"మరొక్క సంగతి. ఇది ఆరంభించడానికి కావాల్సిన సామానులు, చోటు అది చూపించి, మీ అందరినీ ఒకచోట చేర్చడం నా పని. రోజూ మీతోపాటు నేనూ ఈ పని చేయలేను, ఎందుకంటే నాకు యింటిపని, స్కూలు పని, మధ్యాహ్నం మీ చదువు, రాత్రి వయోజన విద్యలాంటి వన్నీ చెయ్యాలి. అంచేత రోజూ మీతోపాటు నేనూ కూర్చోలేకపోవచ్చు. ఇదిగో ఈవిడ ఆర్డరు ఇచ్చి మనచేత చేయిస్తుందని అనుకోవచ్చు. అందుకని ముందే చెప్తున్నాను.
ఈ పనిని మన అన్నపూర్ణమ్మగారు, పద్మావతిగారు, సుగుణ చూసుకుంటారు. ఎవరోఒకరు దగ్గరుంటారు. ఊరగాయలు అవీ పెట్టించడం, అవి సీసాల్లో ప్యాక్ చేయించడం అంతా ఈ ముగ్గురి పర్యవేక్షణలో జరుగుతుంది. ఇందులోవచ్చే లాభాలు నాకేం అక్కరలేదు. ఎంతమంది పనిచేస్తారో అది వారే పంచుకుంటారు..." రాజేశ్వరి అంతా వివరించింది ముందుగానే. అపోహలు తలెత్తకుండా.
"ఎంతయినా రాజేశ్వరిగారు ముందుచూపున్నవారు. అన్నీ ముందే చెప్పారు" ఇంటికెళుతూ అన్నపూర్ణమ్మ అంది.
"మంచిదేగా చెప్పడం. తరువాత మాటమాట అనుకోకుండా..." పద్మావతి అంది.
"నలుగురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకొకరిని అనుకోవడం ఆడవాళ్ళ లక్షణం అంటారు. అందులో ఇలాంటి పనులు చేసినవారికి నాలుగు రోజులు పోగానే ఆడిపోసుకుంటాం. అత్తయ్య అందుకే అందరిముందు చెప్పింది" సుగుణ అంది.
* * *
వారంరోజుల తర్వాత ఓరోజు మార్నింగ్ వాక్ కి వెళ్ళివచ్చేసరికి రాజేశ్వరి ఎవరో అమ్మాయితో మాట్లాడుతూ కన్పించింది. పాతికేళ్ళ అమ్మాయి. సింపుల్ గా వున్న ఆ అమ్మాయి ముఖంలో సంస్కారము, విజ్ఞానం కనపడ్డాయి.
"అదిగో డాక్టరుగారు వచ్చేశారు. ఇదిగో ఈ అమ్మాయి డాక్టర్ శ్యామల...ఇప్పుడే వచ్చింది ఊర్నించి..." రాజేశ్వరి పరిచయం చేసింది.
"ఓ... ఎవరో అనుకున్నాను. వచ్చావన్నమాట అమ్మా ఐయామ్ గ్లాడ్ దట్ యూ హాల్ కమ్ డాక్టర్" ఆ అమ్మాయిలేచి వినయంగా నమస్కారం చేసింది.
"కూర్చోమ్మా కూర్చో... ఈ పల్లెటూరంటే రానంటావేమో అనుకున్నాను. నాకంటే చిన్నదానివి మీరు అంటే బాగుండదు- నిన్ను అంటే ఏమనుకోకమ్మా...నా కూతురికంటే చిన్నదానివి.
"నర్సు విమలగారి ఉత్తరం చూడగానే సంతోషం వేసింది డాక్టర్. మీలాంటి గొప్పవారికింద పనిచేసే అదృష్టం కలిగిందని సంతోషం కల్గింది...పల్లెటూరంటే అమ్మో ఎలా ఉండడం అనిపించి భయంవేసేది. మీరూ వచ్చి వున్నారని విమలగారు రాశాక అమెరికా నుంచి వచ్చిన ఆయనే వుండగా లేనిది నేనెందుకు వుండలేను అన్పించి వచ్చాను సార్."
