అక్కడి ప్రజలు ఒకప్పుడు వంగ దేశం నుంచి (ఇప్పటి బెంగాల్) వెళ్ళిన వారని కొందరి చారిత్రకుల ఊహ.
అక్కడి తోటల్లో కూలీలుగా పనిచెయ్యడానికి భారతీయులు ఎక్కువగా వెళ్ళడం బ్రిటీష్ వారి కాలం నుంచి మొదలయ్యింది. శ్రీలంక తీరానికి తమిళనాడు తీరం చాలా దగ్గర కాబట్టి (రామేశ్వరం నుంచి చూస్తే శ్రీలంక భూభాగం లీలగా కనబడుతూ వుంటుంది) తమిళనాడు నుంచి తమిళులు అధిక సంఖ్యలో వెళ్ళారు.
కాలం గడిచింది.
శ్రీలంకలో స్థిరపడిన తమిళులు అక్కడి స్థానికులతో సమానంగా తమకి హక్కులు లభించడం లేదని, తాము రెండవ తరగతి పౌరులుగా జీవించవలసి వస్తోందనీ భావించారు.
ఎప్పుడయితే తమిళులు హక్కులకోసం అడిగారో, ఇంక శ్రీలంక ప్రభుత్వం వారి మీద దమనకాండ సాగించడం మొదలెట్టింది. శ్రీలంక తమిళులు భారతదేశానికి శరణార్ధులుగా రావడం మొదలెట్టారు.
తమిళుల హక్కులకోసం ఉద్యమం తీవ్రతరమయ్యింది.
ఏ ఉద్యమానికయినా ముఖ్యమైన లక్షణాలు మూడు వుంటాయి.
మొదటగా ఉద్యమ స్థాపకులలోనే భేదాభిప్రాయాలు వస్తాయి. 'ఈగో' కాన్ ఫ్లిక్టు పెరుగుతుంది. 'నువ్వా నేనా?' అన్న అహంభావంతో ఉద్యమాన్ని ముక్కలు చెక్కలుచేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ముక్కని దొరకబుచ్చుకుంటారు. ఒక సంస్థ పది సంస్థలవుతుంది. ఆ తర్వాత ఆదర్శాలు వెనకబడతాయి. అరాచకశక్తులు ఉద్యమంలో దూరతాయి. రౌడీ గ్యాంగుల్లాగా తయారవుతాయి సంస్థలు.
చాలా సహజంగానే, ఆ గతే పట్టింది తమిళుల ఉద్యమానికి కూడా! తమిళుల హక్కులకోసం పోరాడడానికి ఉద్దేశించిన ఉద్యమం అనేక సంస్థలుగా విడిపోయింది. అవి ప్రభుత్వంతో విడివిడిగా సంప్రదింపులు జరుపుతుండగా_
వేలుపిళ్ళే పిరాభకరన్ (ప్రభాకరన్ అనే పేరుకి అపభ్రంశం) అనే యువకుడి నాయకత్వంలో "లిబరేషన్ టైగర్స్ ఆఫ్ టామిల్ ఈలం" (ప్రత్యేక తమిళ దేశంకోసం పోరాడే పులులు) అనే సంస్థ ఉద్భవించింది. ఏవో కొన్ని హక్కులకోసం పోరాటం తమ ధ్యేయం కాదనీ, ప్రత్యేక తమిళ దేశమే తన లక్ష్యమనీ ప్రకటించాడు పిరాభకరన్. తీవ్రవాదమే తన మార్గంగా పెట్టుకున్నాడు.
అది అతను పైకి చెప్పే మాట!
నిజానికి పిరాభకరన్ కి సామ్రాజ్యకాంక్ష వుంది.
శ్రీలంకలో తమిళులు అధికంగా ఉండే ఉత్తర ప్రాంతాలనీ, భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రాన్నీ విడగొట్టి, ఆ రెండింటినీ కలిపి, తమిళ మహా సామ్రాజ్యాన్ని స్థాపించి, దానిని తను చరిత్రకాలపు చోళ చక్రవర్తుల లాగా ఏలాలని అతని ఆకాంక్ష. అదే అతని అంతిమ లక్ష్యం కూడా.
ఈ లక్ష్యం నెరవేరడం కోసం సాటి తమిళ సంస్థలను తమిళులను మట్టుపెట్టడంతో సహా ఏ పనైనా చెయ్యడానికి ఎప్పుడూ వెనకాడలేదు పిరాభకరన్. శ్రీలంక ప్రభుత్వం మీద గెరిల్లా యుద్ధం మొదలెట్టాడు. ఇక్కడొక చిత్రం జరిగింది. ఇజ్రేలీ ఇంటెలిజెన్సు సంస్థ అయిన మొస్సాద్ ని ట్రెయినింగ్ కోసం అడిగాడు పిరాభకరన్. మొస్సాద్ పిరాభకరన్ పులులకు గెరిల్లా యుద్ధంలో శిక్షణ ఇచ్చింది.
