Previous Page Next Page 
ఆఖరి మలుపు పేజి 30


    "మాస్టారూ...."


    "ఇంక ఈ విషయంలో మనం మాట్లాడుకునేది ఏమీ లేదు."


    కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు కృష్ణాజీ.


    తర్వాత అన్నాడు -


    "ఒక్క విషయం చెప్పండి....దాన్ని బట్టి నేను అంతా గ్రహిస్తాను. రాజా పోషణ కోసం నేను మీకు యిచ్చిన డబ్బు....


    మళ్ళీ వేదాంతంగా నవ్వాడు ఆనందరావు.


    "మీకు ఆ డబ్బు ముఖ్యం కాదనీ, నా గురించే మీరు బాధపడుతున్నారనీ నాకు తెలుసు! కానీ మీ డబ్బుని నేను భద్రంగా ఉంచలేకపోయాను. తల తాకట్టు పెట్టి అయినా ఆర్నెలల్లో మీ డబ్బు మీకు అప్పగించేస్తాను" అన్నాడు.


    అవసరం లేదన్నట్లు తల ఆడించాడు కృష్ణాజీ.


    అతనికి అంతా అర్థం అయినట్లే ఉంది.


    మాస్టారి తల పగలగొట్టి, డబ్బు తీసుకుపారిపోయి ఉంటాడు రాజా.


    కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టినా దానికి కుక్క బుద్ధి పోతుందా?


    ఈ మాస్టారు మంచివాడు కాబట్టీ, మానవత్వం ఉన్నవాడు కాబట్టీ రాజాని ప్రొటెక్ట్ చెయ్యాలని చూస్తున్నాడు. తప్పు తన మీదే పెట్టుకుంటున్నాడు.


    మళ్ళీ అన్నాడు మాస్టారు.


    "నేనే యింకొంచెం జాగ్రత్తగా ఉండి వుండవలసింది. చాక్లెట్ల పొట్లాం తెచ్చి పిల్లవాడి ఎదురుగా పెట్టి తినొద్దురా అంటే ఊరుకుంటాడా? డబ్బు సంగతీ దాదాపు అంతే."


    నిట్టూర్చాడు కృష్ణాజీ.


    "సర్! అర్థమయ్యింది! ఆపాత్రదానం చెయ్యబోయాను. అందువల్ల మీకు యిబ్బంది కలిగింది. సిగ్గు పడుతున్నాను. నన్ను క్షమించండి." అన్నాడు.


    చల్లగా నవ్వాడు ఆనందరావు.


    "నేను సాయంత్రం వెళ్ళిపోతున్నాను సర్! మనస్ఫూర్తిగా నన్ను క్షమించమని కోరుకుంటున్నాను" అన్నాడు కృష్ణాజీ.


    "వెళ్ళిరండి బాబూ! మీలాంటి మంచివాళ్ళని దేవుడు చల్లగా కనిపెట్టి వుండాలి. నన్ను గురించి మీరేం బాధపడకండి" అన్నాడు ఆనందరావు.


    కృష్ణాజీ వెళ్ళిపోగానే మాస్కు తీసేసినట్లయింది మాస్టారి మొహం.


    కృష్ణాజీ వెళ్ళినవైపే పరిశీలనగా చూస్తూ ఉండిపోయాడాయన.


    బయటకు వచ్చిన కృష్ణాజీకి వంట్లో రక్తం సలసల కాగిపోతున్నట్లయ్యింది.


    'బాస్టర్డ్' అనుకున్నాడు ఆగ్రహంగా. "బ్లడీ బాస్టర్డ్!" ఎంత ధైర్యం వీడికి. వీణ్ణి బాగుచేద్దామని తను చూస్తే తనకే టోకరా యిస్తాడా? గురువుకి పంగనామాలు పెట్టి పారిపోతాడా! పోతూ పోతూ బుర్ర పగలగొట్టి వెళ్ళిపోతాడా?


