Previous Page Next Page 
మాయ జలతారు పేజి 30


    రాజారావు చేసింది మంచిపనో చెడ్డపనో నిర్ణయించుకోలేకపోయాడు సూరి. కాని, గ్లాసు ఖాళీచేసి "అంతపనీ చేశాడూ బాస్టర్ డ్!" అనేశాడు అన్న తర్వాత తనలోతానే ఆశ్చర్యపోయాడు ఎందుకన్నాడో అర్థంకాలేదు.
    డెయిజీ విచిత్రంగా చూచింది సూరి కళ్ళల్లోకి అయినా, తనమీద సానుభూతితో ఆ మాటలన్నాడో, రాజుమీది అసూయతో అన్నాడో అర్థం కాలేదు. "నేను నమ్మిన రాజూ నన్ను గెంటేశాడు. నేనెంత బాధపడ్డానో చెప్పలేను సూరీ! తరువాత బాగా ఆలోచించాను. నా మెదడులో ఎన్నో పడకగదులు, ఎన్నో రూపాలు మెరిశాయి. వాటిలో బహుశః నువ్వుకూడా ఉండివుంటావు. ఫ్రాంక్ గా చెపుతున్నాను, నిన్ను ఆశ్రయించాలనే విషయం నాకు తోచలేదు. తరువాత అనుకున్నాను. ఎవరు మాత్రం ఎందుకు ఆశ్రయమివ్వాలి నాకు? అని నేను హృదయం యిచ్చానా ఎవరికైనా? ఎవరినైనా ప్రేమించానా? వ్యాపార వస్తువులా వారిదగ్గరకు వెళ్ళాను. కృత్రిమపు నవ్వులు నవ్వాను. డబ్బు తీసుకున్నందుకు మురిపించాను. వారూ నన్ను ఒక యంత్రంలా వాడుకున్నారు. నాటకం చూడ్డానికి ప్రేక్షకులు డబ్బిచ్చిపోతారు నాటకం చూస్తారు. ఆనందిస్తారు వచ్చేస్తారు - అంతే"
    డెయిజీ సుమారు ఉపన్యాసం ఇస్తూంది. ఉక్కిరి బిక్కిరి అయినాడు సూరి. బ్రాందీ ఒక గుటక వేశాడు.
    డెయిజీ గ్లాసు ఖాళీచేసింది. ఆవిడకు సిగరెట్టు కాల్చాలనిపించలేదు. బాధలు వినేవాడు దొరకాడని ఆనందించింది. తనకు సహాయం చేస్తాడని ఆశించనేలేదావిడ. అయినా, సూరి అందించిన సిగరెట్టు అందుకొని నోట్లో పెట్టుకుంది. సిగరెట్టు కాల్చి పొగ ఊదింది.
    "నాది నీచమైన వృత్తి. ఈ వృత్తి దేశంలో ఉండకూడదంటున్నారు కాని, దాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం ఏం చేస్తూందో నాకు తెలియదు. ఎవరూ సహాయం చేయరని నాకు తెలిసిపోయింది. తరువాత ఆలోచించాను. ఈ సంఘం నన్ను ఒక విషపు పురుగులా చూస్తుంది. దూరదూరంగా ఉండాలనుకుంటుంది. జీవించే శక్తి ఉన్నా నన్ను జీవించనివ్వటంలేదు. మైకేలు మైకేలుక్కావలసింది. డబ్బు నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి బజారులో అమ్మితే డబ్బువస్తే అందుకూ వెనుదీయడు కాని, అది బంగారు గుడ్డుపెట్టే బాతును కోయడం చేరదీయగలవాడూ, నన్ను మనసారా ప్రేమించినవాడూ ఒక్కడే ఉన్నాడు - జార్జి జార్జిని నేను ప్రేమించాను సూరీ! జార్జి ఎంత మంచివాడంటే, ఈ పరిస్థితిలోనూ నన్ను స్వీకరించగలడనే విశ్వాసం ఉంది నాకు ఏం ఆశ్చర్యంగా ఉంది కదూ! కాల్ గర్ల్ ను ప్రేమించేవారు సహితం ఉన్నారని! జార్జిని నాకు దక్కకుండా చేశాడు, మైకేల్" అని జార్జి కథంతా వినిపించింది డెయిజీ.
