హాస్పిటల్లో ఉదయం వెళ్ళి కూర్చోడం మొదలుపెట్టాక కేశవరావుగార్కి ఉదయం పూట బాగానే కాలక్షేపం అవుతుంది. మొదటిరోజు హరిజనవాడ నుంచి ఇద్దరు ముగ్గురు పేషంట్లు భయం భయంగా చూస్తూ వచ్చారు. అందులో ముసలివాడు విడవకుండా ఒకటే దగ్గుతున్నాడు. పేషంటుని పరిక్షించకముందే ఆయనకి టి.బి.అన్న అనుమానం కల్గింది ఆ దగ్గు వింటుంటే. ఛాతి పరీక్ష చేసి, చెస్ట్ ఎక్స్ రే తీసేసరికి జబ్బు ముదిరిందన్నది స్పష్టమైంది. అంత బీదవాడికి బలమైన ఆహారం, పాలు, పళ్ళు లాంటివి తిను అని చెప్పి లాభం లేదు. మందులైతే తను యివ్వగలడు. వట్టి మందులతో లాభంలేదు అని ఆలోచించి డిస్ట్రిక్ హెడ్ క్వార్టర్ ఆస్పత్రి అధికారికి ఇన్ పేషెంటుగా చేర్చుకోమని కోరుతూ రికమండేషన్ ఉత్తరం యిచ్చి అక్కడ ఆస్పత్రిలో జాయిన్ చేయమని చెప్పి పంపారు రెండు మూడు రోజులకి సరిపడ మందులు యిచ్చి. రెండో ముసలామెకి రోజూ సాయంత్రం అయిందగ్గరనించి చలిజ్వరం, ఉదయం పూట దగ్గుతూంటుంది. మలేరియా అనిపించి మలేరియా మందులు యిచ్చారు. ఒకామెకి గైనిక్ ప్రాబ్లమ్. చెప్పిన లక్షణాలనుబట్టి యూటెరస్ పై ఫైబ్రాయిడ్ అయివుండచ్చు. అందుకే బ్లీడింగు అవుతుంది అన్పించింది. గైనిక్ కేసులు బొత్తిగా అనుభవంలేదు ఆయనకి. ఒక లేడీ డాక్టరుని అపాయింట్ చేసుకోవాలి తప్పదు అన్పించింది ఆ క్షణంలో. నర్సు విమలకి డెలివరీల అనుభవం వున్నందున పి.వి. చేసి చూసి ఫైబ్రాయిడ్స్ వున్నాయన్న అనుమానం వ్యక్తం చేసింది. ఇప్పుడే ఆపరేషన్ అవసరంలేదు. మందులతో బ్లీడింగు తగ్గచ్చు అని పదిరోజుల వరకు మందులు ఇచ్చి పంపారు. వారం రోజులకే అక్కడ లేడీ డాక్టర్ తప్పనిసరి అన్నది అర్థం అయింది ఆయనకి. మగవారికంటే స్త్రీల కేసులే ఎక్కువ. నెలతప్పిన వారు, బ్లీడింగు కేసులు ఆడవారిలో ఎక్కువ. గైనకాలజీలో బొత్తిగా ఆయనకి అనుభవం లేకపోవడం ఒకటి. రెండు స్త్రీలు అసలు ఆయనతో ఆ విషయాలు చెప్పడానికి బిడియపడి సిగ్గుతో ముడుచుకుపోయేవారు.
"ఒక లేడీ డాక్టరు కావాలి మనకు నర్సు" కేశవరావు అన్నారు పేషెంట్లు వెళ్ళాక..
"అవును సార్. ఏదో పురుళ్ళు అంటే నేచూడగలను గాని మిగతా పరీక్షలకి, హఠాత్తుగా ఏదైనా సిజేరియన్ చెయ్యాల్సివచ్చినా లేడీ డాక్టరు అవసరం వుంది. ముందు ముందు ఈ వూరేకాక చుట్టుపక్కలవాళ్ళూ వస్తారు. మంచి డాక్టరు వూరికే చూస్తారంటే డాక్టరు తప్పనిసరే అనిపిస్తూంది" నర్సు విమల కూడా అంగీకరించింది.
"పొరపాటు చేశాను. నర్సుల కోసం ప్రకటన ఇచ్చినప్పుడే లేడీ డాక్టరుకి కూడా ప్రకటన ఇవ్వాల్సింది. సరే మళ్ళీ పేపర్లో వేయిద్దాం."
"డాక్టర్... నేను రిటైరయ్యాక యిక్కడికి వచ్చేవరకు ఓ ప్రయివేటు నర్సింగ్ హోమ్ లో నాలుగు నెలలు ఉద్యోగం చేశాను. అందులో పాపం ఒక కొత్తగా పాసయిన అమ్మాయి ఎక్కడా ఉద్యోగం దొరక్క షిప్టు డ్యూటి డాక్టరుగా అతి తక్కువ జీతంలో చేరింది. పాపం ఆట్టేవున్న సంసారం కాదు. తల్లి, తమ్ముడు బాధ్యత - జీతం చాలడంలేదని వాపోయేది. మంచి అమ్మాయి. నెమ్మదయినది. పని తెల్సిన అమ్మాయి. ఆ అమ్మాయిని అడిగితే వస్తుందేమో. రాయనా సార్..."