    బ్లడీ ఫెలో! ఈసారి వీడు తన కంట బడాలి. కాళ్ళూ చేతులూ విరగ్గొట్టేస్తాడు తను. సున్నంలోకి ఎముక లేకుండా చితక్కొడతాడు.


    పోలీసులతో లాలూచే పడి పెరుగుతున్న వెధవ వీడు.


    పోలీసుల థర్డ్ డిగ్రీ మెథడ్స్ అంటే ఏమిటో వీడికి తెలిసి ఉండవు.


    చూపిస్తాడు తను.


    పోలీసు బ్రూటాలిటీ అంటే తనకు అలర్జీ.


    కానీ వీణ్ణి మాత్రం నరికి పోగులు పెట్టినా తప్పులేదేమో!


    మనసు మండిపోతుంటే, యాంత్రికంగా పనులు మిగించుకుని, కొత్త ప్లేస్ కి వెళ్ళాడు కృష్ణాజీ.


    ఆ రాత్రికి పోలీస్ క్లబ్ లోనే ఉండిపోయాడు అతను.


                                                    *    *    *    *


    కృష్ణాజీని కలుసుకోవడానికి వచ్చాడు రాజా.


    కానీ ఆయన యింకా అప్పటికి ఇంకా డ్యూటీలో జాయిన్ కాలేదని తెలిసింది.


    ఓపిగ్గా కాచుకున్నాడు రాజా. కడుపులో ఆకలి మండిపోతోంది. జేబులో డబ్బుల్లేవు. ఇంకెవరి జేబన్నా తడమొచ్చుగానీ, అలా చెయ్యడానికి మనసు రావడం లేదు. దేవుడిలాంటి మనిషిని చూడడానికి వచ్చాడు తను. ఇక్కడ దయ్యపు చేష్టలు చేయకూడదు.


    రాత్రికి కృష్ణాజీ వచ్చాడు. తనకోసం టెంపరరీగా ఒక గెస్ట్ హౌస్ లో రూం బుక్ చేయించుకున్నాడు.


    వెళ్ళీ వెళ్ళగానే లాన్ లో కూర్చున్నాడు కృష్ణాజీ. విస్కీ ఆర్డర్ చేశాడు.


    పెగ్గు మీద పెగ్గు తాగడం మొదలెట్టాడు.


    "హలో ఓల్డ్ బాయ్!" అంటూ అతని దగ్గరికి వచ్చాడు దివాకర్ రెడ్డి. దివాకర్ రెడ్డి కృష్ణాజీకి కొలీగ్. వాళ్ళిద్దరూ కొన్నేళ్ళ క్రితం కడపలో కలిసి పని చేశారు. రెడ్డి చేతిలో కూడా గ్లాసు ఉంది.


    కుశల ప్రశ్నలు అడిగాడు రెడ్డి.


    కృష్ణాజీ అంటీ ముట్టనట్లు సమాధానాలు చెప్పాడు.


    అది గమనించి ఆశ్చర్యంగా అడిగాడు రెడ్డి.


    "కృష్ణాజీ! ఏమయింది నీకు? యు ఆర్ నాట్ యువర్ యూజువల్ సెల్ఫ్! అన్నాడు నిశితంగా చూస్తూ. సాధారణంగా అయితే కృష్ణాజీ మిన్ను విరిగి మీద పడినా చలించనట్లు ఉండే రకం మనిషి. మనసులో ఏమున్నా పైకి మాత్రం కనబడనివ్వని మనిషి.


    అలాంటి కృష్ణాజీ ఇవాళ యింత అన్యమనస్కంగా వున్నాడు. చిరచిరలాడుతున్నాడు. ఎందుకని?


    "ఏమయ్యింది కృష్ణాజీ?" అన్నాడు రెడ్డి మళ్ళీ. అతని గొంతులో అభిమానం ధ్వనిస్తోంది.

 Previous Page Next Page