Previous Page Next Page 
సరస్వతీ మహల్ పేజి 31

                                                                శృంగార బంగార శ్రీనాధం

    ఆయన మహాకవి. త్రిమూర్తుల్లో బ్రహ్మ, శివుడికంటే విష్ణువు ప్రపంచవృద్ధికి ఎలా కర్తయ్యాడో-అలాగే తెలుగు సాహిత్యానికి ఆయన శ్రీ మహావిష్ణువు అతడే శ్రీనాధుడు.

    తెలుగు సాహిత్యాన్ని తేజోమంతం చేసే కావ్యాలు శృంగార నైషధం, కాశీఖండం, హరవిలాసం, భీమేశ్వర పురాణం, శివరాత్రి మహాత్మ్యం (క్రీడాభిరామం) రాసినా తెలుగువారికి బాగా తేట తెల్లగా ఉండి చల్లగా పాడుకునేందుకు - తెలుగువారికి తెలుగు ఛందస్సు ద్విపదలో రాసిన మహాకావ్యం పల్నాటి వీర చరిత్ర.

    శ్రీనాధుడు కొండవీటిరెడ్ల ఆస్థానం చేరిన తరువాత (చేరకముందు కూడా దేశద్రిమ్మరే) వివిధ ప్రదేశాలు చూశాడు. వివిధ రాజస్థానాలు చూశాడు. అక్కడి కవులతో వాగ్యుద్ధాలు, సంవాదాలు, చర్చలు చేశాడు. ఊరూరు తిరుగుతూ వర్ణనలతో స్త్రీలను రూపు కట్టించాడు. ఆయన సాహిత్యం ఎంత విలువైందో-ఆయన చెప్పిన చాటువులు చెప్పే చరిత్రని సాంఘిక వ్యవస్థని అవి కళ్ళకు కట్టినట్లుగా నాటి దేశకాలమాన పరిస్థితుల్ని చెబుతాయి. శిలాశాసనాల కన్న స్పష్టంగా రాజశాసనాలకన్నా సూటిగా చెపుతాయి.

    ఆయన అలా తిరుగాడే రోజుల్లో పలనాడు వెళ్ళాడు. అప్పుడు ఎన్నో అనుభవాలు ఎన్నో ఆనందాలు అన్నిటికీ అన్ని పద్యాలు-మంచినీళ్ళు దొరకపోతే సిరిగలవారికి చెల్లును తరుణుల పదియారువేల తగ పెండ్లాడన్ తిరిపెమున కిద్దరాండ్రా! .... పరమేశా గంగ విడవు పార్వతి చాలున్.

    శివుడి నెత్తిమీద గంగమ్మ దిగొస్తే తప్ప నీరుపుట్టని దేశం అది. రాజుల, రారాజుల, మహారాజుల, మహామంత్రుల సరసన మహారాజభోగం అనుభవించాడు. విస్సనమంత్రి స్వర్గస్తుడయ్యాడని హేమపాత్రాన్నము ఎవని పంక్తిలో కలదని బాధపడిన భోగి అప్సరోభామని వక్షజోద్వయ కుంభి కుంభాలపై కస్తూరి వాసనలు చిమ్మడానికి కస్తూరి భిక్షవేడిన మహాభోగి, అలాటివాడు - భోజన సమయంలో జొన్నకలి, జొన్నము, జొన్న అంబలి, జొన్న పిసరు, జొన్నలే తప్ప సన్నన్నం మాటేలేకపోతే ఎలా తినగలడు.

    ఇక ఆ ఊళ్ళో ఊరు వ్యాఘ్రనగరం (పులిపాడు) ఉరగంబు (నాగయో! శేషయ్యో!) కరణం, కాపు కపివరుడు (హనుమయ్యో, ఆంజనేయులో) కసవు (పుల్లిగాడు) నేడు ... అలాటిచోట ఇలాంటి కవికి ఏం మర్యాదలు జరిగి ఉంటాయి. అందుకే నోరు తీరా తిట్టేశాడు.

    అలా తిరుగుతూఉంటే కారెంపూడి వచ్చాడు.

    అక్కడ---

    వీరులు దివ్యలింగములు విష్ణువు చెన్నుడు తల్లిపోతరా
    జారయ భైరవుండు తుహినాద్రి జయాంకము నిర్మలంబులై
    కేరెడు గంధగార మడుగే మణి కర్ణిక యన్ని రీతులన్
    కారెమపూడి పట్టణము కాశిగదా పలనాటి వారికిన్

    అంతగా ప్రస్తుతించాడు కాబట్టే మనకు పలనాటి చరిత్ర పాడి పోయాడు.

    భారతానికి ఎంత ప్రశస్తి, ప్రకాస్తి ఉందో పలనాటి భారతానికి అంతే ప్రశస్తి, ప్రకాస్తి ఉంది. భారతంలో అభిమన్యుడికి ఎంత ప్రాముఖ్యత ఉందో, పల్నాటి చరిత్రలో బాలచంద్రుడికి అంతే ప్రాముఖ్యత ఉంది. ఆది చదువుతూ ఎంత పొంగిపోతారో ఇది వింటూ అంతే పొంగిపోతారు జనం! భారతంలో అశ్వద్ధామ అగ్రతః చతురోవేదాః పృష్టతః సశరం ధనుః

    ఇదం బ్రహ్మ్య మిదం క్షాత్రం శాపాదపి శరాదపి అని ఉన్నట్టుగా ఇందులో ఈ పల్నాటి వీర భారతంలో అనపోతు ఉన్నాడు. అది ఎలా ప్రత్యక్షర రసార్ణవమో ఇదీ అలా ప్రతి పద రసోదయం.

