Previous Page Next Page 
వివాహబంధాలు పేజి 30


    మొహం మాడ్చుకుని వెళ్ళాడు శ్యాం. ఆ మర్నాడు కాలేజీలో నేను మేడమెట్లు దిగి వస్తూంటే ప్రకాష్ మెట్లమద్యలో అడ్డంగా నిలబడి నన్ను చూసి అదోలా నవ్వి చటుక్కున నా చేయిపట్టుకున్నాడు. ఆ సాహసానికి భయం కంటే ఆశ్చర్యం ఎక్కువవేసింది. తీక్షణంగా చూసి "వదులు" అన్నాను.
    "వదలడానికి కాదు పట్టుకుంది. ఈ ప్రాణిగ్రహణం చెయ్యనిదే నాకు నిద్ర కూడా రాదు" అన్నాడు.
    విసురుగా చేయి లాక్కుని "అది జన్మలో చేయలేవు" అన్నాను.
    అతని మొహం నల్లబడింది.
    "ఓహో ఏం చూసుకుని ఆ పొగరు! అందగత్తెననా? నేను తలుచుకుంటే నిన్ను పెళ్ళి చేసుకోవడం పెద్ద విషయం గాదు. నాలాంటివాడిని పొందడమే వరం అనుకుంటూ పైకి బెట్టుచేస్తున్నావు కదూ?"
    "ఛీ! నిన్నా! రోడ్డునపోయే ముష్టివాడినన్నా పెళ్ళాడుతానుగాని నిన్ను నా కంఠంలో ఊపిరి వుండగా పెళ్ళాడను" అన్నాను.
    అతని కళ్ళు నిప్పులు చెరిగాయి. కర్కశంగా "అలాగా ఎలా చేసుకోవో నేనూ చూస్తా" అన్నాడు దర్పంగా.
    బాగా చూడు. దారి వదులు. లేకపోతే ఈ విషయం చాలా దూరం వెడ్తుంది" అని విసురుగా తోసుకుని పైకి వెళ్ళాను.
    ఆ మర్నాడు ప్రకాష్ చాలా ప్రేమ కురిపిస్తూ "నిన్న తొందర పడ్డానని, నేనంటే చాలా యిష్టం అని, ఏదో అల్లరి చిల్లరిగా ఏడిపించి నప్పటికీ నా అందానికి ముగ్ధుడయి ప్రేమించి వివాహం చేసుకోవాలనుకుంటున్నానని' అన్యధా తలచకుండా న అభ్యర్ధన తీసేయవద్దని, నీవు లేక పోతే బతుకే లేదు- పిచ్చి వాడినయిపోతాను" అంటూ పదిపేజీల ప్రేమలేఖ రాశాడు. ఒక్కక్షణం నిజమా అనుకున్నాను. కాని అతనిసంగతి రెండేళ్ళుగా చూస్తూ అంత సుళువుగా అతన్ని నమ్మలేక పోయాను. బెదిరించి నన్ను లొంగదీసుకోలేక ఈ దారిన నన్ను వప్పించి పెళ్ళి చేసుకుని నా మీద కసి తీర్చుకోడానికి వేసిన ఎత్తు అన్పించింది. ఉత్తరం చించేశాను. కాలేజీలో అభ్యర్ధనగా జాలిగా చూశాడు. మళ్ళీ శ్యాంతో కబురుపంపాడు- నా జవాబు మారదని ఖచ్చితంగా చెప్పాను.
    అంతే - ఆ మర్నాటినించి నా పాట్లు భగవంతుని కెరుక! నా పేరు గోడల నిండా మరొకడితో కలిసి వెలిగింది. పిల్లి కూతలు, నవ్వులు, చప్పట్లు, కేకలు ఒకటేమిటి పిల్లలందరిని కూడేసి ఏడిపించారు. రెండు రోజులు చూసి భరించలేక ప్రిన్సిపాల్ కి రిపోర్టు ఇచ్చాను. ఆయన చివాట్లు పెట్టారు. ఆ తరువాత కాలేజి మానేసి రోడ్డు మీద, మా ఇంటి ఎదురుగా గొడవ ఆరంభించారు. మా ఇంటి గోడల మీద పోస్టర్లు వెలిశాయి. అమ్మ నాన్న నిలదీయడం, తిట్టడం, ఇరుగు పొరుగు చెవులు కొరుక్కోవడం, ఇంట్లోంచి కదిలి వెడితే వెనకాల ఎక్కడనుంచి ప్రత్యక్షమయ్యేవారో నలుగురు తయారు, భరించలేనిదిగా తయారైంది. అదృష్ట వశాత్తు ఎలక్షన్స్ అయి కాలేజికి శలవులు యిచ్చారు. బతికాననుకొని ఇంట్లో కూర్చునే దానిని ఎక్కడికీ కదలకుండా. ఈ పుకార్లతో నా పెళ్ళి ఎక్కడకాదోనని మా వాళ్ళ భయం. ఆఖరికి పరీక్షలు అయింది అనగానే నా పెళ్ళి ప్రయత్నాలు ఆరంభించారు. ఆ సమయంలో ప్రకాష్ నాన్నగారు మధ్యవర్తి ద్వారా నన్ను చేసుకుంటానని కబురంపారు. అమ్మానాన్నల సంతోషానికి అవధులు లేవు. ఇది ప్రకాష్ ఎత్తేనని నాకు తెలుసు. అదృష్టవంతురాలినని అందరూ నన్ను పొగిడారు. ససేమిరా ఈ సంబంధం చేసుకోనన్న నన్ను అమ్మ, నాన్న తిట్టారు, భయపెట్టారు, నచ్చ చెప్పారు. ఈ పెళ్ళిచేస్తే నా శవానికే చేస్తారని తేల్చి చెప్పేశాను. కారణం అడిగారు. ముందునించి ప్రకాష్ సంగతి చెప్పాను. ఆ-ఏదో కుర్రతనం, కాస్త బాగున్న ఆడపిల్లని ఏదో అంటారు. అంత మాత్రానికి ఇంత మంచి సంబంధం వదులుకోడం అవివేకం అని నచ్చ చెప్పబోయారు. ప్రకాశ్ తత్వం తెలిసీ - ఈ పెళ్ళి చేసుకోడం నా గొంతుకి నేను బిగించుకునే మంగళసూత్రం కాదు ఉరిత్రాడని తెలిసి తిరస్కరించాను. అమ్మవాళ్ళు తిట్టి తిట్టి విరక్తితో ఊరుకొన్నారు. విజయగారూ! ఆనాటి నా తిరస్కారం ప్రకాష్ లో ఇంత పగ రేపుతుందని, ఇంతలా పగబట్టి క్రూరంగా కాటువేసి నా జీవితాన్ని సర్వ నాశనం చేస్తా డనుకోలేదండీ," సుశీల కళ్ళలో నీరు చిమ్మింది.
    ఆశ్చర్యంగా చూశాను.
    "విజయగారూ! ... మీ ప్రకాష్ మనిషి కాడండి- మానవ రూపంలో దానవుడు. నా పసుపు కుంకాన్ని తుడిచేశాడండీ" భోరుమంది.
    చకితురాలినయ్యాను... అంటే .... అంటే" అడగలేక పోయాను.
    "నాకు పెళ్ళయింది విజయగారూ! నాభర్త శ్రీమంతుడు కాడు, అందగాడు కాడు, ఉన్నతోద్యోగి కాడు. నా మనసెరిగినవాడు, నన్ను మెచ్చినవాడు, సంస్కారం ఉన్నవాడూ. మా అంతస్థుకి తగిన వాడ్ని చూసి చేశారు. ఆర్నెల్ల కాపురంలో మరిచిపోలేని అనుభూతులు చవిచూశాను. ఆలుమగల అన్యోన్యతకి ఆస్థి అంతస్థులు అవసరం లేదన్నది తెలుసుకుని నా అదృష్టాన్ని అభినందించుకున్నాను. నా ఆనందం, అదృష్టం ఆర్నెల్లల్లో తుడుచుకుపోయింది. ఆ ప్రకాష్ ...నా కాపిరంలో చిచ్చు పెట్టడానికి చేయదగింది అంతా చేశాడు. ఆకాశరామన్న ఉత్తరాలు రాశాడు. ఆయనతో ముందే ప్రకాష్ గురించి చెప్పాను. ఆయన ఆ విషయాన్ని చాలా తేలికగా తీసుకుని బుట్ట దాఖలా చేశారు ఆ ఉత్తరాలు. ఆ ఎత్తు పారలేదు. పెళ్ళయ్యాక మొదటిసారి పండగకి వెళ్లాం ఇద్దరం. వారం రోజులు సరదాగా గడపదలచుకున్నాం. పండగముచ్చట్లు అయ్యాయి. ఇద్దరం రోజూ ఊరి చివరకి వెళ్ళేవాళ్ళం. కను చీకటివేళ, -ఓ రోజు - ఆ రోజు కాళరాత్రి నాకు. ఎవరో ముగ్గురు మనుష్యులు మామీద పడి నన్ను పట్టుకుని నోరునొక్కి-నా కళ్ళముందే యమ దూతల్లాంటి ఇద్దరు ఆయన్ని కత్తితో పొడిచి పొడిచి చంపారు. రక్తం వరదలు అయింది. నా నుదుటి కుంకుమ తుడుచుకుపోయింది. వాళ్ళెవరో నాకు తెలియదు. కాని ఆ పని వాళ్ళెందుకు చేశారో నాకు తెలుసు. డబ్బుకి కక్కుర్తిపడి నిండు ప్రాణం తీశారు. ఆ ఊర్లో ఆయనని తెలిసినవారే లేరు. అంత కసి కోపం ఎవరికీ ఉండే ఆస్కారం లేదు నా మీద. ప్రకాష్ కసి కోపం ఆయనని బలితీసుకున్నాయి. ఆ నిజం నాకు తెలుసు. కాని ఎలా నిరూపించను? అ సమయంలో ప్రకాశ్, అతని మిత్ర బృందం అందరూ మరొకరి ఇంట్లో పార్టీలో మునిగి ఉన్నట్టు సాక్ష్యం సృష్టించుకున్నారు.

 Previous Page Next Page