Previous Page Next Page 
ముద్దుగుమ్మ పేజి 31

    "ఏదో బలీయమైన కారణం వుంది. అంకుల్ పనిగట్టుకుని అలా చెప్పారంటే అతన్ని ముందుగా హెచ్చరించటమేనని అనుకోవాలి. అలా అనుకున్న పద్మిని "మీరు చెప్పినట్లే చేస్తాను అంకుల్" అంది.

    "చాలా సంతోషం అమ్మాయీ!" అన్నట్లు చూసి శంకర్రావు అవతలికి వెళ్ళిపోయాడు."

    "ఆంటీకి, అంకుల్ కి పిల్లలు పుట్టలేదా! పుట్టి పసితనంలోనే పుట్టినవాళ్ళు మరణించారా! అలా అయితే వాళ్ళ గురించి ఏదో ఒక మాటల సందర్భంలో చెప్పాలికదా! పోనీ కనీసం వాళ్ళ గురించి చెప్పకపోయినా వాళ్ళ ఆనవాళ్ళుగా ఫోటోలు వుండాలికదా! అవీలేవు. పెద్దయిం తరువాత ఏదో ఒక విషయం మీద తల్లిదండ్రులమీద కోపగించుకుని పూర్తిగా వాళ్ళని వదిలేసి దూరంగా వెళ్ళిపోయారేమో? ఇంతగా ప్రేమించే తల్లితండ్రిని వదలి వెళ్ళిపోవటానికి వాళ్ళకి ఎలా మనసు వప్పిందో?

    పద్మిని ప్రియదర్శిని వెన్నుమీద యెవరో చెళ్ళున చరిచినట్లయింది. "ఏంటమ్మా! ఇంత మంచిగా ప్రేమించే తల్లి తండ్రిని వదిలి వెళ్ళటానికి ఆ పిల్లలకి మనసు యెలా వచ్చిందంటావా? మరి నీ విషయం ఏమిటిట? నీ తల్లి నీ తండ్రి నిన్ను అమితంగానే ప్రేమించారుకదా! వాళ్ళ గారాల బొమ్మని ముగ్గు గుమ్మవి నీవేకదా! నీవు చేసింది మాత్రం ఏమిటి? మీ మమ్మీ డాడీలు హాయిగా వున్నారని అనుకుంటున్నావు? వున్నారో లేదో తెలుసా?

    అంతరాత్మ నిలదీసి ప్రశ్నించినట్లయింది.

    అవును!

    తను ఇక్కడ క్షేమంగానే వుంది. తన మమ్మీ_డాడీలు క్షేమంగా వున్నారని ఏమిటి?

    మనసు పాపిష్టిది మంచిగా ఆలోచించేకన్నా ప్రమాదకరమైన ఆలోచనలు చెడుని ఎక్కువగా ఆలోచింపజేస్తాయి.

    పద్మిని విషయంలో అలాగే జరిగింది. పిరికిగా ఆలోచనలు సాగుతున్నాయి.

    దానికి తగ్గట్టు ఆరోజంతా పార్వతమ్మ శంకర్రావు అదోవిధంగా వున్నారు. పార్వతమ్మ ముఖం అయితే నూరు లంకణాలు చేసినట్లు పీక్కుపోయివుంది.

    యింటికి ఎవరో ఒకరువచ్చిపోతూనే వున్నారు. వాళ్ళకి డబ్బులు యిచ్చి ఓ కాగితంమీద ఏదో రాసిఇచ్చి పంపిస్తున్నాడు శంకర్రావు. వాళ్ళు పార్వతమ్మతో పనిగట్టుకుని ఏమీ మాట్లాడలేదు. వాళ్ళకి కాఫీలు యివ్వటానికి వెళితే "నమస్కారమమ్మా!" అని చెప్పారు అంతవరకే.

    ఇదంతా చూస్తుంటే పద్మినికి చాలా వింతగా విచిత్రంగా కానవచ్చింది. అలా అని కారణం అడగలేదు.

    విషయం అడక్కముందే జాగ్రత్తపడ్డాడు శంకరరావు.

    దాంతో __

    పద్మిని ప్రియదర్శిని నోరు కుట్టేసినట్లయింది.


                                     18


    ఆ రోజు_

    రోజూలాగ కాకుండా మరో గంట ముందులేచింది పార్వతమ్మ.

    పార్వతమ్మ లేవటంచూసి పద్మిని కూడా లేచింది.

    పద్మిని కాలకృత్యాలు తీర్చుకుని ముఖం కడుక్కుని వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద వేడి వేడి ఇడ్లీలు అల్లం చట్నీ కొబ్బరిచట్నీ కారప్పొడి రెడీగా వున్నాయి.

    పద్మిని ఈ ఇంటిలో అడుగు పెట్టింతర్వాత ఇడ్లీ ముఖం చూడలేదు. సాధారణంగా ఉదయం టిఫిన్ శంకర్రావు ఇంటిలో అలవాటులేదు. పదకొండు గంటలకల్లా భోంచేయటం మధ్యాహ్నంపూట ఉప్మా, అట్టు లాంటివి చేసుకోటం లేకపోతే అదే వీధిలో చివరగానున్న హోటల్ నుంచి ఏదయినా టిఫిన్ కొని తెచ్చుకొని తినటం. ఇదేదీ కాకపోతే ఇంటిలో ఏదో ఒక పళ్ళుంటాయి కాబట్టి అవి తిని ఊరుకోటం జరుగుతుండేది.

