Previous Page Next Page 
అశ్వభారతం పేజి 31


    "సరే అడగను. ఓ గమ్మత్తు చూసారా? మీ ప్రశ్నలో ఉండాల్సిన లాజిక్ కి తమాషా అనే సమాధానం అడ్డం పెట్టుకున్నారు. నా సమాధానానికి మాత్రం లాజిక్ ఎక్స్ప్ క్టే చేస్తున్నారు. సరే కానివ్వండి....

    "మీరు లా స్టూడెంటా....?"

    "లా చదువుతున్నాను. స్టూడెంట్ ని మాత్రం కాదు...."

    "అదేమిటి లా చదువుతున్నానన్నారు. స్టూడెంట్ కాకపోవటం ఏమిటి...."

    "మెడిసిన్ చదవలేదు__కాని ప్రాక్టీసు చేస్తుంటాను. కొందరు ఎలా....?"

    "బికాజ్ ఆఫ్ ఎక్స్ పీరియన్స్"

    "అతని భ్మతి కోసం అతను వైద్యం చేయాలి. ఓ డాక్టర్ దగ్గర చేరి నేర్చుకుంటాడు, నాకు ఇండియన్ పీనల్ కోడ్ తో ఆడుకోవాల్సిన అవసరం వుందన్నాడు. అంటే లా చదవాలి కాని నాకా వయస్సు ఇంకా రాలేదు, అది వచ్చేదాక ఆగేంత సమయం లేదన్నాడు. అందుకే స్టూడెంటుగా కాక అవసరం వుంది కనుక చదువుతున్నాడు. ఏ కాలేజీలో చేరలేదు గనుక నేను స్టూడెంటుని కాను ఎకడమిక్ గా...."

    చిత్రమైన మనిషి అనిపించింది ఈసారి ఆషాకు కూడా.

    "అన్నాడు, అన్నారు. మీ ఫాదరా?"

    "కాదు"

    "మరి ....?"

    "అంకుల్"

    "అంకులా....?!"

    "అవును ఓ లక్ష్యం కోసం నన్ను పెంచాడు. లా బుక్స్ చదవమన్నారు. జాకీగా ట్రైనింగ్ ఇప్పించాడు...." ఒకింతసేపు ఆగాడు భరత్.

    అలాగే కొనసాగించి వుంటే తన తండ్రి ఖర్చుపెట్టే పధకానికి మూలం భరతేనని త్రివేణికి తెలిసిపోయి వుండేది, అప్పుడు కధ మరో మలుపు తిరిగేదేమో. 

    భరత్ సంభాషణ కొనసాగించాలని ఆ ఇద్దరు అనుకోకపోవటం మరో రకంగా దారి తీసింది.

    "చూసావా ఎంత తిక్కగా సమాధానాలు చెబుతారో" అంది త్రివేణి తెచ్చిపెట్టుకున్న కోపంతో.

    భరత్ ఎంతసేపు మాట్లాడుతున్నా అలా వినాలనిపిస్తుంది. ఎందుకో తనకే తెలియని త్రివేణి మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది.

    "నావి తిక్క సమాధానాలు కావు బుజ్జి ...." అన్నాడు మరింత ఉడికిస్తూ.

    మొహం ముడుచుకుంది త్రివేణి. అందులో కోపం లేదు. తనకే తెలియని స్పందన.

    "సరి సరే మీకు ఇరవై, మీ అమ్మగార్కి డెబ్బై. హఠాత్తుగా ఓ రోజు సృష్టికర్త ప్రత్యక్షమై ఒకరి ప్రాణాన్ని మాత్రం ఇస్తాను. నీ ప్రాణం కావాలో మీ అమ్మ ప్రాణం కావాలా అంటే ఏం చెబుతారు?"

    భరత్ ఏం చెబుతాడోనని ఇద్దరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చాలా క్లిష్టమైన ప్రశ్న. సెంటిమెంటు ఇమిడి వున్న ప్రశ్న. అంత తేలిగ్గా ఠకీమని సమాధానం చెప్పలేని ప్రశ్న.

    ఇద్దరి వేపు చూసాడు భరత్.

    "నా ప్రాణమే కావాలని అడుగుతాను....

    ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

    "మనదేశ వైద్య సర్వీసుల ప్రమాణం చాలా తక్కువ. మీ డాక్టర్స్ కి సంపాదన తప్ప రోగుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తక్కువ. ఒక్కసారి మీరు గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేరితే మీ మెదళ్ళు పని చేయవు. చేతులు మాత్రమే పనిచేస్తాయి. కొత్త కొత్త జబ్బుల గురించి అవగాహన తక్కువ. మెడికల్ మేగ్ జైన్స్ చదవరు. పెద్దపెద్ద డాక్టర్స్ పరిశోధనా వ్యాసాలు చదవరు.

