మర్నాడు ఫోను వరాలు తీసింది-' అయ్యగారు స్నానం చేస్తున్నారండయ్యా అంటూ గబగబ ఆరాటంగా 'అబ్బాయిగారు వంటావిడ వెళ్ళిపోయిందండి, అయ్యగారు వంటావిడ వెళ్ళిపోయిందండి, అయ్యగారు హోటల్నించి తెచ్చుకుని తింటున్నారు.. ఆరికి ఆ తిండి పడటంలేదండి - రెండు రోజుల్నించి విరోచినాలు .. అమ్మగారి కీయండి బాబూ ఫోను - 'అంది ఆయన స్నానం చేసి వచ్చేలోగా మాట్లాడేయాలన్న ఆరాటంతో - ఫోను రాజేశ్వరికందించాడు నరేష్. అమ్మగారూ వంటావిడ వెళ్లిపోయారండి - 'ఎందుకె' 'ఎందుకేటమ్మా, సాధిస్తే, తిడితే - ఏది చేసినా వంకలు పెడ్తే ఎవరూరుకుంటారమ్మా - మీరేటి పడడానికి. మీరెళ్లాక అయ్య కోపం మరీ ఎక్కువైందమ్మ. నన్ను తెగ సాధిస్తున్నారమ్మా. వచ్చేయండి బేగా. వరాలు చెప్తుండగానే 'వరాలు' అన్న విశ్వనాథంగారి కేక -' ఎవరితో మాట్లాడుతున్నావు - పెట్టేయి ఫోను - నిన్నీ విషయాలు ఎవరు చెప్పమన్నారు - ఊ.. పెట్టు..' హుంకరింపు వినపడింది ఫోనులో. ఫోను కట్ అయింది. రాజేశ్వరి నిట్టూర్చింది. కొడుకు ఫోను చేసినా ఊ.. ఆ.. అంటూ పొడి మాటలు, బాగున్నాను. నాకేం -' అంటూ ముక్తసరిగా మాట్లాడేవారాయన. వంటావిడ వెళ్లిపోయిందని విని కలవరపడింది రాజేశ్వరి. 'అయ్యో భోజనానికి ఏం చేస్తున్నారో' అంది దిగులుగా. 'ఏం, వూర్లో హోటళ్లు చాలానే వున్నాయి తింటారు వూరికే నీవు బాధపడకు, కాస్తన్నా ఆయనకి నీ విలువ తెల్సివస్తుందిక' అన్నాడు తేలిగ్గా నరేష్- అంత తేలిగ్గా అనుకోలేకపోయింది రాజేశ్వరి -
మళ్ళీ ఆదివారం నరేష్ ఫోను చేస్తే యింట్లో ఫోనెత్త లేదు ఎవరూ ఆ రోజంతా నాలుగైదు సార్లు ఫోను చేసినా రెస్పాన్స్ లేదు. - ఊ ఏమయ్యారు నాన్న. ఎక్కడికి వెళ్ళివుంటారు..' స్వగతంలా అన్నాడు - రాజేశ్వరి కాస్త గాభరాపడింది-' నానీ పక్కింటి శంకర్రావుగార్కి కాస్త ఫోను చేసి చూడు ఆయనకేమన్నా తెలుసేమో, కాదంటే నాన్న మేనత్త కొడుకు రంగా వున్నాడు అక్కడికి చేసి చూడు - వుండు, నా డైరీలో నంబర్లున్నాయి ఇస్తాను -' అందావిడ - పక్కింటి శంకర్రావు 'ఇల్లు తాళం వేసివుంది వారం రోజులుగా', నాకేం చెప్పలేదాయన అన్నాడు. రంగా 'అంకుల్ ఆమధ్య ఓసారి మా యింటికి వచ్చారు - వంటమనిషి వెళ్ళిపోయింది ఇంకెవరినన్నా చూడమన్నారు చూసి పంపిస్తానన్నా - యింకా ఎవరూ దొరకలేదు- దొరికితే తీసుకు వద్దమనుకున్నా, .. నాకే తెలీదే' అన్నాడు. నరేష్ ఆలోచనలో పడ్డాడు. రాజేశ్వరి ఆందోళనతో 'ఏమయ్యారీయన-' అంది దిగులుగా. వుండు "ఇందుకేమన్నా ఫోను చేసారేమో అడుగుతాను' అంటూ డెట్రాయిట్ లో వున్న చెల్లెలికి ఫోను చేశాడు - జరిగింది చెప్పాడు-' ఏమిటో అన్నయ్యా, అమ్మ చేసిన పని బాగులేదు. ఈ వయస్సులో ఆయన్నలా వంటరిగా వదిలి రావడం - అరవై ఏళ్లు భరించిన ఆవిడ యీ ఆఖరురోజుల్లో ఆయనలో మార్పు వస్తుందనుకుందా - నాన్నగారేం నాకు ఫోను చెయ్యలేదు.' అంటూ మాట్లాడింది బాధగా.. "నానీ, ఏమిటిరా నాకు గాభరాగా వుంది - ఈ పెద్దమనిషి ఏమయ్యారో ఏమిటో, టిక్కెట్టు కొనెయ్ నాకు వెళ్లిపోతా, ఏదన్నా కానిది జరిగితే లోకం నింద వేస్తుంది నామీదే.' అంది అపరాధ భావంతో - కొడుక్కి ఏమనాలో తోచక తల ఊపాడు.
