Previous Page Next Page 
అశ్వభారతం పేజి 33


    శశాంక వేపు అనుమానంగా చూశాడు.

    ఆ నవ్వు తాలూకు ఉధృతం క్రమంగా తగ్గుతూ వ్యంగ్యంగా మారిపోయింది.

    కరస్పాండెంట్ కి అర్ధమయిపోయింది. బ్రహ్మాండమైన స్కూప్ ఏదో తెరవెనుక జరుగుతోందని, లేదంటే బిగినర్స్ కూడా స్కైవాకరే గెలుస్తుందని దాని గత చరిత్రను చూసి నమ్ముతుంటే_ అదే తను చెబితే శశాంక నొసలు చిట్లించి నవ్వాడంటే గ్యారంటీగా ఏదో జరుగుతోంది.

    అలాంటి స్కూప్ ని ముందుగా పసిగట్టి పేపరులో రాయగలిగితే అటు మేనేజ్ మెంట్ లో? ఇటు పంటర్స్ లో తనకు, తన సెలక్షన్స్ కి, తను పనిచేసే పేపర్ కి మంచి రెప్యుటేషన్ బిల్డప్ అవుతుంది.

    అయితే ఆ స్కూప్ ఎలాంటిదో తెలియాలి. స్కైవాకర్ ని ఓడించి దేన్ని గెలిపించబోతున్నారు? స్కైవాకర్ ఫాస్ట్ రాదని రాసినా ఏది విన్ అవుతుందో రాయాలంటే స్కూప్ తెలియాలి. తెలిసినా అది పేపర్ లో రావటం శశాంకకి ఇష్టంలేకుంటే మరుసటిరోజుకు తన పెళ్ళాం బిడ్డలకు మిగలడు.

    కరస్పాండెంట్ పరిస్థితి శశాంక ముందు సంకటంగా తయారైంది.

    "అయితే స్కైవాకర్ గెలవదంటారా?"

    "అనేకదా అర్ధం"

    "కాని ఎలా సాధ్యం సార్ ....? ష్యూర్ గా గెలుస్తుందనుకుంటున్న హార్స్ గెలవకపోతే పంటర్స్ కి ఆ మోసం తెలియదూ?"

    "మోసం అని ఎవరన్నారు?"

    "అది మీ మాటల్లోనే బోధపడుతోంది."

    "మోసమే కాని అది మోసమని తెలియదు."

    "అసాధ్యం సార్. కొన్నివేలమంది పంటర్స్ కళ్ళముందు, వీడియో కెమేరాలు జామ్ లో పనిచేస్తుండగా అంతటి మోసం ఎవరివలనా సాధ్యంకాదు సార్" కాస్త నిబ్బరం కూడదీసుకొని అన్నాడు కరస్పాండెంట్.

    మరోసారి పెద్దగా నవ్వుతూ ఠక్కున ఆగిపోయాడు శశాంక.

    "పిచ్చివాడా....నీకేం తెలుసు. నీకు ఏదో ఒక సెలెక్షన్ తప్ప. ఆ సెలక్షన్ కూడా రేసుల్లో పాల్గొంటున్న గుర్రాల పెడిగ్రి చూస్తావు. 

    దాని గత సామర్ధ్యం చూస్తావు. దాని జాకీ, ట్రైనర్ గురించి చూస్తావు. వాటి ప్రకారం సెలక్షన్ నీవైనా, వేలాది పూట పంటర్స్ అయినా అంతేగదా. కాని వీరెవరికి తెలియని ఖరీదైన మెదళ్ళు వాటి వెనుక వుంటాయి. అవి చాలా వేగంగా పనిచేస్తాయి. చాలా తెలివిగా పనిచేస్తాయి. ఆ మెదళ్ళు డబ్బు ముట్టుకోవు. మెదళ్ళు లేని పూర్ పంటర్స్ డబ్బు కాజేస్తాయి.

