జానకి ఏమి అనలేదు. అతని వక్షంలో తలదాచుకుంది.
"పత్రిక వస్తూంది" ఈ వార్త మెల్లమెల్లగా ఇంటింటికీ పాకింది. ఏదో భయంకరమైన వస్తువు వస్తున్నట్లు బెదిరిపోయారు కొందరు. ఏదో వెలుగు వస్తూందనీ ఊళ్ళోకి ఉషస్సు ప్రవేశిస్తుందనీ ఆనందించారు కొందరు.
ఈ వార్త తాసిల్దారు చెవిన పడింది. కోపం వచ్చి ఉగ్రుడు కావలసిన వాని గుండెలో గుబులు చేరింది. గుండె గుబ గుబలాడింది. అది అతని జీవితంలో మొదటిసారి. ఆ భయంలో అతనికి ఏమీ అర్థం కాలేదు. ఏం చేయాలో తోచలేదు. అసలు పత్రిక ఏమిటో అతనికి తెలియదు. అదేదో పాములాంటి దనిపించిందతనికి. అది పడగవిప్పి తన ఇంట్లోకి దూరుతున్నట్లనిపించింది. ఏం చేయాలి? ఎందుకిలా తాను నీరసించి పోతున్నాడు? తలగోక్కున్నాడు. ఎంతో ఆలోచించాడు. ఏమీ తోచలేదు. గిర్దావరునూ, అమీన్ను పిలిపించాడు.
"బొక్క లిరగ్గొట్టి కొట్ల ఏస్తే సరిప్పోతది." అమీను తన కసినంతా వెళ్ళగ్రక్కాడు.
గిర్దావరు వైపు చూచాడు తాసిల్దారు. అతడు మాట్లాడలేదు. మౌనంగా ఉన్నాడు. తాసిల్దారుకు చిర్రుమన్నది. "ఏమో బెల్లంకొట్టిన రాయోలె నిలపడ్డవు? ఉలకవు, పలకవు అని అరచాడు.
"ఏం చెప్పను సర్కార్, ఎనక్కుపోతే నుయ్యి ముందు పోతే గొయ్యి అన్నట్లున్నది."
"ఏందో ముసుగుల మాట్లాడ్తవు. సాప్ సీదగ చెప్పు. అసల్ కైపియత్ ఏందో."
"మున్సఫ్ సాబ్ మద్దతున్నదట! మనం ఏమనే టట్లున్నది!"
ఆ మాట విని తాసిల్దారు భయం మరికొంత పెరిగింది, "అయితే ఏం చేద్దామంటవు?"
"మాఫ్ కర్నా సర్కార్ నాకేం తోస్తలేదు."
అసలు అంతమొందించేద్దామన్నాడు అమీను. రాత్రికి రాత్రి సఫాచేసి శవాన్ని కూడా తప్పిస్తానన్నాడు. ఊళ్ళో సాక్ష్యం రావడానికి ఎవనికి గుండెలున్నాయి? మున్సిఫ్ ఏం చేస్తాడో చూద్దాం.
అది తాసిల్దారుకు అంతగా నచ్చలేదు. భూకామందు అల్లుణ్ణి చంపుతే ఖూనీకేసు అవుతుంది. ఖాల్సా పోలీసు దిగుతే తన అధికారం అంతం అవుతుంది.
"సాబ్ సంగపోండ్ల బలమున్నదట. సర్కార్ భీ సంగపోండ్లకు మద్దత్ చేస్తున్నదట" అని గిర్దావర్ విజ్ఞత.
తాసిల్దారు మరికొంత హడలిపోయాడు. అసలు పత్రికంటే ఏమిటి, అందులో ఏముంటుంది? అని అడిగాడు తాసిల్దారు. తమకు తెలియదంటే తమకు తెలియదన్నారు ఇద్దరూ.
తెల్లవారి పత్రిక తెప్పించుకొని చదివించుకున్నారు. అతనికేమి అర్థంకాలేదు. కాని యెక్కడో జరిగే యుద్ధాన్ని గురించిన విషయాలున్నట్లు అనిపించింది. అది చదువుతే ప్రమాదమేమి? అని తనలో తానే ప్రశ్నించుకున్నాడు.