* * * * *
ఆదివారం - ఉదయం పదిగంటల వేళ సావకాశంగా అంతా డైనింగ్ టేబిలు దగ్గర దోశలు తింటుండగా కారు చప్పుడు, ఆ వెనక ఇందుమతి గొంతు విని కిటికీలోంచి తొంగి చూసిన వినోదిని ఆశ్చర్యంగా 'మామయ్యగారు. మామయ్యగారొచ్చారు...' అంటూ వీధి గుమ్మం తలుపు తీయడానికి గబగబ వెళ్ళింది. తల్లి కొడుకులు అర్థంకానట్టు మొహాలు చూసుకుంటాండగానే ముందు ఇందుమతి వెనకాతల నెమ్మదిగా విశ్వనాథం గారు లోపలికొచ్చారు - 'నాన్నగారిని తీసుకొచ్చాను అమ్మా -' నవ్వుతూ అంది ఇందుమతి తల్లి దగ్గిరకెళ్ళి 'ఎప్పుడొచ్చారు - చెప్పలేదు నిన్న .. తెల్సుండీ నటించావా-' నరేష్ చెల్లితో మందలింపుగా అన్నాడు - 'మేమిక్కడ గాభరా పడ్తుంటే ఏం తెలీనట్టు మాట్లాడావా - ఏమిటి నాన్నగారూ ఇది. చెప్పా చెయ్యకుండా అలా ఇల్లు తాళం పెట్టి వెళితే మేం గాభరా పడుతున్నాం 'ముందుగా ఫోను చేసి వస్తున్నట్టు చెప్పొచ్చుగా-' నా కూతురు, నా కొడుకుని మనవలని చూడాలనిపించింది వచ్చాను ముందు పర్మిషన్ తీసుకోవాలా రావడానికి-' బుకాయింపుగా అన్నారాయన. 'నాన్న వస్తానని వీసా కాగితాలు పంపమని, ఎవరికి చెప్పొద్దని ప్రామిస్ చేయించుకున్నారు అప్పుడే వచ్చి ఐదురోజులయింది - నిన్న నీ ఫోను వచ్చాక యింక సస్పెన్సు వద్దని నేనే చెప్పి తీసుకొచ్చాను. 'చూశావా అమ్మా, నాన్నకి నీవంటే ఎంత ప్రేమో నీవు లేకుండా వుండలేక నీ వెనకే పరిగెత్తి వచ్చారు - విశ్వనాథం గారి మొహం సిగ్గుతో ఎర్రబడి 'అదేం కాదు - అదేంకాదు - ఏం ఆవిడేనా నన్ను వదిలి అమెరికా వెళ్లగలదు. నా యిష్టం నేనూ రాగలను - మీ అందరిని చూడాలని వచ్చాను అంతే, తగ్గిపోను సుమా అన్నట్టు బెట్టుగా అన్నారాయన-' అబ్బ నాన్న ...ఒక్క చిన్నమాట నీవు లేకుండా వుండలేక వచ్చేశాను అంటే అమ్మ సంతోషిస్తుంది గదా. మీ మగాళ్లకింత ఇగో ప్రాబ్లమ్ వుండకూడదు-' కూతురు నవ్వుతూ అంటించింది. 'ఆ, 'ఇగో' ఏ తల్లీ భార్య భర్తల మధ్య దూరాలని పెంచేది - అది మగాళ్లకి అర్థం కాదు. పెళ్ళాం ముందు తలవంచకూడదనుకుంటాడు మగాడు - తలవంచడం తలవంపులనుకునే భావన వల్ల జీవితంలో ఏం కోల్పోయాడో అర్థం కాదు మగాడికి'- రాజేశ్వరి నవ్వుతూ అంటించింది. భార్యవంక గుర్రుగా చూసి. నేనెప్పటికీ తలవంచని వీరుడినే అది తెలుసుకోండి' గర్వంగా తలెగరేసి 'చాలా గొప్పగా అన్నారు పెళ్ళాం ముందు తగ్గిపోవడం యిష్టంలేక -