"చూడమ్మా, యిదేం పెద్ద ఆస్పత్రి కాదు- ప్రమోషన్లుండవు. ఏడాదికేడాది ఇంక్రిమెంట్లు వుండవు. నిస్వార్థంతో డాక్టరుగా నీ వృత్తిని నిర్వహించాలి. ఎలాగో నీకు ఇప్పుడుమంచి ఉద్యోగం లేదు కనక కొన్నాళ్ళుండి- ఇంకేదన్నా మంచి ఆఫర్ వస్తే వదులుకోనక్కరలేదు. ఇక్కడ ఉన్నందుకు నీవు భవిష్యత్తులో నష్టపోకుండా చూసే బాధ్యత నాది.
"తప్పకుండా సార్! ఒకటి రెండేళ్ళయినా మీకింద పని నేర్చుకుంటాను" వినయంగా అంది.
"ఆ... డాక్టర్... గైనిక్ ప్రాబ్లమ్స్ అటెండ్ అవ్వగలవా - నీ అంతట నీవు నిర్ణయాలు తీసుకోవల్సి వుంటుంది. నాకు ఆ సబ్జక్ట్ తో అసలు పరిచయం లేదు. ఇక్కడికి వచ్చే ఆడవారి కేసులన్నీ నువ్వే చూసుకోవాలి. కెన్ యూ మానేజ్ యిట్."
"ఐ థింక్ సో సర్, హౌస్ సర్జన్ గా వున్నప్పుడు చాలా కేసులు అటెండ్ అయ్యాను. సిజేరియన్స్ అసిస్ట్ చేశాను. గత ఏడాది నుంచి నర్సింగ్ హోములో బాగానే ఎక్స్ పీరియన్స్ వచ్చింది. మరీ కాంప్లికేటెడ్ కేసులయితే చెప్పలేనుగాని మిగతావి హేండిల్ చెయ్యగలననే అనుకుంటున్నాను. ఎనీహౌ, ఐ విల్ ట్రై మై బెస్ట్ సర్."
"థాంక్యూ. ఆ మాత్రం భరోసా చాలు." అన్నారు కేశవరావు. లోపల్నించి రెండు కప్పులతో కాఫీలు పట్టుకొచ్చింది రాజేశ్వరి. "మొహం అదీ కడుక్కున్నావా అమ్మా. లేదంటే బాత్ రూము చూపిస్తా. కడుక్కుని వచ్చి కాఫీ తాగు."
"రైల్లోనే కడుకున్నానండి. ఫలానా డాక్టరుగారిల్లెక్కడ అంటే రిక్షావాడు తీసుకొచ్చాడు."
"అది సరే రాజేశ్వరీ... యీ అమ్మాయిని ఎక్కడ వుంచడం" ఆలోచనలో పడ్డారు.
"నర్సు రాసింది. ఆస్పత్రిలోనే ఉండచ్చు. ఆవిడ అక్కడే వుంటున్నదట కదా. యిద్దరం కల్సి ఓ రూములో వుందాం. కలిసి వంట చేసుకుని షేర్ చేసుకుందాం అని రాసింది."
ఆయన సగం భారం తీరినట్లు "వెల్... సిస్టర్ అన్ని ఏర్పాట్లు చేసేసిందన్నమాట... నాపని సుళువయింది"
"డాక్టరుగారూ... మేం యిద్దరం అక్కడే వుంటాం కాబట్టి ఆస్పత్రి పని అంతా మేం చూసుకుంటాం. మీకేం భారం లేకుండా..." శ్యామల అంది.
"థాంక్స్... ఏదో నా అదృష్టం బాగుంది. మీలాంటి మంచి స్టాఫ్ దొరికారు."