కానీ పిరాభకరన్ కి తెలియనిది ఏమిటంటే, అదే స్థావరంలో, ఆ మొస్సాద్ సంస్థే, శ్రీలంక సైనికులకు కూడా గెరిల్లాలను ఎదుర్కోవడంలో శిక్షణ ఇచ్చింది. డబుల్ గేమ్ అంటే ఇదే.
శ్రీలంక తమిళులు భారత సంతతి వారు కావడంవల్ల ఆ సోదరభావంతో తమిళనాడులోని రాజకీయ పార్టీలు తమిళ పులులకు అన్ని విధాలా మద్దతు ఇచ్చాయి. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి యం.జి.ఆర్. 'తంబి' పిరాభకరన్ కి నాలుగు కోట్ల రూపాయలకి ఒక చెక్కు కూడా ఇచ్చాడు.
పిరాభకరన్ తనకు సహజమైన చలాకీతనం చూపిస్తూ, తమిళనాడులో మారే రాజకీయాలని బట్టి ప్లేటు పిరయిస్తూ, కొన్నాళ్లు ఆ పార్టీతో కొన్నాళ్లు ఈ పార్టీతో....అలా స్నేహం చేశాడు.
ఈలోగా శ్రీలంక ప్రభుత్వం తమిళుల మీద మారణహోమం మొదలెట్టింది. అప్పుడు భారత ప్రభుత్వం పూనుకుని, శ్రీలంక ప్రభుత్వానికీ తమిళ సంస్థలకూ (ఎల్.టి.టి.ఇ.తో సహా) మధ్య రాజీ చేసి ఒక ఒప్పందం కుదిర్చింది. ఆ ఒప్పందం ద్వారా తమిళులకు కొన్ని అధికారాలు సంక్రమిస్తాయి.
ఆ ఒప్పందం సజావుగా అమలు జరిగేటట్లు చూడడానికిగానూ శాంతిసేనని (ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఐ.పి.కె.ఎఫ్) పంపింది భారత ప్రభుత్వం.
భారత సైన్యం తనకు అనుకూలంగా, శ్రీలంక ప్రభుత్వానికి ప్రతికూలంగా పక్షపాతంతో ప్రవర్తిస్తుందని ఆశపడ్డాడు తమిళ పులుల నాయకుడు పిరాభకరన్.
కానీ భారత సైన్యం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, ఒప్పందాన్ని అమలులోకి తేవడానికి మాత్రమే ప్రయత్నించడంతో పిరాభకరన్ కి నిరాశ కలిగింది. ఒప్పందం అమలుకి పిరాభకరన్ మీద కూడా ప్రెజర్ తెచ్చింది సైన్యం. దానితో పిరాభకరన్ కి భారత సైన్యంపట్ల ద్వేషం పెరిగింది.
సైన్యం మీదే తిరగబడ్డాడు పిరాభకరన్.
అయినా భారత ప్రభుత్వం తమిళ పులులని నూటికి నూరుశాతం శత్రువులలాగా చూడలేకపోయింది. చేతులూ, కాళ్ళూ కట్టేసి యుద్ధానికి పంపినట్లయింది భారత సైనికుల స్థితి. (సైనికులు కూడా ఆజ్ఞలని జవదాటి కొన్ని అత్యాచారాలు చేశారని ఒక వాదన వుంది.) పాకిస్తాన్ తో చేసిన అనేక యుద్ధాలలో వీరోచితంగా పోరాడి, గెలిచిన భారత సైన్యం తమిళ పులులని పూర్తిగా లొంగదీయలేకపోయింది. (భారత సైన్యం కంటే అన్నివిధాలా చిన్నదయిన శ్రీలంక సైన్యం కొద్ది సంవత్సరాల క్రితం తమిళ పులులని చావుదెబ్బ కొట్టి వాళ్ళకి అతి ముఖ్యమైన జాఫ్నా పట్టణాన్ని పట్టుకోబోతున్నప్పుడూ, భారత ప్రభుత్వం శ్రీలంకకి తీవ్రమైన హెచ్చరిక చేసి, శ్రీలంక తమిళులని ఆడుకోవడం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి.) మొత్తానికి భారత సైన్యాన్ని వెనక్కి పిలిపించెయ్యడం జరిగింది.
శాంతి సైన్యాన్ని పంపినందుకు భారత ప్రభుత్వం మీద కచ్చ పెట్టుకున్నాడు పిరాభకరన్.
ఇదిలా వుండగా ఇప్పుడు ప్రపంచంలో వున్న తీవ్రవాద సంస్థలలోనూ అతి ముఖ్యమైనది పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (పి.ఎల్.ఓ.) దానికి నాయకుడు యాసిర్ అరాఫత్.
అరాఫత్ నెహ్రూ, గాంధీ కుటుంబంతో చిరకాల సాన్నిహిత్యం ఉంది.
రాజీవ్ గాంధీ హత్యకు కొద్ది రోజుల ముందు యాసిర్ అరాఫత్ రాజీవ్ గాంధీతో చెప్పాడు. "నీ మీద హత్యాప్రయత్నం జరగబోతోంది. జాగ్రత్తగా వుండు" అని.
