సుందర సుకుమారి వయస్సు ముప్పై ఏడేళ్ళు.
ఆం ఎభార్త పర్వతేశ్వరరావు వయస్సు నలభయ్ రెండు.
ఆ దంపతులిద్దరికీ అప్పటికే ఐదుగురు పిల్లలు. సుందర సుకుమరి తెలివిగ ఇద్దరు ఆడపిల్లలు పుట్టంగానే మళ్ళీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకొంది. ఆమె భర్త పర్వతేశ్వరరావు మాత్రం ముగ్గురబ్బాయిలు కలిగినా ఇంకా తెలివి తెచ్చుకోక మళ్ళీ కడుపుతో ఉన్నాడు.
ఆ ఇంట్లో ఆ భార్యా భర్తకాక ఐదుగురు పిల్లలు. ఈ ఏడుగురు తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకోబోయే లోపల ఆ ఇంట్లో రణగొణ ధ్వని రాళ్ళ వానతో ఇరుగు పొరుక్కి తలనొప్పి కలిగిస్తూంటారు. అది చాలదన్నట్టు టి.వి గోల ఒకటి. టి.వి.లో ఏ చెత్త ప్రోగ్రామ్స్ వచ్చినా సరే వాళ్ళు దాని నోరు తెరిచిపెట్టి ఉంచుతారు. టి.వి. లో ఏ ప్రోగ్రామ్ వచ్చినా సరే వాళ్ళు దాని నోరు తెరిచి పెట్టి ఉంచుతారు. టి.వి.లో ఏ ప్రోగ్రాములు లేనపుడు పాపం పిచ్చిముండ దానంతట అది నోరు మూసుకోవాల్సిందే.
ఖర్మ చాలక ఇరుగు పొరుగువాళ్ళు టి.వి. గురించి ఏమైనా అంటే టి.వి.లో కన్నా ఎక్కువశభ్దాలుచేస్తూ ఆ ఇంట్లో అందరూ ఐకమత్యంగ కలిసి పోట్లాడతారు దాంతో "వీళ్ళతో ఎందుకొచ్చిన గోల" అని ఇరుగుపొరుగు వాళ్ళే తగ్గిపోయారు.
టి.వి.లో ఉన్నా చానల్స్ చాలక మరో పది చానల్స్ ప్రవేశపెట్టడం వల్ల తామేదో గొప్ప ఘనకార్యం చేశామని దూరదర్శన్ వారు మురిసిపోతున్నారు కాని ప్రజలేమీ మురిసిపోవడం లేదు. ఈ క్రొత్త ప్రవేశంవల్ల ప్రతి ఇంట్లో చిర్రు బుర్రులెక్కువయ్యాయ్.
"ఫలానా ఛానల్ లో క్రికెట్ వస్తుందని ఒకళ్ళింట్లో పెద్ద కొడుకంటే వెంటనే వాడక్కయ్య "ఫలానా ఛానల్ లో క్రొత్తరకం వంటలు తయారుచేయటం, క్రొత్త రకం కుట్లు అల్లికలు చూపిస్తున్నారనటం... "వెంటనే ఆ ఛానల్ కి బటన్ నొక్కటం చేసేది.
ఈ లోపలే కొంపలంటుకుపోయినట్టు వంట గదిలోంచి వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి.
"సుందర లక్ష్మీ అక్కరలు-అలంకారం పాటలు వస్తున్నా" యంటు మరో ఛానల్ తాలూకా బటన్ నొక్కేది.
"భక్తిని మించిన రక్తి టీముంది? పుణ్యము పురుషార్ధము. మంచి భక్తి పాటలొస్తున్నాయ్. సౌందర్య బాలన్ పాడుతున్నాడు." అంటూ వాళ్ళ నాన్న కళ్ళజోడు సవరించుకొంటూ వచ్చి మరో ఛానల్ తాలూకా బటన్ నొక్కేది.
"టి.వి. విషయంలో ఆ ఇంట్లో ఎవరూ తగ్గేవాళ్ళు కాదు. ఎవరికే ఛానల్ కావాలంటే ఆ ఛానల్ తాలూకా బటన్ వాళ్ళకు బుద్ది పుట్టంగానే నొక్కటమే.
పెద్దమ్మాయి నొక్కిందని చిన్నవాడు, చిన్నవాడు నొక్కాడని తల్లి, ఆమె నొక్కిందని తండ్రి...ఈ నలుగురూ కాక ఆ యింట్లో వున్నా మరి మూడు శాల్తీలు వాళ్ళకిష్టమైన చానల్స్ తాలూకా బటన్స్ నొక్కేవారు.
టి.వి. తెర చూడబోతే ఒకటి. బటన్స్ చూడబోతే పదహారు. ఇంట్లో వున్న వాళ్ళకి తలో రకం అభిరుచి సర్దుకుపోయేతత్వం బొత్తిగా లేదు.
దాంతో పంతంగా అలా బటన్స్ నొక్కటంవల్ల ఒక చానల్ లొ కపిల్ దేవ్ వేసిన క్రికెట్ బాల్ సగం దూరంలో ఉండంగానే ఒకామె వంటగదిలో ఉల్లిపాయ ఎగరేస్తూ కనబడేది. ఆ ఉల్లిపాయ పైకెగిరి కిందపడేలోపల మూడో ఛానల్ లోని ఆండాళమ్మ డాకలాగా నోరు తెరిచి "ఆ....ఆ..." రాగం తీస్తూ కనిపించేది.