    "జార్జి ఎక్కడున్నాడిప్పుడు?"
    "అది తెలిస్తే ఈ కథంతా నీకు చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. ఇక్కడ్నుంచి వెళ్ళిం తరువాత జార్జి ఉత్తరాలు కూడా వ్రాశాడనీ, మైకేలు, మా యజమాని వాటిని నాకు అందకుండా చేశారనీ తెలిసింది. నేను జార్జితో వెళ్ళిపోయి ఉండాల్సింది పాపం, జార్జి నేనంటే ప్రాణమిస్తాడు. నేను అతణ్ణి ప్రేమించాను. ప్రేమ మొక్కలాంటిది శిథిల హృదయంలో కూడా దాని పచ్చదనం వాడదు. అతణ్ణి ప్రేమించాననే పచ్చదనంతోనే జీవిస్తున్నాను. ఏముందీ నాకీ లోకంలో? బ్రతికి చేయాల్సిందేమి? జీవితానికి లక్ష్యం ఏమి? ఉన్న వయసును, అందాన్ని, సొగసును అణా పైసల క్రింద మార్చుకుంటూ బ్రతకటం బ్రతకడమేనా? అందుకే చనిపోదామనుకున్నాను. ఎలా చనిపోవాలని ఆలోచించాను. హుసేన్ సాగర్ లో పడాలనుకున్నాను. అది బాగనిపించలేదు. పోలీసులు శవాన్ని బైటికి తీస్తారు. కట్టమీద వేస్తారు వచ్చేపోయేవాడల్లా కడుపు చేసుకొని చచ్చింది అని తిడ్తారుకాని, సానుభూతి ఎవడూ చూపడు"
    డెయిజీ ముఖంలో ఏదో విషాదం గోచరించి, ఆమె కళ్ళలో ఏదో బాధ కనిపించింది. చివరి వాక్యం విని చిరునవ్వు నవ్వుకున్నాడు. సూరి చావు తరవాత ఏముంది? ఎవడు చూచాడు తరువాత ఏముందో! అయినా, మనిషికి ఎంత ఆశ! ఆ చావు తరువాత సైతం తనకు అవమానం జరగరాదు, జనం తనను కీర్తించాలి. తనపేరు నిలిచి ఉండాలి ఏమిటో పిచ్చి! ముందున్న గ్లాసు ఖాళీగా ఉంది. నింపుకున్నాడు. డెయిజీ గ్లాసు నింపాడు సిగరెట్టు వెలిగించి "ఆ తరువాత?" అన్నాడు.
    "చావడానికి నిశ్చయించుకున్నాను. ఎలా చావాలన్నదే ప్రశ్న సూరీ! ఈ దశలో సైతం నా జార్జి వస్తే జీవించగలను. నేను అతనికి ఏమీ ఆనందం ఇవ్వలేకపోవచ్చు. నాలో మరొకని రక్తంతో పెరుగుతున్న బిడ్డ ఉండవచ్చు అయినా, నన్ను పరిగ్రహిస్తాడు జార్జి. నాకా విశ్వాసం ఉంది సూరీ! అతడు వాస్తవంగా నన్ను ప్రేమించాడు. ప్రేమ హృదయానికి సంబంధించింది కానీ, నాకా అదృష్టం లేదని తెలుసు. నేను పాపాత్మురాలిని. ఆ మేరీమాత కూడా నన్ను క్షమించదు. అమాంతంగా నాకు సైనాయిడ్ గుర్తుకు వచ్చింది. సైనాయిడ్ సాధించడం కష్టం అయినా సాధించాను. ఆరోజు చర్చికి వెళ్ళాను. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను సూరీ! మైకేలు నన్ను వదిలి చర్చికి వెళ్ళాడు అయితే, ఆ రోజు చర్చికి వెళ్ళడంలో నాకేదో పవిత్రత కనిపించింది. చర్చిలో కళ్ళు మూసుకొని మేరీమాతను ప్రార్థించాను. నన్ను క్షమించాల్సిందని వేడుకున్నాను. మేరీమాతను చూచి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి 'తల్లీ' ఇది నా చివరిరోజు. రేపు నీదగ్గరికి చేరుకుంటాను' అన్నాను. హృదయంలో