రఘు విషయంలో జనానికి ఒక విధమైన ఆదరం ఏర్పడుతూంది. ఆత్మీయత ఏర్పడింది. రఘు బజారుకు వచ్చినా, హోటల్లో కూర్చున్నా, చౌక్ లో కనిపించినా జనం చుట్టూచేరి ఏదో ఒకటి అడుగుతుండేవారు. అందరికీ ఓపిగ్గా సమాధానం చెప్పేవాడతను. అందరినీ సమాధానపరిచేవాడు.
ప్రతిరోజూ నాగేశ్ పత్రిక తెచ్చి అందరికీ అందజేస్తున్నాడు. కొన్ని రోజులు ఉచితంగానే ఇచ్చాడు. తరవాత చాలమంది చందాదారులుగా చేరారు. అప్పుడప్పుడూ పుస్తకాలు తెచ్చి ఇస్తుండేవాడు. క్రమక్రమంగా చదవటం అలవాటైంది జనానికి. పుస్తకాలు కూడా కొనసాగారు.
తాసిల్దారు కూడా పత్రిక తెప్పించుకొని చదివించుకోసాగాడు. ఏవేవో కొత్త విషయాలు తెలుస్తున్నట్లనిపించింది.
రావఁడు పొదిలో పత్రిక పెట్టుకొని తాసిల్దారు దగ్గరికి వెళ్తున్నాడు.
ఊళ్ళో గ్రంథాలయం స్థాపించాలని సంకల్పించాడు రఘు. ఆ విషయంలో అనేక మందితో చర్చలు సాగిస్తున్నారు రఘు, నాగేశ్ లు. గ్రంథాలయ స్థాపనను గురించిన వాతావరణం కల్పించసాగారు.
భూతం అని భయపడిన పత్రిక గ్రామానికి భువన మోహినిగా మారింది.
* * * *
తాసిల్దారు ఏకైక పుత్రుడు రషీద్. మంచి అందగాడు. స్ఫురద్రూపి. కోలముఖం. కొనదేరిన ముక్కు, ఏపిల్ పండురంగు, అచ్చం ఇరానీ రూపం. అతని తల్లి మంచి అందగత్తె. ఇరాన్ నుంచి బ్రతకడానికి వచ్చిన వాని కూతురు. అతనికి ఉద్యోగపు ఆశ చూపి, ఆ పిల్లను కట్టుకున్నాడు తాసిల్దార్. తరవాత ఉద్యోగం అడుగుతే మామగారికి విషం పెట్టి చంపాడు తాసిల్దార్ అని గిట్టనివాళ్ళు చెప్పుకుంటారు. ఆమె అందాన్ని అనేక రకాలుగా వర్ణిస్తారు జనం. కాని చూచినవారు ఎవరూ లేరు తల్లి అందాన్ని పుణికి పుచ్చుకున్నాడు రషీద్. కాని గుణాలు తండ్రివి వచ్చాయి.
రషీదును బాగా చదివించాలనుకున్నాడు తండ్రి. హైదరాబాద్ లో ఉంచాడు చదువుకు. అతనికి చదువు అంటలేదు. దురభ్యాసాలు చాలా వచ్చాయి. తాగుడుకు అంతులేదు. సారాయి మంచినీళ్ళ ప్రాయం. వ్యభిచారంలో దక్షత సంపాదించాడు. గోడలు దూకి హైదరాబాదులో తన్నులు తింటే ఇంటికి తెచ్చుకున్నాడు కొడుకును తండ్రి. కాని ఇంట్లో కూడా అతన్ని పట్టలేకపోయాడు. తండ్రిని తలతన్నాడు. తండ్రి 'నికా' కుట్టుకున్నదాన్నే తగులుతున్నాడు. రాత్రింబవళ్ళు త్రాగడం, అమ్మాయిలతో చదరంగం, పచ్చీసు ఆడడం అతని జీవితం. అతని కంటపడ్డ అందకత్తె ఆ రాత్రి అతనిది కావల్సిందే. ఒకసారి తాసిల్దార్ గట్టిగా మందలించాడు. కొడుకు తుపాకీ తండ్రి రొమ్మున పెట్టి కాలుస్తానన్నాడు. ఆనాటి నుంచీ తండ్రి అతణ్ణి గురించి పట్టించుకోవడం మానేశాడు. పూర్వం అవుతే బజారుకు వెళ్ళాడంటే ఊరు చాటించేవారు. ఆడవాళ్ళు ఎక్కడివాళ్ళు అక్కడ నక్కేవారు. ఈ మధ్య ఆ ఆచారం అడుగంటింది. రషీద్ కూడా ఎక్కువగా బజారుకు వెళ్ళడంలేదు.
