అలాంటి తన కొడుకు తనంత తాను కాల్చుకొని చనిపోవటం బాగా కృంగదీసింది. కొడుకు చనిపోయినట్లు రాత్రి 1_30కి తెలిసింది. తెలిసిన అరగంటకే ఆ క్లబ్ నామరూపాలు లేకుండా మాడిమసైపోయింది.
"ఎలా జరిగింది....?" భూపతి నోటివెంట ఒక్కొక్కమాట ఒక్కో నిప్పురవ్వలా వస్తోంది.
"నేను ఎంక్వైరీ చేయించినమేరకు ఇది శశాంక పనే అని అనిపిస్తోంది...."
"అని అనిపించటమేనా ఆధారాలున్నాయా?"
భూపతి అంతటివాడిక్కూడా శశాంకమీద ఎదురు తిరగాలంటే భయమే. అందుకే శశాంక విషయంలోమాత్రం జాగ్రత్తగా తూచి తూచి అడుగులేస్తాడు.
"అంత తేలిగ్గా ఈ వశిష్ట ఎప్పుడు ఏదీ చెప్పడు. తగిన ఆధారాలున్నాయి గనుకే అంత గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఆ రాత్రి క్లబ్ కి బాగా పొద్దుపోయాక ఇద్దరు వ్యక్తులు వచ్చారు. మరికాసేపటికి మరో వ్యక్తి వచ్చాడు. మొదటి ఇద్దరు వ్యక్తులు విడిపోయి వేరువేరుగా కూర్చున్నారు. ఇక్కడ ఆగుతాను__ఇక్కడే నా లాజిక్ కి బేస్ చెబుతాను. ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకుంటూ క్లబ్ లోకి ఎంటరయ్యారు. కలిసే ఎంజాయ్ చేయాలి. లేదు అంటే ఓ కారణముండాలి విడిపోయి కూర్చునేందుకు....ఆ ఇద్దరిలో ఒకరికి బాగా కావల్సిన వ్యక్తికి ఎవరన్నా ఆ పాటికే క్లబ్ లోకి వచ్చి వుంటే అతను వీరిలో ఎవరినన్నా చూసిరమ్మని ఆఫర్ చేసుంటే, వారు విడిపోవటానికి లాజిక్ వుండేది. కాని అదేం జరగలేదు. కావాలనే విడిపోయారు. ఆ తరువాత వచ్చిన వ్యక్తి ఈ ఇద్దరి వ్యక్తులలో ఒకరి దగ్గరకు వచ్చి అతని ఎదురుగా కూర్చొని ఆ వెంటనే మన చినబాబు వున్న టేబుల్ వద్దకు వెళ్ళాడు. అప్పుడే అసలు డ్రామా మొదలయింది. జరగాల్సిన మారణకాండ జరిగాక ఆ ముగ్గురూ ఒక్కసారే బయటకు నడిచారు వేగంగా. వీటినిబట్టి ఆ ముగ్గురే డెత్ గేమ్ కి ప్రేరణ అయివుండాలి. అసలలాంటి గేమ్ ఒకటుందని మనకి తెలియకపోవటం ఆశ్చర్యమే...."
"నీ ఆశ్చర్యం తరువాత, నీవు చెప్పిన ముగ్గురు వ్యక్తులెవరు? ఆ వ్యక్తులకు శశాంకకు ఏమిటి సంబంధం....?"
"ఆ ముగ్గురు వ్యక్తులకు శశాంకకు సంబంధం వుండాల్సిన పనిలేదు. అందులో ఏ ఒక్కరికి వున్నా చాలుగదా. ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి శశాంక మనిషి ప్రొఫెషనల్ కిల్లర్ సుదర్శన్. అతను శశాంక దగ్గర ఫుల్ టైమ్ కిల్లర్ ఎప్పుడూ రాని అతను ఆరోజే వచ్చాడంటే ఏమిటర్ధం....?"
"చాలు ఇక మనం కసి తీర్చుకోటానికి ఆ మాత్రం ఆధారాలు చాలు...."
"అతనికి మన మీద కసి, పగ వుంటే వేరే రకంగా తీర్చుకోవాలి. కాని ఎవరో చెప్పారని ఆధారాలు లేకుండా తన కొడుకుని కరీం అనే వ్యక్తి మర్డర్ కి ప్రనోక్ చేసారనగానే నమ్మేయడం వెరీ బ్యాడ్. ఇప్పుడిక పాపపుణ్యాల ప్రసక్తి అనవసరం? కోట్లు ఖర్చయినా తాడోపేడో తేల్చుకోవటమే ప్రెస్టేజ్....మీరు వూ....అంటే డ్రామా ఇక నేను నడిపిస్తాను...." అన్నాడు వశిష్ట భూపతి వేపు ఓరగా చూస్తూ.