    "మాలాంటి వాళ్ళు సరదాకోసం ఏర్పాటు చేసుకున్న గేమ్ అది. ఆ సరదా గేమ్ లో కూడా డబ్బు గెలవటమే మా లక్ష్యం...." ఒకింతసేపు ఆగాడు శశాంక.

    శశాంక అలా మాట్లాడగా ఎప్పుడూ చూడలేదు. తాగిన మత్తులోనో, తట్టుకోలేని బాధలోనో, ఇతరుల్ని మోసం చేయగలుగుతున్నామన్న సేడిస్టిక్ ఫీలింగ్__లక్షలమందిని ఫూల్స్ ని చేస్తున్నామన్న రాక్షస ఆనందం.

    కరస్పాండెంట్ కి ఇక అక్కడ ఉండాలంటే భయమేసింది. లేచాడు వస్తామన్నట్లు నమస్కారం పెడుతూ "ఎలా రాయమంటారు?" అన్నాడు.

    గతిలేక ఒక్కోసారి_ భయపడి ఒక్కోసారి_ కక్కుర్తిపడి ఒక్కోసారి ప్రపంచ వ్యాప్తంగానే కొంతమంది రేస్ కరస్పాండెంట్స్ రాంగ్ సెలెక్షన్ ఇచ్చి లక్షలాది పంటర్స్ ని మోసం చేయటం నేడు జరుగుతున్నదే.

    "నీవనుకుంటున్న సెలెక్షన్సే రాయి" అన్నాడు శశాంక మత్తుగా ఓ పక్కకి వాలిపోతూ.

    కరస్పాండెంట్ బయటకు నడుస్తూ ఆలోచిస్తున్నాడు_ ఆ స్కూన్ ఏమై వుంటుంది? ఎంతమంది పంటర్స్ రేపు డబ్బును పోగొట్టుకుంటారో? ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారో? ఎంతమందికి గుండెపోటు వస్తుందో__? ఎన్ని కుటుంబాలు నిలువునా కూలిపోతాయో?

    ఉన్నపళాన తనెళ్ళి వేలాది పంటర్స్ మధ్య నిలబడి రేపు జరగబోయే రేస్ లో పెద్ద మోసం జరగబోతోంది. స్కైవాకర్ గెలవదు అని అరిచినా నమ్మరు. పైగా తననే పిచ్చివాడని తరిమికొడతారు.

    మోసం చేయబడతామని తెలిసే_ ఆ....అదేంలేదని భ్రమపడటం ఆశపడటం__ఆశపడుతూ మోసపోవటం, మోసపోయామని తెలిసీ భ్రమలోనే నాశనం కావటం_ నాశనంలోనే సంపాదించుకోగలమన్న భ్రమలో మునిగిపోవటం__కేవలం అదృష్టాన్ని, చేత గీతల్ని, జాతక చక్రాలని, న్యూమరాలజీని, శకునాలని, జ్యోతిష్కాన్ని నమ్ముకుని అదృష్టవంతులమనుకునే దురదృష్టవంతులు. తమని, తమ కళ్ళని ఎవరూ మోసం చేయలేరనే ఆత్మ విశ్వాసంతో జీవితం పట్లే విశ్వాసాన్ని కోల్పోయే దురాశా జీవుల ప్రపంచం.

    పాపుల ప్రపంచం, పావురాళ్ళ ప్రపంచం.

    వేటగాళ్ళు వేరు_ వేలాడబడేది వీళ్ళు.


                                                                       *    *    *


    హాస్పిటల్ క్లాక్ పన్నెండు గంటలు కొట్టింది. 

    మఫ్టీలో ఉన్న పోలీసు కమెండోలకు, భరత్ మనుష్యులకు అంతా సస్పెన్స్ గా ఉంది.

    శశాంక తన కొడుకును ఎత్తుకెళ్ళే పధకం సిద్ధం చేసుండవచ్చని భావిస్తున్న పోలీసులకు అంతవరకు ఆ ప్రయత్నమైనా ఎందుకు జరగలేదో అర్ధం కావడం లేదు.