"శివుణ్ణి పంపమంటారా? ఏక మార్ మెఁ సఫా" అడిగాడు అమీను.
ఏదో ఆలోచిస్తున్నట్లు నటించాడు తాసిల్దారు. "దేఖేంగే" అని జవాబు చెప్పాడు.
అమీనుకు తాసిల్దారు మీదనే కోపం వచ్చింది. కాని దిగమ్రింగాడు. సలామ్ చేసి గిర్దావర్ తానూ వెళ్ళిపోయారు.
శుభదినమూ, అశుభదినమూ రానేవచ్చాయి. ఊరంతా కుత కుత ఉడికి పోయింది. ఏ దుకాణంలో విన్నా, ఏ హోటల్లో విన్నా, ఏ చౌరాస్తాలో విన్నా, ఏ ఇంట్లో విన్నా ఒకటే వార్త "పత్రిక వస్తూంది." ఊళ్ళోకి ఏదో వింత వస్తువు ప్రవేశిస్తున్నట్లు, దాన్ని చూడాలన్నట్లు గ్రామం యావత్తూ స్టేషనుకు చేరింది- తాసిల్దారు తప్ప. రాబోయే పత్రికను గురించీ, తెచ్చే వ్యక్తిని గురించి అనేక రకాల వ్యాఖ్యానాలు జరుగుతున్నాయి. కొందరు వీరయ్యగారి చుట్టూ చేరి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జానకి వంటరిగా ఒక పక్కకు కూర్చుంది. ఆమె చేతిలో పూలదండలున్నాయి. ఆడపిల్ల అలా రావడం బాగనిపించలేదు చాలామందికి. పూలదండ వేస్తుందేమో ఇంతమందిలో! కాలం మారిపోయింది. ఘోరకలి వచ్చింది అని పెదవి విరచాను కొందరు - కాదు చాలామంది.
మున్సిఫ్ స్టేషనుకు వచ్చాడు. అతణ్ణి చూచి అమీను లోలోపల మండుతూనే సలామ్ కొట్టాడు. ప్రతినమస్కారంచేసి సాగిపోయాడు. నాగేశ్ కనిపించి నమస్కరించాడు. చిరునవ్వు నవ్వి సాగిపోయాడు. వెయిటింగ్ రూంలో కూర్చున్నాడు.
మున్సిఫ్ రావడాన్ని గురించీ అనేక గుసగుసలు లేచాయి. కొందరు పెద్ద మనుషులు వెయిటింగ్ రూంలోకి వెళ్ళారు. అతనితో పిచ్చాపాటీ మాట్లాడుతూ మధ్య మధ్య పత్రికను గురించి ముచ్చటించారు. అతనూ ఏవేవో సమాధానాలు చెప్పాడు. పత్రిక చదవటం మహాపాపం కాదని వెల్లడించాడు.
సెకెండ్ బెల్లుకొట్టారు. పోలీసులంతా అటెన్షన్ లో నుంచున్నారు. అమీను వారికి ఏవేవో సంజ్ఞలు చేస్తున్నట్లు అందరికీ కనిపించేట్లు నటించాడు.
అంతా ఊపిరి బిగపట్టుకొని ప్లాటుఫారంమీద నుంచున్నారు. జనం కిటకిటలాడిపోతున్నారు. ఏదో అవతారం కోసం ఎదురు చూస్తున్నట్లు ప్లాటుఫారం సాంతం మౌనంగా వుంది. ఉచ్చ్వాస నిశ్వాసాలు సైతం బిగపట్టి రైలు రాకకు ఎదురుచూస్తున్నారు.
