32
ఏది ఏమయినా మానసిక సంఘర్షణ మనిషిని బాగా కృంగదీస్తూంది. శ్రీకర్ మనసులో యెప్పుడూ జ్యోతి తిరుగుతూనే వుంది. అతనామెని మనసారా ద్వేషిస్తున్నా ఒకప్పుడు మరోసారి ఆమెని ఎంతగానో అభిమానిస్తున్నాడు. ఒక్కోసారి అతనికీ తన ఈ మానసిక చర్య ఎంతో వింతగా అనిపిస్తోంది.
ఉదయం ఆఫీసులో నీలవేణిని చూస్తే అచ్చం జ్యోతిలానే కనిపించింది. దాంతో అతని మనస్సు పాడైపోయి సెలవుపెట్టి ఇంటికి వచ్చేశాడు.
శైలజ ఏదో కుట్లు కుట్టుకుంటూ వుంది.
కాలక్షేపానికి ఏదో మేగజైన్ అందుకున్నాడు శ్రీకర్.
ఓ అరగంట గడిచేసరికి ఇంటిముందు జట్కా ఆగింది. అందులోంచి ఇద్దరు వయసు మళ్ళినవాళ్ళు, ఓ యువకుడూ దిగారు. ఎవరా? అనుకుంటూ ముందుకు వెళ్ళాడతను.
"విశ్వనాధంగారిల్లిదేనా బాబూ!" అడిగాడు అందులో ఒకాయన.
"అవునండీ! రండి, నేను వాళ్ళబ్బాయిని.
వాళ్ళు లోపలికి వచ్చేసరికి యెక్కడికో వెళ్ళిన అన్నపూర్ణమ్మ కూడా వచ్చేసింది.
వాళ్ళతో వచ్చిన ఆడమనిషి అంది ఆమెని చూస్తూ "మేం మీ అమ్మాయిని చూసి పోయేందుకు వచ్చాం వదినగారూ! అబ్బాయీ, నేనూ వారూ వచ్చాం"! అంది.
అన్నపూర్ణమ్మ ఆమెని లోపలి తీసికెళ్ళింది.
మగవాళ్ళు ముగ్గురూ బయట కూర్చున్నారు. ఆ యువకుడు ఏమీ మాట్లాడటంలేదు. అయితే అబ్బాయి తండ్రి మాత్రం శ్రీకర్ తో అన్ని విషయాలూ మాట్లాడుతున్నాడు.
ఎందుకో చప్పున ఓ సంఘటన గుర్తుకొచ్చింది శ్రీకర్ కి. దాంతో అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి.
అతనత్తవారింట్లో వుండగా విశ్వనాధంగారు ఓ ఉత్తరం రాశారు. ఎం.ఏ. పాసై లెక్చరర్ గా యూనివర్సిటీలో పనిచేస్తున్న ఓ అబ్బాయి శైలజని చూడటానికి వస్తున్నాడు. ఆనాటికి శ్రీకర్ ని జ్యోతిని రమ్మని ఆహ్వానిస్తూ రాశాడాయన. అయితే ఆ పెళ్ళిచూపులకి ఇద్దరూరాలేదు.
ఆ పెళ్ళికొడుకు వీళ్ళకి నచ్చలేదు. ఆ అబ్బాయికి అమ్మాయి చదువు నచ్చలేదు. దాంతో సంబంధం తప్పిపోయింది. ఆ విషయం రాస్తూ విశ్వనాధంగారు కొంత నిష్టూరంగానే రాశారు కొడుక్కి.
"మీరిద్దరూ వస్తారనీ, చెల్లాయి విషయం చూసుకుంటారనీ ఎంతగానో ఆశపడ్డాను. అయితే మీరు రాలేదు. ఆఖరి నిమిషం దాకా చూసి చూసి నిశాశ చేసుకున్నాం. నువ్వు అయినా ఎందుకు రాలేదో మాకు తెలియదు. మేం నిన్ను కట్న కానుకలు అడుగుతామేమోనని నువ్వు భయపడి వుంటే చాలా పొరబడ్డట్టే. నేను అంత చేతకాని వాడిని కాను. కూతురి పెళ్ళి చేయలేని దౌర్భాగ్యం యింకా రాలేద
మనుషులెందుకింత హఠాత్తుగా మారిపోతారో అర్ధం కాలేదు.
ఫర్వాలేదు. ఒక్కొ సంఘటన విలువల్ని తెలుపుతుందిలే!"
