వెరీ సారీరా సుబ్బారావు. వెధవలు తొమ్మిదిన్నరకే షాపులు కట్టేస్తారు. ఇలాంటి వెధవలు ఏం బిజినెస్సు చేస్తారు. పోనీ యింకో షాపు కెడదాం ఏడవకు. అరే, యిదీ కట్టేశారు. మీ వీధిలో ఇంకో షాపుంది అది చాలాసేపుంటుందా, అయితే యిదిగో ఈ వంద తీసుకో, ఆటోలో వెళ్ళిరా యింక డ్రైవ్ చేయలేను నేను, బై. గుడ్ బై.
"ఏమండీ, సాయంత్రం నాలుగున్నరకి పోయినవాళ్ళు యిప్పుడా రావడం - పాలడబ్బా తెస్తానని వెళ్ళి పదిగంటలకి యింటికి వస్తాం. ఏమిటలా చూస్తారు. ఏమిటా వాసన తాగి వచ్చారా ఫ్రెండు లాక్కెళ్ళాడా బారుకి. మీరసలు మనుషులు కాదా. ఆకలికి పిల్లాడు గగ్గోలు పెట్టి ఏడుస్తూ వుంటే బారుకెళ్ళి పీకలదాకా తాగి తిని వచ్చారా. మీరసలు ఓ తండ్రేనా. పిల్లాడు కడుపుకి పాలుపట్టలేని మీరు ఓ తండ్రేనా! వందరూపాయలా. ఎందుకు నాకివి? ఈ నోటు తినమంటారా మీ బాబుని. దుకాణాలు కట్టేశారా. అవును రాత్రి పదిగంటలకి తమరు సావకాశంగా తాగి, తిని వెళితే దుకాణాలు తెరుచుకు కూర్చోడానికి వాళ్ళకి భార్యా బిడ్డలున్నారన్న జ్ఞానం వుంది. వెళ్ళండి. ఈ వంద కూడా పట్టుకెళ్ళి మరి నాలుగు పెగ్గులు తాగిరండి.
"అయ్యో భగవంతుడా నేనేం పాపం చేశానని నాకిలాంటి బాధలు తండ్రీ! నేనేం చీరలు అడిగానా, నగలడిగానా, సినిమాలడిగానా, సరదాలడిగానా! కన్నబిడ్డకి గుక్కెడు పాలు కావాలన్నాను. ఒరే బాబూ ఒరే నాయనా కన్నతల్లిని నీకు గుక్కెడు పాలు కూడా పట్టలేని దౌర్భాగ్యురాలినిరా తండ్రీ. ఈ అమ్మ కన్నీళ్ళతో కడుపునింపడం కంటే ఏం చెయ్యగలదురా. అయ్యో ఏమండి బాబేమిటండీ యిలా అయిపోతున్నాడు. అదేమిటండీ అలా పిచ్చిచూపులు చూస్తున్నాడు.
అయ్యో, అయ్యో.. బాబు వెక్కిళ్ళు పడ్తున్నాడండీ.. అలా చూస్తారేమిటండీ! పరిగెత్తండి, డాక్టరుని తీసుకురండి. అయ్యో.. అయ్యో... బాబు గుండెలెగసిపడుతున్నాయి అండీ. అదేమిటి ఒక్కసారి వెక్కిళ్ళు ఆగిపోయాయి. గుండె ఎగసిపడ్డం ఆగిపోయింది. అదెందుకు మధ్యలో అలా వచ్చిందో. బాబూ, నాన్న ఎలావుందిరా నాయనా, నిద్రపట్టినట్లుంది వెర్రినాన్నకి. అదేమిటి ఏడుస్తారెందుకు వాడు ఆకలికి ఏడ్చినప్పుడు మీరూరుకున్నారు. వాడు ఆకలి మరిచి నిద్రపోతుంటే ఏడుపెందుకండీ. ఏదో కన్నకడుపు. బాధకొట్టీ తిట్టాను మిమ్మల్ని అయ్యో, అత్తయ్యా మామయ్యా మీరంతా ఎందుకు ఏడుస్తున్నారెందుకు. ఏడుస్తున్న పిల్లాడని, ఉద్యోగం సద్యోగం లేని కొడుకు పిల్లాడని, ఆకలికేడుస్తున్నా చీమ కుట్టినట్లనిపించని మీరు వాడు హాయిగా నిద్రపోతుంటే ఇప్పుడొచ్చి ఏడవడం ఎందుకు.
అయ్యో.. అదేమిటి వాడినలా కింద పడుకోబెడ్తున్నారు.ఏమిటి బాబింక లేడా. వెళ్ళండవతలికి నాకేం చెప్పక్కరలేదు మీరు. ఆకలికి ఏడ్చి ఏడ్చి యిప్పుడే పడుకున్నాడు. నాకు పిచ్చా. బాబింక ఆకలి అని అసలు ఏడవడా. బాబింక పాలుకావాలని అడగనే అడగడా. ఏమిటీ బాబు చచ్చిపోయాడా. అబద్ధం, బాబూ, నాయనా, ఒక్కసారి కళ్ళిప్పరా".
"ఇదిగో చూడు మీనాన్న వందరూపాయలు తెచ్చారురా. చక్కా రేపొద్దుట పాలడబ్బా తెచ్చి పాలు కలిపిపడతా, కడుపునిండా తాగుదువుగాని. ఏమిటి కళ్ళిప్పవూ.. ఇంక నీకు పాలొద్దా. ఈ పాపిష్టి డబ్బుతో పాలు తాగవూ. పోనీలే నాన్న నా రక్తం పాలగా మార్చిస్తాను తాగుదువుగాని.. అయ్యో వదలండి నన్ను... అయ్యో... ఎందుకలా తీసికెడుతున్నారు బాబుని, ఎక్కడికి తీసికెడ్తున్నారు నా బాబుని వద్దు. నేనీయను. మీరంతా పొండి, మీరసలు మనుష్యులు కారు. రాక్షసులు. నా బాబు ఆకలికి ఏడుస్తుంటే గుక్కెడుపాలు తెచ్చీయలేకపోయారు. వదలండి నన్ను... నన్ను ముట్టుకోకండి ఎవరూ.. నాకు పిచ్చా... అవును పిచ్చే. నా బాబుని నన్ను వదిలిపొండి. అయ్యో... బాబూ, నాయనా, బాబూ....