"పోటీలేమిటి సార్?" అడగొచ్చో అడక్కూడదో అనుకుంటూ అడిగింది వందనాదేవి.
"గుండూరావ్ చిన్న గూండా. చిన్న చిన్న వాళ్ళందరిని మోసం చేస్తుంటాడు. వాళ్ళచేత మోసాలు, దొంగతనాలు చేయిస్తుంటాడు. వాడిని ఏదన్నా చేద్దామంటే కుదరకుండా వుంది. లైసెన్స్ సంపాదించాడు. పబ్లిక్ బజారులో పందాలు పెడుతూ వుంటాడు" అంటూ వాడు ఎలాంటి పందాలు నిర్వహించేది చెప్పాడు విశ్వనాథరెడ్డి.
"వాడిపేరు గుండూరావ్ సార్! విషయం ఇప్పుడు అర్థమైంది. నాల్రోజుల క్రితం నేను వాడిని నేరేడుపళ్ళ పోటీలో ఓడించాను. సుందరి సుకుమారి చెబుతుంటే "నేరేడుపళ్ళ పోటీయా!" అని అనబోయాడు ఇన్ స్పెక్టర్ విశ్వనాథరెడ్డి.
"నువ్వుండు నేను చెబుతాను" సుందరికి అడ్డు తగిలి ఆరోజు ఊహించని విధంగా సుందరి గబుక్కున "పోటీలో పాల్గొంటానని చెప్పటం...తప్పనిసరై పోటీలో పాల్గొంటం జరిగింది. ఆ పోటీలో సుందరి పదివేల రూపాయలు గెలుచుకుంది." అంటూ జరిగిందంతా ఒక్కమాటా పొల్లుబోకుండ చెప్పింది వందనాదేవి.
సుందర సుకుమారి వైపు ఆశ్చర్యపోతూ చూశాడు ఇన్ స్పెక్టర్ విశ్వనాథరెడ్డి.
"వాళ్ళెవరన్నది హోటల్లో ఎందుకుండాల్సి వచ్చింది" వివరంగా అడిగాడు.
"పోలీసులతో వ్యవహారం. విషయం దాయకుండా చెప్పడం మంచిది" అనుకున్న వందన తాము నలుగురు జర్నీ చేస్తూ బెంగుళూరు రావటం...ఈ హోటల్లో దిగటం వరకు వివరంగా చెప్పింది. కాకపోతే మూడు విషయాలు మాత్రం దాచింది.
ఒకటి...
"ఇంట్లో వాళ్ళు మొదట ఈ ప్రయాణానికి ఒప్పుకోలేదు."
రెండు...
"తమతోపాటు ఓ వికృత స్వరూపుడు ప్రయాణమై ఇక్కడిదాకా వచ్చాడన్న సంగతి."
మూడు...
"ఓ అందమైన కుర్రాడు కూడా తమ వెన్నంటే తిరుగుతున్నట్టుగా అనుమానంగా ఉందని."
ఇప్పుడున్నది చాలక కొత్త విషయాలు కూడ దేనికని చెప్పలేదు వందన.
"మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తుంటే ఇది ఈ పంకజం పనికాదు గుండూరావ్ గాడి పనే. పదివేల రూపాయలు మిస్ సుందర సుకుమారి గారు పోటీలో గెల్చుకొని ఉచితంగా కొట్టేయడం వాడికి సహజంగానే మంట కలుగజేసింది. ఆ పదివేల రూపాయిలు తిరిగి పొందడానికి ఈ పంకజాన్ని మీ వెనకనే పంపించి ఉంటాడు. ఇది నాల్రోజుల పాటు మీ నీడలా తిరిగి మీరీ హోటల్లో దిగినట్టు...నలుగురే ఉన్నట్టు__ఎక్కడెక్కడికెళ్ళేది, ఏం చూసేది అన్నీ తెలుసుకొని వాడికి చెప్పి ఉంటుంది.
"గుండూరావ్ గాదు తేలికైన పథకం వేసి తెలివిగా దీన్ని పంపించాడు. ఆంధ్రా ఆడపడుచులాగా నటిస్తూ ఇది మిమ్మల్ని బానే మోసం చేసింది. కాకపోతే చిక్కిపోయింది అంతే" అని చెబుతూ పంకజం వైపు తిరిగి "ఏమే! నేను చెప్పిందంతా నిజమేనా! లేకపోతే మంత్రదండం ప్రయోగించాలా!" ఇన్ స్పెక్టర్ విశ్వనాథ రెడ్డి కరుగ్గా అడిగాడు.
