"ఈ పదేళ్ళ కాలంలో పరిశోధన తప్పించి మరో పని చేయలేదు. దాంతో గడ్డం పెరిగింది. గోళ్ళు పెరిగాయి. అది మామూలుగా కాకుండా అదనపు శక్తితో పెరగటంవల్ల ఆయన రూపాన్ని గిన్నీస్ బుక్ లోకి ఎక్కించారట. నీవేమో పేపర్ చూడవు చదవవు..." పర్వతేశ్వరరావు అన్నాడు.
ఉన్నట్టుండి పర్వతేశ్వరరావు పెద్దకొడుకు అనంత పద్మనాభుడు గట్టిగా ఒక కేకవేసి "నాన్నోయ్! ఇవ్వాళే టి.వి.లో "తానా-తందానా" వచ్చేది. "తానా-తందానా"లో ఎన్ని వింతలు చూపిస్తారో! అయ్యో ఇప్పుడెట్లా!" అంటూ లబలబలాడుతూ చెప్పాడు.
"అయ్యో తానా-తందానా! అయ్యో తానా-తందానా!" అంటూ ఇంట్లో అందరూ అదేదో పెద్ద వస్తువు దొంగాడు ఎత్తుకుపోయినట్టు దిగులుగా వాపోయారు. కొద్దిసేపు విచారం పాటిస్తూ కూర్చున్నారు.
టి.వి. వచ్చి ఏళ్ళు గడిచిపోయాయ్. సృష్టికి ప్రతిసృష్టి జరిగింది. కాని హైదరాబాద్ దూరదర్శన్ వారు మాత్రం ఏమీ మారలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు టి.వి.ప్రవేశపెట్టిన దగ్గిర్నుంచి ఇప్పటివరకు ఒకేలా వున్నారు.
ఢిల్లీ దూరదర్శన్ వారు "బానా-తాన" అంటూ ఒక కొత్త కార్యక్రమం వారానికోసారి నలభైనిమిషాలసేపు చూపించటం మొదలుపెట్టారు. ఒక సుందరి, సుందరాం గుడు టి.వి. తెరమీద ప్రత్యక్షమై వింతలు విశేషాలు వివరిస్తూ చూపిస్తుంటే అది చూడ రెండు కన్నులూ చాలేవి కావు.
ఒక వారం పక్షి ఈక చూపించి ఇది ఏ పక్షి తాలూకా ఈకో చెబితే పదహారు రకాల బహుమతులు ఇస్తామంటూ....అందుకోండి మా గిఫ్ట్స్... అంటూ చిరునవ్వుతో "బానా- తాన" కార్యక్రమాన్ని ముగించేవారు.
పైవారం తిరిగేసరికి ఢిల్లీ దూరదర్శన్ కేంద్రానికి పది లారీల నిండుగా ఆ ఈక ఏ పక్షిదో తెలియజేస్తూ లెటర్స్ వచ్చేవి....ఆ కార్యక్రమం చాలా సరదాగా సాగేది.
అది చూసిన హైదరాబాద్ దూరదర్శన్ వరు కళ్ళు కుట్టి వాళ్ళు "బానా-తాన" పెట్టినప్పుడు మనమెందుకు "తానా-తందాన" అని కొత్త కార్యక్రమం పెట్టకూడదని ఆలోచించి "తానా-తందాన" అంటూ ఒక కార్యక్రమాన్ని వారానికోసారి ఏర్పాటు చేశారు.
ఆ కార్యక్రమంలో ముందుగా లింగు లిటుకు అంటూ ఒక మగ, ఓకే ఆడ ప్రత్యక్షమయ్యేవారు. "ఈ వారం మన ప్రేక్షకులకు ఏం వింత చూపిస్తున్నావ్ అక్కా!" అంటూ అదోలా నవ్వుతూ అడిగేవాడు ఆయన.
ఆ అడిగే ఆయన అచ్చం కేతిగాడులా వుంటే ఆమె మాత్రం అచ్చం బంగారక్కలాగ వుండేది. ఆయన వయసులో కాస్త పెద్దవాడే.
ముందు జుట్టు వూడిపోతే వెనక జుట్టు తీసి ముందుకు క్రాపు లాగా దువ్వుకొని, దానికి కాస్త రంగు పులిమి పెద్ద కళ్ళద్దాల్లోంచి బుల్లి బుల్లి కళ్ళేసుకుని చూస్తూ విచిత్రంగా మాట్లాడుతూంటే__
బంగారక్క వయసులో చూడబోతే చిన్నదిగా ఉండి ఆయన చేత "అక్కా..." అనిపించుకొంటూ అదో రకంగా కులుకుతూ మాటకు ముందొకసారి 'క్షమించండ'oటూ మొత్తానికి ఆ కార్యక్రమం పూర్తి చేసేది.
"తానా....తందాన" కార్యక్రమంలో చూపించే వింతలు ఫలాన ఊళ్ళో ఆవు పది లీటర్ల పాలు పది నిమిషాలకోసారి ఇస్తుందనీ_అదేదో ఊళ్ళో వేపచెట్టుకి మామిడికాయ కాసిందని...
