Previous Page Next Page 
తిరిగి దొరికిన జీవితం పేజి 30


    "మోహన్-సాయంత్రం నాతో క్లబ్బుకు రమ్మంటే అర్జంటు పని అన్నావు. ఇదేనా అర్జంటు పని నాతో అబద్దాలాడి యీవిడతో డాన్సుకి రావడాని కన్నమాట ఈ ఎత్తు" తీక్షణంగా గొంతు హెచ్చించి అంది.
    గీత గొంతువిని కార్లెక్కిపోతున్న కొందరు ఆశ్చర్యంగా ఇటు చూడసాగారు. అది గమనించిన మోహన్ సిగ్గుతో "గీతా, రా యింటికెళ్ళి మాట్లాడుదాం" సౌమ్యంగా అని కారెక్కి పోయాడు.
    "అవసరం లేదు. ఆవిడని వెంటబెట్టుకు వెళ్ళు. పాపం యింకేం షికార్లు మిగిలిపోయాయో. నేనెందుకు అడ్డం మీ మధ్య." విసురుగా అంది ఉక్రోషంగా చూస్తూ. అందరూ కుతూహలంగా యిటు చూస్తుంటే తల కొట్టేసినట్లయింది అతనికి. సిగ్గుతో మొహం ఎర్రబడింది. "గీతా! చూడు అందరూ ఎలా చూస్తున్నారో ప్లీజ్ లోపలికి రా."
    "మోహన్, మాట దాటేయాలని చూడక. అందరూ చూస్తే సిగ్గుపడాల్సింది నీవుగాని నేనుకాదు. నిజంగా ఎవరో చూస్తారని, అనుకుంటారని నీకుంటే..."
    గీత ధోరణి చూసేసరికి మోహన్ కి భగ్గుమంది. నడిబజార్లో నిలబెట్టి సభ్యసంస్కారాలు మరిచి అందరి ఎదుట యింత చిన్న విషయానికి యాగీ చేస్తున్న గీతని చూస్తే అతని కోపం కట్టలు తెంచుకుంది. గీతవంక తిరస్కారంగా చూసి, "సరోజా రా వెడదాం" అంటూ కారెక్కాడు. అంతవరకు జరుగుతున్న దానికి సిగ్గుతో తలవాల్చుకున్న సరోజ కారెక్కింది. మోహన్ గీతవంక చూడకుండా విసురుగా వెళ్ళిపోయాడు కారు స్టార్టుచేసి.
    మోహన్ నిర్లక్ష్యం గీతకి తలకొట్టేసినట్లయింది అవమానంతో ఆమె గుండె భగ్గుమంది. విసురుగా కారెక్కి దభాలున తలుపు మూసి, ఆ కోపం ఏక్సిలేటర్ మీద చూపింది.
    
