Previous Page Next Page 
సరస్వతీ మహల్ పేజి 30

                                    అలల కోమలి అందెల రవళి

    అడవిలో చిరుపాయలై వాకలై సోనలై జాలులై సాగిన కిన్నెర నృత్యం దివ్య నిస్వనంతో దిక్ దిగంతాల నంటింది. అపూర్వ రీతిలో "జిగిబెళ్కులా ధగాధగతళ్కులా జగాజిగికుల్కులా కిన్నెర బిగవుటందాలతో నగవు టందాలతో నిండుగా ప్రవహించింది. అలా తెలిపూల తేనేవాకలు పారే రీతిగా తెనుగు వాగై పారింది. కిన్నెర అందాల రాకతో బంగారు జిలుగు గంటలు మోగాయి అవి తేనెలై కలకండ సోనలై వానలై కోకిల గొంతులో కదలాడాయి. కిన్నెరపాట అందకత్తెల జిలుగు అందియలు మ్రోసినట్లు జిలుగులు పోయింది. ఇదంతా చూసి పొంగిపోయాడు కడలిరాజు.

    అతనికి గాలి పిల్లలె పోయి ఊదాయో? మొగిలు కన్నెలు పోయి చెప్పాయో, కాని ఆయనకి కిన్నెరసాని అందచందాలు చూడాలనిపించి మిర్రెక్కి చూశాడు. కోరికతో తటపటయి పోయి తపియించి పోయాడు. పాపం! అతనిలో నీటి గుణం ఏమైందో---- చల్లదనమేమయిందో! ఈ విరహాగ్ని పాలుకావడం అతనికి తగునా? గంగతన ఇల్లాలు కాదా? యమున తన ఇల్లాలు కాదా?" ఇంకా ఎంతమంది లేరు? ఇన్నేళ్ళు వచ్చి--- నా (ఏళ్ళంటే వయస్సని--- ఏరులని కూడా చమత్కారం కదా!) ఇంతచిన్న వాగును చూచి చిత్తం తత్తరపడడం తగునా.'

    ఈ ముసలి కడలి.... నలుగులర్లో తిరగనేర్చిన పెద్ద - కామానికి లౌంగి-తన "మర్యాద" తప్పితే - లోకాలు తప్పు చేస్తే సర్ది చెప్పగల సామంతుడు తానుగా తప్పుదారులకు దిగునా? అది తగునా? తను ఆశిస్తే మాత్రం ఆ కిన్నెరసాని తన్ను పొందుతుందా? తనకు దక్కుతుందా? వాగుగా అయ్యాక జలజలా బిల బిలా ప్రవహించి తన కౌగిట్లో దూరుతుందని భ్రమించడం - పొంగి పోవడం తగునా? ఆ మిడిసిపాటు చూసి జగాలన్నీ కలవరపడ్డాయి కానీ ఎలా పొంగిన కడలి అలాగే నిలిచిపోయింది. ఒక నీటిబొట్టయినా పొంగి రాలేదు. అది చూచిన జనానికి భయం పోయింది! దాంతో పిచ్చిగా అనుకున్నారు కడలి పొంగింది! కడలి ఉబికింది అంతే కానీ కడలి చెలియలి కట్ట దాటుతుందా అనుకున్నాడు.

    ఆ కడలిరాజు ఉలికిపాటు, ఉద్రేకం, పెంగిపోవడం, చూసిన కిన్నెర మనసులో పెద్ద దిగులు పుట్టింది ముందుకు సాగిపోతే ఆ రాజు ఐక్యంకాక తప్పదని ఆగాలని నీరు గడ్డ కట్టించుకోవాలని ఎంతో తలపోసింది. ఎంతో వగచింది, ఏడ్చింది. రాయడ్డంచేసి నిలిచింది. పొదలడ్డం పోయింది కానీ నీటి గుణాను గుణంగా కదిలిపోయింది. జల జలా బిల బిలా దుఃఖం ఆపుకోలేక హా అని ఏడ్చింది. తనలో అంతర్మధనం సాగింది. చుక్కనో మొక్కనో అయితే ఈ బాధ వుండేది కాదని బాధ పడింది. తమని-కడలని గూర్చి తర్కించుకుంది. అంతగా ఏడ్చిన ఏడ్పులకు నీళ్ళన్ని ఎర్రగా అయినా, తనువు నల్లనయి, నురుగులు తెల్లనైనడకలు వేగమై ఏడ్చింది. ఆ దుఃఖంచూసి పులులు మృగాలు వచ్చాయి. ఓదార్చాలని వచ్చి అవీ ఏడ్చేశాయి. అలా అలా ఏడ్పులు సాగి సాగి, మోగి మోగి గోదావరిని చేరితే ఆమె పొంగివచ్చింది, అభయమిచ్చింది. వారి సంగమం అద్భుతం, అపూర్వం.

