ఆ తర్వాత యిరువురి మధ్య భయంకరమైన పోరు జరిగింది. బండ భీముడు కర్రతో కొడుతుంటే ఆమె ఆ దెబ్బలు తప్పించుకుంటూ చేతులతో కాళ్ళతో దెబ్బతీస్తూ ఎదుర్కొంది. రెండో నిమిషంలో బండ భీముడు చాప చుట్టలా పడిపోయాడు. ఆమె మాత్రం చెక్కు చెదరలేదు. చీర చెదరలేదు. ఎలా వుందో అలా వుంది.
"ఏమండోయ్! ఎక్కడ వున్నారు! తొందరగా యింటికి వెళదాం రండి." ఆమె తాపీగా పిలిచింది అక్కడ అంతకు ముందు ఏమి జరగనట్లుగా.
జంకుతు జంకుతు భర్త ఓ పక్కనుంచి వచ్చాడు. ఇరువురు చేయి చేయి కలుపుకుని స్టేజీ దిగిపోయారు. రౌడీ భీముడు కూడా ఆ తర్వాత లేచి వెళ్ళిపోయాడు.
ఏ మాత్రం ఆలశ్యం లేకుండా వెంటనే మరో నలుగురు స్టేజీ మీదకి వచ్చారు. వాళ్ళు అత్త, మామ, భర్త, ఆ యింటి కొత్త కోడలు. మళ్ళీ మైకులో వాళ్ళ కథ వినిపించటం జరిగింది.
వరకట్న దురాచారం. కోడలిని సజీవంగా తగల బెట్టబోయిన దీనగాధ. కొత్త కోడలిని అత్త మామ భర్త కలసి చంపుదామని ఆమెని గట్టిగా పట్టుకుని నిలువెల్లా కిరసనాయిలుతో తడిపారు. యింక అగ్గిపుల్ల గియ్యటమే మిగిలింది. అగ్గిపుల్ల గీసి ఆమె మీద వేసిన మరుక్షణం ఆమె అగ్ని దేముడిలో ఐక్యం కావటం ఖాయం.
కిరసనాయిలు డబ్బా ఎత్తి తనమీద పోస్తున్నా ఏమీ అనని ఆ కొత్త కోడలు, ముగ్గురు రాక్షసుల మధ్య వంటరిగా నిలిచిన ఆ అసహాయ అబల, భర్త అగ్గిపెట్టె తీసుకోగానే తన విశ్వరూపం చూపించింది. క్షణాలలో అత్తమామలు భర్త నేల కరిచేలా చేసింది. ఆ తర్వాత పోలీసుని పిలిచి పట్టిచ్చింది.
ఇలా రెండు నిమిషాలకి మూడు నిమిషాలకి మైకులో ఉత్సాహంగా కొత్త కథ వినిపించటం వెంటవెంటనే చిన్న ప్రదర్శన, అద్భుత పోరాట విన్యాసం, క్విక్ మూమెంటుతో మెరుపు వేగంతో ఉత్త చేతులతో ఎదిరించి పోరాడి గెలవటం.
ఇలా అరడజను ప్రదర్శనలు జరిగాయి.
మాటలు పాటలు లేకపోవచ్చు. సెట్టింగు విషయానికి వస్తే మొదలే లేదు. అయినా తెరవెనుక వ్యాఖ్యానం లాంటి మాటలతో కథ వినిపించటం, చకచక స్టేజీమీదకి మనుష్యులు రావటం, క్విక్ గా యాక్షను, చివరికి వచ్చేసరికి పోరాటంతో ముగింపు, ఆ పోరాడింది స్త్రీ కావటం.
చూస్తున్నవాళ్ళకి యింతవరకూ జరిగింది అర్ధమవుతూనే వుంది. ఇలాంటి సీన్లు సంఘటనలు నవలల్లో చదివారు. సినిమాల్లో చూశారు. అక్కడ విషయం వేరు. కళ్ళముందు ఉరుములు మెరుపులు సింహనాదాలు , ఏనుగు ఘీంకారాలు, ముఖ్యంగా పాతికేళ్ళు నిండని అమ్మాయిలు వాళ్ళంతా.
ఈ అమ్మాయిలలో దీక్ష వుంటుందేమో అని చూశారు. లేదు. ఓ వేళ అబ్బాయిలు రౌడీల లాంటి వేషధారుల్లో వుందేమో తెలియదు. తరచి చూసినా కనపడలేదు.
దీక్ష ఈ ప్రదర్శనలు వీళ్ళకి చూపించటంలో అర్ధం?
దీక్ష పంచిన పాంప్లెట్లకి దీనికి సంబంధం?
ముఖ్యంగా ఆడవాళ్ళు భరతనాట్య విన్యాసాలు మానేసి చెట్టంత మగవాళ్ళని ఎగిరెగిరి తన్నటం ఏమిటి?
చూడటానికి కన్నుల పండుగగా వున్నా యిది వాస్తవ జీవితంలో ఎంతవరకు సాధ్యం?
అందరు ఆలోచిస్తున్నది అంతవరకే! కాస్త డీప్ గా వెళ్ళి ఆలోచిస్తే..!
వాళ్ళా పనిచెయ్యలేదు. పైపై ఆలోచనలలోనే వున్నారు.
తరచి తరచి ఆలోచిస్తే అప్పటి కప్పుడే ఓ నగ్న సత్యం తెలిసేది. వాళ్ళ ఊహకు రానిదీ అక్కడ జరిగింది ఒకటే.
అది కరాటే.
- 15 -
ఐదు నిమిషాల తర్వాత.
సీతాకోక చిలుకలలాంటి అమ్మాయిలు బిలబిల లాడుతూ వచ్చి స్టేజీ ఎక్కారు. వరుసగా నుంచున్నారు.