Previous Page Next Page 
డి.కామేశ్వరి కథలు పేజి 31


                                                గుక్కెడు పాలు

    పాలు:... పాలు:... పాలు కావాలి బాబుకి! అలాగా, పాలు కావాలండీ తమరికి! మామూలు పాలొద్దు. డబ్బాపాలు కావాలా- మా నాయనే. డబ్బాపాలెక్కడ దొరుకుతాయి చిట్టితండ్రీ. డబ్బాలో వుంటాయి. డబ్బా లెక్కడవుంటాయి బాబూ? బజార్లో దొరుకుతాయి. మరి ఆ డబ్బా ఎలా వస్తుంది నాన్నా... డబ్బిచ్చి కొంటే వస్తుంది. డబ్బెక్కడనించి వస్తుందిరా బాబూ! అడ్డగాడిదా, చెవలాయి, డబ్బెక్కడ నించి వస్తుంది అనే వెధవ్వి పిల్లాడినెందుకు కన్నావోయి, కన్న వెధవ్వి ఏ మనిషిపాలో, ఆవుపాలో, గేదెపాలో, నీళ్ళపాలో అలవాటు చెయ్యక డబ్బా పాలెందుకు అలవాటు చేశావురా చిట్టితండ్రీ... నీ పెళ్ళాం చేసిందా - చేస్తుంది. చేస్తుంది. డబ్బా తెండి పిల్లాడికి అనగానే వెర్రివెంగళాయిలా తలాడించి డబ్బప్పుచేసి మరీ కొని వుంటావు. ఆ... అదే తప్పుగాదూ! అలివేణీ, ఆణిముత్యమా నా మొదటి తప్పు ఉద్యోగం లేకుండా బామ్మ చావు మంచంలో వుండి బలవంతం చేసిందని నిన్ను పెళ్ళాడడం... ఆడితినిబో, బుద్ధిలేక పిల్లాడిని కనడం, ఈ రెండు తప్పులకి శిక్షగా డబ్బాలెక్కడతేను, గంజిపట్టు, బార్లీ పట్టు, నూకల జావపట్టు. మరేం చచ్చిపోడు.    
    యివి తాగిన పిల్లలు దబ్బపళ్ళల్లా వున్నారు. అవి నచ్చచెప్పి నమ్మించావా, లేదు. ఎందుకు చెప్పలేదు. నీవేం లక్షాధికారిననుకున్నావా. ఏ పెద్ద ఆఫీసరుననుకున్నావా. ఆఫ్టరాల్ గుమస్తావన్నా కాదే. ఉద్యోగం సద్యోగంలేని వెధవ్వి. ఏ ధైర్యంతో పాలడబ్బాలు అలవాటు చేశావు. డబ్బా పాతిక ముప్ఫై పెట్టి నెలకి మూడు నాలుగు ఎలా కొందామనుకున్నావు. ఛా నాదగ్గిరేడవకు. పాలమ్మి డబ్బివ్వలేదని తిడ్తూ పోసే ఆ నీళ్ళ పాలూ మానేసిందా. పిల్లాడికి జ్వరం ఏడు రోజులబట్టి పాలడబ్బాలేదా! అన్నం గంజి పెడితే నోట పెట్టడం లేదు. పెట్టినా వాంతి చేస్తున్నాడు. వాంతి చేయకపోయినా అరగక విరేచనాలతో కళ్ళు తేలేశాడు. నా దగ్గరేడిస్తే ఏం లాభం. ఏ డాక్టరు కాళ్ళో పట్టుకో. పట్టుకుంటే పిల్లాడికి మందు పాలడబ్బా తెమ్మన్నాడా?