"అయితే రాజేశ్వరి వెంకన్ననిచ్చి యీ అమ్మాయిని అక్కడికి పంపించు. ఆ సామాను వాడు తెస్తాడులే అమ్మా. వెళ్ళి రిఫ్రెష్ అవ్వు. నేను తొమ్మిది గంటలకి వస్తాను. అప్పుడు మిగతా విషయాలు హాస్పిటల్లో మాట్లాడుకుందాం" అంటూ లేచారు.
"మన వాళ్ళమ్మాయేనండి. తండ్రి ఏ.జి. ఆఫీసులో గుమాస్తాగా వుండేవారట- స్కూటర్ ఏక్సిడెంట్ లో పోయాడట. అప్పటికి మూడో ఏడు మెడిసిన్ చదువుతుండేదట. తండ్రి పోయాక పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ అది కలిపి ఈ రెండు మూడేళ్ళు గడిపారు.
తమ్ముడు ఇంటర్ చదువుతున్నాడుట. కాస్త ఆ అబ్బాయి చదువయి ఏదన్నా ఉద్యోగం చేసేవరకు యింటి బాధ్యత యీ అమ్మాయిదే పాపం-"
"అప్పుడే అన్ని వివరాలు సేకరించావు" బూట్లు విప్పుకుంటూ అన్నారు.
"ఏదో రాగానే వివరాలన్నీ తనే చెప్పింది. నెమ్మదయిన దానిలాగానే వుంది. పోనీ ఆ అమ్మాయిని ఇంట్లో వుండమందామా. ఇక్కడే తింటుంది, వుంటుంది. అక్కడ నర్సు విమల నాన్ వెజిటేరియన్. ఈ అమ్మాయికి, ఆవిడకి భోజనంలో యిబ్నందిగా వుంటుందేమో. నాకూ కాస్త సాయంగా వుంటుందేమోననిపిస్తుంది" రాజేశ్వరి సందేహిస్తూ అంది.
కేశవరావు ఆలోచించారు ఒక్కక్షణం. "నీకు కావాలంటే వుంచుకో. నాకేం అభ్యంతరం వుంటుంది. కాని అలా కొత్త అమ్మాయిని, ఆ అమ్మాయి అలవాట్లు అవి తెలియకుండా యింట్లో పెట్టుకుంటే నీకు ఆ అమ్మాయి అలవాట్లు, శుభ్రాలు కలవకపోతే, నీవేమో శుభ్రమెక్కువ. బాత్ రూములు, వంటిల్లు అవి చాలా శుభ్రంగా ఎక్కడివక్కడ వుండాలంటావు.
ఆ అమ్మాయి మామూలు మిడిల్ క్లాసు నుంచి వచ్చిన పిల్ల. తీరా యింట్లో పెట్టుకున్నాక నీకు, ఆమెకి కలవకపోతే చెప్పలేక, వుండమనలేక, పొమ్మనలేక అవస్థ పడాల్సి వస్తుందేమో, ఆలోచించుకో. సర్దుకోగలనంటే వుంచుకో..." ఆయన అన్నారు.
రాజేశ్వరి ఆలోచించింది. భర్త అన్నమాటలు నిజమే. అమెరికాలో వుండివచ్చి అక్కడి శుభ్రాలు అవి అలవాటయ్యాక తనకి యిల్లు శుభ్రంగా లేకపోతే నచ్చదు. ఎంత ఓపిక లేకపోయినా అన్నీ స్వయంగా చేసుకోవడం అలవాటయింది. ముఖ్యంగా బాత్ రూములు తనే స్వయంగా కడుగుతుంది యిక్కడ కూడా. పరాయి పిల్లని యింట్లో పెట్టుకుని ఆమె వాడే బాత్ రూములు అవీ తను కడగడం అది చేయగలదా. అంత నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలు. కేశవరావు ప్రతిది లోతుగా ఆలోచిస్తారు. ఎందుకొచ్చిన గొడవ. ఇంట్లో వుంచుకోడం అంటే చాలానే ప్రాబ్లమ్స్ రావచ్చు. వచ్చిపోతుంటే మర్యాదలు, అభిమానాలు నిలుస్తాయి గాని ఒకేచోట వుంటే వుండకపోవచ్చు."