"మాటిచ్చావు గనుక ముద్దెట్టుకున్నా కేక వేయకూడదు. అది అంతటితో ఆగిపోక_ వ్యామోహంకాక నీ లైఫ్ కి లాక్ కావాలని నా కోర్కె" అంటూ ఆషా వడివడిగా వెళ్ళిపోయింది. త్రివేణికి అర్ధంకాని ఓ స్పందన చుట్టిముట్టి ఉక్కిరి బిక్కిరి చేసినట్లనిపించింది.
* * *
శశాంక ముళ్ళమీద కూర్చున్నట్లుగా ఉన్నాడు.
ఎదురుగా శుక్రాచార్య అసహనంగా పచార్లు చేస్తున్నాడు.
"ఎవరు చెప్పారు నీకు....?" అడిగాడు శుక్రాచార్య.
"తెలియదు ఇంతకుముందు కూడా నేనతన్ని ఎప్పుడూ చూడలేదు. హఠాత్తుగా హాస్పిటల్లోకి దూసుకొచ్చాడు. విశ్వదత్త ప్రాణాలు అపాయంలో ఉన్నాయి. మీరే సేవ్ చేయాలి అని అంటూనే అదృశ్యమైపోయాడు...."
"వచ్చినతను ఎవరు? విశ్వదత్తను ఎవరు చంపాలనుకుంటున్నారు? ఎందుకు....? అనేవి తెలుసుకోకుండానే వదిలేయటం అవివేకం."
అంత సునిశితంగా తనకొడుకు ప్రాణాలపట్ల శుక్రాచార్య శ్రద్ధ చూపించటం శశాంకకి ధైర్యంగా ఉన్నా కొత్తగా వచ్చిన ఈ ఉపద్రవం పట్ల పైకి కనిపించకపోయినా ఆందోళన చెందుతున్నాడు.
"అది నా పొరపాటే. ఒప్పుకుంటాను. ఇప్పుడిక నా అజాగ్రత్త పట్ల చింతించటం కన్నా చేయవల్సిందేమిటో ఆలోచించాలిగదా...."
"నీవెం చేయాలనుకుంటున్నావ్....?" శుక్రాచార్య అడిగాడు.
"విశ్వదత్తను మరో వారంరోజుల్లో డిశ్చార్జి చేస్తారు. అప్పటివరకు కాపుకాయాలి. అదీ ఈ క్షణంనుంచే మొదలవ్వాలి. నేను మరికొద్దిసేపటిలోనే హాస్పిటల్ చుట్టూ వలయాన్ని సృష్టిస్తాను. విశ్వదత్తను చంపాలనుకుంటున్నారంటే_ శత్రువుల్ని తక్కువ అంచనా వేయకూడదు...." భరత్ చెప్పటం ఆపాడు.
"గోహేడ్" అన్నాడు శుక్రాచార్య.
శుక్రాచార్యకు ఆందోళనగా ఉంది. విశ్వదత్త బ్రతికి ఉండి, చట్టం నుండి రక్షిస్తేనే తన పథకానికి ఆటంకం ఉండదు.
"కాని.... రేసెస్?" సందేహం వ్యక్తం చేశాడు శశాంక.
కొడుకు ప్రాణాలు రిస్కులో ఉన్నా రేసెస్ గురించే ఆలోచించేంత క్రానిక్ శశాంక_
శుక్రాచార్య, భరత్ ఆశ్చర్యంగా చూశారు. "ఓ.కే. నువ్వు బాబు సెక్యూరిటీ చూసుకో. కాని దక్కన్ డెర్బీ నాటికి నువ్వు నా జాకీగా ఉండి తీరాలి...." అన్నాడు శశాంక భరత్ వేపు చూస్తూ.
శుక్రాచార్య, భరత్ మౌనంగా నవ్వుకున్నారు. ఈ డబ్బున్నవాళ్ళు అంత తేలిగ్గా ఎవర్నీ నమ్మరు. దగ్గర చేరే ప్రతివారు తమ సొమ్ము గుంజేయటానికి వచ్చిన వాళ్ళలాగే కనిపిస్తారు. కాని ఒక్కసారి నమ్మారంటే ఇంక వదలి పెట్టరు.
కొద్దిరోజుల క్రితమే నా జాకీగా పనికొస్తావా? అని సందేహించిన శశాంక నువ్వు లేకపోతే నా హార్సెస్ విన్ కావు అన్నంత నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఇప్పుడు.
అందుకే నవ్వుకున్నారు ఇద్దరు.
శశాంక ఏదైతే ఆశించాడో అది ఇప్పటికి సాధ్యపడింది. భరత్ ని తన జాకీగా శశాంక పూర్తిగా విశ్వసించాలి.
"నీ ప్లానేమిటో త్వరగా చెప్పు. నీకేం కావాలో కూడా" అడిగాడు శుక్రాచార్య.