ఫలానా ఊళ్ళో ఒక ముసలమ్మ నూటయాభై ఆరేళ్ళు వచ్చినా కళ్ళజోడు లేకుండా సూదిలో దారం ఎక్కించగలదని అన్నంలో వచ్చిన రాళ్ళని మెత్తగా పిండిలా నమిలేయగలదని...
ఇలాంటి వింతలు విశేషాలు చూపించి చివర్పి ఏ విరిగిపోయిన ఫ్యాన్ రెక్కనో దర్భ పుల్లనో ఎత్తి చూపిస్తూ ఇదేమిటో కనుక్కున్నా వారికి ఇరవై లక్షల పైసలు బహుమతి" అంటూ ఆశ చూపించి 'తానా' అంటూ ఆయన 'తందానా' అంటూ ఆమె గబుక్కున మాయమయ్యే వాళ్ళు.
టివి వాళ్ళు ఇచ్చే బహుమతి వల్లనో వాళ్ళుచూపించే (దిక్కు మాలిన) వింతల వల్లనో మొత్తానికి "తానా-తందాన" ప్రోగ్రామ్ కి అందరూ ఎడిట్ అయ్యారు.
ఈ వారం టివి చెడిపోవటం వల్ల "తానా-తందాన" ప్రోగ్రామ్ చూడలేకపోయినందున అందరూ విచారించి కళ్ళు తుడుచుకొన్నారు.
పది నిమిషాలయిం తర్వాత పర్వతేశ్వరరావు కుర్చీలో కాస్త వెనక్కి వాలి "నాకు కడుపులో ఏమిటోగా ఉందే సుకుమారి!" అన్నాడు పొట్ట మీద చెయ్యివేసి నిమురుకొంటూ.
"పొద్దున్న అమ్మ చేసిన గారెలు గట్టిగా ఉన్నాయని రోట్లోవేసి చితక్కొట్టి తిన్నావ్ కదా నాన్న! అయినా అవి అరిగుండవ్" పర్వతేస్వరరావు పెద్దకొడుకు చల్లగా అన్నాడు.
"నోరు ముయ్యరా భడవ! నీ కంతా మీ అయ్య పోలికే. ఎప్పుడే సందు దొరుకుతుందా ఎలా వెక్కిరిద్దామా అని చూడటం తప్ప మరో పనిలేదు.
నే చేసిన గారెలు రోట్లో వేసి దంచితే నలిగాయ్. పక్కింటి పంకజాక్షి చేసిన గారెలు రోడ్ రోలర్ కింద పెట్టినా వీసమెత్తు చెక్కుచెదరలేదట. ఇది నా చేతి వంట మహాత్యంకాదు. మీ నాన్న మూర్ఖపు పట్టుదల.
ముచ్చటగా ముగ్గురు మగపిల్లల్ని కన్నారు. అక్కడితో చాలించొచ్చు కదా. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు కావాలిట. అందుకని మళ్ళీ కడుపుతో ఉన్నారు. అసలే బక్కప్రాణం. మరో నలుసుని కనకపోతేనేమో! ఇప్పటికే మూడు ప్రమోషన్ లు కట్ అయ్యాయ్. అయినా సిగ్గా, శరమా! కంటూ పోవడమే.
నన్ను చూసి నేర్చుకోండి అన్నాను. నే నిద్దరితో ఆగలేదా..." కామా, ఫుల్ స్టాప్ లు లేకుండా ఆయాసంతో రొప్పుతూ అలా మాట్లాడుకొంటూ పోతున్నది సుందర సుకుమారి.
భార్య నోటి సంగతి తెలిసిన పర్వతేశ్వరరావు "అబ్బా!" అంటూ గట్టిగా అరిచాడు.
సడన్ బ్రేక్ వేసినట్టు సుందర సుకుమారి మాటలాపేసింది. "ఏమైంది?" అంటూ అక్న్గారుగా అడిగింది.
"కడుపులో, ఏమిటో పోట్లులాగ వస్తున్నాయ్." పర్వతేశ్వరరావు పొట్ట నొక్కుకొంటూ బాధగా అన్నాడు.
"గారెలు" గుర్తుచేశాడు పెద్దకొడుకు.
"అమ్మ నేనున్నా అన్నావంటే ఊరుకోను." సుందర సుకుమారి పెద్దకూతురు కయ్ మంది.
"ఇంతకన్నా గట్టి గారెలే చాలా సార్లు తిన్నాను. ఇది గారెలు చేస్తున్న గడబిడ కాదు. నెప్పులు... నెప్పులు..." అన్నాడు పర్వతేశ్వరరావు.
"ఇప్పుడేం నెప్పులండీ అరు నెలలు నిండి ఆరు రోజులు కాలేదు" సుందర సుకుమారి దవడలు నొక్కుకొంటూ అంది.