Previous Page Next Page 
మధుపం పేజి 30


    "ఇన్ స్పెక్టర్ ఓ భర్తకి తన భార్య ఇంకోరితో సంబంధం పెట్టుకుందని తెలిస్తే ఎవరూ భరించలేరు సార్. మొదటిసారి, అంటే పెళ్ళయిన ఏడెనిమిది నెలలకి ఓసారి ఇలాగే పనిమీద ఏదో ఊరు వెళ్ళి పొరపాటున ఇంటి తాళాలు తీసికెళ్ళడం మర్చిపోయి తాళాల కోసం ఆఫీసు కెళ్ళాను - అక్కడావిడ లేదు. ఆఫీసు లీవు పెట్టి పన్నెండు గంటలకే వెళ్ళిందన్నారు. రెండయినా ఇంటికి రాలేదంటే ఎక్కడికి వెళ్ళింది? ప్యూన్ ని అడిగితె 'ఎవరో సార్ వచ్చారు. ఇద్దరూ కలిసి వెళ్ళారన్నాడు. నేను ఊరి నుంచి మర్నాడు కాని రానని తెలుసు కనుక ఇంటికి ఎప్పుడు వస్తుందో చూద్దాం ఆ వ్యక్తి ఎవరో చూడాలని అపార్ట్ మెంట్ కి కాస్త దూరంలో కాపు వేశాను. సాయంత్రం అయిదవుతుందనగా ఎవరో అతనితో స్కూటర్ మీద వచ్చి సందు మొదట్లో దిగి ఇంటికి వెళ్ళింది. ఆవిడ వెళ్ళిన వెంటనే నేను వెళ్ళెను. నన్ను చూసి బిత్తర పోయింది. తను ఎవరితోనో రావడం , నేను ఆఫీసుకి వెళ్ళడం అంతా చెప్పి నిలేశాను. ముందు ఎవరో స్నేహితుడని బుకాయించింది. క్లాస్ మేట్ కనిపిస్తే బయటికి వెళ్లానని ..... నమ్మినట్టు నటించాను. ఆ తరువాత మూడు నాలుగు నెలలు ఆమెని గమనించడమే పని అయింది. రెండు మూడు సార్లు స్పష్టంగా అతనితో సినిమాలకీ, హోటళ్ళ కి వెళ్ళడం రూడి అయ్యాక నిలేస్తే ఇంక లాభం లేదని నిజం వప్పుకుంది. అతను పెళ్ళికి ముందు తన క్లాస్ మేట్ అని, స్నేహితుడని ఇద్దరి మధ్యా ఇదివరకే పరిచయం, ప్రేమా ఉన్నా, అప్పటికి అతని చదువు పూర్తి అవ్వక, ఉద్యోగం దొరక్క అతన్ని చేసుకునే వీలు దొరకలేదని, అతని పట్ల ఇంకా ప్రేమ వుందని , అతను కనిపించగానే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, తమది నిజమైన ప్రేమని, నన్నెప్పుడూ ప్రేమించలేదని, కేవలం భర్తగా చూడడం తప్ప నా మీద తనకేం లేదని, విడాకులు ఇచ్చేయమని కోరింది నిజం వప్పుకుని, భరించ లేకపోయాను. నా పరువు, గౌరవం ఏమవ్వాలి? నా తప్పు లేకుండా నన్ను విదిల్చి పారేయాలనుకోవడం నాలో విచక్షణాజ్ఞానాన్ని చంపేసింది. ఆమె పట్ల కసి, ద్వేషం పెరిగి నన్ను ఇంత మోసం చేసింది చాలక నిర్బయంగా నన్ను వదుల్చుకోవాలనుకోవడం భరించలేక నన్ను కాదని ఆమె సుఖ పడకూదని , పడనీయ కూడదన్న కక్ష పెరిగి ఆమెని ఎలాగైనా శిక్షించి నాకు చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోవాలని, నెలా పదిహేనురోజులు రకరకాలుగా ప్లాన్లు వేసి ఆఖరికి ఈప్లాను నిర్ణయించాను. విజయవాడలో ఉన్నట్టు ఎలిబి చూపి, అక్కడ నించి మధ్యాహ్నం రైలులో రాత్రి తొమ్మిదిన్నరకి హైదరాబాద్ వచ్చాను. పదకొండున్నర ప్రాంతంలో అటో ఎక్కి చలికాలం కనక నన్నెవరూ గుర్తుపట్టకుండా మనకీ క్యాప్, నల్ల స్వెట్టర్ తొడుక్కుని మా అపార్ట్ మెంట్ కి రెండు ఫర్లాంగుల దూరంలో అటో దిగాను. ఎవరన్నా అటోవాడిని పోలీసులు అడిగినా నా అపార్ట్ మెంట్ దగ్గర దిగినట్టు ఎవరూ చెప్పకుండా అక్కడ దిగి, పన్నెండు గంటలకి నీళ్ళ టాంకరు రావడం చూసాక నడుచుకుంటూ మా అపార్ట్ మెంట్ దగ్గరకు వెళ్ళి చిన్న గేటులోంచి వాచ్ మెన్ వెనక పక్క నుండగా