"నరరూప రాక్షసుల్లాంటి వార్ని నలుగుర్ని ఇవ్వండి, హాస్పిటల్ చీఫ్ కి ఫోన్ చేసి నేను వస్తున్నట్లు కావల్సిన సహాయం చేయమని చెప్పండి చాలు.
* * *
"మీకిప్పుడే శశాంక ఎస్టేట్ నుండి ఫోన్ వచ్చిందనుకుంటా....? ఉస్మానియా హాస్పిటల్ చీప్ ని ఉద్దేశించి అడిగాడు భరత్.
చీప్ అవునన్నట్లు తలూపుతూ "చెప్పండి మీకు నేనేం చేయగలను?" అన్నాడు.
"నన్ను కొత్తగా వచ్చిన డాక్టర్ గా మీ హాస్పిటల్ లో ప్రవేశపెట్టండి. ఆ తరువాత విశ్వదత్త రూమ్ నాకు అప్పగించండి."
భరత్ మాటలకి చీప్ కొద్దిగా జంకాడు.
ఇందులో ప్రమాదం ఏంలేదు. నేనెవరికి ట్రీట్ మెంట్ ఇవ్వను. విశ్వదత్త రూమ్ లో కూర్చుంటానంతే. టైం లేదు క్విక్."
నిండా ఇరవై కూడా ఉన్నట్లు కనబడని ఈ యువకుడు ఏదైనా ప్రమాదాన్ని సృష్టించాలనుకుంటున్నాడా__ తప్పించాలనుకుంటున్నడా చీప్ విస్మయంలోపడ్డాడు భరత్ ను చూస్తూ.
చప్పున తేరుకుని చకచకా అరేంజ్ మెంట్సు చేశాడు.
ఐదు నిమిషాల్లో డాక్టర్స్ కోట్ వేసుకుని హుందాగా విశ్వదత్త రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు.
విశ్వదత్తను భరత్ ఇదే తొలిసారి చూట్టం.
విశ్వదత్త ఓ పక్కకు తిరిగి గాఢనిద్రలో ఉన్నాడు. అతన్ని చూడగానే భరత్ కి ఒక్కసారి తీవ్రమైన ప్రకంపన వచ్చింది. తనకు దైవ సమానుడైన అనంత్ ను గాయపర్చిన వంశానికి వారసుడు ఒళ్ళుపై తెలియక డబ్బు, పలుకుబడి అండగా పట్టపగలు కొన్ని వందల మంది మద్య నిలువునా ఓ మనిషి ప్రాణం తీసిన రాక్షసుడు__పథకం ప్రకారము వీడ్ని ఇప్పుడు రక్షించినా ఆ తరువాతైనా అంత తేలిగ్గా వదలరాదని ఆఖరిసారి నిర్ణయించుకున్నాడు భరత్.
అంతలో నలుగురు కాంపౌండర్స్ వచ్చారా గదిలోకి.
వాళ్ళు కాంపౌండర్స్ రూపంలో అంతకు ముందే ప్రవేశించిన శశాంక మనుషులు.
కనురెప్పపాటు కాలంలో ఒక్కొక్కరు నల్గుర్ని నమిలిమింగేయగల నరరూప రాక్షసులు.
ప్రస్తుతం భరత్ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు.
"మీరు ఈ రూమ్ కి ఒక్కొక్కరు ఒక్కోపక్క కాపు కాయండి. డ్యూటీలో ఉన్నట్లే నటిస్తూ అప్రమత్తంగా రాగల ప్రమాదాన్ని అడ్డుకోండి. వాళ్ళు మిమ్మల్ని దాటుకుని రాలేకపోవచ్చు. ఒక వేళ వస్తే ఇక్కడ నా చేతిలో మసై పోతారు. ఒక్కటి గుర్తుంచుకోండి__ఒక వలయాన్ని ఇప్పటికే అబిడ్స్ సర్కిల్, ఈ హాస్పిటల్ చుట్టూ పన్ని ఉంచాడు. ఇక్కడే చుట్టుప్రక్కలే మఫ్టీలో పోలీసులుండి ఉంటారు. వారికి మన ఉనికి తెలియకూడదనే మనమీరూపాల్లోకి మారాం. ఈ రెండు వలయాల్ని చేదించుకుని భూపతి మనుషులు రావలసి వుంటుంది. పోలీసుల కళ్ళుగప్పి మొదటి వలయాన్ని ఛేదించుకొని వచ్చినా మన వలయం దాటి అడుగువేయరాదు. అవసరం రానంతవరకు మీరెలాంటి గలాటా సృష్టించవద్దు. అనివార్యం అనుకుంటే అల్లకల్లోలం సృష్టించైనా విశ్వదత్తను కాపాడాలి. ఆ సందర్భంలో పేషెంట్స్ కి, స్టాఫ్ కి ఎలాంటి నష్టం జరగరాదు. వెళ్ళండి" అన్నాడు భరత్.
సరిగ్గా అదే సమయంలో శుక్రాచార్య ఫోన్ చేశాడు అబిడ్స్ పోలీస్ స్టేషన్ కి.