రైలు పెద్దగా విజిల్ యిచ్చి ఝలక్ ఝలక్ మంటూ సాగిపోయి కిర్రుమని మొత్తుకుంటూ ఆగిపోయింది. వేలకండ్లు ఒకే వ్యక్తికోసం వెదికాయి. రఘు పత్రికతో కనిపించాడు. జనం యావత్తూ ఆ పెట్టె దగ్గరికే చేరింది. కష్టంగా జనాన్ని నెట్టి తోవ కల్పించారు వీరయ్యగారు జానకికోసం. జానికి గుండె గంతులు వేస్తూంది. సుమారు పరిగెత్తింది. రఘు మెడలో దండ వేసింది.
"రఘుగారికి" ఎవరన్నరో తెలియదుకాని "జై" అనే నినాదంతో దిక్కులు పిక్కటిల్లాయి.
రఘు ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అయినాడు. అవును, అతడు విజయం సాధించాడు! నిన్నటివరకూ కుక్కిన పేనువలే పడి ఉన్న జనం నేడు గొంతులు చించుకొని నినాదాలు చేస్తున్నారు! ఎక్కడ చూచినా ఆవేశం జనం రూపంలో ఆవిర్భవించింది.
వీరయ్యగారు అల్లునికి పూలదండ వేశారు.
"రఘుగారికీ" ఈతడవ జానకి కేక.
"జై" అనే నినాదం మరింత ఆవేశంతో వెలువడింది.
అమీను గుండెలో తుపాకులు పేలాయి. నుంచున్న పోలీసులకు చెమటలు పట్టాయి.
రైలు కేక వేసింది.
అదిరిపడ్డాడు అమీను. రైలు సాగిపోయింది. తనమీదనుంచే పోతున్నట్లు అనిపించింది అతనికి. యంత్రవత్తుగా నుంచున్నాడతను. ప్రతిమలా నిలిచాడు. ఏం చెయ్యాలో అతనికి తోచలేదు. వణుకు పుట్టింది.
మున్సిఫ్ మేజిస్ట్రేట్ రఘును కలుసుకున్నాడు. కరచాలనంచేసి కంగ్రాచ్యులేషన్స్ చెప్పాడు.
ముందు రఘు వెనుక జనం సాగారు. స్టేషను మాస్టరుకు పేపరు ఇచ్చి చిరునవ్వు నవ్వాడు రఘు. స్టేషను మాస్టరు ఆదరంగా పేపరు అందుకున్నాడు. అభినందనలు తెలిపాడు.
రఘు స్టేషను దాటాడు. అమీను కనిపించాడు. అతనికి పేపరు అందించాడు. అమీను బిత్తర బిత్తరగా చూచాడు. ఏం చేయాలో తోచలేదు. పేపరు అందుకున్నాడు. మున్సిఫ్ కనిపించడంతో ఠక్ మని సలాం కొట్టాడు.
జనం అర్థంచేసుకున్నది వేరు.
"జై" అన్నారు.
అమీను గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి.
రఘు ముందుకు సాగాడు.
కరోడ్గిరీ జవాను కనిపించాడు.
"సలామ్ సాబ్" అన్నాడు.
రఘు పేపరు అందించాడు.
పేపరు అందుకుంటూ మళ్ళీ సలామ్ చేసి "జర మా సంగతి యాది మరువకండి" అన్నాడు.
మున్సిఫ్ రఘువద్ద శలవు తీసుకొని వెళ్ళిపోయాడు.
వీరయ్యగారి ఇంటినిండా జనం కూడారు. ఏవేవో ప్రశ్నలడుగుతున్నారు. అన్నిటికీ ఓపిగ్గా సమాధానాలు చెపుతున్నారు రఘు, నాగేశ్ లు. వీరయ్యగారి ఆనందానికి అంతులేదు. జానకి బిందెలకొద్ది చాయ్ తయారుచేసి అందరికీ అందిస్తూంది.
ప్రతి దుకాణంలో, ప్రతి హోటల్లో, ప్రతి చదువు వచ్చిన వారి ఇంట్లో పేపరు వెలిసింది. పత్రికలోని విషయాలు వారికి ఏమీ అర్థంకాలేదు. కాని ఏ ఇద్దరు కలిసినా ఆనాటి చర్చ పత్రికను గురించీ, దానిని తెచ్చిన రఘును గురించే.