దుఃఖం పొంగింది. కళ్ళలోకి నీళ్ళు వచ్చి నిలిచిపోయాయి. చర్చినుంచి ఇంటికి వచ్చాం. మైకేలు బట్టలు మార్చుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు. గదిలో చేరి తలుపు వేసుకున్నాను. బట్టలు మార్చాను. కుర్చీమీద కూర్చొని మేరీమాత పటాన్ని టేబుల్ మీద పెట్టుకున్నాను. బైబిల్ అందుకొని చదివాను అప్పుడు నా హృదయం ఎలా ఉండిందో చెప్పలేను సూరీ! ప్రపంచం అంటే ఏవగింపు కలిగింది. ఇదంతా చీకటివలె కనిపించింది చావు - అదే ముక్తి అనిపించింది. చావు తరువాత ఏదో వెలుగు కనిపిస్తుందనిపించింది. ఎక్కడో దూరాన ఒక వెలుగు కనిపించినట్లైంది. నా శరీరాన్ని ఇక్కడే వదిలేసి, మెల్లగా అడుగులు వేస్తూ, ఆ వెలుగు వైపు పోతున్నట్లనిపించింది. సైనాయిడ్ తెచ్చి ముందు పెట్టుకున్నాను. మరు సెకండులో డెయిజీ ఉండదు. డెయిజీ దేహం పూడ్చబడుతుంది. డెయిజీని తల్చుకునే వాడెవడూ ఉండడు. సైనాయిడ్ అందుకున్నాను. డొక్కలోంచి ఎవరో, 'అమ్మా' అని పిలుస్తున్నట్లనిపించింది. ఒళ్లంతా వణికింది. చేతులు వణికాయి. సైనాయిడ్ క్రింద పడిపోయింది. 'బిడ్డా' అని కేకపెట్టి టేబుల్ కు ముఖం కొట్టుకున్నాను. ఎంతసేపు ఏడ్చానో తెలియదు. ఎందుకు ఏడ్చానో తెలియదు. సైనాయిడ్ ఎందుకు క్రిందపడిపోయిందో తెలియదు. ఏడ్చి ఏడ్చి కళ్ళు తుడుచుకున్నాను."  
    తనకు తెలియకుండానే సూరి జేబురుమాలును తీసి కళ్ళు వత్తుకున్నాడు. టేబుల్ మీద ఉన్న గ్లాసులు అలాగే ఉన్నాయి.
    "ఆలోచించాను ఇంత స్థిర నిశ్చయాన్ని పటాపంచలు చేసిందెవరు? 'అమ్మా' అన్న ఒక కేక అదీ ఊహ. అవును ఆ పిలుపు ఏదో ఒక కర్తవ్యాన్ని నాకు చూపింది. నా ముందున్న మేరీ తల్లే అలా అన్నదేమో! ఎంత హాయిగా ఉండిందా పిలుపు! అప్పుడు నేననుకున్నాను. నేను చనిపోయే హక్కు నాకు లేదు. నా బిడ్డను నేను చంపగలనా? ఛా! పాపం, బతకాలి మళ్ళీ బతుకు మీద ఆశ జనించింది. నాకొక శిశువు జన్మిస్తాడు. వాడికి నేను తల్లిని అవుతాను. ఆ పాప నన్ను 'అమ్మా' అని పిలుస్తాడు. నేనా పాపను గట్టిగా రొమ్ముకు హత్తుకుంటాను. నా పాప పెద్దవాడౌతాడు. వాణ్ణి డాక్టర్ను చేస్తాను. అప్పుడు జనం ముక్కుమీద వేలేసుకుంటుంది. తెల్లని కోటు చేతపట్టుకొని స్టెతస్కోపు మెడకు తగిలించుకొని వస్తుంటే, జనం అంతా వాణ్ణి డెయిజీ కొడుకని వేలెత్తి చూపుతారు. ఎంత ఆనందిస్తాను నేను? ఎంత భవిష్యత్తుంది నాకు? అలాంటప్పుడు చావడం ఎందుకు? అని ప్రశ్నించుకున్నాను. అవును. చావకూడదు అని నిశ్చయించుకున్నాను"
    "డెయిజీ! నీకు కలుగబోయేది ఆడపిల్లైతే?" అన్నాడు సూరి. ఎండమావులు చూచి పరిగెత్తి పరిగెత్తి ప్రాణాలు వదిలే లేడిలా కనిపించింది డెయిజీ అతనికి.