"మిస్టర్ సర్కిల్.... ఈ రాత్రికి విశ్వదత్తను తప్పించే న్కూఫ్ ఒకటి సిద్ధమవుతోంది. నీవు నీ స్టాఫ్ తో గట్టిగా కాపు కాయకపోతే పని ఫినిష్....ఇట్లు ఇన్ ఫార్మర్" ఫోన్ పెట్టేశాడు శుక్రాచార్య.
నిముషాల్లోనే ఎలాంటి ప్రమాదానైనా ఎదుర్కోగల పదిమంది పోలీస్ కమెండోస్ రప్పించబడ్డారు.
మామూలు మనుషుల్లాగే క్షణాల్లో హాస్పిటల్ లో జొరబడ్డారు పదిమంది.
విశ్వదత్త వార్డు చుట్టూ రక్షణ కవచం బిగించారు.
హాస్పిటల్ హాస్పిటల్ నే క్షణాల్లో నామరూపాలు లేకుండా చేయగల భయంకరమైన వ్యక్తులు, వార్ని ఎదుర్కొనే ప్రమాదకరమైన పోలీసు కమెండోలు__ఈ రెండు బాచెస్ లో మట్టుపెటైనా విశ్వదత్తను తీసుకుపోగల కౄరులు ప్రస్తుతం తమతోనే వున్నారని అక్కడున్న పేషెంట్స్ గాని, స్టాఫ్ కుగాని ఏమాత్రం తెలియదు,
క్రమంగా సాయం చీకట్లు ముసురుకుంటున్నాయి. విశ్వదత్త రక్షించాలనుకునేవారు, తప్పించుకుపోకుండా చూడాలనుకునేవారు, చంపేయాలనుకునేవారు....అందరూ అప్రమత్తులయ్యారు.
ఎవరికివారు ఎప్పుడు ఏవేపు నుండి ఎటాక్ జరుగుతుందోనని ప్రత్యక్షి యుద్ధానికి సిద్ధమవుతున్నారు.
* * *
రాత్రి పదకొండు గంటలు కావస్తోంది.
ఆ హాల్లో ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు.
వారి మధ్యలో వున్నా టీపాయ్ మీద షాంపైన్ బాటిల్ ఓపెన్ చేసుంది.
"రాబోయే రేస్ సెలెక్షన్ రేపే అచ్చావ్వాల్సి వుంది. ముందుగా మీకు కనిపించి వెళదామని వచ్చాను" అన్నాడు హిందూ ఇంగ్లీషు డైలీ రేస్ కరస్పాండెంట్ వినయంగా. ప్రతి డైలీ పేపర్ రేసెస్ జరుగుతున్న సీజన్ లో రేసెస్ కి ఒక కాలమ్ మెయిన్ టైన్ చేస్తుంది. దాన్ని నిర్వహించటానికి రేస్ సెలక్షన్ లో అనుభవమున్న జర్నలిస్టుని నియమిస్తుంది. చాలామంది పంటర్స్ పేపర్స్ లో చూపే తమ సెలక్షన్ ని స్థిరపర్చుకుంటారు.
"నిజానికి ఇప్పుడు నీతో మాట్లాడే మూడ్ లో లేను. అయినా దేనికదే గదా ఇంతకీ నీ సెలక్షన్ ఏంటి....?" కొడుకు లైఫ్ రిస్క్ పట్ల వ్యాకులత చెందుతూనే దాన్ని పైకి కనిపించకుండా జాగ్రత్త పడుతూ అడిగాడు శశాంక.
"స్కైనాకర్ కి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నాకే కాదు గతంలో దాన్ని ఎరుగున్న ప్రతి ఒక్కరికి తెలుసు...."
"సెకెండ్ ...."
"టెంపుల్ కోర్టు. ఇదీ కన్ ఫర్మ్ డ్ సెలెక్షనే"
"సందేహం ఏం లేదా....?"
"ఏంటిసార్ అలా సందేహపడతారు. హండ్రెడు కాదు నూటయాభై పర్సెంట్ ప్రాపబిలిటీ...."
"ఏమో నాకు సందేహమే"
"మీరేదో తమాషాకి అంటున్నారు. స్కైవాకర్ మంచి ఫామ్ లో వుంది. అది అసలు పుట్టిందే గెలవటానికి సార్. ఓటమి దాని చరిత్రలో లేదు. వెరీ ప్రామిసింగ్ హార్స్. ఆల్ టైమ్ హాట్ ఫేవరేట్. ష్యూర్ విన్నర్ సార్?
అసలు అన్నిసార్లు శశాంక సందేహం ఎందుకు వెలిబుచ్చుతున్నాడో ఆ కరస్పాండెంటుకి అర్ధం కావటం లేదుగాని చిన్న అనుమానం బయలుదేరింది.
చిన్నగా నవ్వాడు శశాంక. ఆ తరువాత తెరలు తెరలుగా ఆ నవ్వు పెద్దదయింది.