    అంటాడంటాడు... వాళ్ళూ దుకాణం వాళ్ళూ ఒకటే. అమూల్ పట్టండి, గ్లాస్కో పట్టండి అంటారుగాని గంజిపట్టండి అనరు. అవునా? తెలుసు గదా. మరి ముందెందుకు అలవాటు చెయ్యలేదు మరి. తూరుపు తిరిగి దండం పెట్టాలి. నాలాంటి వాడిని పట్టుకుని ఏడిస్తే లాభం ఏమిటి రానాయనా జోగిజోగిరాసుకుంటే బూడిద పుడ్తుంది. ఒరేయ్ సుబ్బారావు... ఏమిటిరా ఆ పరుగు. ఎక్కడికిరా ఆ పరుగు. ఆ దుకాణం ముందు కారు దిగినవాడు నీ ఫ్రెండా సర్లే వెళ్ళు, ట్రై యువర్ లక్, పదో పరకో పారేస్తాడేమో అడిగిచూడు...
    అరే.. సుబ్బారావా.. ఎన్నాళ్ళ కెన్నాళ్ళకి కన్పించావురా! ఎప్పుడో ఇంటరు చదివే రోజుల్లో యిద్దరం హాస్టల్లో ఒకేగదిలో వుండేవాళ్ళం. ఏమిట్రా యిలా తయారయ్యావు. ఆ అవతారమేమిటి. ఆ బట్టలేమిటి ఏం చేస్తున్నావు.
    ఇంకా ఉద్యోగం కోసం తిరుగుతున్నావా! ఇంకా ఉద్యోగం లేకపోవడం ఏమిటిరా? సరేలే ఆ ఏడుపు మొహం ఏమిట్రా. ఏమిటీ నీ పిల్లాడికి వంట్లో బాగోలేదూ.. వ్వాట్ - నీకు పెళ్ళాం, ఓ పిల్లాడు కూడానా! వుద్యోగంలేని వెధవ్వి పెళ్ళెందుకు చేసుకున్నావురా. సర్లే.. సర్లే... ఏడవకు పిల్లాడికి పాలడబ్బా కావాలా! డబ్బు కావాలా, సర్లేవోయ్ పాతిక రూపాయలప్పుకోసం అంత ఏడుపు ఎందుకురా నాయనా. పద, ముందసలు కారెక్కు నీవు. యిన్నాళ్ళకి కల్సుకున్నాం మనం కాస్త మాట్లాడుకుందాం. వెళుదువుగాని రావోయి ఆప్తమిత్రుడివిన్నాళ్ళకు కన్పించావు. లెటజ్ సెలిబ్రేట్. డబ్బు నేనిస్తా, పాలడబ్బా కొన్నాక కారులో డ్రాఫ్ చేస్తా! ఊ కారెక్కు....
    "హాయ్... హాయ్... ఈ చల్లని బారులో చల్లని విస్కీ! గొంతులోకి దిగుతూంటే స్వర్గం బెత్తెడు దూరంలో వున్నట్టు లేదురా! ఏమిట్రా ఆముదం తాగినట్టు ఆ మొహం నీవూనూ. ఎంజాయ్ మై బాయ్! ఎంజాయ్! లైఫ్ యీజ్ షార్ట్, లెటజ్ ఎంజాయ్ ఫరెవైల్. ఏరా మన కాలేజీ రోజులు మర్చిపోయావురా, నీవొట్టిపుస్తకాల పురుగులా దూరి చదివి ఇంటర్ లో ఫస్టుక్లాసు తెచ్చుకుని ఏం ఉద్ధరించావురా. పెద్ద చదువులకి డబ్బులేక బి.ఏ.లో చేరి బియ్యేతో ఆపుచేశావా! టట్! అదేరా బాడ్ లక్. చదువుకోవాలంటే డబ్బులేక నీవు మానేశావు డబ్బుండి చదువంటక నేను మానేశాను. ఆహా గాడ్ ఈజ్ గ్రేట్.