ఈ లోపల తండ్రిగారు నొక్కిన బటన్ ఫలితంగా ఒకాయన కళ్ళు మూసుకొని "ఎంచుకొచ్చిన జన్మంబిది" అని తత్వం పాడుతూ ప్రత్యక్షమయ్యేవాడు.
సరిగ్గా అప్పుడే బుడత కీచులాంటి ఆఖరి పిల్ల వచ్చి వేరే బటన్ నొక్కేది. దాంతో చిన్నపిల్లలు తెరమీదికి వచ్చి అంగుళం చాక్లెట్ కోసం ఆరుగురు పిల్లలు ఆనందంగా కేరింతలు కొడుతూ కనిపించే వారు.
ఇలా క్షణానికో ఛానల్ మార్చడంవల్ల క్రికెట్ బాల్ వెళ్ళి పాట పాడే ఆమె నోట్లో పడితే ఆ దృశ్యం చూడలేక మరొకాయన కళ్ళుమూసుకుంటే అది చూసి పిల్లలంతా కేరింతలు కొడితే...
ఈ విధంగా టి.వి.లొ వచ్చే ఏ కార్యక్రమమూ పూర్తిగా చూసి చచ్చేది లేకపోగా ఆ ఇంట్లో వాళ్ళు కీచులాడుకొంటూ హార్మనీ రీడ్లు కొక్కినట్టు, టైప్ మిషన్ టక టకా కొట్టినట్టు టి.వి. బటన్స్ నొక్కటం వల్ల అది చెడిపోయి ఊరుకుంది. టి.వి. ఎప్పుడైతే నోరు మూసుకొందో యింట్లో వాళ్ళకి శివాలు పూని గంగవెర్రులెత్తినట్లయింది.
మూగబోయిన టి.వి.ని చూస్తూ ఆ సాయంత్రం అందరూ హాల్లో సమావేశమయ్యారు.
పాపం పేరుకే సుందర సుకుమారి శరీరంమాత్రం లారీ నిండుగా నిండు బస్తాలు పేర్చినట్టుంటుంది. కాస్త విశ్రాంతిగా పడుకుంటే తప్ప పాపం ఆమె ఏ భంగిమలో నించున్నా కూర్చున్నా ఆయాసం ఎగరొప్పు.
రొప్పొస్తున్నది కదాని మాటలు మానదు. దాని దోవ దానిదే, దీని దోవ దీనిదే. ఏదో ఒకటి వాగుతూనే వుంటుంది.
సుందర సుకుమారి భర్త పర్వతేశ్వరరావు పేరుకి మాత్రమే పర్వతేశ్వరరావు.
ఉఫ్ అని కాస్త గట్టిగా పుడితే గాలికి ఎగిరెళ్ళి పక్క వీధిలో పడేట్టు వుంటాడు. అప్పటికే ముగ్గురు పిల్లలు కలిగారేమో అతినీరసం.
పర్వతేశ్వరరావు ఎంత కంఠం పెద్దది చేసి మాట్లాడినా లోతైన నూతిలోంచి వచ్చినట్టు వినవస్తాయి మాటలు.
మళ్ళీ యిప్పుడు నాలుగో వాడ్ని కనటానికి రెడీగ కడుపుతో వున్నాడు.
అమ్మకి పుట్టిన పిల్లలు అబ్బకి పుట్టిన పిల్లలు మామూలు పిల్లలు కాదు పిల్ల రాక్షసులు పిల్ల కోతులు.
టి.వి. ని నీవు పాడు జేశావంటే నీవు పాడుజేశావంటూ అందరూ కలసి అరగంటసేపు పోట్లాడుకొని చివరకి నోరు మూసుకొన్నారు. నెమ్మదిగా మామూలు మాటల్లో పడ్డారు. ఖాళీగా ఉన్నారేమో వాళ్ళమధ్య రకరకాల సంభాషణలూ సాగుతున్నాయ్.
"సుకుమారీ! ఇవ్వాళ పేపర్ లో టి.వి. గురించి ఒక విషయం రాశారు మన దేశంలో గిల్ట్ అనే ఒకాయన టి.వి. మీద పది సంవత్సరాలు పరిశోధన చేసి ఒక గొప్ప విషయం కనుక్కొన్నాడట. డ్రగ్స్ కన్నా ప్రమాదకరమైనది టి.వి. అని...డ్రగ్స్ కొంతకాలం వాడి మానివేయవచ్చునేమో కాని టి వి ని చూడకుండా ఉండటం ప్రజలు మానలేరని ఆయన పదేళ్ళు పరిశోధన చేసి తేల్చి చెప్పాడు" పర్వతేశ్వరరావు అన్నాడు.
"ఈ పదేళ్ళు టి.వి చూడకుండా ఎలా ఉన్నారబ్బా?" ఆయన పెద్ద కూతరు ఆశ్చర్యపోతూ అంది.
"ఈ పదేళ్ళూ ఈ ఒక్క పరిశోధన తప్ప ఆయన మరేం చేయలేదా?" సుందరి సుకుమారి అడిగింది.