ముగ్గురు రౌడీలు వికృతంగాను హేళనగాను నవ్వి మీదకి దూకారు! రౌడీలు కండకావరంతో భీమబలంతో పోరాటానికి సిద్ధమవుతూ అమ్మాయిని గట్టిగా పట్టేయబోయారు. వాళ్ళకి అందకుండా సర్రున తాచుపాము కలుగులో దూరినట్లు అవతలకి వెళ్ళి నుంచుంది అమ్మాయి.
"ఇది గట్టి పిండంరోయ్!" ఒకడు అరుస్తూనే బొడ్లో కత్తి తీశాడు. ఇంకో రౌడీ లుంగీకివున్న బెత్తెడు వెడల్పు బెల్టు ఛర్రున లాగాడు. మరో రౌడీ జబ్బకి చుట్టుకున్న సైకిల్ చైన్ ని చేతిలోకి తీసుకున్నాడు.
ముగ్గురు అమ్మాయి మీదకి చేతిలో ఆయుధాలతో సహా అక్కడికక్కడే ఆ అమ్మాయిని చీల్చి చెండాడే ఉద్దేశంతో దూకారు.
ఒంటరిది, చేతిలో ఏ చిన్న ఆయుధములేనిది, అబల ఆడపిల్ల అయిన అంజలి సర్కార్ భయపడలేదు. అరవలేదు, పారిపోలేదు. ధైర్యమే వూపిరిగా సాహసమే లక్ష్యంగా, చేతులే ఆయుధంగా వాళ్ళతో తలపడింది. గాలిలోకి యింతెత్తు లేచింది. హ్హా... అంటూ ఒక రౌడీ చేతిలో వున్న కత్తిని ఎగరగొట్టింది. హ్హా.. అంటూ మరొకడి చేతిలో చైను దూరంగా వెళ్ళి పడేలా చేసింది.
వాళ్ళ చేతుల్లో ఆయుధాలు దూరంగా వెళ్ళిపడ్డాయి. ఉత్త చేతులతో వాళ్ళు పోరాటానికి ముందుకు వస్తుంటే అంజలి సర్కార్ మెరుపు వేగంతో వంగుతు లేస్తూ పక్కకి తప్పుకుంటూ ఓ కాలు ముడిచి మరోకాలు బారుగా జాపి గాలిలో పైకి లేచి తన్నుతూ విచిత్ర విన్యాసంతో కదులుతూ చేయిజాపి వంకరగా పెట్టిన వేళ్ళతో చిటుకు చిటుకు దెబ్బలు తీస్తూ, అలా చేస్తున్నంతసేపూ హ్హా.... హ్హా.... అంటూ సింహనాదంలా అరుస్తూనే వుంది.
రెండే రెండు నిమిషాలు! ముగ్గురు రౌడీలు మొదలు నరికిన చెట్టుల్లా తలో మూలకి వెళ్ళి పడిపోయారు ఏమీ జరగనట్లు కిందపడిన పుస్తకాలను తీసుకుని తాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది అంజలి సర్కార్.
అంజలి సర్కార్ స్టేజీ దిగి అటు వెళ్ళగానే రౌడీలు లేచి పరుగున స్టేజీ దిగి వెళ్ళిపోయారు.
కళ్ళార్పకుండా స్టేజీ మీద ఏం జరుగుతున్నదో చూస్తున్న వీళ్ళకి మెరుపు వేగంతో ఆ అమ్మాయి కదులుతూ వాళ్ళను కొట్టటం చూశారు. ఆ రౌడీలకి పట్టిన గతి గమనించారు. ఇక ఊపిరి పీల్చుకుని ఆలోచించాలి.
చూసేవాళ్ళకి ఆలోచించే అవకాశం యివ్వకుండా మరో ముగ్గురు వెంటనే స్టేజీ మీదకి వచ్చారు. ఆ వెంటనే మైకులో మాటలు వినిపించాయి.
"సోదరీమణులారా! ఒంటరిగా వున్న ఒక్క అమ్మాయి చేతిలో ఏ ఆయుధం లేకుండా ముగ్గురు రౌడీలను చిత్తుచిత్తుగా తన్ని తగిలేసింది. స్వయంగా మీరు మీ కళ్ళతో చూశారు.
ఇందులో ఏ మాయాలేదు కదా!
ఇది జరిగే పనేనా?
ఈ విషయం తర్వాత ఆలోచిద్దాము. ఇప్పుడు మీ ముందున్న ఈ ముగ్గురి కథ వినండి. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. రెండో ఆట సినిమా చూసి నడుచుకుంటూ వస్తున్నారు. బండ భీముడు లాంటి రౌడీ వాళ్ళ ముందుకు వచ్చి చేతిలో వున్న కర్రని వాళ్ళ మీదకి ఎత్తాడు. భయంతో భర్త పారిపోయాడు. భార్య అక్కడ వుండిపోయింది. అప్పుడు ఏం జరగనుందో మీరే స్వయంగా చూడండి."
ఈ మాటలు తర్వాత ఇందాక లాగానే "యాక్షన్" అన్న అరుపు వినపడింది.
స్టేజీ మీద నటన మొదలైంది.
సినిమా చూసి తిరిగి వస్తున్నభార్యాభర్త సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నడిచి వస్తున్నారు. బండ భీముడు లావుపాటి కర్రతో వాళ్ళ ముందుకి వచ్చి సొమ్ములు వాచీ డబ్బు అన్నీ తీసి ఇవ్వండని బెదిరించాడు. భర్త తిరిగి చూడకుండా కాలికి బుద్ధి చెప్పాడు.
"బాబూ నా జోలికి రాకు. కాళ్ళకున్న వెండి పట్టాలతో సహా తీసియిస్తాను." భయంతో చేతులు జోడించి అని.. కాలి పట్టాలు తీయటానికి వంగింది.