"హు..భార్య భర్తలు ఒకరి ముందు ఒకరు అవసరం అయినప్పుడు తలదించుతేనే ఆ సంసారంలో సామరస్యం వుంటుందని చెప్పడానికే మన పెళ్ళిలో జీలకర్రబెల్లం తంతు ఒకరిముందు ఒకరు తలదించి ఒకరి తల ఒకరి చేతిలో వుంచి తల వంచి జీలకర్ర బెల్లంలా కల్సిపోవాలని పెట్టిస్తారు. దానిలో పరమార్థం అదే అనేది అర్థం చేసుకుంటే తెలివైన మగాడు భార్యముందు అవసరం అయినపుడు లొంగిపోవడంలో సుఖం ఆనందం వుందని గుర్తిస్తాడు. సప్తపదిలో భార్య కాలివేళ్లు పట్టుకుని మట్టెలు తొడిగించడంలోని పరమార్థం అదే - సంసారంలో అన్యోన్యత వుండాలంటే అవసరమైనపుడు భార్య కాళ్లు పట్టుకోడానికి పురుషుడు సిగ్గు పడాల్సిన అవసరం లేదు అని చెప్పడానికే పబ్లిక్ గా అందరిముందు కాలికి మట్టెలు తొడిగిస్తారనిపిస్తుంది. 'అబ్బో, మీ అమ్మకి పడమటి గాలి బాగా వంటపట్టినట్టుంది నెలరోజులకే మాటలు జోరుగా వస్తున్నాయి నోట్లోంచి...' పెళ్ళిళ్ళ గురించి రీసెర్చి చేసినట్టు మాట్లాడుతూంది' హేళనగా, వ్యంగ్యంగా అన్నారు విశ్వనాథం. 'అవును, ఇన్నాళ్లు నోరిప్పకపోవడమే నే చేసిన తప్పని ఇక్కడకీసారి వచ్చాకే బాగా అర్థం అయింది. ఆడది నోరిప్పితే తిరుగుబాటు ధోరణిలాగే కనిపిస్తుంది ఇలాంటి మగాళ్లకి-' రాజేశ్వరీ నవ్వుతూనే అంటించింది.
'డాడీ వాటెవర్ యుసే.. అమ్మ చెప్పింది కరక్టని మీరు ఒప్పుకుని తీరాలి. యిప్పటికైనా.. బెటర్ లేట్ దెన్ నెవర్..." అన్నాడు కొడుకు నవ్వుతూ...
'అన్నయ్య.. నాన్నగారిలా అమ్మని వదలలేక వెనకాల వచ్చారంటేనే అర్థం కావడంలేదా. నాన్న అమ్మ లేకుండా వుండలేరని-' ఇందుమతి నవ్వుతూ హాస్యం ఆడింది. విశ్వనాథం గారి మొహం సిగ్గువల్ల, అవమానం వల్ల ఎర్రబడింది - పంతంగా తల అడ్డం తిప్పుతూ.. పెదాల బిగపట్టి' ఐవిల్ నెవర్ సరెండర్.. అది తెల్సుకోండి. వూరికే మార్పు కోసం, మిమ్మల్ని చూడాలని వచ్చానంతే-' అంటూ గదిలోకి నడిచారు.
ఆయన మొహం చూస్తూ రాజేశ్వరి నవ్వుకుని 'ఏడిశారులెండి మొహంలో కళ్లు, పళ్లు వెళ్లుకు వచ్చాయి నెలరోజులకె. బుకాయించకండి' అని చెవి మెలేసి అనాలనిపించింది. చిన్నప్పుడు కొడుకు అలిగి అన్నం తినకుండా పెదాలు బిగపెట్టి ముద్ద పెడ్తుంటే నోరు తెరవకుండా అలిగినపుడు 'పిచ్చివెధవాయమ్మా, అమ్మ మీద కోపం వస్తే అన్నం మీద చూపిస్తారా - అంటూ సుతారంగా నెత్తిన జెల్లవేసినట్టు వేయాలనిపించింది ఆ క్షణాన - ఆవిడలోని తల్లి మనసుకి - కాని అంత సామరస్యం - సరసం వుంటే యింక కావల్సిందేముంది అనిపించింది.
(ఆంధ్రభూమి - జనవరి 2005)
* * * * *