గురవయ్య బాగా క్షీణించిపోయాడు. ఎముకలు, చర్మం తప్ప మిగల్లేదు భాగవతం వినడం మానలేదు.
పిచ్చమ్మ గుండె పగిలింది.
ఆమె కన్నీటికి అంతులేదు - బాపల ఇంటికి రోజూ వెళ్ళబట్టే ఇలా అయిందని ఆమె నమ్మకం. ఆమె ఏడవటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు - ఆమె చేతులో పైసా లేదు -- కనీసం మంగళసూత్రం లేదు అమ్మకానికి!
స్వామికి తిరువారదానలో రాముడు కాదు గురవయ్య కనిపించాసాగాడు. భోజనాల సమయంలో నాంచారమ్మతో అన్నాడు ---
"గురవయ్యను పట్నం తీసుకుపొద మానుకుంటున్న."
"తీసుకుపొండి . సాంతం ఎట్లనో అయిండు."
నారాయణస్వామికి ఎందుకో ధైర్యం వచ్చింది. గురవయ్య వచ్చినప్పుడు అడిగారు --
"గురవయ్యా! రోగం ముదురుతున్నది. ఇక్కడ తగ్గెట్లు లేదు. పట్నం పోదాం."
"అన్నగారూ!" దగ్గుతూనే అన్నాడు గురవయ్య." ఆయువుకు ఎవడు కర్తండి. పరీక్షిత్తు పాము కరవకూడ దను కుంటే ఆగినాదుండి " మళ్ళీ దగ్గు పొర వచ్చింది. గిజగిజ లాడాడు. తేలికపడి "బతికుండంగ భాగవతం పూర ఇనాలే! పట్నం ఎందుకు పంపుతరు! మీరు ముందరుంటే రోగం అదే తగ్గుతది."
'అట్లకాదు గురవయ్యా! వళ్ళు బాగుంటే ఎదన్న చెయ్యొచ్చు. మీ అన్నగారి శిష్యుడు డాక్టరున్నడు పట్నంల. దాగయ్యేదుంటే చచ్చుటెందుకు " నాంచారమ్మ.
"వదినగారూ! బతికి చేసెడి దేమున్నదుండి . భాగవతం ఇని చావాలే. అంతే."
"అది కాదు గురవయ్యా! ఆరోగ్యం బాగులేకుంటే ఏమి వింటావు? మునుపటి వలే చర్చ సాగుతున్నదా చెప్పు? నాకు గూడ చెప్పినట్లనిపించటంలే ఏమంటవు?"
"అన్నగారూ!" దగ్గుపొర నుంచి తట్టుకొని "ఈ దాసుణ్ణి మీకు అప్పగించిన " నన్ను బందాల్నుంచి తప్పించిన్రు. ఇంతవాణ్ణి చేసిన్రు. ఈ దాసుడు మీవాడు. మీరేమన్న చేసుకోండి , నే నొద్దనను."
మరొకసారి దగ్గుతెర తెరిపి ఇవ్వకుండా వచ్చింది. గిజగిజ తన్నుకున్నాడు గురవయ్య. నాంచారమ్మ, నారాయణస్వామి అతణ్ణి పట్టుకుంటే వళ్ళు మసిలి పోతుంది. ఇద్దరూ తీసికెళ్ళి గురవయ్య వద్దన్నా వినకుండా మంచంలో పడుకోబెట్టారు. నారాయణస్వామి కుప్పె అరగదీసి గురవయ్యతో నాకించాడు. గురవయ్యకు నిద్రపట్టింది.
గురవయ్య కోసం పిచ్చమ్మ వచ్చింది. ఇక్కడే ఉంటాడని నారాయణస్వామి చెపుతే చిన్నబుచ్చుకొని పోయింది.
తెల్లవారి రామక్రిష్ణయ్య దగ్గర పొలం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాడు నారాయణస్వామి. బండి కట్టించి గురవయ్యను తీసుకొని కదిలారు. ఊరు సాంతం బండి వెంట సాగింది. అందరికీ దండాలు పెట్టి శలవు తీసుకున్నాడు గురవయ్య.
కన్నీరు జలజలా రాల్చి సాగనంపింది పిచ్చమ్మ.
గురవయ్య మాత్రం చలించలేదు. "పిచ్చీ? ఎందుకు కేడుస్తవు? నువ్వెవరు? నేనెవరు? ఎక్కడ కలిసినం? ఎక్కడ విడిపోతం? ఎవని కేరిక! అన్నగారున్నరు వదినగారున్నరు. వాళ్ళు మనకు దేవుళ్ళు. వాళ్ళు చెప్పినట్లు ఇనాలే. వచ్చే ఆపదను ఎవరు ఆపలేరు. అందుకు తయారుగుండు , ఏడవకు పిచ్చీ!' గురవయ్య మాటలు నిశ్చలంగా ఉన్నాయి. ఆ వేగం, దుఃఖం ఎక్కడా కనిపించలేదు. ఆ మాటలు భార్యకు చెప్పుతున్నట్లుగా లేవు. ఎవరికో చెపుతున్నట్లున్నాయి. ఆ నిగ్రహానికి నారాయణస్వామి ఆశ్చర్యపోయారు!