తండ్రి ఉత్తరం చూసిన శ్రీకర్ కి తొలుత ఏమీ అర్ధంకాలేదు. తండ్రి ఉత్తరం ఎప్పుడు రాశాడు? అది మిస్ అయిందా? లేక యెవరయినా తనకి అందకూడదని చేశారా?"
ఫ్యాక్టరీనుంచి రివ్వున దూసిన బాణంలా వచ్చాడతను.
అప్పటికే యిద్దరి మధ్యా కావలసినన్ని సెగలు పొగలు.
"జ్యోతీ!" కేకలేస్తూ వచ్చాడతను.
అప్పటికి విశాల చనిపోయి దాదాపు నెల అయివుంటుంది. తల్లి మరణంతో మానసికంగా కృంగిపోతున్నది జ్యోతి.
"నాకు వూరినుంచి ఉత్తరం వచ్చిందా?"
"రాలేదు!"
"నిజం చెప్పు..."
"అయ్యో రామ! ఇందులో కూడా అబద్ధం వుంటుందా! ఆ మాటకి వస్తే అసలు పోస్టుమేన్ రానేలేదు ఈరోజు."
"ఈరోజు విషయంకాదు నేనడిగేది. ఇంతకుముందు వారం క్రిందటో, పదిరోజుల క్రిందటో?"
తీవ్రంగా ముద్దాయినిమల్లే నిలదీసి అతను అడుగుతూ వుంటే ఆమె గుండె దడదడలాడింది...చప్పున సమాధానం యివ్వలేదు.
"రాలేదా? వస్తే దాని యివ్వలేదా?" రెట్టించాడతను.
"భలే గమ్మత్తుగా అడుగుతారే! ఉత్తరం వచ్చి ఎన్నో రోజులయింది. రెండువారాలో ఇంకాస్త ఎక్కువనో అయివుంటుంది!" తేలిగ్గా నవ్వేస్తూ అంది.
"రాస్కెల్!" అప్రయత్నంగా అన్నాడతను.
నివ్వెరపోయింది జ్యోతి.
"మా చెల్లాయికి పెళ్ళిచూపులు జరుగుతున్నాయి. రమ్మని మా నాన్నగారు రాస్తే ఆ ఉత్తరం దాచిపెడతావా? ఎంత ధైర్యం నీకు? ఏం నేను నా చెల్లి పెళ్ళికి డబ్బు అడుగుతానని భయపడ్డారా నువ్వు మీ నాన్న...యూ పూర్ లేడీ! నేను నీ యింటినుంచి చిల్లిగవ్వకూడా ఆశించనని తెలీదా? నీ ముష్టి పాపిష్టి డబ్బుకోసం ఆశపడే నికృష్టుడననుకున్నావా?"
"ఎందుకలా గొంతుచించుకుని అరుస్తావ్? ఎప్పుడేం కొంప మునిగింది. ఆ సంబంధం తప్పిపోయిందా? పోతే పోతుంది. గంతకు తగ్గ బొంత! ఏదో ఒకటి కుదురుతుందిలే!" వెటకారంగా అంది.
అంతే! జ్యోతి చెంప ఛెళ్ మంది, దాంతో రభస! మామగారు జోక్యం చేసుకునేవరకూ శాంతించలేదు శ్రీకర్ ...
ఆరోజు జరిగినదంతా గుర్తుకొచ్చిన శ్రీకర్ చాలా బాధపడ్డాడు.
"అమ్మాయిని త్వరగా చూపిస్తే వెళ్ళిపోతాం!" కాబోయే మామగారు అడగటంతో ఆలోచనలకి స్వస్తిచెప్పి లోపలకి వెళ్ళాడు శ్రీకర్. శైలజని బొమ్మలా అలంకరించింది అన్నపూర్ణ. తొలి చూపులోనే ఆకర్షించేటట్టుగా వుంది అనుకున్నాడు.
మరో పదినిమిషాలకి లాంఛనంగా ముగిశాయి పెళ్ళిచూపులు. వరుడి ముఖంలో తృప్తి, ఏరునిండిన కెరటాల్లా కనిపించింది. తృప్తిగా విశ్వసించాడు శ్రీకర్.
మీ నాన్నగారు వచ్చేదాకా ఆగాలంటే కుదరదు శ్రీకర్! ఆయన రాత్రే వస్తారో, రేపే వస్తారో తెలీదుకదా! అయినా ఫలానారోజు వస్తామని రాయకుండా రావటం మా తప్పే!