ఆనాటి నుంచి గురువయ్య కుర్చోలేకపోతున్నాడు. తుంగచాప మీద పడుకొని భాగవతం వింటున్నాడు. పిచ్చమ్మ తన ఇల్లు వదిలేసింది. నిరంతరం గురువయ్య పక్కనే ఉంటుంది.
కదా శ్రవణం సాగుతూనే ఉంది.
రామక్రిష్టయ్య తోపుడు బండి మీద వచ్చి వింటున్నాడు. కూతురు లేచి పోవడం, కూతురుతో పాటు ఉన్న సొమ్ము పోవడంతో డీలాపడి పోయాడు రామక్రిష్ణయ్య. అతను చేతబడి చేసి చంపింతామనుకున్న ఎంకమ్మ అత్తవారి తరుపువారు ఎంకమ్మ లేచిపోవడంతో కోర్టులో దావా వేశారు ----ఎంకమ్మ తెచ్చిన ఆస్తి కోసం, రామక్రిష్టయ్య కోర్టుల చుట్టూ తిరిగాడు. ఉన్నది ఊడింది -- కోర్టులో ఓడిపోయాడు, దాంతో మనోవ్యాధి పడి మంచాన పడ్డాడు. ఇంతలో ఇంటికి నిప్పంటుకుంది .....అర్ధరాత్రి, ప్రాణాలతో రామక్రిష్టయ్య బయటపడడం కష్టం అయింది. కాలూ చెయ్యి పడిపోవామే గాక, మాట కూడా పోయింది. రామక్రిష్టయ్య భార్య మరణించింది. రామక్రిష్టయ్య ఏకాకి అయినాడు. అతడు నమ్ముకున్నది డబ్బు - ఆస్తి . వాటికోసం అతడు చేసినవి అనేకం. చేసిన చేష్టలు నిలిచిపోయాయి. వచ్చిన ఆస్తి ------ దనం పోయింది. ఎక్కడ్నుంచో ఒక పనిమనిషిని తెచ్చి పెట్టుకున్నాడు. అతను ఇంత కాచి పోసే తాగుతున్నాడు. తోపుడు బండిలో తిరిగి బాకీలు వసూలు చేస్తున్నాడు. మంచంలో పడి వుంటే రామక్రిష్టయ్యకు తాను చేసిన అన్యాయాలు భూతాల్లా వెంబడిస్తున్నాయి. "పురుగులు పడి చస్తడు" అని నారాయణస్వామి అన్న విషయం అతనికి గుర్తు వచ్చింది. తన స్థితి చూసుకుంటే ముందేం జరుగునున్నదో తెలిసేట్లు లేదు. నారాయణస్వామి అన్నాడని చెప్పిన మాటలు అతనికి గుర్తు రాసాగాయి. ఎందుకో ఆలోచన సైతం భరించలేకపోతున్నాడు. తన వంటి నిండా లుకలుక లాడుతున్న పురుగులు కనిపించాయి -------తన శరీరం తనకే అసహ్యం అనిపించింది. తోపుడు బండిలో పురాణం వినడానికి బయలుదేరాడు. చేసిన పాపాలు అలా కడుక్కోవాలని అతని ఆశయం. ఒకనాడు ఎందుకో అతనికి అనిపించింది గురువయ్య భూమి, నారాయణస్వామి భూమి తన దగ్గర ఉండడం మంచిది కాదని వాటిని వారికే దానం చేతామను కున్నాడు. తోపుడు బండిలో స్వామి ఇంటికి చేరాడు. గురువయ్య కాళ్ళంటి తాను చెప్పేవన్నీ కాగితం మీద రాసి చూపించాడు.
"గురువయ్యా౧ నేను అపచారం చేసిన, నీ భూమి తీసుకున్న. ఇప్పుడు ఇచ్చిపోవడానికి వచ్చిన, తీసుకో."
"రామక్రిష్టయ్యా! నాకు భూమెక్కడిది? నా కిక్కడ ఏమి లేవు. మిగిలిన భాగవత మున్నది -----అందుకు తగిన గింజలున్నయి. 'నాది ' అనేది నాకు లేదు రామక్రిష్టయ్యా!"
రామక్రిష్ణయ్య గురువయ్య కాళ్ళ మీద తలపెట్టి పెద్దగా ఏడ్చాడు. ఏవేవో అనదలచుకున్నాడు. అనలేకపోయాడు. ఆ ఊహలు, ఆలోచనలు అనదలచిన మాటలు మనసులోనే మసలసాగాయి ---- మరగసాగేయి. నారాయనస్వామిని వారి భూమి వాపసు తీసుకోవలసిందని ప్రార్ధించాడు రామక్రిష్టయ్య -- దోసి లోగ్గి. దేహీ అనడం కాదు ఇస్తానన్నాడు.