    అప్పుడొచ్చింది. కిన్నెరకు వైభవం. రుతువు రుతువు మారే రుచులతో కారు కారు నమారే కాంతితో కిన్నెర చవులూరితే అది తెలుగు సత్కవిరాజు పలుకందుకోలేని చవులయింది. ఆమె సోయగం ఆమె నడక నల్లతాచులుదూకి నాట్యమాడినట్లుంటుంది. చివరికి నిర్మలంగా ప్రశాంతంగా తెలుగు యాత్రికులకు తెలుగుదైవము భద్రాద్రి రామయ్య దర్శనం చేసే యాత్రికులకు-ఆ చల్లని నీడ అందిస్తోంది. పుతాత్మ కిన్నెర భద్రాద్రి తోవను కాస్తోంది.

        ఇది ఒక అచ్చయిన తెలుగు కవి. స్వచ్ఛమైన తెలుగు కవితా మార్గం..... ఇందులో అట్టహాసం లేదు. ఎక్కడో తప్ప పదా డంబరం లేనేలేదు. "మున్ను భగీరధ భూపతి వెన్ను వెంట పరుగెత్తిన అన్నాక థునీ వైఖరి ... ఇక్కడ ఓ పదం. ఈ తరగల కదలికలో ఓ తరుణీ నీ కంఠ శ్రీతారుణ్యం... ఇక్కడో మాట గోదావరీ మహా కూలంక షామృత శ్రీదివ్య మధు తరంగాలు.... ఇక్కడో వాక్యం.... మండు టెండలు గాసి మాడ్చినది గ్రీష్మమ్ము. కొండ అంచులనుండి కురిసినది ఊష్మమ్మ.... ఇక్కడో అద్భుత ప్రాస.... శైవాభిషేక రంజన్నారి కేళ గర్భాంబుపుల్ అక్కడో సమాసం... ఇలా వెతికితే పట్టుమని అయిదో పదో దాటని కవిత్వపు పోకడలు తప్ప-అంటే కధా గానంలో లీనమై కవి గానంచేస్తూ వుంటే మధ్యమధ్య కవి విశ్వనాధను కాదని పండిత విశ్వనాధ కనిపించే చోట్ల తప్ప మిగతా అంతా ద్రాక్షా పాక కవిత్వమే! ఎవరూ ఏడవాలని ఏడవరు. ఏడుపు నటిస్తారేమో తప్ప గుండె గుబులు బుగులు మంటే కాని కంట్లో నీరు వాగై కురియదు. కవితా అంతే! గుండె కదిలి పదం ప్రిదిలి పద్యం కుదరాలి. అంతా కవితామయమే తప్ప పదాడంబరం పాండిత్యా డంబరం వుండనే వుండదు. భావ ప్రవాహం మెల్లనయితే నో - ఊహకంటే వాక్కు వెనుక పడితేనో తప్ప కవి ఫ్రౌడి తెలిసే పదం పడదు....---

    భావావేశ ప్రారంభ దశ కాబట్టి ఇదిగో చేతుల చాచితి ఏడ్చుచుంటి కంఠమెత్తి అన్నాడు కవి. ఈ నడకలో ఒక లయవుంది. ఒక గుణంతో పాటు గణమూ ఉంది. కానీ దుఃఖావేశం తగ్గాక వచ్చింది అసలయిన కవిత. అది కిన్నెర నడకల్లో అడుగడుగున కనిపిస్తుంది. 'నీలి మబ్బుల బోలు నిడివి నీ చేతుల్లో నన్నింక కౌగిలించగా రావు కాబోలు కడు ప్రేమగా చేరగా లేవు కాబోలు నెమ్మదిగా నా యేడల్ నిమరవు కాబోలు.... ఇందులో కవిత వుందా కథ ఉందా? బాధ వుందా అన్నట్టు కిన్నెర భర్త - వల్లనయ్యె కాబోలు - కాకపోతే నీలి మబ్బుల బోలు అని చేతుల రంగు చెప్పదు కదా! తెల్లని - ఎంత తెల్లని? తొలి వెన్నెల చివుళ్ళ తెలినిగ్గు విరజిమ్ము వెలది - కిన్నెరకూ నల్లని ఆమె భర్తకూ సఖ్యం ప్రధానం అయ్యింది. కానీ రంగు ముఖ్యం కాలేదు. బహుశా ఈ రంగుల తేడా కూడా కిన్నెర అత్త ఆరళ్ళకు ఒక కారణము అయ్యిందేమో!

    కిన్నెరసాని పాటలు నిజంగా తేనెలై కలకండ సోనలై వానలై తెలుగు దేశాన్ని రసింప జేస్తూనే ఉన్నాయి. కల్పవృక్షానికి ఆ మహా రామాయణ గాధకు జ్ఞాన పీఠ బహుమతి వస్తే వచ్చుగాక - కిన్నెరసాని పాటల్లోని కవిత్వం నిజంగా నోబుల్ బహుమతి రాదగింది.

    దీని జతకత్తె కోకిలమ్మ పెళ్ళి గురించి మరోసారి.


                                                       ----*----

 Previous Page Next Page