Previous Page Next Page 
శరతల్పం పేజి 31

 

    అతని ముఖంలో ఏదో కొత్త వర్చస్సు కనిపించింది.
    డాక్టరు ఆశ్చర్యపడ్డాడు. ఏమిటీ పరిణామం! ఇంత జవ, అంత శక్తి , ఇంత చైతన్యం ఎలా వచ్చాయి?
    "స్వామీ! మీ పద్యం మా మందుల కంటే శక్తి వంతంగా పని చేసిందండి. ఇంజక్షన్లు, మందులు విఫలమయినాయి. నాకు నిరాశ కలిగి మీకు రాశాను. కాని మీ పద్యం - అబ్బ మీ పద్యంలో ఎంత శక్తి ఉన్నదండి!' గురువయ్య చురుకుగా కనిపించాడు.
    చూస్తున్న ముగ్గురూ ఆశ్చర్యపోయారు.
    "డాక్టరు గారో౧ గురువయ్య పద్యం కోసం పరితపిస్తున్నాడు. అది లభించే వరకు అతనికి ఉత్సాహం వచ్చింది. రోగానికి కావలసింది కాక రోగికి కావలసినవి  ఉంటావికదా!' నారాయణస్వామి వివరించాడు.
    గురువయ్య మరో పద్యం చదవమన్నాడు. పద్యం డాక్టరుకూ బాగనిపించింది. అతడూ అర్ధించాడు. స్వామి "సిరికిం జెప్పుడు ....." చదివేశారు.
    "అన్నగారో౧ భగవంతుడట్ల వస్తడా?"
    ఎంతకాలానికి గురవయ్య నుంచి ప్రశ్న విన్నారు స్వమి౧ వారికి ఎంతో అనందం అయింది.
    "వస్తడు గురవయ్యా౧ వస్తడు . నీవంటి వారు నిండు మనసుతో ఎలుగెత్తి పిలిస్తే ఎందుకు రాడు? తప్పక వస్తడు గురువయ్యా! వస్తడు " అని వీపు మీద చేయి వేసి నిమిరారు స్వామి!
    "ధన్యుడవు గురువయ్యా! ధన్యుడవు నీ ఆత్మ పరిపక్వమైంది" అన్న స్వామి డాక్టరు పిలువగా వెళ్ళిపోయారు డాక్టరు వెంట.
    గురువయ్యతో పిచ్చమ్మ మాటలు సాగించింది.
    గురువయ్య స్థితి ప్రమాదకరంగా ఉంటేనే పిలిపించా నన్నాడు డాక్టరు. అతని శారీరక స్థితి అతడు మరిన్ని నాళ్ళు జీవించడని చెపుతుందన్నాడు. మందులు అతనికి పనిచేసేట్లు లేవు. అతన్ని తీసికెళ్ళడమే మంచిదని సలహా ఇచ్చాడు.
    స్వామి గురువయ్యను తీసికొని ఊరికి చేరుకున్నారు. గురువయ్యను తమ ఇంట్లోనే ఉంచుకున్నారు.
    గురువయ్య వచ్చాడని తెలిసింది , ఊరు సాంతం కదిలింది,.
    గురువయ్య చచ్చి బతికిండట! భాగోతం ఇనేటందుకే బతికిండట! గురువయ్య చచ్చిండట! దేవుడొచ్చి బతికించిండట! అసలు గురువయ్యనే దేవుడు పూనిండట! గురువయ్యలో ఇప్పుడు సగం దేవుడున్నడట?
    వదంతులు అలా వ్యాపించాయి - ముందు ఊళ్ళో -------తదుపరి చుట్టుపట్ల గ్రామాల్లో ----ఆ తరువాత ఆ ప్రాంతంలో .
    జనం గురువయ్య దర్శనానికి వస్తున్నారు.
    గురువయ్య ఉదయమే స్నానం చేసి, ఊర్ధ్వపుండ్రాలు ధరించి వసారాలో గుంజకు అనుకోని కూచుంటాడు. మంచంలో పడుకోమ్మంటే పడుకోడు. పడుకొని భాగవతం విననంటాడు. కూర్చునే శక్తి లేదు గురువయ్యకు. అయినా పట్టుదలగా కూర్చుంటున్నాడు.
    నారాయణస్వామి గోడకు అనుకోని గురవయ్యకు ఎదురుగా కూర్చుంటారు -- వ్యాస పీఠం మీద భాగవతం ఉంచుకొని చదువుతుంటారు. మధ్య మధ్య గురువయ్య ప్రశ్నలు ---- వాటికి స్వామి వివరణలు. అలా మధ్యాహ్న భోజనం వరకూ సాగుతుంది. భోజనం తరువాత విశ్రాంతి. సాయంకాలం మళ్ళీ భాగవత పఠానం . అలా జరుగుతుంది కార్యక్రమం.
    పురాణం వినడానికి వందలు - వేలుగా జనం వస్తున్నారు, బండ్లు కట్టుకొని కాలి నడకన, గుర్రాల మీద , జనం కుటుంబాలతో తరలి వస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న బాటలన్నీ ఈ ఊరికే సాగుతున్నాయి. ఊరు నిత్య తిరుణాళ్ళులా తయారయింది. చెట్ల కిందా, బండ్ల కిందా వంటలు. చెరువులో , ఏటిలో స్నానాలు. ఊరు జనంతో కిటకిట లాడింది. వ్యాపారస్తులు దుకాణాలు పెట్టారు. ధార్మికులు పందిళ్ళు వేయించారు.
    ఊరు పరిస్థితే మారిపోయింది. ఊరు పది ఊళ్ళ పెట్టు అయింది.