                                    *    *    *
    
    మర్నాడు మధ్యాహ్నం కృష్ణమోహన్ భోజనం చేస్తుంటే, సరస్వతమ్మ గీత తండ్రి ఉదయం పురోహితుడిని వెంటబెట్టుకుని పెళ్ళి ముహూర్తం నిర్ణయించడానికి వచ్చినట్లు చెప్పింది.
    "నీకోసం చాలాసేపు కూర్చున్నారు నాయనా నీవెంతకీ రాకపోతే సాయంత్రం మళ్ళీ వస్తానని వెళ్ళారు ఈ నెలలో మీ నాన్నగారి సంవత్సరీకాలు అవగానే మళ్ళీ నెలలో ముహూర్తం వుందిట. నిశ్చయం చేస్తానన్నారు. నీవు లేకుండా నేనేం అనను. అందుకే సాయంత్రం వస్తామన్నారు."
    తల్లి ఆ మాట చెప్పగానే కృష్ణమోహన్ కలవరపడ్డాడు. ఏదో పెద్ద ఆపద నెత్తిన పడిన వాడిలా దిగాలు పడిపోయాడు ఇంక భోజనం తినలేక పోయాడు. అన్నం కెలుకుతూ కూర్చున్న కొడుకుని చూసేసరికి ఆవిడకి కడుపులో దేవినట్లయింది కొడుకు అంతరంగం ఆమె అర్ధం చేసుకుంది.
    "అన్నం తినరా నాయనా-" అంది ఆర్ద్రంగా.
    "వద్దమ్మా - ఏమిటో ఆకలిగా లేదు" అంటూ కంచంలో నీళ్ళుపోసి లేచిపోయాడు మోహన్. "అమ్మా, ఒకసారి మేడమీదకి రా" అన్నాడు -వంటావిడ ఎదురుగా మాట్లాడడం యిష్టంలేక.
    నిన్న రాత్రి డాన్స్ ప్రోగ్రాంనించి వచ్చాక కృష్ణమోహన్ ఎవరితో మాట్లాడకుండా మేడమీదకి వెళ్ళిపోయాడు...సరోజవచ్చి భోజనానికి పిలిస్తే అన్నం తిననన్నాడు. సరోజ ద్వారా జరిగిన సంగతి విన్న సరస్వతమ్మ నిట్టూర్చింది ఆవేదనగా. సరోజ కృష్ణమోహన్ డాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళాక  కాసేపటికి గీత వచ్చింది. సరస్వతమ్మ అనాలోచితంగా యదార్ధం చెప్పింది. దాంతో కల్లుతాగిన కోతిలా గీత ధుమధుమలాడుతూ విసురుగా వెళ్ళిపోయింది. కాని అక్కడికి వెళ్ళి నడిరోడ్డుమీద రభస చేసిందని వినగానే సరస్వతమ్మ చాలా బాధపడింది-కొడుకు మనస్తత్వం ఎరిగిన ఆమె, మోహన్ జరిగిన దానికి ఎంత బాధపడ్తున్నాడో అర్ధంచేసుకుంది. ఇంక ఆ పూట ఏం చెప్పినా అతను భోజనం చేయడని తెలుసు గనుక బాధగా నిట్టూర్చింది. పాలు పంపింది సరోజచేత.
    జరిగిందానికి - జరుగుతున్న అన్నింటికి తనే మూలకారణం అన్న బాధతో, సిగ్గుతో సరోజ చితికిపోతూంది-వెళ్ళిపోతానంటే వెళ్ళనీయరు వుంటే గీతవల్ల అడుగడుగునా ఎదుర్కొనే అవమానాలు ఆమెకి తలనొప్పిగా తయారయ్యాయి. ఏమయినా ఇంక తనక్కడ వుండడం అసాధ్యంగా తయారయింది ఆమెకి. ఏమయినా కృష్ణమోహన్ ని వప్పించి వెంటనే వెళ్ళాలి. దృఢనిశ్చయం చేసుకుంది సరోజ.
    పాల గ్లాసు పట్టుకొని దగ్గరకి వెళ్ళి లైటువేసింది.
    "లైట్ తీసేయ్" కళ్ళకి చేతులు అడ్డంపెట్టుకుని చిరాగ్గా అన్నాడు మోహన్.
    "పాలుతీసుకొచ్చాను-తాగండి" అంది సరోజ మృదువుగా.
    "నాకేంవద్దు-ముందు లైటార్పి వెళ్ళు" కరకుగా అన్నాడు కళ్ళు తెరచి తీక్షణంగా చూస్తూ.
    "బాగుంది-మధ్య కోపం నామీద చూపిస్తారేం - పాలేం చేశాయితాగండి" అంటూ చనువుగా నవ్వి దగ్గరకి వెళ్ళి పాలగ్లాసు అందించింది.
    ప్రశాంతంగా చిరునవ్వుతో అభిమానంగా దగ్గరకి వచ్చిన సరోజ కళ్ళలోకి చూశాడు మోహన్, ఏం అనలేక గ్లాసు అందుకుని,
    "సరోజా నామీద కోపంగా, అసహ్యంగా లేదూ నీకూ-యీ పిరికివాడిని చూస్తే జాలి అనిపిస్తుందా నీకు" అన్నాడు వ్యధగా.
    "అవును జాలివేస్తూంది మిమ్మల్ని చూస్తే -లేచి కూర్చుని కలతలన్ని కౌగలించుకుని మా యిద్దరి మధ్య నలిగి పోతున్న మిమ్మల్ని చూస్తే - నిజంగానే జాలిగా వుంది నాకు - ఇంక ఏమయినాసరే నావల్ల మీరు మనశ్శాంతికి దూరం అవడం నేను సహించను."

 Previous Page Next Page