"ఈ పల్లెటూరికి రావడానికి అంగీకరిస్తుందా... అక్కడ ఎంత జీతం యిచ్చేవారు? మనమూ మరీ ఎక్కువ ఇవ్వలేం గదా. పదిహేనువందలవరకు పరవాలేదు."
"అయితే తప్పకుండా వస్తుంది సర్ - పాపం అక్కడ పట్టుమని ఎనిమిదివందలిచ్చేవారు. నర్సులకంటే తక్కువ ఇస్తున్నారు అంటూ బాధపడేది. కొత్తగా పాసయిందని అనుభవంలేదని అవసరంలో వుందని గ్రహించి ఎనిమిదివందలకే ఉద్యోగం యిచ్చారు. పదిహేనువందలంటే తప్పక రావచ్చు. సిటీలో కంటే ఖర్చులు తక్కువ కదా ఇక్కడ. రాసి చూస్తాను వస్తానంటే సరే, లేదంటే అప్పుడే పేపరులో వేద్దురుగాని."
"సరే. వెంటనే రాసి వప్పుకుంటే వెంటనే వచ్చి చేరమను."
* * *
"ఏమండీ పద్మావతిగారూ! అన్నపూర్ణగార్కి మనం ఈ నెల నుంచి ఒక చిట్టి పథకం ప్రారంభిద్దామా. ఆడవాళ్ళకి, ముఖ్యంగా కూలీ నాలీ చేసుకునే వాళ్ళందరికీ నెలకోసారి పాడి ఆ డబ్బు చేతికివస్తే ఏదన్నా సామాను, బట్టలు ఏమన్నా కొనుక్కునే వీలు కల్పించినట్లవుతుంది. ఈ వూర్లో కనీసం ఏభయ్ మందన్నా నెలకో యాభయ్యో, వందో కడితే చీటీ తీద్దాం ప్రతినెలా. ఎవరి పేరు వస్తే వాళ్లకి ఆ డబ్బు యిద్దాం.
ఇది ఉన్నవారి కోసం కాదు అనుకోండి. కానీ మనమూ డబ్బు కడుతున్నాం అంటే వాళ్ళకీ ఉత్సాహం వుంటుంది. చీటీ డబ్బు మూడు నాలుగు వేలు ఓసారి చేతికివస్తే వున్న ఆడవాళ్ళకి ఏ పట్టుచీరో ముచ్చట తీర్చుకోవచ్చు. లేనివాళ్ళకి ఏదన్నా పనికి, వస్తువుకి పనికొస్తుంది.
"ఆ... ఆ... కడదాం. అసలు నేనే అడగాలనుకున్నాను" అన్నపూర్ణమ్మ ఉత్సాహంగా అంది.
"కానీ... పాపం ఈ కూలీనాలీ చేసుకునేవారికి ఏభయ్ రూపాయలన్నా ఎక్కువేగదా. వాళ్ళు కట్టగలరో లేదో" సుగుణ అంది.
"అడిగి చూద్దాం... ఏ నెలన్నా ఎవరన్నా కట్టకపోతే వాళ్ళ వంతు నేను కట్టి డబ్బు వాళ్లకి వచ్చినప్పుడు తీసుకుంటానని చెపుతా."
"అడిగి చూడండి. అంతా ఒప్పుకుంటే మేం రడీ..." అంది పద్మావతి.
"ఇదొక పొదుపు పథకం. రోజుకో రూపాయి రెండు చూపున వాళ్ళు దాస్తే చాలు. మగాళ్ళకి తెలియని ఎన్నో ఖర్చులుంటాయి మనకు. ఈ విధంగా కాస్త పెద్ద మొత్తం వాళ్ళ చేతికి వస్తే సాయంగా వుంటుంది పాపం. ఆ తరువాత మనం అందరం కల్సి ఓ మహిళా మండలిలా ఏర్పడి ఏదన్నా మంచి పనులు చెయ్యాలి. అందరం కల్సి ఏమన్నా వస్తువులు చేసి అమ్మడం లాంటివి- అంటే అప్పడాలు, వడియాలు, ఊరగాయలు, పొడులు చేసి మార్కెట్ లో అమ్మకానికి యిస్తే ఆ లాభాలు అంతా పంచుకోవచ్చు.