పట్నం చేసి క్షయ ఆస్పత్రిలో చేర్పించారు నారాయణస్వామి. అక్కడి డాక్టరు నారాయణస్వామికి శిష్యుడు. గురవయ్య కధ విని స్వామి విషయంలో భక్తీ ఇనుమడించింది డాక్టరుకు. గురవయ్య విషయంలో కూడా ఆదరం ఏర్పడింది డాక్టరుకు. గురవయ్యను డాక్టరుకు అప్పగించి బయలుదేరుతున్న నారాయణస్వామిని చూచి అన్నాడు గురవయ్య ----
"అన్నగారూ! మీ ఋణం ఎన్ని జన్మలకు తీర్చుకుంట?"
"గురవయ్యా! " స్వామి కంఠం రుద్డం అయింది. "గురవయ్యా! నీకు మరో జన్మ లేదయ్యా" స్వామి కన్నీరు జలజలా రాల్చారు. డాక్టరు సహితం కంట తడి పెట్టాడు.
నారాయణస్వామి బలవంతంగా సాగిపోయారు.
గురవయ్య అటు చూస్తూ ఉండిపోయాడు.
16
రైలు పట్నం చేరింది.
నారాయణస్వామి దంపతులు, పిచ్చమ్మ రైలు దిగారు. వారు క్షయ వైద్యశాలకు చేరుకున్నారు. వేప చెట్ల కింద మౌనంగా కూర్చున్నారు. ఇంకా లోనికి వెళ్ళే సమయం కాలేదు. స్వామి తెలుసుకుని వచ్చారు - గురవయ్య స్థితి ఏమంత బావుండలేదని చెప్పారు. గురవయ్య జీవించి ఉన్నందుకు ముగ్గురూ మనసుల్లోనే సంతోషించారు. అతన్ని చూడాలనే ఆతురత ముగ్గురికి ఉంది.
లోనికెళ్ళే వేళకాగానే ముగ్గురూ లోనికి వెళ్ళారు.
గురువయ్య మంచంలో పడి వున్నాడు. బాగా చిక్కి శల్యం అయినాడు . బుట్టలో పొగాకు కాడలా కనిపించాడు.
పిచ్చమ్మ గొల్లుమంది, నారాయణస్వామి ధైర్యం చిక్కబట్టారు. నాంచారమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి.
"గురువయ్యా! ఎట్లున్నది ?" స్వామి అడిగారు.
"ఇట్లున్న. కండ్లపడుతున్నదిగద" అని చేతులు జోడించి "మీ దర్శనం అయింది చాలు. " అన్నాడు కళ్ళలో ఒక వెలుగు కనిపించింది. పిచ్చమ్మ మంచం కోడు పట్టుకొని నేలమీద కూర్చుంది.
"దగ్గు సాంతం తగ్గిందండి . జ్వరం మాత్రం వదలడం లేదు. మందులెం పనిచేస్తున్నట్లు లేవు" డాక్టరు అన్నాడు.
"అన్నగారూ! భాగవతం పూర ఇనందిపోను. నన్నిక్కడ తెచ్చి పడేసిన్రు? ఏం బాగుంట చెప్పండి."
"అట్లనకు గురువయ్యా! బాగవుతావు" చెప్పడానికి చెప్పింది నాంచారమ్మ కాని గురువయ్యను చూస్తే గుండె చేరువైంది -----ఎక్కడో కళ్ళల్లో ఉన్నాయి ప్రాణాలు. రోజులు లెక్క పెడుతున్నట్లనిపించింది. అంతే చాలు ప్రాణంతో కనిపించాడు అనుకుంది.
"ఏం బాగయితలేరి! అయిన మన చేతులేమున్నదంటరు" అన్న గురవయ్య "అన్నగారూ ఒక్క పద్యం ఇనిపించండి - ఎన్నాళ్ళయే!" అని అర్ధించాడు.
గురవయ్య ఆర్తికి స్వామి అబ్బురపడ్డారు. వారి గుండె పొంగింది. అటూ పోటు వచ్చాయి. స్వామి కనులు తడిశాయి. గొంతు రుద్డం అయింది - పద్యం అందుకున్నారు ---
లావొక్కింతయి లేదు, ధైర్యము విలోలంబయ్యె, బ్రాణంబులున్
ఠావుల్ దప్పెన్ . మూర్చవచ్చే, దనువున్ డస్సెన్ , శ్రమంబయ్యెడిన్ .
నీవే తప్ప నితపరంబెరుగ . మన్నింపన్ దగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మకా"
చేతులు జోడించి ఆకాశానికి మొక్కి పద్యం ముగించారు స్వామి. అప్పటికి కన్నీరు చెంపల మీది నుంచి జారింది.
పద్యం చదువుతుంటే గురువయ్యలో ఏదో చైతన్యం వస్తున్నట్లు కనిపించింది డాక్టరుకు. సిరంజి ద్వారా నరాల్లోకి రక్తం పోతున్నట్లు పుంజుకుంటున్నాడు గురువయ్య.
"ఆహా! అన్నగారూ! నా ఆత్మ ధన్యమైంది." అన్నాడు గురవయ్య. అతని ధ్వని శక్తి వంతంగా ఉంది ----పూర్వం కంటే ఎంతో బలంగా ఉంది. ఏదో విశ్వాసం కలిగినట్లుంది.
గురవయ్య లేచి మంచంలో కూర్చున్నాడు.