"రామక్రిష్టయ్యా! నీకు దుఃఖానికి హేతువైంది. నాకిస్తనంటావా! నీవు చంచలములైన ఆస్తిని ధనమును నమ్ముకున్నావు. అవి ఎన్నడూ ఎవరి దగ్గర కలకాలం ఉండవు. ద్రవ్యానికి ద్రవ స్వభావం ఉన్నది. అది పాడుతుంది గాని ఘనంగా నిలువదు. నిలునిదాన్ని నిలువస్తుందని భ్రమ పడ్డావు. అది నిలువ లేదు. పోయింది. అన్య వస్తువులపై గాక ఆత్మపై ఆధారపడిన వ్యక్తికీ బాధలుండవు. అతడు నమ్మినది ఆత్మను, అది పోయినప్పుడుగాని అతడు పోడు. ఆత్మను గాని, పరమాత్మను గాని నమ్మిన వాడు చెడడు. "నమే భక్త ప్రణశ్యతి" అన్నాడు కృష్ణ పరమాత్మ. నీవు నాకు ఇస్తానంటున్న భూమి అశాశ్వతం అయింది. దానికి ద్రవ్యం నాకు ఇచ్చినవు. అది సదుపయోగం అయింది. నీవల్ల నాకు గురువయ్య లాభించిండు. నాకు ఒక మహాత్ముడు దొరికిండు. అయన నుంచి చాల నేర్చుకున్న. 'నాది' అనటంలో అనేక దుఃఖాలున్నాయి. "అందరిది " అనుకున్నప్పుడు దుఃఖాలు లేవు. నాకు ఇప్పుడు అనందం గున్నది. భూమి తెచ్చుకొని దుఃఖాలు తెచ్చుకోలేను రామక్రిష్టయ్యా!"
రామక్రిష్టయ్య గుండెలో అగ్గి రాగలసాగింది కాని నోట మాటరాదు. నోరంతా తెరచి , మూసి ఏమేమో అన్నాడు. అది అతనికి అర్ధం కాలేదు. విన్నవారికీ అర్ధం కాలేదు. తలవంచుకొని తోపుడు బండిలో వెళ్ళిపోయాడు.
ఆరోజు భాగవత కధ ముగుస్తుంది. వాస్తవానికి క్రితం రోజే అయిపొయింది. లాంచనంగా సమారాధన తరువాత చదవాలని వదిలేశారు స్వామి.
ఉదయం స్నానం చేసి సిద్దమై తుంగచాపలో పడుకున్నాడు గురువయ్య. పిచ్చమ్మ సహితం స్నానం చేసి అతని పక్కనే గోడకు అనుకుని కూర్చుంది. ఆఖరి రోజు కాబట్టి జనం ఎక్కువ వచ్చారు. వత్తిడి ఎక్కువగా ఉంది.
నారాయణస్వామి వ్యాస పీఠం ముందు కూర్చొని ధ్యానం చేసి గురువయ్యను చూచాడు. గురువయ్య కళ్ళలో అనందం తోనికిస లాడుతుంది. అతని కోర్కె పూర్తయింది - భాగవతం పూర్తీ అవుతోంది. "గురువయ్యా ! ప్రారంభింతమ!" అడిగారు స్వామి.
"ఇవ్వాళ ప్రారంభం కాదు అన్నగారూ! ముగింపు. ఆరంభం కాదు అన్నగారూ అంతం."
నారాయణస్వామి ప్రారంభించారు.
జనసందోహం అతి శ్రద్దగా వింటున్నారు. ఆనాడు పిచ్చమ్మ కూడా శ్రద్దగా వినసాగింది.
గురువయ్య ప్రాణాలన్నీ భాగవత కధలో పెట్టాడు.
"ఇట్టి భాగవత పురాణంబు పఠియించి విష్ణు సాయుజ్యంబు జెందుదురని మరియు నిట్లనియె " నారాయణస్వామి చదివి గురువయ్యను చూచారు. గురువయ్య కధలో లీనం అయి ఉన్నాడు.
"అని యారీతి నుతించి భాగవత మాద్యంతంబు నూతుండు సె
ప్పిన సంతుష్ట మనస్కులై విని మునుల్ ప్రేమంబోనం పద్మానా
భుని జిత్తంబున నిల్పి తదుణ మున్ ఋషించుచున్ ధన్యులై
చని రాత్మీయ నికేతనములకు నుత్సాహంబు వర్ధిల్లగన్."
అనే పద్యం పూర్తీ చేయగానే గురువయ్య నారయనస్వామిని తన దగ్గరికి రావలసిందని సంజ్ఞా చేశాడు చేతితో.
నారాయణస్వామి లేచి గురువయ్య వైపు సాగారు.
గురువయ్య తన చేతిని వారి పాదాల మీద వేశాడు.
వేసినప్పుడు వేడిగా ఉన్న చేయి మంచుగా మారింది.
నారాయణస్వామి నుంచొనే ఉన్నారు కదల్లేదు.
జనం సాంతం నిశ్శబ్దంగా నారాయనస్వామిని చూస్తున్నారు.
వాతావరణం స్తబ్దంగా ఉంది. నిశ్శబ్దంగా ఉంది. మౌనంగా ఉంది. వెళ్ళి పోతున్న ఆత్మను సాగనంపుతున్నట్లుంది.
నారాయణస్వామి పెదవి కదిలింది.
"గురువయ్య పరమపదించిన్రు."
జనంలో సంచలనం.
గోడకు అనుకోని కూర్చున్న పిచ్చమ్మ నేలకొరిగింది.
పిచ్చమ్మ గురువయ్యను చేరుకొంది.
* సమాప్తం *