Previous Page Next Page 
పడుచుదనం రైలుబండి పేజి 31


    ముఖ్యంగా సుందర సుకుమారికి కావాల్సినన్ని పొగడ్తల దండలు లభించాయ్.


    అప్పటికి పూర్తిగా తెల్లవారింది.


                                        13


    తెల్లవారినా


    ఇంకా నలుగురు లేవలేదు. మంచాలెక్కి కూర్చుని కబుర్ల మీద కబుర్లు చెప్పుకోసాగారు.


    జరిగిందంతా కలా! నిజమా! అన్నట్లు కొద్దిసేపు స్తబ్దుగా ఉండిపోయారు. ఊహించనిది జరిగితే ఎవరికయినా అలానే ఉంటుంది. వాళ్ళ నలుగురికి కూడా కొద్దిసేపు అలాగే ఉంది.


    ఆంధ్రుల ఆడబడుచు శ్రీమహాలక్ష్మి దానికో ఉట్టుట్టి మొగుడు__తొందరపడి బస్సు దిగటం... బస్సులో భార్తగారు నిద్రపోవటం స్టేషన్లో పడిగాపులు...సాటి స్త్రీ కళ్ళనీళ్ళు చూడలేక సహృదయంతో తోడ్కొని వచ్చి రూమ్ లో చోటివ్వటం అదేమో పక్కా మోసగత్తెగా బయటపడటం అంతా అదేదో కలలా ఉంది.


    "అమ్మయ్య! ఇప్పటికి కాని నా ప్రాణం తెరిపిన పడలేదు. మీకెలాగుందే?" ప్రమద అడిగింది.


    "ఇదో ఎడ్వంచర్ పోనీ అనుభవం అనుకుందాం. చావు తప్పి కన్ను లొట్టపోవటం అంటారు. అది మాత్రం కాదు. ఎందుకంటే మన కళ్ళు లొట్టబోలేదు. నిక్షేపంగా ఉన్నాయికాబట్టి" రాణి అంది.


    "ఇది నిజంగా ఒక గొప్ప అనుభవమే. సుందర సుకుమారి వాళ్ళ బామ్మ ఆవు నేతిలో స్నానం చేయించి...గేదె నేతితో తీపి పిండివంటలు చేసి తినిపించడంవల్ల సదరు మన సుందర సుకుమారి దేహం విషయం వదిలేసి మేథస్సు విషయానికి వస్తే అద్భుతమైన మేథస్సని ఒప్పుకోక తప్పదు" వందన అంది.


    "నెయ్యి తింటే మేధస్సు పెరుగుతుందిటే! మా ఇంట్లో కూడా అంటుంటారు. మీ మేధస్సు అద్భుతంగా పని చేయాలంటే సుందర సుకుమారి తినేవే వాడండి" ప్రమద అంది.


    "ఒసేయ్! ఇలా వంతుల వారిగా నన్ను పొగిడేస్తు ఇలాగే మాట్లాడుతూ ఉన్నారంటే నేను సిగ్గుతో మెలికలు తిరిగిపోతాను. అది చూడలేక మీరు చచ్చిపోతారు. ఆపై మీ ఇష్టం" సుందర సుకుమారి అంది.


    "నీ సాహసకార్యానికి అభినందనలు వద్దా!"


    "వద్దే వందనా! నేను చేసింది చాలా చిన్న పని."


    "దీనిని చిన్నపని అని అనరు. ఎంతోకొంత బుర్రలున్న మనం ఒకళ్ళం కాదు...ఇద్దరం కాదు...నలుగురం. ఆమె మాటలని నమ్మాలి. మనల్ని అంతగా నమ్మించింది అంటే ఆమెగారు ఒక మహానటని ఒప్పుకోవాల్సిందే!" వందన అంది.


    "ఒసేయ్! నేనొకటి కనిపెట్టాను. చెప్పనా! వద్దా!" ప్రమద అడిగింది.


    "కనిపెట్టింది దాచుకోకూడదమ్మా! చెప్పు! చెప్పు!" ఆత్రుతగా అడిగింది రాణి.


    "మన ఇన్ స్పెక్టర్ విశ్వనాథ రెడ్డిగారున్నారు చూశావా!" అంటూ సస్పెన్స్ కోసం ఆగింది ప్రమద.    


    "బోడి సస్పెన్సూ...నువ్వూను... నువ్వేంటి! అందరం చూశాం. విషయమేమిటో చెప్పు" విసుక్కుంటూ అంది రాణి.


    "ఆ విశ్వనాథ నాయకులవారు మాట మాటికి వందనాదేవిని చూస్తూ ఉన్నారు. అదేపనిగా చూస్తే బాగుండదని అటు ఇటు బలవంతాన కళ్ళు తిప్పేసుకొన్నారు."


    "నాకూ అనుమానం వచ్చిందేవ్! మనం ముగ్గురం ఉన్నాం కదా! మన్ని వదిలేసి వందనని నందనంగా చూడ్డం ఎందుకంట? ఏమా రహస్యం?"


    "మళ్ళీ నోరెత్తారంటే చంపేస్తాను. ట్రాక్ ని పక్కదోవ పట్టించడం తప్ప మీకు మరో పనేంలేదు" వందన కోపంగా అరిచింది.


    ఇన్ స్పెక్టర్ విశ్వనాథరెడ్డి తనని ఒకటికి రెండుసార్లు చూడటం వందన ముందే కనిపెట్టింది. అయితే ఆ విషయం పైకెలా చెబుతుంది? లోలోనే దాచుకొంది. మిత్రురాళ్ళు పసిగట్టటమే కాదు ఆ విషయం అడగను కూడ అడిగారు. గట్టిగా కోప్పడకపోతే ఇంకా వాళ్ళ మాటలు చాలా దూరం వెళతాయ్. ఇప్పుడు సరదా కాదు కావాల్సింది... అసలు విషయం తెల్సుకోవటం. అందుకనే గట్టిగా కోప్పడి వాళ్ళ నోళ్ళు మూయించింది వందన.


    "సరేలే! ఇప్పుడు నిన్ను వదిలేసి సుందరిని అడుగుతాం. మాక్కొన్ని అనుమానాలున్నాయ్! అవయినా అడిగి తెలుసుకుంటాం!" ముచ్చటగా మూతి మూడు వంకర్లు తిప్పి మరీ చెప్పింది ప్రమద.


    "ఇన్ స్పెక్టర్ విశ్వనాథరెడ్డి దగ్గర్నుంచి పక్కనున్న బొంగు లాంటి పోలీసులు మొదలు ఇక్కడికొచ్చిన అందరు నన్ను చూశారు సరేనా!" అంది సుందర సుకుమారి.


    "మేమడగబోయేది ఒకటి...నీవు చెప్పేది ఇంకోటి. ఆ... విషయం కాదు. మరో...విషయం" దీర్ఘం తీస్తూ చెప్పింది రాణి.

 Previous Page Next Page