    నేనేం చేస్తున్నానా! ఏదో ఎందుకురా చేయడం మా ఫాదర్ బిజినెస్... దాచిన లక్షలు చూసుకుంటున్నాను. మా ఫాదర్ ఆయన లక్షలు చాలక మరికొన్ని లక్షలు తెచ్చిన అమ్మాయిని తెచ్చి పెళ్ళిచేశాడురా. లక్షల ముందు అందం ఎందుకురా అన్నాడు. మా వైఫ్ అంటే నా భార్య పాపం డబ్బు తెచ్చానన్న గర్వంతో భర్తని కొనగలననుకుంది. బట్ వీడా ఆడదానికి లొంగేది! ఆడదాని కొంగు పట్టుకుని తిరిగే దద్దమ్మనా నేను! దాని మొహం చూడాలంటే చిరాకు. అందం లేకపోతే బుద్ధన్నా ఏడిసిందా? లేదు. ఫలితం ఇంట్లో దొరకని ఆనందాన్ని డబ్బిచ్చి పైన కొనుక్కుంటాం పెళ్ళాలు అన్నవాళ్ళు యింట్లో పడుండడానికి. పిల్లల్ని కనడానికి. ఇల్లు చూడడానికేరా. నా సంగతి తెల్సుగదా అనుభవించడానికే బతకాలంటాను.
    ఒరేయ్! ఆ హాస్టలు రోజులు ఎంత బాగుండేవిరా చీకుచింతా లేకుండా ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం. ఒరేయ్ సునీత, రాధారాణి వాళ్ళెక్కడున్నారో, ఎక్కడుంటారు? ఏ మొగుడిపక్కనో వుండి పిల్లల్ని కంటూ వుంటారు. ఒరేయ్ ఏమిటిరా ఆ మొహం! బార్లో కూచుని ఫ్రీగా పోసినా తాగడానికి ఆ ఏడుపేమిటిరా? తాగరా వెధవా. బీరు కావాలనకుండా పాలడబ్బా అంటావేమిటిరా ఆ పాలడబ్బా సంగతి ఓ అరగంట మర్చిపోరా చిట్టితండ్రీ డబ్బిస్తానన్నాగదరా! ఊ, కమాన్ ఒరేయ్ ఆరోజుల్లో నీవు ఎంత చలాకీగా వుండే వాడివిరా, అలా యిద్దరం బీచ్ ఒడ్డున కూర్చుంటే నీవు పాటలు పాడేవాడివి. ఏమిట్రా ఆ పాట ఒరేయ్ ఆ పాట ఒకసారి పాడరా. పాటలాగే వుంది నా బ్రతుకు అంటావేమిట్రా. ఒరేయ్ బతుకు మనల్ని నడిపించకూడదురా, మనం బతుకుని నడిపించాలిరా. ఆ డబ్బుంది గనక నీతులు భోదిస్తున్నా నంటావా. డబ్బు లేకపోతే అది వచ్చే మార్గం చూడాలిరా. ఏడుస్తే వస్తుందా? రాదు. దానికేంగాని మైడియర్ ఫ్రెండ్ చాలారోజుల తరువాత కలిశాం. చాలా ఆనందంగా వుందిరా నాకు. ఏమిట్రా తెప్పించింది. తినవా, ఊహు తినాల్సిందే. నీకు జింజర్ చికెన్ ఇష్టమన్నది నాకు గుర్తుంది. చూశావా నీకోసం ఆర్డరు చేస్తే వద్దంటావేం. అబ్బ యింకా ఎనిమిదిన్నరే అయిందిబాబూ, వెళుదువుగాని లేరా వెధవ పాలడబ్బా అంటూ ప్రాణాలు తీసి మూడ్ పాడుచేస్తున్నావు.
    సరే అదితిని తగలడు వెళదాం డర్టిఫెలో నిన్ను పిలవడం నా తప్పురా. ఇంకోసారి వస్తావా. వెధవ్వి ఇంకోసారి నిన్ను పిలవనసలు, లైఫ్ ఎంజాయ్ చేయలేని వెధవ్వి నీవు బారు కొచ్చినా పిల్లాడు, ఆకలి, ఏడుపు, విరేచనాలు అనే వెధవ్వి నీవేం ఫ్రోస్పర్ అవుతావురా లైఫ్ లో. ఆ తెలుసులేవోయ్ నీ పరిస్థితి. పద, నా మూడ్ అంతా పోయింది. నీతో నీ'సారి' లెందుకులే నాకు. ఊ పద కారెక్కు. ఎటు వెళ్ళాలో చెప్పు.

 Previous Page Next Page