    యజ్ఞభూపతి ఒక సవాల్ చేశాడంటే అది తీర్చుకునే వరకు నిద్రపోడు. అందుకు లక్షలేకాదు కోట్లు ఖర్చయినా వెనుకంజవేసే మనస్థత్వం కాదు. మరింత వరకు ఆ ప్రయత్నమేది జరగకపోవటం భరత్ వెంట వచ్చిన కిల్లర్స్ కి అర్ధంకావటం లేదు.

    వీళ్ళెవరికి అర్ధం కాకపోయినా భరత్ కి ఏ క్షణంలోనయినా ఏదో ఒక వేపు నుండి ఎటాక్ జరగవచ్చునని అనుమానంగా ఉంది.

    కరక్టుగా 12-5 నిమిషాలకు హాస్పిటల్ సూపర్నెంట్ ఇద్దరు డాక్టర్స్ ని తీసుకొని విశ్వదత్త రూమ్ కి బయలుదేరాడు.

    వీళ్ళను చూసిన మూడో వలయంలోని భూపతి మనుష్యులు ఒక్కొక్కరు ఒక్కో పోలీసు పక్కకి చేరారు. వాళ్ళకి మాత్రమే మరికొద్ది నిమిషాల్లో అక్కడో విస్పోటం జరగబోతోందని తెలుసు. అందుకే సిద్ధమవుతున్నారు.

    పోలీసులకు ఏమాత్రం అనుమానం రాలేదు. అనుమానాస్పద పరిస్థితుల్లో అక్కడెవరూ కన్పించలేదు. సూపర్నెంట్ వెంట వస్తున్న ఇద్దరు డాక్టర్స్ ని పరీక్షగా చూసివుంటే ఆ క్షణానే జాగిల్లాలా మీదకు దూకేవారు.

    అల్లంత దూరానే సూపర్నెంట్ రాకను, ఆ పక్కనే వస్తూన్న ఇద్దరు డాక్టర్స్ ని చూసిన భరత్ క్షణాల్లో ముంచుకురానున్న ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు.

    కరక్టుగా గదిలోకి ఎంటర్ అయ్యేసరికి విశ్వదత్త నిద్రపోతూ కనిపించాడు. ఆ గదిలో మరెవరూ కనిపించలేదు. ఆ ఇద్దరు డాక్టర్స్ మెషిన్ కన్నా వేగంగా సూపర్నెంట్ ని పక్కకినెట్టి మెరుపువేగంతో విశ్వదత్త బెడ్ వేపు దూకుతూనే పటకా కత్తుల్ని బయటకు తీశారు. సర్రున రెండు కత్తులు గాలో లేచాయి. మరొక్క క్షణముంటే ఆ రెండు కత్తులూ విశ్వదత్త శరీరాన్ని ఖచ్చితంగా మూడుభాగాలు క్రింద విడగొట్టేసేవే.

    అప్పటివరకు విశ్వదత్తను అతుక్కొని పడుకొని వున్న భరత్ స్ప్రింగ్ లా లేచాడు. గాల్లో ఆ హఠాత్పరిణామాన్ని ఊహించనివారు తేరుకునే లోపలే గుండెలమీద పడ్డ దెబ్బలకు మొదలు విరిగిన చెట్లలా కూలిపోయారు.

    క్షణాల్లోనే తేరుకొని రెట్టించిన వేగంతో ఫ్లోర్ మీంచి లేచారు. అప్పటికే బాడీని ఉక్కుముక్కలా చేసుకుని రెడీగా వున్న భరత్ మరోసారి గాల్లోకి డైవ్ చేశాడు. రక్తం కక్కుకుంటూ నేలకూలారిద్దరు.

    సన్నగా బలహీనంగా కనిపిస్తున్న భరత్ డాక్టర్స్ రూపంలోకి తనవెంట వచ్చిన ఇద్దరు దృడకాయుల్ని క్షణాల్లో ఎలా దెబ్బతీయగలిగాడో అర్ధంకాలేదు సూపర్నెంట్ కి. బహుశా పోలీసు ఆఫీసరయి వుండాలనిపించింది.