"అప్పటివరకు ఆవేశంగా పచార్లు చేస్తున్న భూపతి ఠక్కున ఆగిపోయాడు.
అప్పుడు భూపతి ఆలోచనలు, శశాంకను ఎలా దెబ్బ తీయాలనే వున్నాయి గాని__వశిష్ట తనకన్నా తెలివి కలవాడనిగాని ఇవన్ని ఎలా కనుక్కోగలిగాడని గాని ఆలోచించలేక పోయాడు.
అసలు వశిష్ట ఎవరు....? తన దగ్గర ఎందుకు చేరాడు....?
"ఈ బేసిక్ ప్రశ్నలపట్ల శ్రద్ధ చూపించని భూపతి వశిష్టను తక్కువ అంచనా వేసాడు.
తనకు__శశాంకకు మధ్య పెద్ద పెద్ద బెట్టింగ్స్ ఎందుకు మొదలయ్యాయి? చాలా కాలంగా ఫ్రెండ్లీగా వున్న తమ మధ్య వైరం ఎందుకు మొదలయింది! ఎక్కడ మొదలయింది....? ఎవరు దానికి కారణం....? ఇవేమీ ఆలోచించే వివేకాన్ని ఎప్పుడో కోల్పోయాడు భూపతి.
"ఇప్పుడిక ఒక పని చేయాల్సి వుంది...."
"ఏమిటది?" వశిష్ట అడిగాడు "చెబుతాను...." అంటూ బెల్ నొక్కాడు.
"ఆరడుగుల ఎత్తులో, కండలు మెలితిరిగి వున్న ఓ బలిష్టుడు వచ్చాడు."
"నీవేం చేస్తావో నాకు తెలియదు. శశాంక కొడుకు విశ్వదత్తను దారుణంగా చంపాలి. మనమే చంపినట్లు తెలియాలి. కాని ఆధారాలు వుండకూడదు వెళ్ళు__" ఆజ్ఞాపించాడు భూపతి.
ఆ క్షణంలో భూపతి కాలరుద్రుడిలా వున్నాడు.
ఇప్పుడిక కావాల్సింది నాశనం__సర్వనాశనం.
భూపతి మాటలకు వశిష్ట కొద్దిగా కంగారుపడ్డాడు. విశ్వదత్తను అప్పుడే చంపటం వశిష్టకు ఇష్టం లేదు.
అలా అని ఆ సమయంలో భూపతికి చెప్పటం కూడా సాహసమే అవుతుంది.
ఎటూ నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నాడు వశిష్ట.
* * *
భరత్ డిస్చార్జీ అయ్యేది ఆ రోజే.
చివరి చెకప్ కి వచ్చింది త్రివేణి. భరత్ వేపు సూటిగా చూడలేకపోతోంది. దీనికి కారణం తెలుసుకోవాలంటే ఓ రోజు ముందుకెళ్ళాలి.
గతం రోజు భరత్ జాకీ అని తెలియగానే ఒకింత అయిష్టత చూపిన త్రివేణి సరాసరి ఆషా దగ్గరకు వెళ్ళింది.
"అతను నన్ను బాగా ఏడిపిస్తున్నాడు...."
"ఎవరతను" అడిగింది ఆషా.
"అతనే....ఆ భరత్"
"అది ఏడిపించటం కాదేమో. నువ్వు నచ్చి వుడికిస్తున్నాడేమో, తమాషాగా నవ్వుతూ అంది.
వుక్రోషంగా చూసింది త్రివేణి.
అమాంతం త్రివేణీని కౌగలించుకుని "నీలో అదే గొప్ప ఆకర్షణ. నీకు వుక్రోషం వస్తే నాకే ముద్దెట్టుకోవాలన్నంత మూడ్ వస్తుంది." అంటూ ఆ పనే చేసింది.
త్రివేణి చిరాగ్గా చెక్కిలిని తుడుచుకుంటూ సీరియస్ గా చూసింది.
"నా ముద్దయితే ఎంగిలి అని తుడుచుకున్నా నీ ప్రియుడి ముద్దుని మాత్రం అలా చేయలేవు...."
"ఇవన్నీ నాకంతగా ఇష్టముండదు."
"ఇంతకాలం నీ గంభీరతతో, సీరియస్ నెస్ తో ఎవర్ని దగ్గరకు రానివ్వలేదు. అది గొప్ప పనేం కాదు. అది కేవలం జడత్వం. ఇంత కాలానికి యాక్సిడెంటల్ గా నీ గంభీరతను వదిలించే వ్యక్తి నీకు తారసపడ్డాడు. అతన్ని చూస్తూంటే ఏ అమ్మాయి అయినా ఆకర్షింపబడుతుంది. చాలా సరదాగా వుంటాడు. ఆ సరదా తమాషా వెనుక ఏదో లక్ష్యం కనిపిస్తూంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. వీటన్నిటికి మించి చాలా తెలివికలవాడు...."