    నారాయణస్వామి పురాణం చెపుతున్నప్పుడు జనం కిటకిటలాడి పోతుంది. కొబ్బరికాయలు, పూలు, పండ్లు గుట్టలుగా పడుతున్నాయి. వాటి సేకరణ వితరణతో సతమతం అవుతుంది నాంచారమ్మ. పిచ్చమ్మ ఎప్పుడో గాని అటు రావడం లేదు. వచ్చినా గురువయ్యకు నమస్కరించి వెళ్ళిపోతుంది. ఆమె ఎవరి తోనూ మాట్లాడ్డంలేదు. మౌనంగా తన ఇంటి వాకిట్లో కూర్చుంటుంది. తనలో తాను గొణుక్కుంటుంది. అప్పుడప్పుడు నవ్వుకుంటుంది. అమాంతంగా లేచి గురువయ్య దగ్గరికి పోతుంది - మళ్ళీ వచ్చి అక్కడే కూర్చుంటుంది.
    విసుగూ, విరామం లేకుండా భాగవతం చదువుతున్నారు నారాయణస్వామి. అతి త్వరగా ముగించాలని వారి పట్టుదల - గురువయ్య చాలా కాలం బతుకుతాడని వారికి నమ్మకం లేదు. గురువయ్యకు భాగవతం పూర్తిగా చెప్పాలని వారి పట్టుదల. వార్ధక్యంలో ఉన్న నారాయణస్వామి శ్రమకు తట్టుకోలేక పోతున్నారు. నడుం నొప్పి ప్రారంభం అయింది. ,ముఖం మీద బాగా అలసట కనిపిస్తుంది. రాత్రిళ్ళు నాంచారమ్మ స్వామి నడుం వత్తుతుంది. ఆమెకూ పని ఎక్కువైంది - కళ్ళు భారంగా ఉంటున్నాయి.
    అయినా పట్టుదలగా సాగిస్తున్నారు స్వామి. గురువయ్యకూ శక్తి లేదు. అతనికి పట్టుదలే.
    ఊరంతా ఒక వింత వాతావరణం ఏర్పడింది. భజన మండలలు ఏర్పడ్డాయి. ఊరి నిండా పందిళ్ళతో భజనలు సాగుతున్నాయి - - రాత్రింబవళ్ళు. ఇదంతా విచిత్రంగా ఉంది స్వామికి.
    "అన్నగారూ ౧ ఎందుకిట్ల వస్తున్నరు మంది ఎర్రోళ్లోలే" ఒకనారి రాత్రి అడిగాడు గురువయ్య స్వామిని.
    "అర్ధం కావటం లేదు గురువయ్యా! ఊరంతా భజనలు చేస్తున్నరు- నీ ఆరోగ్యానికేమో!"
    "అన్నగారో౧ నాకు బతకాల్నని లేదు. భాగవతం ఇనాలే. అటేన్క బతికి చేసెడి దేమున్నది! ఇంకేంతున్నది అన్నగారూ?"
    "గురువయ్యా! మమ్ములను విడిచి వెళ్ళిపోతావా?" నాంచారమ్మ ఆపద మీద పడినట్లే మాట్లాడింది.
    "వదినగారూ! పారే నీళ్ళల్లో ఎక్కడ్నుంచో రొండు కట్టెలు కొట్టుకొస్తయి వరదలో రొండు కలుస్తయి , జర దూరం పోతయి, ఆటేన్క ఏరుపడ్తాయి , ఏది ఎక్కడికి పోతదో ఎవరి కెరుక?"
    నారాయణస్వామికి ఏట్లో తాను చూచిన దృశ్యం గుర్తుకు వచ్చింది. ఆ విషయమే చెపుతున్నాడు గురువయ్య. ఈ సామ్యత ఎక్కడికి? భగవంతుడు చెప్పిస్తున్నాడా? గురువయ్య విడిపోవడం తప్పదా? ఈ మధ్య తాను పోగూడదా? పోడు తనకు గురువయ్యంత పరిపక్వత రాలేదు. పోతానని ఎంత విరాగిలా చెపుతున్నాడు గురువయ్య! అతను ఈ లోకంతో బంధనాలు తెంచుకున్నాడు. భాగవతం కోసమే బతికి ఉన్నడు! అనుకున్నారు.
    ఆ తెల్లవారి గురువయ్య స్థితి దిగజారింది,ప్రమాదకరంగా పరిణమించింది. నోట మాట నిలిచిపోయింది. చూపు పైచుపు అయింది. భూలయనం చేయాల్సి వచ్చింది. దర్భలు తెప్పించి వేసి రామనామంతో భూశాయనం చేశారు స్వామి.   
    వార్త ఊరంతా పాకింది. జనం స్వామి ఇల్లు వాకిలి నిండిపోయారు. స్వామి రామనామ సంకీర్తనం సాగించారు. జనం అనుసరించారు. ఊరంతా రామనామం ప్రతిధ్వనించింది.
    పిచ్చమ్మ వాకిట్లో కూర్చొని ఏడ్వసాగింది.
    రామక్రిష్టయ్య తోపుడు బండి మీద నారాయణస్వామి ఇంటికి వచ్చాడు - అతనికి కాళ్ళూ నోరూ పడిపోయాయి --- వచ్చి గురువయ్యను కాళ్ళు పట్టుకొని కన్నీరు కార్చాడు.
    గురువయ్య కోలుకోసాగాడు. గురువయ్యకు స్పృహ వస్తుంది -----నెమ్మదిగా.
    స్వామి గమనించారు -----భజన వేగం హెచ్చించారు.
    రామనామం తప్ప మరేమీ వినిపించటం లేదు.
    గురువయ్య మాట్లాడాడు.
    మళ్ళీ మంచం మీద పడుకోబెట్టారు.   

 Previous Page Next Page