    ఆ మాటలు విని వణికిపోయింది డెయిజీ. ఆమె కళ్ళల్లో నీరు నిండింది. ఆమె గొంతు బొంగురుపోయింది. "అలా అనకు సూరీ! నాకు మగబిడ్డ కలుగుతాడు. ఆడపిల్ల పుడుతుందనే ఆలోచన సైతం భరించలేను. నా జీవితం చూచిన తరువాత"
    పొరపాటు చేశాననుకున్నాడు సూరి "క్షమించు డెయిజీ. నీకు మగపిల్లవాడే కలుగుతాడు. తరవాత ఏమైందీ?" అడిగాడు గ్లాసు వంక చూస్తే అది నిండి అలాగే ఉంది. ఒక్క గుటక వేశాడు. సిగరెట్టు వెలిగించి వినడానికి సంసిద్ధుడై కూర్చున్నాడు.
    "ఏమైందంటున్నావా? ఏమి అవుతుంది? మామూలే ఎప్పుడు జరిగేదే జరిగింది. నేను గదిలో ఉండగా మా ఇంటిముందు ఒక కారు ఆగిన చప్పుడైంది. కిటికీలోంచి చూచాను. కార్లోంచి మైకేలు దిగాడు. అతని వెనుక ఒక యువకుడు దిగాడు. ఆ యువకుడు టై కట్టుకున్నాడు. కొద్దిగా మైకంలో ఉన్నాడు. అతణ్ణి చూచి నాకు ఏడుపు వచ్చింది కాని, నిగ్రహించుకున్నాను. గుండె దడ దడ కొట్టుకుంది. మైకేలు అతన్ని ముందు వరండాలో కూర్చుండబెట్టి నా గది తలుపు తట్టాడు. తలుపు తీశాను. నా ముఖం చూచి నిర్విణ్ణుడైనాడు మైకేలు కాని, క్షణంలో తమాయించుకున్నాడు. చిరునవ్వు నవ్వాడు. నేను ఎక్కడికీ వెళ్ళనన్నాను కాబట్టి ఇంటికే తీసుకొచ్చానన్నాడు. బట్టలు వేసుకొని సిద్ధంగా ఉండమన్నాడు. నేను ఒప్పుకోలేదు. బ్రతిమిలాడాడు. విన్నాడు కాదు బెదిరించాడు, ఇంట్లోంచి వెళ్ళగొడ్తానని అయినా, లొంగలేదు. నన్ను దెబ్బలు కొట్టాడు. అప్పటికీ వినలేదు. 'నీమీద సైతాను ఆవేశించింది దింపుతా నుండు' అని తలుపువేసి బయటినుండి గొళ్ళెంపెట్టి వెళ్ళిపోయాడు. నేను ఏడుస్తూ కూర్చుండిపోయాను. యువకుడూ, మైకేలూ ఏదో పోట్లాడుకున్నారు. బహుశః డబ్బుకోసం తగాదా అయివుంటుంది. కొంతసేపటికి యువకుడు వెళ్ళిపోయాడు. మైకేలు కూడా వెళ్ళిపోయాడు. 'నీవు లొంగలేదు జయించావు' అన్నది నా మనసు. అవును, జయించాను అనుకున్నాను. మనసు తేలికైంది. మంచంమీద పడిపోయాను. బాగా అలసి ఉన్నానా - నిద్ర వచ్చినట్లైంది. నిద్రపోయాను.

 Previous Page Next Page