Previous Page Next Page 
సరస్వతీ మహల్ పేజి 29

                                                అమ్మా .... నువ్వింత వాడివా బ్రహ్మా

    మానవుల జీవిత విశేషాలను భవిష్యత్తును యోగాన్ని చెప్పేదే జ్యోతిశ్శాస్త్రం. ఆ జాతకం చెప్పడానికి జాతక చక్రం కావాలి. ఆ జాతక చక్రం తయారు చేసేందుకు లగ్న నిర్ణయం-అందుకు పుట్టిన సమయం కావాలి. పుట్టిన సమయాన్ని బట్టి మానవుల భూత భవిష్యత్ వర్తమాన విషయాలు చెప్పగలరు. జాతకాన్ని నిశితంగా పరిశీలించి ఫలితాలు చెప్పడంలో శాస్త్రవేత్త పొరపాటు పడవచ్చునేమో కానీ శాస్త్రం తప్పుకాదు. జన్మ కాలాన్ని బట్టి ఆధారలగ్నం నిర్ణయిస్తారు అంటే మానవుడు మాతృగర్భంలో నిక్షిప్తమైన సమయం. ఏతావాతా తేలిందేమిటంటే స్త్రీ పురుషుల కలయికకు కూడా మంచి సమయం కావాలి. పుత్ర యజ్ఞమది ఆవేశం ఫలితంగా పుట్టే సంతానం ఎలా వుంటుందో శ్రీ కాళహస్తి మహాత్మ్యం చెబుతుంది. నమ్మినా నమ్మకపోయినా కలయిక సమయంలో భార్యాభర్తల చిత్త వృత్తులు సంతానానికి వస్తాయి. నేటి జన్యుశాస్త్రవేత్తలు కూడా ఇదే నిర్ణయిస్తారు.

    శ్రీకాళహస్తి మహత్మ్య కధ చూద్దాం---

    ఒకప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మకు సృష్టికార్యం మీద విపరీతమైన వాంఛ పుట్టుకొచ్చిందట అందుకని భార్య సరస్వతితో "నా వాంఛ చాపల్యం తీరాలంటే నువ్వు నూరురూపాలు దాల్చాలి. నువ్వలా వంద సరస్వతులుగా రూపాంతరం చెందితే నేను శతానందుడిని అవుతా!" అని అడిగాడు. అలాగే సరస్వతి వంద "భాషాయోష"ల రూపం ధరించింది.

    బ్రహ్మ బ్రహ్మానంద భరితుడయినారు.

    ఇళ్ళల్లో, కొండ చరియల్లో, మేడల మీద, నదీ తీరాల్లో, పూపొదరిళ్లలో, దేశం, కాలం సమయం, ఆ సమయం అనే విషయాలు మరచి కామాంధుడై కోరిక తీరేలా తిరిగేడు. అరవై గడియలు రతి ఆనందంతో గడిపేశాడు. పుణ్యం, పాపం అనుకోకుండా అదే పనిగా కామలోలుడయ్యాడు.

    ఫలితంగా---

    ఆయనకి ముప్పయి వేలమంది రాక్షసులు పుట్టుకొచ్చారు. వాళ్ళంతా క్రూరులు, ధూర్తులు, దోషులు, జగత్ ద్రోహులు, మహా భయంకరులు, ధర్మ విరోధులు, పర స్త్రీ సుఖలాలసులు, ఆచార భ్రష్టులు, లోక కంటకులు, నిర్దయులు, పుట్టీ పుట్టగానే తమ పుట్టుకకు కారకుడైన సృష్టికర్త వద్దకు వెళ్లారు, మొక్కారు. "పజా పతీ! చెప్పండి, శ్రీ మహాలక్ష్మిని చెరపటట్టి తెమ్మంటారా? వెండి కొండను పిండి చెయ్యమంటారా? శేష శాయిని ఒక ఆట ఆడించమంటారా? భూమిని పెగిలించమంటారా? మృత్యు కోరలు విరగదన్న మంటారా? యముడ్ని పారదోలాలా? ఏడు కొండలూ పై కెగరవేసి బంతాట ఆడుకోమంటారా?" అని అడిగారు.

    ఒక్కో యుగంలో ఒక్కో రాక్షసుడు ఒక్కో దుర్మార్గం చేశాడు. హిరణ్యాక్షుడు భూమిని పెకిలించాడు. వరాహ రూపంతో దాన్ని విష్ణువు ఆపేడు. అలా ఒక్కొక్కరి కోసం విష్ణువు ఒక్కో అవతారం ఎత్తాల్సి వచ్చింది.

    మరి వీళ్లో!

    అవన్ని తామే చేస్తాం అంటున్నారు.

    వీళ్ళను చంపి లోకాల్ని రక్షించాలంటే!

    అంతా విన్న బ్రహ్మ నాలుగు తలలు పట్టుకున్నాడు. "హత విధీ!" అనుకున్నాడు. కళ్ళకు కావరం కమ్మి కామాంధ కారంతో చెరలాడినందులకు ఈ చేటు అనుకుని - తన పనికి తానే వగచి - అందర్నీ వింధ్యకు పొమ్మని ఆజ్ఞాపించాడు.

    వాళ్ళు అమిత ఉత్సాహంతో వెళ్లారు అక్కడ---

    జంతువులను చంపారు. మింగారు. ఋషి పత్నులను చెరపట్టారు. దేవతల నగరాలను ముట్టడించారు. మునుల తపస్సు చెడగొట్టారు. పురుషుడెదురైతే చంపేవాళ్ళు.

    స్త్రీ ఎదురైతే చెరిచే వాళ్ళు. సంపదలు దోచేవాళ్ళు లోకంలో  సుఖశాంతులు లేకుండా చేశారు. చేస్తే ---

    భూదేవి వెళ్ళి మొర పెట్టుకుంది.

    అది విని బ్రహ్మ కోపించాడు. ఆ కోపంలోంచి "ఉగ్రుడు" అనే వీరుడు పుట్టుకొచ్చాడు. అతడికి ఉగ్రసింహ రధాన్నీ, అస్త్రాలను, శస్త్రాలను, వజ్ర కవచాన్ని ఇచ్చి- "కుమారా! యుద్ధంతో ఆ ముప్పైవేల మందినీ చంపెయ్, నా కొడుకులు అనుకోవద్దు. నీ అన్నలు అని సంకోచించవద్దు- వాళ్ళు లోక కంటకులు. వాళ్ళవల్ల లోకాలన్నీ తలకిందులవుతున్నాయి. వెళ్ళు చంపిరా!" అని పంపాడు.

    వాళ్ళతో యుద్ధంచేసి అందర్ని చంపి తిరిగొచ్చి తండ్రి ఎదుట నిలిచాడు ఉగ్రుడు.

    ఆ కొడుకుల దుష్టవర్తనం ఈ కొడుకు వాళ్ళను చంపడం అంతా మనసులో మెదిలి బ్రహ్మ మనస్సులో కోపం పుట్టింది మళ్ళీ. ఆ క్రోదంలో ఉగ్రుడూ భస్మమయ్యాడు.

    కొడుకులు పోవడం - పుత్ర హత్యా దోషం చుట్టు కోవడంతో శివుడి గూర్చి తపస్సు చేశాడు బ్రహ్మ -
    కధ అంతే అయినా - గమనించాల్సింది - సంతాన కారణం ఆ సమయంలో తల్లిదండ్రుల మనస్తతం.... తత్ఫలితం

                                                  ----*----

 Previous Page Next Page