రాజీవ్ దానిని పెద్దగా లక్ష్యపెట్టలేదు. గతంలో శ్రీలంకలోనే రాజీవ్ ని తుపాకితో కొట్టి చంపడానికి ప్రయత్నించాడు ఒక సైనికుడు. అయినా ప్రజలకు దగ్గరగా ఉంటూ, వాళ్ళలో కలిసిపోయే పద్ధతి వదిలిపెట్టలేదు రాజీవ్.
చివరికి, రాజీవ్ మర్నాడు మరణిస్తాడగా, విశాఖపట్నంలో విమానం ఎక్కబోతున్నప్పుడు ఎవరో సణిగారు కూడా.... సెక్యూరిటీ ఏర్పాట్లు సరిగా లేవని!
రాజీవ్ నవ్వి, "సెక్యూరిటీ ఇవ్వవలసింది ఆ పైన ఉన్నవాడు! ఈ మనుషులు కారు" అన్నాడు.
ఆ మర్నాడే రాజీవ్ ణి పిరాభకరన్ పంపిన పిశాచగణం చంపింది.
ఆ దుర్ఘటనతో ఇంక మేలుకున్నాయి కేంద్ర, రాస్త్ర ప్రభుత్వాలు. తమిళనాడులో ఎల్.టి.టి.ఇ. స్థావరాలమీద దాడులు మొదలయ్యాయి. నమ్మలేని నిజాలు బయటపడ్డాయి ఈ దాడుల్లో.
తమిళ పులులు కేవలం శరణార్ధులుగా ఉండడం లేదు ఇక్కడ!
భారత భూభాగం మీదే వాళ్లు ట్రెయినింగ్ కాంప్స్ పెట్టుకుని, తమ సభ్యులకే కాక, తమిళనాడులోని వేర్పాటువాద సంస్థలు కొన్నిటికీ, అస్సాంలోని ఉల్ఫా మొదలైన అతివాద సంస్థలకూ ఆయుధ శిక్షణ ఇవ్వడమే కాకుండా అనేకమైన సంఘవ్యతిరేక శక్తులకు ఆయుధాలు అమ్ముతున్నారని కూడా తెలిసింది.
తమిళ పులుల నాయకుడు పిరాభకరన్ తన ప్రాబల్యం నిలబెట్టుకోవడం కోసం తక్కిన తమిళ వర్గాలని నిర్ధాక్షిణ్యంగా మట్టుపెట్టాడన్నది ఇప్పుడు పూర్తిగా రుజువయింది.
సిద్దాంతాలకీ, ఆదర్శాలకీ చరమగీతం పాడేసి వ్యక్తిపూజే ముఖ్యాంశంగా మారిన ఎల్.టి.టి.ఇ. ఒక టెర్రరిస్టు అవుట్ ఫిట్ గా తయారయ్యింది. అవసరాల కోసం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యాపారంలోకి, స్మగ్లింగ్, హవాలా వ్యవహారాలలోకి దిగింది.
దావూద్ ఇబ్రహీం చేసేది కూడా అదే!
దావూద్ గ్యాంగుకి పిరాభకరన్ సంస్థ అయిన ఎల్.టి.టి.ఇ. దొంగ చాటుగా ఆయుధాలు అమ్మడం మొదలెట్టింది.
శక్త్యానుసారం, మిగతా తీవ్రవాద సంస్థలూ, చిన్నా, పెద్దా గ్యాంగులూ కూడా పిరాభకరన్ దగర ఆయుధాలు కొనడం మొదలెట్టారు.
ఇదిలా వుండగా, సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయిన తర్వాత, కుప్పలు తెప్పలుగా ఆయుధాలు మాత్రం మిగిలాయి వాళ్ళ దగ్గర.
"కోల్డ్ వార్" జరిగినన్నాళ్ళు అమెరికా మీద ప్రయోగించడానికి రెడీగా పెట్టుకున్న ఆయుధాలు అవి!
అణ్వస్త్రాలతో సహా అన్ని రకాల ఆయుధాలనీ గుట్టుచప్పుడు కాకుండా ఇంటర్నేషనల్ బ్లాక్ మార్కెట్ లో అమ్మే ప్రయత్నాలలో వున్నారు అక్కడి రాజకీయ నాయకులు.
ఇలాంటి సమయాల్లోనే పిరాభకరన్ లాంటివాళ్ళు పనికివస్తారు.
టైగర్ నాయకుడు పిరాభకరన్ తను ఆ ఆయుధాలను కొని దావూద్ ఇబ్రహీం లాంటివాళ్ళకు అమ్ముతాడని వినికిడి.
ఇలాంటి సమాచారం అంతా, తమిళ పులులు తమ హెడ్ క్వార్టర్స్ కి పంపే కమ్యూనికేషన్లణి "టాప్" చెయ్యడం ద్వారా తెలుస్తోంది.