అమాంతంగా బజారు బైల్దేరాలనిపించింది రషీద్ కు. అతణ్ణి అడ్డేవారెవరు? బయలుదేరాడు. ఎర్రని కండ్లు, పొడువైన గిరజాలు, వదులు పైజమా, భుజాలమీద అల్లికపు పనిచేసిన లాల్చీలో బయలుదేరాడు. వెంట అతని అంతరంగిక బృందం బయలుదేరింది. ఒకడు హుక్కా పట్టుకొని సాగాడు. ఒకడు పాన్ దాన్ తో నడచాడు. ఒకడు మధుపాత్ర చషకంతో వెంబడించాడు. అతడు ఏది కావాలంటే అది అందించాలి పరిచారకులు. అతడు ఒకసారి హుక్కా పీలుస్తాడు. ఒకసారి పాన్ తింటాడు. నడుస్తూనే సారాయి తాగుతాడు.
రషీద్ బృందం సాగుతూంది. ఆ విషయం తెలియని వెంకయ్య కూతురు గుడికి వెళ్తూంది. ఆమె తల మీంచి స్నానం చేసింది. జుట్టు వదులుగా ముడివేసుకుంది. చేతుల్లో ప్రమిదలు, పలహారం ఉన్న పళ్ళెం పట్టుకుంది. సాగిపోతూంది. ఏ ధ్యాసమీద ఉందో తెలియదు. ఎదుటి వాణ్ణి సహితం గమనించలేదు!
రషీద్ ఆమెను చూచాడు. చేయిపట్టుకొని లాగాడు. పళ్ళెం ధన్ మణి కింద పడిపోయింది. పైకి చూసింది. రషీద్! ముచ్చెమటలు పోశాయి. గడగడ వణికింది. గట్టిగా కేక పెట్టాలనుకుంది. కాని ధ్వని పెకల్లేదు. తుదకు సర్వశక్తులూ కూడ దీసుకొని కేక పెట్టింది.
గ్రంథాలయానికి చందాలు వసూలు చేయడానికి తిరుగుతున్న నాగేశ్ కేక విన్నాడు. పరిగెత్తాడు. చూచాడు.అతని రక్తంలో మంటలు లేచాయి. దోవన వెళ్ళే వాని చేతి కర్ర లాక్కున్నాడు. కర్ర ఎత్తి లాగి రషీద్ చేతిమీద వేశాడు. రషీద్ రుక్మిణి చేయివదలడం ఆమె ఒక్కసారి నాగేశ్ ను తన చూపులతో కొలవడం, పరిగెత్తడం అన్నీ రెప్పపాటులో జరిగాయి. రషీద్ ముందు దెబ్బతగిలిన చేతినీ, తదుపరి నాగేశ్ నూ చూచాడు. రక్తం కక్కుతున్నాయి నాగేశ్ కళ్ళు. వణికిపోతున్నాడు, ఊపిరి వేగంగా పీలుస్తున్నాడు. చేతిలో దుడ్డుకర్ర ఉంది. వెనక్కి చూచాడు. పరిచారకులు హుక్కా, పాన్ దాన్ వగైరా పారేసి పరుగు లంకించుకున్నారు. రషీద్ నాగేశ్ ను చూచాడు - చేతిలో కర్ర చూచాడూ. "అమ్మో కర్ర!" ఒక చిరునవ్వు నవ్వాడు. వెనక్కి తిరిగి సాగిపోయాడు. కర్ర అక్కడే పారేసి నాగేశ్ తన పనిమీద సాగిపోయాడు.
రుక్మిణి రొప్పుతూ ఇల్లు చేరింది భోరున ఏడ్చేసింది. ఇంట్లో తండ్రిలేడు. తల్లి కలవరపాటుతో పరిగెత్తుకొని వచ్చింది. తల్లిని చూచింది రుక్మిణి. ఏడ్పు పొంగింది. తల్లిమీద పడి పెద్దగా ఏడ్చేసింది. తల్లికి ఏమీ అర్థం కాలేదు. కొంత ఊరడిల్లి కథ సాంతం చెప్పింది. కూతురు మానం కాపాడిన వాడెవడు? తన సంసారాన్ని రక్షించిన దేవుడెవడు? ఈ లంకలో రాముడెవడు? రషీద్ ను ఎదిరించి నిలిచిన ధీరుడెవడు? అతని పాదాలంటి పూజించాలని, అతనిని ఆదరించాలని, గౌరవించాలని, రుణం తీర్చుకోవాలని తహతాహలాడింది తల్లి. కాని అతని రూపాన్ని తప్ప ఊరుగాని, పేరుగాని తెలియపరచలేక పోయింది కూతురు. లిప్తలో నాగేశ్ రూపాన్ని ఎదలో నింపుకుంది రుక్మిణి. ఎన్నో రకాల వర్ణించి చెప్పింది. మళ్ళీ అతణ్ణి చూడాలని తహతాహ లాడింది.
