ముక్కుకి కర్చీఫ్ అడ్డుపెట్టుకుని చెవులప్పగించింది పద్మిని ప్రియదర్శిని.
"సిగరెట్ తాగితే ఏమొస్తుందోయ్?" శంకర్రావు అడిగాడు.
"పొగవస్తుంది" నాగేంద్రం ముక్తసరిగా జవాబిచ్చాడు.
"నువ్వు భలే మాట్లాడతావోయ్! నేనిలా అన్నానని నువ్వేమీ అనుకోకు. ఏదైనా అలవాటు చేసుకోవటం తేలికే. మానడమే కష్టం. పొగ పీలిస్తే ఆరోగ్యం చెడిపోతుంది. నీ మంచికే చెబుతున్నాను. అంతగా అలవాటు మానలేకపోతే రోజుకి వకటో రెండో తాగు. ఇలా అగ్గిపెట్టె అవసరం లేకుండా సిగరెట్ కి సిగరెట్ ముట్టిస్తూ తాగటం ఆరోగ్యానికి హానికరం.
"గత ఇరవైయేళ్ళ అలవాటయ్యింది. మానాలన్నా మానలేకపోతున్నాను. నాకున్న చెడ్డఅలవాటు ఇదొక్కటే! పాపం నావలన సిగరెట్ లు బూడిదైపోతున్నాయిగాని నాకు మాత్రం ఇంతవరకూ ఏమీ కాలేదు. జలుబు, తలనొప్పి చిన్న చిన్నవికూడా నా దరిదాపులకి రావడానికి భయపడతాయి."
నాగేంద్రం చెప్పిన విధానానికి శంకర్రావుకి నవ్వొచ్చినట్టుంది. నవ్విన శబ్దం వినబడింది.
క్షణం ఆగి...
"నువ్వింతవరకు యెందుకు పెళ్ళిచేసుకోలేదు?" శంకర్రావు అడిగాడు.
"స్త్రీని బాధపెట్టడం నా కిష్టంలేక" నాగేంద్రం జవాబిచ్చాడు.
"అదేమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు శంకర్రావు.
"అదంతే మాష్టారూ!"
నాగేంద్రం ,శంకర్రావుని "మాష్టారూ" అని సంభోదిస్తూంటాడు.
శంకర్రావు నాగేంద్రంని "అదేమిటోయ్" అని "అదికాదు నాగేంద్రం" అని పలురకాలుగా సంభోదిస్తూంటాడు.
"అదంతే! అంటే నాకెలా తెలుస్తుంది? కాస్త వివరంగ చెప్పవయ్యా! నాకూ కాస్త కాలక్షేపంగా వుంటుంది" అన్నాడు శంకర్రావు.
"చిన్నప్పటినుంచి చాలా సంసారాల్లో చూశాను. ఏదో ఒకటి ధంగపురుషుడు స్త్రీని బాధపెట్టడమే కనిపించిదిగాని మరోటి కనిపించలేదు. స్త్రీ అంటే పిల్లలని కనే యంత్రం అనుకుంటాడు. జీవితంలో పెళ్ళి చేసుకోకూడదని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను."
"నీ నిర్ణయం తప్పు నాగేంద్రం"
"ఎలా చెప్పగలరు మాష్టారూ?"
"నువ్వు ఒకమ్మాయిని పెళ్ళాడి ఆ అమ్మాయిని సుఖపెట్టవచ్చు కదా?"
నాగేంద్రం మాట్లాడినట్లు లేదు. ఇదే ప్రశ్నని మళ్ళీ అడిగాడు శంకర్రావు.
"అమ్మాయి, వివాహం ఆ మాటలువద్దు మాష్టారూ! నా జీవితంలో ప్రతిస్త్రీని ఆఖరికి అప్సరస అయినా సరే అమ్మలా భావించేలా ఒట్టుపెట్టుకున్నాను వివాహం గురించి ఇంకేం అడక్కండి" మొహమాటం లేకుండా చెప్పాడు నాగేంద్రం.
"అడగను" శంకర్రావు అన్నాడు.
"గురుడు ఏ స్త్రీనో ప్రేమించి ఘోరంగా దెబ్బతిని వుంటాడు. అసలు విషయం దాచి అమ్మ, బామ్మ అంటూ కబుర్లు చెపుతున్నాడు" అనుకుంది లోపలవుండి వాళ్ళ మాటలు వింటున్న పద్మిని ప్రియదర్శిని.
"ఇంకా కొన్నాళ్ళు వుంటావా?" శంకర్రావు అడిగాడు.
"పై వారం వెళుతున్నాను మాష్టారూ! మళ్ళీ ఎప్పుడో బుద్ధిపుట్టినప్పుడు ఏడాదికో రెండేళ్ళకో వస్తాను"
"అదేమి వంటరివాదివి. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు రావచ్చుకదా?"
