బ్రహ్మాండమైన ఆనకట్ట బద్దలైపోయినట్లు యింక చెప్పడం మొదలెట్టాడు కృష్ణాజీ.
తను వెదికి వెదికి ఒక అప్రాచ్యపు వెధవని చేరదీశాననీ, వాడిని ఉద్దరిస్తున్నాననుకుని పాతిక వేలు తగలేసుకున్నాననీ, అదంతా ఆపాత్రదానంలాగా అయిపోయిందనీ, అన్ని వివరాలూ చెప్పాడు.
సరిగ్గా అతను అలా చెబుతున్న టైంలోనే -
అక్కడికి చేరుకున్నాడు రాజా.
లాన్ లో కృష్ణాజీ కూర్చున్న టేబులు కాంపౌండ్ వాల్ కి దగ్గరిగా వుంది. ఆ టేబులు వెనకే ఒక చెట్టు ఉంది.
ఆ చెట్టు కొమ్మమీద కూర్చుని వున్నాడు రాజా. కృష్ణాజీ చెబుతున్నది అతనికి స్పష్టంగా వినబడుతోంది. దృశ్యం కూడా స్పష్టంగానే కనబడుతోంది. జేవురించిన మొహంతో, కోపంతో వణుకుతున్న గొంతుతో చెబుతున్నాడు కృష్ణాజీ -
"రెడ్డీ! నా గుండె ఎంత మండిపోతుందంటే, ఈసారి ఆ కుర్రవెధవ గనక కనబడ్డాడంటే చాలు, కర్ర విరిగేటట్లు కొడతా, సున్నంలోకి ఎముక మిగలకూడదు. అంత కసిగా ఉంది. ఇంతగా నేనెప్పుడూ నమ్మి మోసపోలేదు" అన్నాడు.
సానుభూతిగా తల పంకిస్తున్నాడు రెడ్డి. కృష్ణాజీ యింత బాడ్ మూడ్ లో వుండడం అతనెప్పుడూ చూడలేదు.
కృష్ణాజీ ఆగ్రహంతో ఇంకా అంటూనే ఉన్నాడు.
"పోలీసు బ్రూటాలిటీ, డిగ్రీ ట్రీట్ మెంటూ, టార్చరూ...వీటికి నేను వ్యతిరేకం అని నీకు తెలుసు కానీ, ఇవాళ అనిపిస్తోంది నాకు. ఇలాంటి కేడీ వెధవల మీద అలాంటి మెథడ్సు ప్రయోగించినా తప్పులేదని"
కృష్ణాజీకి అడ్డు రాకుండా సావధానంగా వింటున్నాడు దివాకర్ రెడ్డి. కడుపులో ఉన్న కోపాన్ని యిలా మాటల రూపంలో కక్కేస్తే కృష్ణాజీ మళ్ళీ మామూలు మనిషయి పోతాడని అతనికి తెలుసు.
ఆపకుండా అయిదు నిమిషాలపాటు రాజాను తిడుతూనే ఉన్నాడు కృష్ణాజీ. తిట్టి తిట్టి "బ్లడీ షిట్!" అని తుపుక్కున ఉమ్మేసాడు.
చెట్టుమీద కూర్చుని వింటున్న రాజా గుండె గొంతుకి అడ్డుపడినట్లు అయ్యింది. కృష్ణాజీ ఇలా ఉగ్రనరసింహావతారంలాగా ఉంటాడని అనుకోలేదు అతను.
ఆనందరావు కృష్ణాజీకి ఇంతగా బ్రెయిన్ వాష్ చేసి, తనపట్ల ఇంత తీవ్రమైన వ్యతిరేకత సృష్టించగలడని కూడా ఊహించలేదు అతను.
ఈ లెఖ్కన ఆ ఆనందరావు తలలు తీసి తలలు పెట్టగలిగినంత తెలివిగలవాడన్న మాట.