    ఇకపోతే నేను మధ్యతరగతి మానవుణ్ణి కనుక నా తల్లికి బలవర్ధకమైన ఆహారం ఇప్పించలేను కనుక 70 తర్వాత ఆమెకి అంటే మా అమ్మకి బ్రతికే అవకాశాలు తక్కువ. అలాంటప్పుడు ఆమె బతకటంకన్నా నేను బతకటమే మంచిది. ఎందుకంటే మిగిలిపోయిన కుటుంబ బాధ్యత తీర్చటం వయస్సులో ఉన్న నాకే సాధ్యం గనుక...."

    ఆషా భరత్ వేపు ప్రశంసా పూర్వకంగా చూస్తూ "ఇలా సమాధానం చెబితే మీరు స్వార్ధపరులని_జన్మనిచ్చిన కన్నతల్లి ప్రాణంకన్నా నాదే ముఖ్యమనుకున్న మీ గురించి ఎవరేం అనుకోరా?"

    "ఆ సమాధానం చెబితే అది హిపోక్రసీ అవుతుంది. మెటీరియలిస్టిక్ గా ఆలోచిస్తే నా సమాధానమే కరెక్టు. పై పెచ్చు అలా చెప్పటం సినిమా డ్రామా అవుతుంది. వాస్తవ జీవితంలో అవి వుండవు...."

    "యూ ఆర్ రైట్" అని త్రివేణి వేపు చూసింది ఇప్పుడేం అంటావన్నట్లు.

    త్రివేణి మాట్లాడలేదు.

    "మనిషి నిజ జీవితంలో ఆచరించటానికి మెటీరియలిజం అవసరం. మానసిక ఆనందం కోసం చేయలేనివి చేసినట్లు తృప్తి పడటానికి సెంటిమెంట్, డ్రామా పనికొస్తాయి. సినిమాల్లో తల్లిదండ్రుల కోసం త్యాగం అన్నాచెల్లెళ్ళు. అక్కాతమ్ముళ్ళు ప్రేమ చూసి చాలా బావుందనుకుంటాడు. ఇంటికి రాగానే వారిమీదే ఎగిరిపడతాడు. నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అయితే ఆ ఏట్లో దూకు అంటే దూకను. ఎందుకుదూకాలి_నేను ప్రేమిస్తున్నాను అది చెప్పటానికి నా ప్రాణాన్ని రిస్కులో పెట్టుకోనక్కర్లేదు పూలిష్ గా...."

    భరత్ వాదన విని ఇద్దరూ చకితులయ్యారు. "మీ ప్రశ్న అయిపోయింది. ఇక నేను వేస్తాను. అందులో మీరు ఓడిపోతే నేను చెప్పింది చేయాలి....ఓకే?"

    "ఓకే" అంది ఆషా.

    "ఒక చెవిటివాడు, గుడ్డివాడు, మూగవాడు ఫ్రెండ్స్. ఒకే ఇంటిలో ఉంటున్నారు. గుడ్డివాడికి పెళ్ళయింది కొన్నాళ్ళకి. ఓరోజు చెవిటివాడు గుడ్డివాడి భార్యను బలవంతం చేయబోయాడు. అది మూగవాడు చూసాడు. ఈ విషయం కళ్ళులేవు గనుక గుడ్డివాడికి తెలియదు. మూగవాడు గుడ్డివాడికి జరిగింది చెప్పాలి. ఎలా చెబుతాడు?" చెప్పటం ఆపి ఇద్దరివేపు చూసాడు.

    ఇద్దరు అయోమయంలో పడ్డారు.

    ఐదునిమిషాలు గడిచాయి. ఏ సమాధానం చెప్పలేకపోయారు. "చాలా చిన్న ప్రశ్న. నేను వేయగల చిన్న ప్రశ్న. దీనికి నిమిషం చాలు కనుక మీరు ఓడిపోయామన్నట్లు ఇక నేను చెప్పినట్లు చేయాలి...."

    ఓడిపోయామన్నట్లు దిగాలుగా చూసారు.

    "మిస్ ఆషా మీరు కళ్ళు మూసుకోండి. నేను తెరవమన్నప్పుడు తెరవాలి. అది మీరు చేయవల్సినపని. ఇక మిస్ త్రివేణి-ఎలాంటి కేక వేయకూడదు...." అన్నాడు బెడ్ దిగుతూ. అతనేం చేయబోతున్నాడో ఆషాకి అర్ధమయి రాబోయిన నవ్వును పెదాలమాటున దాచుకుంది.