"తలుచుకోను కాబట్టి రాను."
నాగేంద్రం జవాబులు అలా వుండేసరికి శంకర్రావుకి ఏం మాట్లాడాలో అర్ధంకాలేదు.
ఎప్పుడూ శంకర్రావు ఎవరినీ ప్రశ్నలమీద ప్రశ్నలు అడగడు. ఏవో అతిమామూలు మాటలు అడుగుతాడు. వక్కసారి జీవితాల్లోకి తొంగిచూసే పనిచేయడు. ఎవరి జీవితం వారిది. డీప్ గా వెళ్ళి గతాలు కెలికి సంసారాల్లో చిచ్చుపెట్టడు. చాతనయినంతలో సాయం చేయడం లేకపోతే తనమానాన తను వుండడం అంతే!
నాగేంద్రం విషయమే విచిత్రంగ వుండి ఆ రెండుప్రశ్నలు అడగటం జరిగింది. సమాధానాలు సరిగ్గారాలేదు, వదిలేశాడు.
ప్రస్తుత రాజకీయాల గురించి మీ అభిప్రాయం ఏమిటి మాష్టారూ!" నాగేంద్రం ఆఖరయిన సిగిరెట్ కి కొత్త సిగరెట్ ముట్టిస్తూ అడిగాడు.
దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో వుందోయ్! ప్రతివాడికి పదవిమీద కాంక్షగాని పనిమీదకాదు. నరనరాన స్వార్ధం నడయాడుతుంటే పక్కవాడు పాడయిపోవాలి, నేను మాత్రం బాగుండాలి అనే తత్వంతో_" శంకర్రావు చెప్పుకుపోతున్నాడు.
అదే నాగేంద్రంలో వున్న స్పెషాల్టి. తను వక ప్రశ్న అడిగి వూరుకుంటాడు. ఇంక ఎదుటివారు ఆ విషయం గురించే ఆవేశంగా చెప్పుకు పోతుంటారు.
యిప్పుడు శంకర్రావు విషయంలో జరుగుతున్నది అదే.
వాళ్ళ సంభాషణ వింటున్న పద్మిని ప్రియదర్శినికి ఏదీ అర్ధంకాకపోయినా ఒక విషయం మాత్రం అర్ధం అయింది. తను మాట్లాడకుండా ఎదుటివారి చేత మాట్లాడేట్లు చేసి తనువింటూ కూర్చుంటాడని.
పద్మిని ప్రియదర్శినికి అంతవరకే తెలుసు. నాగేంద్రంని మరో కోణంనుంచి చూస్తే యింకో విషయం కూడా తెలుసుకోగలిగేదే. అంత శక్తి పద్మినికి లేదు.
మనిషిని అంచనా వేయగలంగాని మనసుని అంచనా వేయటం అసాధ్యం.
నాగేంద్రం విషయంలో అంతే నిజం.
నాగేంద్రం ఒక గంటసేపు వుండి శంకర్రావు చేత సాగించి వినయంగా శలవు తీసుకుని మళ్ళీ రేపు సాయంత్రం వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.
నాగేంద్రంని సాగనంపి శంకర్రావు ఇంట్లోకి వచ్చేసరికి పద్మిని ఏదో నవల చదువుతున్నట్లు వుండిపోయింది.
చదువుతున్నదాన్ని మధ్యలో డిస్టర్బ్ చేయటం దేనికని శంకర్రావు మళ్ళీ బైటికి వచ్చేశాడు.
అది గమనించిన పద్మిని నిట్టూర్చి వూరుకుంది.
17
"రేపు మనం కొన్ని అనాధ ఆశ్రమాలకి వెళ్ళి ఆడ, మగ పిల్లలకి స్వీట్స్ పళ్ళు పంచాలి"
అని ఆ క్రితంరోజు పార్వతమ్మ ఇంట్లో లేకుండా చూసి శంకర్రావు పద్మినితో చెప్పాడు.
"రేపు ఏమిటి విశేషం అంకుల్!" పద్మిని ప్రియదర్శిని ఉత్సాహంగా అడిగింది.
"వివరం అడగొద్దు అడుగుతావనే ముందుగా చెపుతున్నాను. ముఖ్యంగా మీ ఆంటీని ఏమీ అడగవద్దు. ఇంతకన్నా ప్రస్తుతం ఏమీ చెప్పలేను" శంకర్రావు అన్నాడు.
శంకర్రావు ముఖంలోకి పరిశీలనగా చూసింది. తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం తప్ప ముఖంలో చదవటానికి ఏమీ కనిపించలేదు పద్మినికి.