Previous Page Next Page 
అనురాగ జలధి పేజి 30

    "గుంటూరునుంచి మీ చెల్లాయి రాసింది చూస్తే వీడికి మళ్ళీ మంచిరోజులు వస్తాయేమో!" మెల్లగా అన్నాడు విశ్వనాథం.
    "అవును! కామాక్షి అంతా వివరంగా రాసింది కదా! వాళ్ళకి శ్రీకర్ విషయమంతా తెలుసు! జ్యోతి వదిలేసిన విషయం కూడా తెలిసిందల్లే వుంది. అందుకే జ్యోతితో ఓ వుత్తరం రాయించుకుంటే వాళ్ళ అమ్మాయిని యివ్వటానికి అభ్యంతరం లేదన్నారు."
    "మళ్ళీ ఓసారి భయం వేస్తుంది. ఏ పుట్టలో ఏ పాముందో! అంత దూరం సంబంధం! ఆ అమ్మాయి మనస్తత్వం ఎలాంటిదో ఏమో" నిస్పృహతో అన్నాడు.
    "అలాంటి సంకోచాలేం పనిలేదు. అలాంటివి వుంటే అది ఎందుకు రాస్తుంది. బహుశా అమ్మాయి ఏమయినా చదువుకుందేమో! అందుకే పరిస్థితుల్ని అర్ధం చేసుకుందేమో."
    "కావచ్చు!" అన్నాడు విశ్వనాధం. మళ్ళీ వాళ్ళ మధ్యా కత్తిలాంటి నిశ్శబ్దం...ఉన్నట్టుండి అన్నాడు మళ్ళీ. "అసలు ఈ ప్రబుద్దుడు ఏమంటాడో?"
    నిట్టూర్చింది అన్నపూర్ణ. "అదే నా భయం" అంది మెల్లిగా.
    "పూర్ణా! ఎంతకాలమని యిలాగ గడుపుతాడు? చూస్తే ఆ జ్యోతి తిరిగి ఎప్పటికయినా తన దగ్గరకి వస్తుందేమోనని వాడి అంతరాంతరాల్లో వున్నట్టుంది మనతో చెప్పలేడు. తను ఆలోచించలేడు. వాడి భవిష్యత్తు ఏమవుతుందా అనే నా బాధ!"
    ఆమె ఏమీ సమాధానం యివ్వలేదు.
    "ఇంతకీ వీడు ఎక్కడికి వెళ్ళినట్టు?"
    "బయటకు వెళ్ళాడు. ఇంకాస్సేపట్లో వస్తాడేమో-"
    ప్రస్తావిద్దామంటావా ఆ విషయం? ఎన్నాళ్ళీ ముసుగులో గుద్దులాట? వాడికి మళ్ళీ పెళ్ళి అంగీకారం అయితే ఈ అమ్మాయి కాకుంటే మరో అమ్మాయి అంతే!"
    "అసలొప్పుకోవాలిగా?"
    "అదే తేలుద్దాం" సరిగ్గా అప్పుడే యింటికి వచ్చేడు శ్రీకర్.
    "అదో గేటు చప్పుడు వాడే-"
    "సరే అడిగేద్దాం."
    మరో నిమిషం తర్వాత వచ్చాడు శ్రీకర్ అటుగా. ఇంకా నిద్రపోకుండా మాటాడుకుంటూ వున్న తల్లిదండ్రుల్ని చూసి బాధపడ్డాడు. "ఈ వయసులో నావల్ల బాధపడుతున్నారు. కన్న కొడుకయివుండీ వీళ్ళని సుఖపెట్టలేకపోతున్నాను. ఏం జన్మ!" అనుకున్నాడు.
    "శ్రీకర్ ఇటురా బాబూ!" మృదువుగా పిలిచింది అన్నపూర్ణ. ఆ చల్లని వాతావరణంలో నిద్రలేమిటో కొద్దిగా బరువెక్కిన ఆమె కంఠం మధురాతి మధురంగా ధ్వనించింది. ఆప్యాయత అంతా వొలికినట్టయింది.
