లే' తయారుకా బజారుకు వెళ్దాం, టాక్సీ తెచ్చాను' అన్నాడు మైకేలు 'ఎక్కడికి'? అడిగాను నేను 'డెయిజీ' మంచి పిల్లవు , నిన్నింక వ్యాపారంలోకి దింపనుగా అలా బజారుకు వెళ్ళి వద్దాం చూడు, ఎంత అలసిపోయావో" అన్నాడు మైకేలు . మైకేలు నాకు తండ్రి , అతడు నా నిశ్చయాన్ని అర్ధం చేసుకున్నాడనుకున్నాను. సంతోషించాను క్షణంలో తయారయి వచ్చేశాను. పొద్దున్నుంచీ ఏమీ తినలేదు. ఆకలిగా ఉంది ఇద్దరమూ హోటల్లో తిన్నాం. తరవాత ఇక్కడికి తీసుకొని వచ్చి దింపి వెళ్ళిపోయాడు నా ఏడుపులు, ప్రార్ధనలూ వమ్మైనాయి సూరీ! ఇదీ జేలు కంటే అధ్వాన్నమనుకో అవసరాలన్నీ గదిలోకి వస్తాయి ఇక్కడ్నుంచి కదలడానికి వీల్లేదు. మరో ప్రపంచం ఉందనే విషయం ఇక్కడి వారికి తెలియదు. పచ్చలైటు వెలిగింది ఏం చేయాలో అర్ధం కాలేదు. గుండె దడదడ కొట్టుకుంది. నువ్వు వచ్చావు కొంత ఊరట లభించింది సూరీ! ఇదీ నా పాపపు కధ ఇక ఆలోచించు నా మీద ఏమాత్రం సానుభూతి ఉన్నా నన్ను రక్షించు" అని సోఫా మీద వాలిపోయింది డెయిజీ.
    సూరి గ్లాసందుకొని రెండు గుటకలు వేశాడు సిగరెట్టు పొగ వదులుతూ సోఫా మీద తల వెనుకకు వాల్చి ఫ్యాను వైపు చూస్తూ ఆలోచనలో మునిగిపోయాడు. ఫ్యాన్ తిరుగుతున్న ధ్వని తప్ప గదంతా మౌనంగా ఉంది విన్న వాటన్నింటిని గురించీ ఆలోచించసాగాడు సూరి అతనికి డెయిజీ మీద సానుభూతి పురికొల్పుతుంది. రక్షించాలి - నిజమే! అందువలన ప్రయోజనం ఏమి" మనిషిలోని వ్యాపారం  ప్రశ్నించింది. మానవత మేను వాల్చింది. వ్యాపారం తలెత్తింది ఎంత ఆలోచించినా అతనికి ప్రయోజనం కనిపించలేదు. తటాలున ఒక మెరుపు మెరిసింది ఏదో ఆలోచన వచ్చేసింది ఉరుము ఉరిమింది. కుండపోతగా వాన మొదలైంది ఫ్యాను ఉన్నా ఉక్కపోత మొదలైంది.
    ఉస్మాన్ తో ముఖం వాచేట్లు చీవాట్లు తిన్నాడు లక్ష్మిని - రజనిని - సాధించలేకపోయినందుకు రజని ప్రపంచానికి రాజారావు రాజై కూర్చున్నాడు డెయిజీతో సాధించవచ్చు ననుకున్నాడు.  
    "డెయిజీ!"
    ఉలిక్కిపడి చూచింది డెయిజీ
    "డెయిజీ! నీ కధ విని నా హృదయం కన్నీరై కరిగిపోయింధనుకో మట్టి గుండెలో సైతం మానవత కలిగిస్తుంది నీ కధ నిన్ను ఆదుకోవడమూ అందలాల్లో ఉంచడమూ మానవమాత్రుని కర్తవ్యం రాజారావు వట్టి మూర్ఖుడు బండ బాస్టర్డ్ ఇదిగో,  నా చేయి అందిస్తున్నా అందుకో లే! నాతొ నడువ్ ఈ సూరి ఉన్నాడే - మహిళా సమాజానికి సేవ చేయాలనే దీక్ష బూనాడు ఈనాడు" అన్నాడు.
    డెయిజీ సూరి చేయి అందుకుంది ఇద్దరూ గది దాటారు మెట్లు దిగారు గుమ్మం దాటారు వీధిలో వచ్చారు కారెక్కి వెళ్ళిపోయారు.