    త్రివేణికి ఏం అర్ధం కాలేదు.

    కేక వేయటం ఏమిటి....?!

    ఆ అవసరం తనకేం ఉంది?!

    భరత్ ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాడు.

    త్రివేణికేం అర్ధం కాలేదు.

    ఆషా జరగబోయే సంఘటన కోసం ఎదురు చూస్తోంది. అంతలో ఓ వ్యక్తి పరిగెత్తుకొచ్చాడు హడావుడిగా.

    ఆ శబ్దానికి భరత్, త్రివేణి ఒక్కసారే అటు చూసారు.

    ఆషా ఆ హఠాత్పరిణామానికి కళ్ళు తెరిచింది.

    వచ్చిన వ్యక్తి రొప్పుతున్నాడు.

    "మీకోసం ఫోన్ లో ట్రై చేసాను. మీరు దొరకలేదు. ప్రాణాలమీదకు వస్తోంది" అన్నాడు ఎగశ్వాస పీలుస్తూ.

    ఆ వ్యక్తిని భరత్ ఎప్పుడూ చూడలేదు_అందువలన భరత్ క్కూడా అతని హడావుడి, రాక ఆశ్చర్యం కలిగించింది.

    "ఎవరి ప్రాణాల మీదకు వచ్చింది! అసలు ఎవరునువ్వు....?" అడిగాడు భరత్.

    జరగబోయిన ఒక మధురఘట్టం ఆగిపోయిందని ఆషా నిస్పృహ చెందింది.

    తనెందుకు కేక వేస్తుందో ఇంకా అర్ధంకాని త్రివేణికి కొత్త వ్యక్తి రాక మరింత కన్ ప్యూజ్ గా ఉంది.

    "విశ్వదత్త ప్రాణాలకి" అన్నాడా వ్యక్తి ఆందోళనగా.

    అతనేమన్నాడో ఒక్కక్షణం అర్ధంకాలేదు భరత్ కి.

    వెంటనే తేరుకొని "నీవు బయట ఉండు వస్తున్నాను" అంటూ వేగంగా వెనక్కి తిరిగి వచ్చి షూష్ వేసుకొని బయటకు నడుస్తూ "సమయం వచ్చినప్పుడు మీరు నేను చెప్పినట్టు చేయాల్సి ఉంటుంది. మాట తప్పవద్దు మిస్ త్రివేణి. బైదిబై మీ తమాషా ప్రశ్నకి చిన్న కొసమెరుపు. నాకు 90 ఏళ్ళ అమ్మగాని, 70 ఏళ్ళ అమ్మగాని లేదు. అసలు అమ్మేలేదు" అంటూ ఓక్షణం వారివేపు చూసి వడివడిగా వెళ్ళిపోయాడు.

    ఇద్దరూ భిన్నులైపోయారు.

    అసలు అమ్మలేదు అని అంటున్నప్పుడు లీలమాత్రంగా అతని కళ్ళలోతుల్లో కనిపించిన విషాదం ఆ ఇద్దరి దృష్టిలోనూ పడింది.

    త్రివేణి, ఆషా బయటకు వచ్చేసరికి అక్కడ ఆ వ్యక్తిగాని, భరత్ గాని లేరు.

    అంతటితో ఆ విషయాన్ని మర్చిపోకపోయినా, అక్కడతోనే వదిలేసి తను రూమ్ వేపు నడిచారు.

    "నేనెందుకు కేక వేస్తాను....?" అడిగింది త్రివేణి.

    ఆషా చిన్నగా నవ్వింది__

    "అర్ధం కాలేదా?"

    "వూహు...."

    "నీపై అతనికున్న ప్రేమను తెలియజేయటానికి ఒక కీ ఉపయోగించేవాడు. మోస్ట్ ఇంటిలిజెంట్. అన్ని విషయాల్లోనూ"

    "నాపై ప్రేమా?!! త్రివేణి నడుస్తున్నదల్లా ఆగిపోయింది.

    "అవును...."

    "కీ ఏమిటి....?"

    "కిస్ ఈజ్ ది కీ ఆఫ్ లవ్"

    "త్రివేణి మొఖంలోకి ఒక్కసారి రక్తం చిమ్మింది. అది కోపమో, సిగ్గో ఆషాకి అర్ధం కాలేదు.

    "ఇంకో లైన్ కూడా పూర్తి చేస్తాను_నీకు ముందుముందు పనికిరావచ్చు. లవ్ ఈజ్ ది లాక్ ఆఫ్ లైఫ్."

 Previous Page Next Page