    వేడి వేడిగా కాఫీ, టీ లు కప్పులో పావువంతు మాత్రమే తీసుకొని ఒకటికి నాలుగుసార్లు తాగడం జరుగుతుంది.

    పద్మినికి ఇడ్లీలు టిఫిన్ గా మార్నింగ్ తినటం చాలా యిష్టం.

    ఇక్కడికి వచ్చింతర్వాత, జ్వరం తగ్గింతర్వాత ఇడ్లీలు తినాలని ఎంతగానో కోరిక కలిగింది కాని ఆ కోరికని బలవంతాన ఆపుకుంది.

    జ్వరంతో ఒంటరిగా దిక్కూ మొక్కూ లేకుండా ప్రయాణిస్తుంటే అలా ఒదిలేసిపోక వారిలో ఒక భాగంలాగా యింటికి తీసుకొచ్చారు. సేవలు చేసి జ్వరం తగ్గేలా చేశారు. యింటిలో పిల్లగా ఉండనిచ్చారు.

    ఆపదలో ఆదిదంపతులులాంటివారి అండ దొరకటం నిజంగా అదృష్టం. ఆ వృద్ధదంపతులని ఓ విధంగా తను మోసం చేసింది కట్టుకథ ఒకటి చెప్పి. వాళ్లు తను చెప్పింది నమ్మి తనని తలలో నాలుకలా భావించారు. ఆదరించారు ఆప్యాయత చవిచూసారు.

    వారి ఆప్యాయత అనురాగం చూసి తను వారిని మోసగిస్తున్నందుకు సిగ్గుతో తన ఒళ్ళు చచ్చిపోతుండేది. అది చాలక ఇడ్లీ కావాలి, బాదంహల్వా కావాలి అంటూ గొంతెమ్మ కోరికలు ఎలా కోరగలదు!

    ఈ రోజు

    తను కోరకుండానే తనకి యిష్టమైన వేడి వేడి ఇడ్లీ ఆవిర్లు కక్కుతూ కళ్ళముందు ప్రత్యక్షమయ్యాయి.

    పద్మిని ఆనందం పట్టలేక "అంకుల్ తొందరగా వచ్చేయండి ఇడ్లీ రెడీ!" అంటూ గట్టిగా కేకపెట్టింది.

    "నాకు ఈరోజు ఒంట్లో బాగుండలేదు గాస్ తో కడుపు ఉబ్బరంగా వుంది నీవు తినమ్మా" పక్క గదిలోంచి కేకవేశాడు శంకర్రావు.

    "ప్చ్...అంటి చేసిన ఇడ్లీ తినే యోగం మీకు లేదు అంకుల్!" శంకర్రావుతో పెద్దగా అని పార్వతమ్మ వేపు తిరిగి "ఆంటీ! మీకు తెలుసో తెలియదో నాకు ఇడ్లీ అంటే చాలా చాలా యిష్టం. మీరు ప్లేటులో పెట్టడమే ఆలస్యం చేత్తో తినే పనిలేదు. మాయాబజారు సినిమాలో యస్.వి.రంగారావు ఘటోత్గజుడి వేషంలో పిండివంటల ముందు కూర్చుని ఆ...అని నోరు తెరుస్తాడు అంతే వరసపెట్టి వాటంతట అవే నోటిలోకి వెళ్ళిపోతాయి. నేను ప్రస్తుతం ఆడ ఘటోత్గజుడిని హ హ్హ హ్హా..." అంటూ వుషారుగా మాట్లాడుతూ నవ్వింది పద్మిని.     

    "ఉత్త కబుర్లు నువ్వు ఎన్ని తింటావో చూస్తానుగా" అంటూ పార్వతమ్మ ప్లేటులో ఇడ్లీ పెట్టి రెండు రకాల చట్నీలు వేసి కారంపొడి వేసి పక్కనే పెద్ద ఉసిరికాయంత వెన్నపూస పెట్టి గిన్నె ఎత్తి నెయ్యి పోసింది.

    "కారంపొడి వుంటే వెన్న పక్కనే వుండాలని వెన్నతో తినటం నాకిష్టం అని నీకెలా తెలుసు ఆంటీ!" అని అడిగిందిగాని పార్వతమ్మ సమాధానం యిచ్చిందా లేదా అని గమనించలేదు. ఆతృతగ ఎంతో యిష్టంగా అన్నిరకాలు నంజుకుంటూ ఇడ్లీ తినటంలో మునిగిపోయింది.

    పార్వతమ్మ ప్లేటులో ఇడ్లీ వేస్తున్నది. పద్మిని మనసంతా వాటిమీదే లగ్నంచేసి తింటున్నది.

    అరంగుళం చోటులేకుండా కడుపు నిండిపోయింది. అప్పటికిగాని తెలివిరాలేదు పద్మినికి. "చాలు ఆంటీ!" అంటూ చేయి కడిగేసుకుంది.

 Previous Page Next Page