                           14

    "అరె అల్లింక బజన్లు చేస్తాన్రు. ఇంకో చస్టి కొట్టోద్దామెళ్ళండి" విసురుగా అన్నాడు రామమనోహర్ సింగ్
    ఉస్మాన్, వస్తాదులు గూడానికి వచ్చి నాటినుంచి చాలా రాత్రి దాకా భజనలు చేస్తూ మెలుకువతో ఉంటున్నారు. గూడెం వాళ్ళు గూడెం వాళ్ళను బెదర కొట్టడానికి వచ్చిన గుండాలు దూరంగా ఒక గుంతలో కూర్చొని సమయానికై చూస్తున్నారు.
    "పైకమేడిరా! ఖర్చు చేస్తి గద సొంతం తాగేటాన్కి హద్దున్నాది? ఎంత తాగుతవ్ బే సింగ్?" అన్నాడు హుసేన్.
    "దోరేంతిచ్చిండు?" అడిగాడింకోడు.
    "ఎంతిస్తే నీకెంద్కుబే పోయించిన తాగినౌ చెయ్యమన్నది చెయ్ బస్ బక్వాస్ బంద్"
    "సగం కొట్టిండు కమీషన్" సింగ్ అంటించాడు.
    "ఇచ్చిందెంతో చెప్పటాన్కి బుగులెందుకే?" అడిగాడు మరొకడు.
    "మనం గరీబొల్ల నోరు కొడ్తాన్నం మన నోరీ హుసేన్ గాడు కొడ్తాండు హుసేన్ గాడి నోరు ఉస్మాన్ గాడు కొడ్తాండు ఉస్మాన్ గాని నోరు కొట్టేటోడెల్ల లేడురా ఇయాల్టికి"
    "చుప్ , ఎంటిబే బక్వాస్ పనిచేయాలే పైసల్చేతు లేస్కోవాలె ఎందుకుబే లబ్ లబ్ ముహి ఖరాబ్" అన్నాడు హుసేన్ దాడాల్లో పొరుపులు వస్తే తన అస్తిత్వానికి భంగం అని గ్రహించాడు హుసేన్ "అబే సాలె! కామ్ హోనే దే బే ఏక్ నైదో చస్టి లాగానా" అన్నాడు.
    "అట్లను దాదా! ఇదో తయార్" అని రెట్ట మీద చేయి చరిచాడు వస్తాదు మనోహర్ సింగ్.
    "ఆగా చూసినవా? బజన బందైంది గుడిసేల్లోకి పోతాన్రు బద్మాషులు" అన్నాడోకడు.
    "బైరో అభీనై అందర్నీ పోనీ ఆధా ఘంటా" అన్నాడు హుసేన్.
    భజన ముగించి ఎవరి గుడిసెల్లోకి వారు వెళ్ళిపోయారు.
    అరగంట గడిచింది బాలయ్య తప్ప మిగతావారంతా నిద్రపోయారు. హుసేన్ "నిక్లో" అని సైగ చేశాడు చీకట్లో బైల్దేరింది నిశాచర వర్గం కొంతదూరం వచ్చి చెదిరిపోయారు. ఒక్కొక్కరూ ఒక్కొక్క గుడిసెముందుకు వెళ్ళారు. దుడ్డు కర్రల్తో తలుపుల్ను బాదసాగారు. "రండిబే మంది జాగల్ల ఉంటార్ర! ఎల్లుండి మొగోళ్ళీతే తడాఖా తెలుస్తది ఉస్మాన్ సాబ్ ది మీ పెళ్ళాలను అక్కల్ను అమ్మల్ను" పోగేస్తున్నారు గుండాలు విచ్చలవిడిగా బాదేస్తున్నారు తలుపుల్ను తడకల్ను .
    ప్రతి గుడిసేలోనూ కలకలం బైల్దేరింది. అంతా అయోమయంగా ఉంది ఒకరి విషయం ఇంకొకరికి తెలియడం లేదు. ఈలోగా పెద్ద కేక వినిపించింది అది పొలికేక అది పిచ్చయ్య వేసిన కేక -- "కొట్టండి!"

    అమాంతంగా అన్ని తలుపులూ , తడకలూ తెరచుకోన్నాయ్. ప్రతి గుడిసె ముందున్న వాని ముఖాన కారపు నీళ్ళు కొట్టారు ఆడవాళ్ళు. దుడ్డు కర్రలు తీసుకొని బైటికి వచ్చారు గుడిసెలవాళ్ళంతా.