చూడండి మనం సంపాదించింది ఎంత చిన్నమొత్తమైనా మనమూ సంపాదించగలం అన్న ఆత్మస్థయిర్యం స్త్రీలకు రావడం ముఖ్యం. ప్రతిదానికి భర్తమీద ఆధారపడకుండా మనకి కాస్త చేతిలో ధైర్యంగా ఉంటుంది. కొన్ని సమయాల్లో మగాళ్ళ ముందు ఆత్మాభిమానం కాపాడుకోవాలంటే ఆర్ధిక స్వాతంత్ర్యం వుండాలి. అంతేకాక ఖర్మవశాత్తు భర్త చనిపోతే ఆ స్త్రీలు రోడ్డున పడకుండా సంపాదనా శక్తి వారికుంటే వారి పరిస్థితి దైన్యంగా మారకుండా ఆదుకుంటుంది. అంచేత కాస్తో కూస్తో డబ్బు పొదుపు చేయడం ఒకటి, తరువాతనయినా ఏదో ఒక పని చేసి తమకంటూ ఆర్జన ఉండడం చాలా అవసరం. ఇవన్నీ మనం అందరికీ చెప్పి వీలయినంతమందిని ఈ పొదుపు కార్యక్రమంలో చేర్చాలి...
ప్రభుత్వం కూడా మహిళలు తమ కాళ్ళమీద తాము నిలబడేందుకు అనేక రకాల చేతి పనులు, కుటీర పరిశ్రమలు ప్రోత్సహించి మహిళలు తయారుచేసే వస్తువులకి చిన్న మొత్తాలు ఋణాలు ఇప్పించి, తయారుచేసిన వస్తువులని వారికివారే అమ్ముకునేందుకు 'డ్వాక్రా' మేళాలు నిర్వహించి ప్రోత్సహిస్తుందని చదివేను. మన ఆడవాళ్ళం అందరం కల్సి ఏంచేద్దామో ఆలోచించి చెప్పండి.
'లిజ్జత్ అప్పడాలు' అనే సంస్థ బొంబాయిలో మామూలు గృహిణులు ఆరంభించి యిప్పుడు ప్రసిద్ధ కంపెనీ స్థానానికి ఎదిగింది. మన ఆంద్రపచ్చళ్ళకి, ఊరగాయలకి పెట్టింది పేరు! ఇక్కడ మంచి రకం మామిడికాయలు, మిరపపళ్ళు, చింతకాయ, నిమ్మకాయ లాంటివి దొరికేచోట మనం పచ్చళ్ళు తయారుచెయ్యొచ్చు.
ఏ సీజన్లో దొరికే వాటితో ఊరగాయలు, పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు, పొడులు తయారు చేయవచ్చు. తయారుచెయ్యడం అంత కష్టంకాదు. వాటిని అమ్మడం అంటే మార్కెట్ చేయడం కష్టం. మన డాక్టర్ గారికి ఉన్న పెద్ద కాంట్రాక్ట్స్ ఉపయోగించి మనకేమన్నా సహాయం చేయగలరేమో చూద్దాం. ముందు మనం అందరం ఒక మాటమీద నిలబడి చేద్దాం అన్నది నిర్ణయించుకోవాలి..." రాజేశ్వరి మాట పూర్తికాకుండానే అందరూ ఉత్సాహంగా చప్పట్లుకొట్టి 'చేద్దాం...చేద్దాం... తప్పకుండా చేద్దాం' అన్నారు ముక్తకంఠంతో.
"ఇది ఆరంభ శూరతం కాకూడదు! నాలుగురోజులు సరదాగా చేసి మానేయడం చేస్తే లాభం మాట దేవుడెరుగు నష్టాల్లో పడతాం. ఇది ఏ ఒక్కరి వల్ల అయ్యేది కాదు... కనీసం పది పదిహేను మంది కల్సి చెయ్యాల్సిన పని. ఆడవాళ్ళు ఇంటిపని అయ్యాక పదిహేనుమంది కల్సి చెయ్యాల్సిన పని. ఆడవాళ్ళు ఇంటిపని అయ్యాక ఉదయమో, మధ్యాహ్నమో కూర్చుని పెద్ద మొత్తంలో చెయ్యాలి. పచ్చళ్ళు పెట్టడంలో అనుభవం వున్న పెద్దవాళ్ళ సాయం కావాలి.
ముడి సరుకులు, కారం, నూనె, మసాలా దినుసులు పెద్దమొత్తంలో ఒకేసారి కొనాలి. మన పచ్చళ్ళు మొదట్లో పేరు వచ్చాక కొద్దిగా ప్రారంభించినా విజయవాడ, హైదరాబాదు లాంటి నగరాల్లో అమ్మకాలు జరిగి పేరు వస్తే, అమ్మకాలు పెరిగితే ఎక్కువ మొత్తాలలో చెయ్యాలి. మొదటిరోజు ఎలాంటి ప్రత్యేకతలు తీసుకుని శ్రద్ధగా చేస్తామో ఆ క్వాలిటీ ఎప్పుడూ ఒకలా నిలబడితేనే మన ప్రొడక్టు నిలబడుతుంది. అంచేత ఇంటికెళ్ళి మీ మగవాళ్ళతో కూడా ఆలోచించి నిర్ణయం తెలపండి..." అంతా తలలూపారు.