తర్వాత అర్దరాత్రి దాకా ఆ చెట్టుమీదే కూర్చున్నాడు రాజా. అర్దరాత్రి తరువాత లాన్ లో సందడి తగ్గింది.
జనం వెళ్ళిపోయారు.
లైట్లు ఆరిపోయాయి.
అప్పుడు నెమ్మదిగా చెట్టు దిగి, గోడ దూకి రోడ్డు మీదికి వచ్చాడు.
అతని మెదడు మొద్దుబారిపోయినట్లయ్యింది. ఉత్సాహం చచ్చిపోయినట్లయ్యింది.
అప్పుడు హఠాత్తుగా వచ్చింది రాజాకి ఆ ఆలోచన.
చచ్చిపోవాలని తీవ్రంగా అనిపించింది.
ఇంక ఆ విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచించలేదు అతను.
తక్షణం చచ్చిపోవాలనే నిశ్చయాని కొచ్చేశాడు.
ఆ నిర్ణయాన్ని అప్పటికప్పుడే ఆచరణలో పెట్టెయ్యదలుచుకున్నాడు కూడా.
అదే సమయంలో....
యముడి వాహనంలా దూసుకు వచ్చేస్తోంది ఒక లారీ.
లారీ దగ్గరవగానే, దానికి అడ్డంగా పడ్డాడు రాజా.
* * * *
మళ్ళీ కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్ బెడ్ మీద వున్నాడు.
అయితే తను ఇంకా బతికే వున్నాడా? చావలేదా?
మొండి ప్రాణం! తొందరగా పోదన్నమాట!
అంతలోనే, ఎడమ చెయ్యి జివ్వున లాగినట్లయ్యింది. కుడికాలుని కత్తులతో పొడుస్తున్నంత నొప్పి కలిగింది.
అతి కష్టం మీద తల వంచి చూశాడు రాజా.
తన వళ్ళంతా బాండేజీలే!
ఎన్ని ఎముకలు విరిగాయో?
రాజాకి మెలకువ రావడం గమనించింది అక్కడే వున్న ఒక నర్సు. ఆమె మొహంలో ఎగ్జయిట్ మెంటు కనబడుతోంది. పరిగెత్తుకెళ్ళి డాక్టర్ తో చెప్పింది.
"ఓహ్! కళ్ళు తెరిచాడా? అయితే ఇది మెడికల్ హిస్టరీ అవుతుంది!" అన్నాడు డాక్టర్ కూడా అంతకు మించిన ఎగ్జయిట్ మెంటుతో.
వాళ్ళ ఎగ్జయిట్ మెంటుకి కారణం వుంది.
ఇరవై రెండు చోట్ల ఫ్రాక్చర్ అయ్యింది రాజాకి.
అంత చిన్న వయసులో అంత పెద్ద గాయాలని తట్టుకుని బతికి బయటపడడం అంటే మామూలు సంగతి కాదు.
పరుగులాంటి నడకతో వార్డుని చేరుకున్నాడు డాక్టర్.
అప్పటికి రాజా కళ్ళు అలసటతో మళ్ళీ మూతలు పడిపోయాయి.
అతన్ని కంప్లీట్ గా టెస్ట్ చేశాడు డాక్టర్. తరువాత అన్నాడు తృప్తిగా.
"నో ప్రాబ్లం! దిస్ ఫెలో ఈజ్ అవుటాఫ్ డేంజర్! కానీ ప్రాపర్ ట్రీట్ మెంటూ, ఆ తరువాత కరెక్టు ఫిజియోథెరపీ అవన్నీ చేయిస్తేనేగానీ మామూలు మనిషి కాడు. లేకపోతే ఏదో బతికి బయటపడినా కూడా, కాలూ చెయ్యీ సరిగ్గా వుండవు. వీడికి నా అన్న వాళ్ళెవరూ వున్నట్లు లేరే!"