Previous Page Next Page 
అహల్య పేజి 30


    మేమిక్కడ అమర భోగాలు అనుభవిస్తున్నాం. తను అక్కడ ఎలా ఉందో? మాకు పట్టు పీతాంబరాలు. తనకో! ఏమో! నార చీరలు కట్టుకుంటున్నదా? అయినా దూతికా! పట్టు చీరల్లో ఉన్నా, నార చీరల్లో ఉన్నా అహల్య అందమే అందం. అవును కదే! మేమిక్కడ రమ్య భర్మ్య హర్మ్యాలలో నివశిస్తున్నాం.


    ఆమె అక్కడ కుటీరంలో నివసిస్తున్నది కదూ! మా వైభోగం వైభవం అంతా ఆమె కాలిగోటి అందానికి తులకావే చెలీ! అవునే! ఆమె సుఖ సంతోషాలతో శాంతంగా ఉందా? ఉలకవేమే! పలకవేమే!'


    ఇంద్రుడలా ఏకధాటిగా అమర కవివరుని వాగ్ధాటికి వన్నె తెచ్చేలా అడిగితే - ఇంద్రసఖి వినయంగా వినమ్రంగా అంది 'ప్రభూ! వారు మానవులు. అందునా ఋషులు. వారు నాగరీకులు కారు. వారికి నగర జీవనం నచ్చదు.


    అడవుల మధ్యలో ఆశ్రమ వాటికలు నిర్మించుకుని కందమూలాలు తెచ్చుకుంటూ అడవుల్లో దొరికే కాయలూ ఫలాలూ తేనెలూ స్వీకరిస్తూ తపస్సే తమ ధర్మంగా, విశ్వ శ్రేయస్సే తమ ధ్యేయంగా జీవనం సాగిస్తారు. అలా దశాబ్దాలు గడిపేస్తారు. శతాబ్దాలు జీవిస్తారు. వారికీ అమరావతిలో అమర సుఖాలు పొందే మనకూ పోలికెక్కడ ప్రభూ!'


    ఇంద్రసఖి మాటలు వినగానే ఇంద్రుడి ఉత్సాహం అంతా పొంగే పాలపై నీళ్ళు చల్లినట్లు ఇంకిపోయింది. అతని ఆలోచనల్లో అహల్య- ఆమె జీవనం వేరయినా ఋషి జీవనం అతనికి తెలియనిది కాదు.


    కానీ అహల్య అలా జీవిస్తుందంటే అతనికి చేదు తిన్నట్లయింది.


    'ఏమన్నదే అహల్య!'


    'ఏమంటుంది ప్రభూ! అందని ఫలాలకు అర్రులు చాస్తుందా?'


    'ఆ ఏమంటివే? ఏమంటివే?'


    'అయినింటి ఇల్లాలు ఎలా జీవిస్తోందో తను అలా జీవిస్తుంది ప్రభూ! తల్లిదండ్రులు కన్యాదానం చేసి ఏ వరుడికిచ్చి పెళ్ళి చేస్తారో జీవితాంతం ఆ వరుడితో కలిసి బ్రతకడమే భూలోక నారీ ధర్మం కదా ప్రభూ! వారి మనస్సుల్లో మరో ఆలోచనకే తావుండదు. వారేం దేవతలా? ఆశయాలనూ అన్య మార్గాన తీర్చుకోదలచటానికి?'


    'అహల్య ఆంతర్యమేమిటే?'


    'ప్రభువులు తొందర పడుతున్నారు. నేను వెళ్ళి ఆమె పరిచయం సంపాదించుకుని వచ్చాను. మైత్రికి నారు పోసి వచ్చాను. అది సాగి తీగయి పూసి పరిమళించాలి కదా ప్రభూ!'


    'ఎప్పుడే! ఎప్పుడే! ఎప్పుడెప్పుడా అని మా మానసం తొందరిస్తూంటే, నీవు ఎంత నెమ్మదిగా జవాబులు చెపుతున్నావే?


    'కార్యం సాధించాలి కదా ప్రభూ! ఇప్పుడే గురిపెట్టి నారి సారించి బాణం విడిచాను. అది తగిలి తలూచాలి కదా ప్రభూ!'


    నా తొందర నీకేం తెలుసే సుందరీ!


    'తెలియకనే భూలోకం వెళ్ళి వచ్చానంటారా ప్రభూ!'


    'మాటలు నేర్చావు కదే!'


    'నేర్పులాడిననే కదా తమరు నన్ను దూతికగా ఎన్నుకున్నారు'


    'భళా మాటల పుట్టవే నువ్వు!'


    'మాటల్లో పెట్టాను అహల్యాదేవిని. ఆమె మనస్సు కదిలి కరిగి నీరు కావాలి. ఆ జలాల్లో తమరు క్రీడించాలి!'


    'అబ్బ! ఆశల గుర్రంపై ఆరోహించిన మాకు లేని జవ సత్వాలనిచ్చి మాకు మనోవేగాన్ని కలిగిస్తున్నాయే! ఏమీ భూలోకం వెళ్ళనా! వెళ్ళి గౌతమాశ్రమం చేరనా! చేరి ఆశ్రమ ద్వారం చెంత నిలువనా! నిలిస్తే అహల్య అర్ఘపాద్యాదులనిచ్చి ఆహ్వానించేనా!'


    'వెళ్ళండి! వెళ్ళండి! వెళ్ళి ఆశ్రమం ముంగిట్లో నిలవండి! అర్ఘపాద్యాదులు అందుకోండి! తమరిదే ఆలస్యం!'

    
    'ఏమే? అట్లు మాట్లాడెదవేమే?'


    'మరి ఏమి చెప్పను ప్రభూ! తమరలా ఇంద్ర వైభవంతో వెళితే అహల్యానాధుడు శ్రీశ్రీశ్రీ బ్రహ్మ శ్రీ యుతులు గౌతములవారు స్వాగతం పలికి అర్ఘపాద్యాదులను అర్పించి, ఆపై అతిథి మర్యాదలు నిర్వహిస్తారు. త్రిలోకాధినాధులు దివి నుంచి దిగి భువికి వచ్చి ఆశ్రమం ముంగిట్లో నిలిస్తే ఆహ్వానించక అగౌరవిస్తారా స్వామీ!'


    ఇంద్రుడికది నిజమే అనిపించింది.


    'అవును! తను వెళితే ఎవరు మాత్రం స్వాగతించరు?' అనుకున్నాడు.


    మరి గౌతముడి కనుగప్పి అహల్యకు మాత్రమే కనిపించి నేను ఆమెను పలుకరించి ఆమె తనపై రాగ వర్షం కురిపించి తనియించే మార్గం!


    మార్గం తోచని మహేంద్రుడు ఇంద్రసఖి వైపు చూశాడు. ఆ దూతి చప్పున అంది 'ప్రభూ! మీరు ప్రభూ! మనసు మళ్ళించుకోండి! శచీదేవిగారు ఒంటరిగా దయ చేస్తున్నారు. వారు వచ్చిన తర్వాత తమ చిత్తం పరాయత్తమై తమరు పరాకు చిత్తగిస్తే చాలా ప్రమాదం!'


    ఇంద్రుడు ఉలికిపడ్డాడు. అటు తిరగ్గా శచీదేవి మందగమనంతో వస్తున్నది. ఇంద్రసఖి మాటమార్చి చెప్పసాగింది.


                                       20


    'సుందరీ!'

 Previous Page Next Page