"తెలివికలవాడని నీవే చెప్పాలి" అంది పొగరుగా త్రివేణీ.
"ఛాలెంజ్ ...."
"ఛాలెంజ్ ...."
"నేనొక ప్రశ్న వేస్తాను. దానికి సమాధానం చెప్పటం అంత తేలికకాదు. అదే సమయంలో అతన్నో ప్రశ్న వేయమని చెబుదాం, దానికి మనం సమాధానం చెప్పగలిగితే నేను ఊహిస్తున్నంత తెలివికలవాడు కాదనే నీ అభిప్రాయాన్ని బలపరుస్తాను. ఓ.కే...."
"ఓ. కే"
"పందెంలో ఓడిపోతే నేను చెప్పింది చేయాలి రడీనా? అంత స్థయిర్యం లేకపోతే ఈ పందెం వద్దు ఏమంటావ్....?" ఉడికిస్తూ అంది ఆషా.
త్రివేణీ పట్ల ఆషా ఆలోచనే వేరు. ఎలాగైనా త్రివేణి ప్రిజిడిటీని వదిలించాలని చాలా కాలంగా ఆలోచిస్తోంది.
సరైన టైం వచ్చిందనిపించింది.
ఆ మాటకి ఉక్రోషంతోపాటు కోపం కూడా వచ్చింది త్రివేణికి.
"నేను రడీ" అంది.
ఇద్దరూ కల్సి భరత్ దగ్గరకు వెళ్ళారు.
ఆ సమయంలో భరత్ సన్ డే పీపుల్ మేగ్ జైన్ రేసింగ్ ఎడిటర్ జోనధాన్ పావెల్ బాబ్ ఛాంపియన్ కలిసి రాసిన ఛాంపియన్స్ స్టోరీ అనే బుక్ చదువుతున్నాడు.
మెత్తటి అడుగుల శబ్దం విని పుస్తకంలోంచి తలెత్తకుండానే "ఇద్దరు వస్తున్నారు. అందులో ఒకరు డాక్టరు, మరొకరు తెలియకపోయినా ఆడవాళ్ళే అని చెప్పగలను. ఏమైరైట్....?" అన్నాడు భరత్.
త్రివేణి ఆశ్చర్యపోయి ఆషావేపు చూసింది.
ఆషా మౌనంగా నవ్వుతూ చూసింది.
"యు ఆర్ రైట్ మిస్టర్ భరత్" అంది ఆషా దగ్గరకు వస్తూ.
అప్పుడు బుక్కుని పక్కన పెట్టి వారి వేపు చూస్తూ లేచి కూర్చున్నాడు.
"ఈ సాయంత్రం వెళుతున్నారనుకుంటాను...." అడిగింది ఆషా.
"ఎస్ కాని నాకు వెళ్ళాలనిమాత్రం లేదు...." అన్నాడు త్రివేణి వేపు ఓరగా చూస్తూ. ఆ చూపుల్ని త్రివేణి పసిగట్టకపోలేదు.
"డిస్చార్జ్ అయిపోయే ముందు సరదాగా చిన్న గేమ్ ఆడుదాం. ఓకేనా?" అడిగింది ఆషా.
"నేను రడీ....మరి మీ ఫ్రెండ్."
"తనూ రడీనే. నేనో ప్రశ్న వేస్తాను. దానికి కరక్టుగా సమాధానము చెప్పాలి. అలాగే మీరూ వేయవచ్చు ఏమంటారు? ఆషా అడిగింది.
"కానివ్వండి" అన్నాడు ఇద్దర్నీ కూర్చోమన్నట్లు సంజ్ఞచేస్తూ.
"మీకు 20 సంవత్సరాలు అనుకోండి...."
"అనుకోవటమేమిటి? నాకు నిజంగానే ఇరవై ఏండ్లు...."
"అలా మధ్యలో అడ్డురాకూడదు...."
"సరే చెప్పండి."
"మీకు ఇప్పుడు ఉన్న వయస్సే అనుకోండి. మీ అమ్మగార్కి తొంభై సంవత్సరాలు అనుకోండి...."
"తొంభై....! అసలు మీ ప్రశ్నలోనే తప్పుంది. నాకు ఇరవయి అయి మా అమ్మకు 90 ఎలా సాధ్యం! అంటే నేను మా అమ్మకు 70 సంవత్సరాలుండగా పుట్టుంటానా? డాక్టర్స్ మీరు ఆ వయస్సులో ఓ స్త్రీకి గర్భం వచ్చే చాన్సస్ వున్నాయా?"
అదిరిపోయి చూసారిద్దరూ.
ఆషా ఓ క్షణం తడబడిపోయి అంతలోనే సర్దుకుని "నిజమే అనుకోండి తమాషా ప్రశ్న కదా__లాజిక్ అడక్కూడదు."