Previous Page Next Page 
మగబుద్ధి పేజి 31


    అంత బలంగా కొడతాడని ఊహించని జగ్గారావు తూలి కిందపడ్డాడు. మిగిలినవాళ్ళు కూడా షాక్ తిన్నారు. వాళ్ళు ఆ షాక్ నుంచి తేరుకోక ముందే నరేష్ వాళ్ళల్లో ఒకడ్ని ఈడ్చి తన్నాడు. వాడు బోర్లా పడడంతో ముఖమంతా గోక్కుపోయి, రక్తం చర్మంపైకి తేలింది మరోకడ్ని డొక్కలో గుద్దడంతో కడుపులోని పేగులన్నీ చెల్లాచెదురైపోయినట్లు వాడు అలా కడుపుమీద చేతులు పెట్టుకుని కూర్చుండిపోయాడు. చివరివాడికి ఏం జరుగుతూ వుందో అర్థమై అతని పైకి దూకబోయాడు. దీన్ని పసిగట్టిన నరేష్ ఎడమచేత్తో వాడ్ని మధ్యలోనే ఆపి కుడిచేత్తో గడ్డంమీద బలంగా గుద్దాడు. వాడి పళ్ళల్లో ఒకటి రాలి కింద పడింది.   

 

    సీట్లో గువ్వలా ఒదిగిపోయి కూర్చున్న రజనీని చూడగానే అతను మరింత రెచ్చిపోయాడు.

 

    గిర్రున వెనక్కి తిరిగి లేవబోతున్న జగ్గారావు అలానే కిందపడి పోయాడు. మిగిలిన ముగ్గుర్నీ మళ్ళీ కొట్టాడు.

 

    వాళ్ళు అప్పటికే బాగా దెబ్బలు తినడంతో అతన్ని ప్రతిఘటించలేకపోతున్నారు. పిచ్చి పట్టినవాడిలా అతను వాళ్ళను కుక్కల్ని కొట్టినట్టు కొట్టాడు.

 

    పరిస్థితి విషమిస్తోందని గ్రహించాడు జగ్గారావు. అతన్ని అలానే వదిలేస్తే తమను చంపేస్తాడేమోనన్న భయం కలిగింది. మెల్లగా తనే జేబులోంచి చాకు తీసుకున్నాడు.

 

    నరేష్ మిగిలిన ముగ్గుర్నీ చావబాదుతున్నాడు.

 

    అదేమంచి సమయమనుకుని జగ్గారావు మెల్లగా అతను వెనకే నడిచి చాకుతో కుడిభుజం మీద పొడిచాడు. అయితే అతను మరీ బలంగా పొడవలేదు. అతనికి ఎలాంటి అపకారం చేయాలన్న ఉద్దేశ్యం లేదతనికి. అతన్ని అశక్తుడ్ని చేయాలనే మెల్లగా పొడిచాడు. కుడిభుజం మీద గాయమై రక్తం పైకి చిమ్మింది.

 

    అప్పటికీ అతను తగ్గలేదు. నలుగురిమీద కలయబడి దెబ్బకూడా చూసుకోకుండా బాదుతున్నాడు. జగ్గారావు ఈసారి నరేష్ ఎడమభుజం మీద పొడిచాడు. అక్కడ్నుంచి రక్తం పౌంటైన్ లా పైకి చిమ్ముతోంది.

 

    రెండుచేతులూ విపరీతంగా నొప్పి పెట్టడంతో తగ్గాడు అతడు. అదే అదనుగా అతని కడుపుమీద గుద్దాడు. జగ్గారావు దాంతో కిందపడిపోయాడు అతను.

 

    రజని గుడ్లప్పగించి అటే చూస్తోంది.

 

    జగ్గారావు ఆమె దగ్గరగా వెళ్ళి చెప్పాడు. "మేం గూండాలమేకానీ దొంగలం కాము. ఈ నరేష్ బాబు మమ్మల్ని ఓ చిన్న నాటకం ఆడమనిటిప్పిచ్చాడు. మీ కారును నిలిపి మిమ్మల్ని బెదిరిస్తున్నప్పుడు అతను వచ్చి మమ్మల్ని కొట్టాలన్న మాట. దాంతో మేము పరుగెత్తుకుని వెళ్ళిపోవాలి. అది మా మధ్య ఒప్పందం. అయితే నువు కేకలు వేయడంతోనే మేము తను కుదుర్చుకున్న గూండాలన్న విషయం మరిచిపోయాడు గురుడు. వీరబాదుడు బాదాడు. ఇక ఊరుకుంటే మమ్మల్ని చంపేసి మాపేగుల్ని మీకు ప్రేమ కానుకగా సమర్పిస్తాడేమోనన్న భయం వేసి పొడిచాను. అవేం పెద్ద గాయాలు కావు. తీసుకెళ్ళి డాక్టరుకు చూపించు, సర్దుకుంటుంది మమ్మల్ని ఉత్తిత్తిగానే గాకుండా నిజంగానే కొట్టడంతో ఫీజు మరో వేయిరూపాయలు పెరిగింది. అది మాత్రం నువ్వు ఇచ్చేయ్ బుల్లెమ్మా!"  