    "ఇంకా నిద్రపోలేదేమమ్మా!" తల్లిదండ్రుల దగ్గరగా వచ్చి కూర్చుంటూ అడిగాడు.
    "ఏదో మాటాడుతూ వుండిపోయాం. నువ్వెక్కడి కెళ్ళావు? రాత్రిళ్ళు తిరగొద్దు. ఆరోగ్యం పాడవుతుంది" అన్నాడు విశ్వనాధం.
    ఆ ప్రేమకి కరిగిపోయాడు శ్రీకర్.
    ఒక్కక్షణం ఆగి "పిన్ని జాబు రాసింది గుంటూరు నుంచి" అంది అన్నపూర్ణ నాందీగా.
    "అంతా బావున్నారా అమ్మా! చాలా రోజులయింది పిన్ని వచ్చి _ నువ్వు కూడా వెళ్ళలేదు.
    "పోనీ మీ అమ్మా నువ్వూ వెళ్ళొస్తారా?"
    "ఇప్పుడెందుకు నాన్నా! ఏదయినా విశేషం వుంటే వెళతాంలే."
    "అది కాదురా! గుంటూరులో ఎవరో అమ్మాయి వుందట! మనవాళ్ళే! నీకు సంబంధం చూడండి అన్నారట. ఆ విషయమే ముఖ్యంగా రాసింది పిన్ని. నీవూ నేనూ వెళ్ళి చూసొద్దాం. నీకు అంగీకారమయితే అన్ని విషయాలు మాటాడుకోవటానికి వాళ్ళు వస్తారు" చప్పున అదే అవకాశం అన్నట్టుగా అంది అన్నపూర్ణ.
    ఆ మాట వినగానే శ్రీకర్ ముఖం మాడిపోయింది. కారుమబ్బులు చంద్రుడిని కమ్మేసినట్టుగా అయిందతని మనస్సు. తలవంచుకున్నాడు. ఏం సమాధానం యివ్వకుండా.
    "శ్రీకర్! వాళ్ళకి జ్యోతి విషయం తెలియదేమోనని విచారించక్కరలేదు. అంతా తెలుసు. తెలిసే పిల్లనిస్తారన్నారట...ఆ అమ్మాయికి కూడా తెలుసట యీ సంగతి!" 
    "అమ్మా! పెళ్ళి అనేది చాలా పవిత్రమైందమ్మా! అది జీవితానికొక్కసారే శోభనిస్తుంది. మళ్ళీమళ్ళీ కంకణం కట్టుకోవడం అవివేకం. అయినా ఒకసారి జరిగిన అనుభవం చాలు! జన్మ జన్మలకీ పెళ్ళి వద్దు అనేట్టుగా అయింది."
    "బాబూ! అది తప్పు అలా అనుకోకూడదు. భగవంతుడెలా రాసివుంటే అలా జరుగుతుంది. అందుకొకరు బాధ్యులుకారు. జ్యోతి అలా ప్రవర్తించటానికి ఎన్నెన్నో కారణాలు. ఆమె తండ్రిగారి విపరీతమయిన గారాబం, తల్లి లేకపోవటం, స్వతహాగా దుడుకు స్వభావం, యివన్నీ కారణాలు. అన్నిటికిమించి నీనుండి కూడా తప్పే వుండి వుంటుంది. ఒక్కచేయి విసిరితే చప్పుడు కాదు - రెండు చేతులు కలిస్తేనే చప్పుడయ్యేది. అలా అని నిన్నూ నిందించలేం_అంతా విధి అనుకోవాలి అంతే! అందుకే నిన్ను మళ్ళీ పెళ్ళి చేసుకోమంటున్నాను."