వెంకయ్య వచ్చి జరిగింది తెలుసుకున్నాడు. కూలుతున్న కొంపను నిలిపాడు రామలింగేశ్వరుడు అనుకున్నాడు. తైలాభిషేకం చేయిస్తా ననుకున్నాడు. చేయించాడు కూడా.
గ్రామంలో గ్రంథాలయం స్థాపించాలనే ప్రతిపాదన రఘు నుంచి వచ్చింది. వీరయ్యగారు దానికి అవసరం ఐన డబ్బంతా ఇస్తామన్నారు. కాని రఘు ఒప్పుకోలేదు. ప్రజల నుండి డబ్బు వసూలు చేస్తేనేగాని వారికి ఆసక్తి ఉండదని అతని వాదన. అంతేకాక ఈ పేరుతో ప్రజలతో సంబంధం ఏర్పరచుకోవచ్చు నన్నాడు. అతని వాదనలు ఎవరూ కాదనలేదు. గత కొలది రోజులుగా చందాలు పోగుచేస్తున్నారు. ముందు విముఖత చూపినా ప్రజలు ఇప్పుడు ముందుకు వస్తూనే ఉన్నారు.
ఆ రోజు జానకి, రఘు, నాగేశ్ బయలుదేరారు చందాలకు వెళ్ళిచోటనల్లా వారికి ప్రోత్సాహం లభిస్తూనే ఉంది. కొందరు సంశయాలు వ్యక్తపరుస్తున్నారు. వాటిని దూరం చేయడంలో ఆనందం కలుగుతూంది వారికి. వచ్చిన పెద్ద మార్పేమంటే సంశయాలే కాని భయం ఎవరూ వ్యక్తపరచలేదు. అందరూ దాన్ని ఒక సత్కార్యంగానే స్వీకరిస్తున్నారు.
ముగ్గురూ వెంకయ్య ఇంటికి వెళ్ళారు. జానకి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆడవాళ్ళకు నచ్చచెప్పడం ఆమె వంతు. ఇక్కడ ఆమెకు ఎక్కువ కష్టం కలుగలేదు. రుక్మిణిని రక్షించినవాడు నాగేశ్ అని చెప్పింది. అంతే. ఆ మాటల తల్లీ కూతుళ్ళ మీద ఎంతో ప్రభావాన్ని వేశాయి. రుక్మిణి పరిగెత్తింది. తలుపు చాటున ఉండి నాగేశ్ ను చూసింది. ఆమె హృదయం గగుర్పొడిచింది. అతడే తనను రక్షించినవాడు! ధీరుడు! రాముడు! అలా అతణ్ణి చూస్తూ ఉండడంలో ఏదో ఆనందం కలిగింది. ఆమెకు అదేదో కొత్త అనుభూతి!
తనను చూస్తూన్న రుక్మిణిని చూశాడు నాగేశ్. ఆ చూపులు అతని ఎదను గుచ్చుకున్నాయి. ఏదో పూలజల్లు కురిసినట్లయింది. ఒళ్ళు జలదరించింది.
అతడు ఆమెను చూచాడు.
చూపులు కలిశాయి.
ఆమె చూపులు వాలేయి. సిగ్గు ముంచుకొని వచ్చింది. చెంపలు జేవురించాయి. అక్కణ్ణుంచి పరిగెత్తింది. తల్లితో చెప్పింది. "ఆయనే" అని. ఆ మాటలోని సిగ్గును, అనుభూతిని గమనించలేదు తల్లి. ఆమెకు తెలిసిందల్లా అతడే ఇతడు. తలుపు చాటునచేరి భర్తను పిలిచింది. ఏమేమో చెప్పింది. ఎంత అడిగితే అంత యివ్వమంది.
వెంకయ్య బయటికి వచ్చాడు. నాగేశ్ ను ఒకసారి నఖశిఖ పర్యంతం చూచాడు. చాయ్ తాగిపొమ్మన్నాడు. వారడిగినదానికి రెండింతలు యిచ్చాడు. ఇంకా సాధ్యమైనంత సహాయం చేస్తానన్నాడు. "చూడండి జర తాసిల్దారుకు ఎరిక కానియ్యకుండి. పొద్దున్న లేస్తే వాళ్ళతోనే పని బడ్తది" అన్నాడు.
నాగేశ్, రఘు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇంతలో గాజుల చప్పుడైంది. రుక్మిణి చాయ్ తెచ్చి తలుపు చాటున నుంచుంది. నాగేశ్ ఆ అవకాశాన్ని వదులుకోలేదు. తలుపునే చూడసాగాడు, వెంకయ్య చాయ్ తెచ్చి అందించాడు. నాగేశ్ కు చాయ్ చాలా రుచిగా అనిపించింది. అవును అమృతం చేతిలో ఉంటుంది. రుచికి మనసుతో సంబంధం.