    కూలిన ఇద్దరు మరలా లేచారు.

    ఇప్పుడు గనుక తాము విశ్వదత్తను చంపేసి వెళ్ళకపోతే తమ ప్రాణాల్ని భూపతికి అప్పగించాల్సి వుంటుందని ఆ ఇద్దరికీ తెలుసు.

    ఎయిర్ కండిషనర్ రూమ్ లో జరుగుతున్న బీభత్సం తాలూకు శబ్దాల్ని మింగేస్తోంది.

    బయట వున్న పోలీసులకు, భరత్ మనుష్యులకు, భూపతి మనుష్యులకు లోపల జరుగుతుందేమిటో అర్ధంకాక జుట్లు పీక్కుంటున్నారు.

    ఈ బయట ఉన్న మూడు బ్యాచ్ ల్లోనూ ముందు తేరుకుంది శశాంక మనుష్యులే. ఆ నలుగురు అనుమానంగా, డ్యూటీలో వున్న కాంపౌండర్స్ లా నలువేపుల నుంచి రూమ్ ని చుట్టుముట్టడం పోలీసులక్కూడా అనుమానం కలిగించింది. కరక్టుగా రూమ్ ముందుకు చేరేసరికి కమెండోలు నాలుగంటల్లో గాల్లో డైవ్ చేస్తూ వచ్చి రూమ్ లోకి ఎంటర్ కాబోతున్న శశాంక మనుష్యుల ముందు ప్రత్యక్షమయ్యారు.

    రూమ్ ముందు ఘర్షణ మొదలయింది.

    రూమ్ లోపల క్షణక్షణానికి భరత్ ఓపిక సన్నగిల్లిపోతోంది.

    పన్నెండు రోజులక్రితం తగిలిన దెబ్బల తాలూకు నీరసం భరత్ ని క్షణక్షణానికి నిస్సత్తువకు లోను చేస్తోంది. సెడెషన్ మత్తులోకి పంపించబడిన విశ్వదత్త ఇప్పుడప్పుడే లేచి భరత్ కి సహకరించలేడు.

    జరుగుతున్న బీభత్సాన్ని చూసి సూపర్నెంట్ బిగుసుకుపోయాడు.

    మరికొద్ది క్షణాలుంటే భరత్ నేలకూలేవాడే. సరిగ్గా అప్పుడే గది వెనుక వైపు కాస్తున్న శశాంకకు చెందిన నలుగురు మనుష్యుల్లో ఒకడు కిటికీ అద్దాల్ని ఛేదించుకుని రూమ్ లోకి దూకాడు.

    ఆ శబ్దానికి ఆ వేపు చూసిన భూపతి మనుష్యులిద్దర్ని నేలకూల్చటానికి భరత్ కి అరక్షణం సరిపోయింది.

    భరత్ కృతజ్ఞతగా చూసాడు ఆ వ్యక్తివేపు.

    మీకేం ఫర్వాలేదన్నట్లు ఆ వ్యక్తి తలూపుతూ క్షణాల్లో కిందపడున్న ఆ ఇద్దర్ని మూటల్లా మడచి కిటికీలోంచి అవతలకు తేలిగ్గా విసిరేశాడు. అప్పుడు వినిపించింది. తలుపులు తెరుచుకుంటున్న శబ్దం. చంగున శివంగిలా ఆ వ్యక్తి బయటకు దూకటం కిటికీరెక్కలను దగ్గరకు అప్పటికే తేరుకున్న భరత్ ఏమీ తెలియనట్లు అప్పటివరకు అక్కడేం జరగనట్లు చెంగున దూకి బెడ్ పక్క కుర్చీలో రిలాక్సింగ్ మూడ్ లో సెటిల్ అయిపోయాడు.

 Previous Page Next Page