వెంటనే ఒప్పేసుకొంది పంకజం. ఈ ఆడపిల్లల దగ్గర మన డబ్బు కాక వాళ్ళ డబ్బు నగలు తేవటానికి మగాళ్ళు అక్కరలేదు. కళ్ళు కప్పడానికి నువ్వు చాలే పంకజం!" అన్నాడు దాంతో నేను ఒప్పుకొని ఇక్కడిదాక వచ్చాను."
ఇన్ స్పెక్టర్ విశ్వనాథ రెడ్డి ఎంత మంచివాడో, డ్యూటీ విషయంలో అంత కఠినుడు. మంత్ర దండమంటే లాఠీ. దెబ్బ శరీరం మీద కనబడకుండ లాఠీ ప్రయోగించడంలో సుప్రసిద్ధుడు. ఎంత పెద్ద వాళ్ళయినా సరే దొరికిపోతే నేరం ఒప్పుకోవాల్సిందే.
"పంకజం నేరం ఒప్పుకొంది. గుండూరావ్ గాడే ఇలా చెయ్యమన్నాడని పంకజమే చచ్చినట్టు సాక్ష్యమిస్తుంది. జరిగిందంతా మీరు రిపోర్ట్ రాసివ్వాలి. దానివల్ల గుండూరావ్ ని కూడా మూసెయ్యడానికి కుదురుతుంది. వాడిని పట్టాలని ఎన్నివిధాలో చూశాను. కుదరలేదు. తెలివిగా వ్యాపారం చేసేవాడు కూడా ఎప్పుడో ఒకరోజు తలక్రిందులుకాక తప్పదు. నిజంగా మీవల్లనే గుండూరావ్ గాడు నాచేతికి చిక్కాడు. ముఖ్యంగా మిస్ సుందర సుకుమారి గారివల్ల" అన్నాడు ఇన్ స్పెక్టర్.
గుండూరావ్ గాడిని అవలీలగా కేసులో ఇరికించగలిగే సమయం వచ్చినందుకు ఇన్ స్పెక్టర్ విశ్వనాథ రెడ్డి చాలా సంతోషించాడు.
సుందర సుకుమారితో పాటు మిగతా ఫ్రెండ్స్ ని కూడ పొగిడాడు. మధ్య మధ్య పోలీసు బుద్ధి పొనిచ్చుకోకుండ "ఆడపిల్లలు ఇంత సాహసం చేయడం తగదని...ఆడవాళ్ళు సాహసాలు చెయ్యవచ్చుగాని రకరకాల దొంగలు__మోసగాళ్ళు__స్మగ్లర్లు ఉన్న ఈ దేశంలో అడ్డమైనవాళ్ళని ఢీకొనే ప్రయత్నం చెయ్యకూడదని పంకజం లాంటి వారి రూపం చూసి మోసపోవద్దని" సన్న సన్నగ చివాట్లు కూడా పెట్టాడు.
"మేం స్టేట్ మెంటు రాసిస్తే వాళ్ళవల్ల ఏమీ ప్రమాదం ఉండదు కదా!" ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తతో అడిగింది వందనాదేవి.
"వాడిని__వాడి తాలూకా వాళ్ళని తెల్లారేసరికి కటకటాలవెనక్కి తోస్తున్నాను. ఇప్పుడిప్పుడే వాళ్ళు బైటికొచ్చే పనిలేదు. కేసు బలంగా ఉండటానికి మాత్రమే జరిగింది జరిగినట్టు రాసిమ్మన్నాను. దీనివల్ల మీకు ఎటువంటి ప్రమాదము లేదు" వివరించాడు ఇన్ స్పెక్టర్ విశ్వనాథ రెడ్డి.
కొద్ది సేపట్లోనే అన్నీ పూర్తయ్యాయ్. పంకజాన్ని తీసుకుని పోలీసులతో ఇన్ స్పెక్టర్ విశ్వనాథ రెడ్డి అక్కడ్నించి వెళ్ళిపోయాడు. బయట నుంచుని ఇదంతా వింటున్న ఆ హోటల్ లోని వాళ్ళు ఒక్కొక్కరే లోపలికి వచ్చి వీళ్ళందరిని అదేపనిగా అభినందించి వెళ్ళారు.