లిప్టు ఉపయోగించ కుండా , ఎవరి కంటా పడకుండా , నా దగ్గిరున్న తాళంతో తలుపు తీసి లోపలికి వెళ్ళాను. సరోజ అపార్ట్ మెంట్ లో ఎవరికన్నా తెలుస్తుందనో, తెలిస్తే నాకు చెపుతారానో ఎప్పుడూ అతన్ని ఇంటికి తీసుకురాలేదు. తనే అతనితో వెళ్ళేది. నిద్రపోతున్న సరోజని చంపడానికి ముందే ఇంట్లో ఉన్న కత్తి పట్టుకుని  వేలిముద్రలు పడకుండా గ్లౌస్ వేసుకుని పక్కకి తిరిగి పడుకున్న ఆమెని వెల్లకిలా తిప్పి కసిగా కడుపులో పోదిచాను. మేల్కొన్న సరోజ భయంతో కేకలు పెట్టబోతుంటే నోరు నొక్కాను. గింజుకుంటూ కిందపడితే అక్కడ గుండెల్లో మరో పోటు పోదిచేసరికి గిలగిల కొట్టుకుని కాసేపట్లో చనిపోయింది. అపుడు గబగబ ఆమె వంటిని ఉన్న నగలు, బీరువా తెరిచి మిగతా డబ్బు, క్యాష్ వగైరాలు జేబులో వేసుకున్నాను. నగల కోసం దొంగతనం జరిగిందనుకుంటారు అందరూ అనుకున్నాను. తలుపు దగ్గరగా లాగి అరగంటలో చడీ చప్పుడు లేకుండా వచ్చిన దారినే దిగి వాచ్ మెన్ మోటారు రూములో ఉండగా అపార్ట్ మెంట్ నించి నడుస్తూ అరకిలోమీటరు నడిచి అక్కడ అటో ఎక్కి రైల్వే స్టేషన్ కి వెళ్ళి, తెల్లారి నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రాగానే ఆటోలో ఇంటికి వచ్చాను."
    "కరెక్ట్ , నీవు హత్య ఎలా చేశావో నేనూ హించినట్టే చేశావు.'
    'సార్, మీకెందుకు నామీద అనుమానం వచ్చింది? ఎలా వచ్చింది? నిండామునిగాను ఇంకా చలేమిటి. చెప్పండి సార్. ఇప్పుడు నాకేం ఇంక భయం వేయడం లేదు."
    "హత్య జరిగి నెలరోజులైనా చిన్న క్లూ దొరకలేదా అని పై అధికారులు దబాయిస్తుంటే ఎన్ని రకాలుగా ఆలోచించినా మోటివ్ అర్ధం కాకపోవడంతో ఓసారి విజయవాడ వెళ్ళి వద్దాం అని వెళ్ళాను. మిగతాదంతా నీవు చెప్పినట్టే - మెడికల్ షాపు, డాక్టరు ఇంట్లో చెప్పారు. చిన్న పొరపాటు  చేశావు. నిన్నటి టిక్కెట్టు మిగిలి పోయింది. నీకు బ్లాక్ లో టిక్కెట్లమ్మేవాడు అంటగట్టడం వల్ల, అది నీవు గమనించక పోవడం వల్ల తీగ దొరిగింది. డొంక లాగాను. మీ ఆవిడ నీకు తన సంగతి తెలిసిందని ఎలాగో తెలిసింది కనుక భయపడకుండా నిజం ఓప్పుకున్నదని, మీ ఇద్దరి మధ్య జరిగిన దెబ్బలాటలు, ఆమె నిన్ను డైవోర్సు అడిగిన వైనం రాసుకుంది. అప్పుడు కధ అర్ధం అయింది. ఆ అపార్టుమెంటు గేటు వేసే టైమింగు, టాంకర్ టైము తెలిసిన నీవు తప్ప ఇంకెవరూ చెయ్యలేరని పట్టించింది నేరం. క్షణికొద్రేకంలో చేసిన నేరం కాదిది. అలోచించి, ప్లాన్ వేసి చేసిన మర్డర్ ఇది. సుధాకర్ నీవు నేరం అంగీకరించినా, కోర్టు నీకు తక్కువ శిక్ష విధించదు. బి మెంటల్లీ ప్రిపెర్డ్ ఫర్ ఇట్ -" సుధాకర్ ని కాస్త జాలిగా చూసాడు ఇన్ స్పెక్టర్ .
    సుధాకర్ తల దించుకున్నాడు.
    "నెల రోజులయినా కేసులో మీరు, పురోగతి సాధించలేక పోయేసరికి విజయం సాధించాననుకున్నాను. కానీ చట్టం దృష్టి నించి ఏ నేరస్థుడు తప్పించుకోలేడని మరోసారి నా కధ రుజువు చేసింది. ఇప్పుడు నేను అన్నిటికి అతీతుడ్ని . చావంటే నాకు భయం లేదు" అంటూ చేతులు చాపాడు సుధాకర్.

                                                     ***

 Previous Page Next Page