    వస్తాదుల కళ్ళలో కారం పడింది కళ్ళు మండుతున్నాయ్ అంతా చీకటి అయోమయం ఎటుపోయినా దెబ్బలు పడుతున్నాయి పరుగెత్తబోయి ఒకరినొకరు గుద్దుకున్నారు. వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకున్నారు. తల మీద ఎవర్నీ కొట్టవద్దనే బాలయ్య ఆదేశాన్ని అంతా పాటించారు. కాళ్ళ మీదా, వీపుల మీదా చావబాదారు. కకావికలై పారిపోయారు వస్తాదులు. వెంటబడి తరిమారు గుడిసెల వాళ్ళు కొంతదూరం తదిమిం తరువాత తిరిగి వచ్చేయమన్నాడు బాలయ్య.
    అంతా ఒకచోట కూడారు బాలయ్యను ఎత్తుకొని "బాలన్నకూ జై" అంటూ గుడిసెల వద్దకు వచ్చి బాలయ్య ఇంటి ముందు కూడారు.
    "పైనున్నాడితో లడాయి పానం మీద కొస్తది. ఆకు ముల్లు మీద పడినా ముల్లు ఆకూ మీద పడినా నుఖ్సాన్ ఆకుకే అయితదే నేననేడి దేదంటే -- ఉస్మాన్ కు కిరాయి కడ్డం చూసిండ్రు కద ఇయాల గుండా లొచ్చిర్రు రేపు పోలీసులోస్తరు సర్కార్ వాల్లదే గదనే మనం ఏం చేస్తం?" అన్నాడు పుల్లయ్య.
    'అబ్బే! అడికేందుకు కట్టాల్నురా, జాగేమన్న వాని తాత దనుకున్నావా? బెదిరించి అదిరించి జాగ మింగాల్నాని చూస్తాండు నెలకైదు మనమే కూడెద్దం , నెలకు పాంచ్ సౌ జమైనది!" అన్నాడు పిచ్చయ్య.
    "ఏం చెప్పినవే పిచ్చయ్యన్న అయిదు కాదు పదిస్తం" అన్నాడోకడు.
    జనంలో గుసగుసలు బైల్దేరాయి. పది రూపాయలు ఒక్కసారి ఎవడిస్తాడు? అందరూ సాధ్యపడదని తేల్చుకున్నారు. "బువ్వకు లేనోళ్ళు పది యాన్నించిస్తరే  అయిదియ్యటయే ఎక్కువాయె అడికిస్తే చాలు" అన్నాడు మరొకడు.
    "కిరాయి కట్టల్నే నువ్వే మన్నను నేనైతే కడ్త" అని తన నిశ్చయం చెప్పి లేచి నుంచున్నాడు పుల్లయ్య.
    "ఎనకొచ్చిన కొమ్ములే తేజున్నాయ్ రో" అన్నాడోకడు.
    "ఏమన్న మరి మీరియ్యకుంటే నేనైతే కడ్త" అని లేచాడు పుల్లయ్య.
    "యాడికిబే పోతవ్ కిరాయి కడ్తడట! కిరాయ్౧ వచ్చిండు తీస్ మార్ ఖా" అని లాగి కూర్చో పెట్టాడు. పిచ్చయ్య "నఖ్రాల్లేస్తే లాతు కొట్టి ఏళ్ళకోడ్త గుడిసెల్నుంచి" అన్నాడు.
    పులయ్యకూ కోపం వచ్చింది కాని, మింగాడు "ఏళ్ళ కొడ్తే నువ్వేట్లుంటవో నేను చూస్త" అన్నాడు.
    "గదే బె నేననేడిది ఉంటె అందరముండాలే పొతే అందరం పోవాలె ఒక్కణ్ణి పోయి కిరాయి కడ్తనంట వేమ్ర?"
    "అనుకుంటే కట్టండి కిరాయి నేనైతే పోను వాడి తానికి అందరిస్తే నేను గూడిస్త అంతే" అన్నాడు బాలయ్య "చావండిర కొడుకులు" అని పళ్ళు పటపట కొరికాడు పిచ్చయ్య . "కిరాయి కట్టుకోండి, హుసేన్ సాగర్ల పడుండి" అని, "రాబే బాలయన్న , పోదం" అని బాలయ్యను లాక్కుపోయాడు.

 Previous Page Next Page