    విశ్వనాధంగారి మాటలు అతనిపై బాగా పనిచేశాయి. బాగా ఆలోచించుకుంటున్న వాడికిమల్లె కొద్దిసేపు ఆగేడు. "నాన్నగారూ! నాది అదో తరహా ప్రకృతి. నేను అందరితో అడ్జస్ట్ కాలేను. ఎందుకో జ్యోతి నా ఆశలకి, ఆశయాలకి సరయిన జోడీ అనిపించింది. కలిసిపోయాడు-అయితే ఆ కలయిక చాలా రోజులు నిలవలేదు. మీరన్నట్టుగా మా జంట ఆ భగవంతునికే ఇష్టంలేదేమో!"
    విశ్వనాధంగారు ఏదో చెప్పబోయారు. అంతలో శ్రీకర్ మళ్ళీ అన్నాడు.
    "అయినా నాన్నగారూ! నా మనస్సు యింకా జ్యోతి చుట్టూరా తిరుగుతూనే వుంది. ఎందుకో జ్యోతికి దూరంగా వుండలేననిపిస్తోంది ఒక్కోసారి. అలాగే జ్యోతి నన్ను విడిచి చాలాకాలం వుండలేదేమోనని కూడా అనుకుంటున్నాను. ఇవన్నీ పిచ్చి వూహలే కావచ్చు. అయినా మనసు పొరల్లో తారట్లాడే భావాల్ని దూరంగా తోసెయ్యలేం కదా!"
    "జ్యోతి మళ్ళీ వస్తుందని నమ్ముతున్నావా?"
    "నేను సంపూర్ణంగా విశ్వసించటంలేదు. అయితే ఏదో ఆశ అలా తళుక్కుమంటోంది."
    నిట్టూర్చాడు విశ్వనాధం-"శ్రీకర్! నీకు లోకం తెలియదు. నేను అనుభవించాను, చూశాను, పరిశీలించాను. తొలుత జ్యోతి విషయంలో నేను ఏది అనుమానించానో చివరికి అదే నిజమైంది. నువ్వు అప్పుడు కాదన్నావు నా మాటల్ని - నా ఎష్టిమేషన్ తప్పివుంటే ఎంతో సంతోషించేవాడిని. కానీ ఆఖరికి అదే నిజమైంది. ఇప్పుడూ అలాగేననిపిస్తోంది. జ్యోతి రాదేమోననే నా వూహ తప్పిపోయి ఆమె నిన్ను వెతుక్కుంటూ మనింటికి వస్తే అంతకంటే కావలసిందేముంది? కానీ శ్రీకర్! అది పగటి కల! ఒత్తి మానుచిగిర్చదు!"
    శ్రీకర్ సమాధానం ఇవ్వలేదు.
    "అయితే పిన్నికేం రాయమంటావు బాబూ!"
    "అమ్మా! పిన్నికి ఆ సంబంధం నచ్చలేదని రాసేయ్. లేదా నేనిప్పుడిప్పుడే మళ్ళీ పెళ్ళి చేసుకోనని రాసేయ్. జ్యోతి మనసులో వుండగా నేను నా జీవితంలోకి మరో అమ్మాయిని ఆహ్వానించలేను. పరధ్యానంగా యెవరిని చూసినా నా కళ్ళకీ జ్యోతిలాగే కనిపిస్తున్నారు. అలాంటి నేను ఇంకో అమ్మాయి జీవితాన్ని యెందుకు నాశనం చేయాలి? కానివ్వండి. కాలం గడవనివ్వండి. నా మనస్సో, జ్యోతి మనస్సో మారితే అప్పటికి ఏది సబబనిపిస్తే అలా చేయవచ్చు" తల్లిదండ్రులతో ఆ విషయం దాటెయ్యడానికి తోచిందేదో అనేశాడతను. తన మనస్సుని అద్దంలా పట్టి చూపి వెళ్ళిపోతోన్న కొడుకుని చూసి ఏమనలేకపోయారిద్దరూ.

 Previous Page Next Page