 

    రజని అప్పటికి షాక్ నుంచి తేరుకుంది ఆమెకు ఏం జరిగిందో అర్థమైంది. తన మెప్పు పొందాలని నాటకానికి శ్రీకారం చుట్టిన అతను తీరా రంగస్థలంలో తన పాత్రను మరిచిపోయాడు.

 

    ఆమె ఫీలింగ్స్ ని పసిగట్టిన జగ్గారావు అన్నాడు "అందుకే బుల్లెమ్మ! ప్రేమ గుడ్డిదేకాదు పిచ్చిది కూడా."

 

    "ప్రేమ" జీవితంలో ఆ మాటను మొదటిసారి ఉచ్ఛరిస్తున్నట్టు ఆమె పెదవులను కదిపింది.

 

    ఆమె కళ్ళముందు నిశ్శబ్దంగా గులాబీ మొగ్గలు విచ్చుకుంటున్నాయి రంగుల గోళాలు చిట్లి ఇంద్రధనుస్సుల్ని ఆమె మీదకు విసిరేస్తున్నాయి. చందమామ వెన్నెల్ని దోసిళ్ళతో కుమ్మరిస్తోంది.

 

    ఆమె బ్యాగు తెరిచి చేతికొచ్చిన వందరూపాయల నోట్లను జగ్గారావు చేతిలో కుక్కింది.

 

    "ఆయన్ను కార్లో కూర్చో బెట్టండి" అంది.

 

    నరేష్ ని వాళ్ళు మోసుకొచ్చి ఆమె పక్కసీట్లో కూర్చోబెట్టారు.

 

    కారు కదిలింది.

 

    మరోక్షణంలో అతనికి స్పృహ తప్పింది.

 

                        *    *    *    *    *

 

    నరేష్ మెల్లగా కళ్ళు తెరిచాడు.

 

    తన కాట్ పక్కనే స్టూల్ మీద కూర్చున్న రజనీని చూస్తూనే తనెక్కడున్నాడో అన్న విషయాన్ని అతను స్ఫురణకు తెచ్చుకోలేకపోయాడు.

 

    తనను జగ్గారావు పొడవడం మాత్రం గుర్తొచ్చింది.

 

    తను చచ్చిపోయి, స్వర్గలోకానికి వచ్చాడు. తను రజనీని ప్రేమిస్తున్నానని తెలిసి దేవతలే భూలోకంలోకి వెళ్ళి ఆమెను పిలుచుకొచ్చారు. తన పక్కనే కూర్చోబెట్టారు. అయినా స్వర్గంలో కూడా క్లోరోఫామ్ వాసన ఉన్నట్టుంది ముక్కుపుటాలను అదరగొడుతూ వుంది అనుకున్నాడతను.

 

    భూలోకంలో అయితే ప్రేయసిని పెళ్ళి చేసుకుంటారు. మరి ఇక్కడ ఏ పధ్ధతి ఉందో ఎలా తెలుసుకోవడం? రంభని అడిగితే చెబుతుందేమో. రంభ కన్పించడం లేదేమిటి! రంభను చూశాక మరోసారి చచ్చిపోయినా ఫరవాలేదు. ఆమె అంత అందగత్తె కదా కానీ రజనీ కంటే బావుండదేమో! కొంపతీసి రజనీని ఇంద్రుడు చూసి మోహిస్తే ఏం చేయాలి? వజ్రాయుధంతో నెత్తిమీద ఒక్కటి మొడితే చాలు. చచ్చి వూరుకుంటాడు. భూలోకంలో చచ్చిపోతే స్వర్గానికి వస్తారు. మరి ఇక్కడ చచ్చిపోతే ఎక్కడి కెళతారు? అతను గజిబిజిగా ఆలోచిస్తున్నాడు.    

 

    "ఎలా వుంది?" రజని మెల్లగా అడిగింది.

 

    "బావుంది. కాకపోతే రెండు చేతులే నూనెలో వేసిన పూరీల్లా ఉబ్బినట్టున్నాయి" చెప్పాడు.

 

    "తగ్గిపోతుంది లెండి."

 

    "మరి స్వర్గంలో బాధలూ, నొప్పులూ ఉండవట కదా!"

 

    ఆమె అతనివైపు వింతగా చూసింది.

 

    "స్వర్గమంటారేమిటి? ఇది భూలోకం. మీరు స్వర్ణా నర్శింగ్ హోమ్ లో వున్నారు."

 Previous Page Next Page