    అన్ని కావ్యాలు రాసి, అన్ని చాటువులు చెప్పి అఖిలాంద్రావళి మోదం వడసిన కవి సార్వభౌముడికి - ఈ చిన్న ద్విపద రచన ఎందుకు చేయాలన్పించింది. చేసింది చాలకా? తృప్తిలేకా? విషయ పరిపూర్ణత విశిష్టత కారణమా? రణమా?

    మాచర్ల చెన్న కేశవుడు కలలో కన్పించి శౌర్యంబు పుణ్యంబు సమకూర్చినట్టి పలనాటి వీరుల భాగవతం అంకితం ఇమ్మన్నాడు. దానికి కవిగారు పలనాటి వీరుల చరిత జనులెల్ల భక్తిచే చదువుట కొరకు మంజరిద్విపదగా .... వచః శ్రీ మెరయగ చెప్పబూనాడు.

    దేవుడు పలనాటి వీరుల భాగవతం అన్నా అందరూ దీన్ని భారతం తోటీ పోల్చారు మరి!
    ఇంతకూ భారత యుద్ధానికి ఏదో రీతిగా ద్రౌపది కారణం అయినట్లుగా ఈ పల్నాటి యుద్ధానికి కారణం నాగమ్మనే నాయకురాలు - అటు బ్రహ్మనాయుడు ఇటు నాగమ్మగా రాజ్యతంత్రం రణతంత్రం సాగింది. భారత యుద్ధానికి జూదం ఎలా ప్రాతిపదికో ఈ యుద్ధానికి కోడి పందాలు అలా మూల హేతువు. గురజాల వాళ్ళు మాచర్ల వెళ్లి రాజ్యం నిర్మించుకున్నా-రాకపోకలు సాగుతూ సంబరాలలో అంబరాన్నంటే పొరపచ్చాలు వచ్చి పాండవులు అడవికి వెళ్ళినట్టే మాచర్ల వదిలి వలసపోయి తర్వాత అక్కడ లాగా ఇక్కడ యుద్ధం. భారతానికి శ్రీకృష్ణుడిలాగా ఈ పల్నాటి కధకు బ్రహ్మనాయుడు శకునిలా తంత్రం నడిపింది నాయకురాలు. కధ అంటే కధనంలో కదను తొక్కుతుంది శ్రీనాధుని కలం.

    అక్కడ యుద్ధం జరుగుతుంటే ఇక్కడ బాలచంద్రుడు బొంగారాలు ఆడ్తుంటాడు. ఆటలో బొంగరం వెళ్లి అన్నమ్మ అనే వైశ్య కాంతకు తగిలి ఆమె మూర్ఛపోతుంది. తర్వాత తేరుకుని బాలచంద్రుడికి చీవాట్లు పెడుతుంది. ఓరి దురాత్ముడా! ఓరి దుర్మార్గ! క్రిందు మీ దెరుగ కెరలు చున్నావు. గర్వమేటికి నీవు.... కలిగిన తినవలె కట్టంగవలయు.... ముదిరె మదంబు నీ మురిపెంబు క్రుంగ...త్రుళ్ళుచునున్నావు. దుష్ట చిత్తుండ.... చూచెదు కనులకు సూదులగుచ్చ. మీ అయ్య లెల్లను మించిన బలిమిచేరి వైరులతోడ శ్రీ యుద్ధభూమి ఉప్పొంగు చున్నవారు ర్వీశునెదుట వారిలో కలియు నీవడి కానవచ్చు పోతు సింహమురీతి పోదలుచున్నావు అని ఆమె చెరిగిపోస్తే-నయవిదుడైన బాలచంద్రుడు నొప్పి కల్గుటచే నోరాపలేని అనరాని మాటల అడితిగాని బొంగరం బదితాకెనిన్ను నా తప్పు మన్నింపు "నయభావమున" అని క్షమాపణ అడుగుతాడు.

    అక్కడినుండి తల్లి ఐతమ్మ వద్దకు వెళ్లి ఎక్కడ యుద్ధం ఏమిటి కథ అని అడుగగా ఆమె మూర్చబోతుంది. యుద్ధాన్ని భయంకరంగా వర్ణిస్తుంది. ఘనకరీంద్రముల ఘీకారరావంబు సాంద్రతురంగ హేషా విజృంభణము రధనేమి సంకుల ప్రబల శబ్దంబులమిత పదాతి చయ అట్టహాసంబు భేరిడమాముల ఫీళ్ళను మ్రోత" ఎలా సహిస్తావు. నీవేడరణమేడ నీ బలమేడ? బాలురతో నాడు పగిది కాదోయి చెక్కులు మీటిన చిందును పాలునుదురు మీటిన నూనెవెళ్ళెడును గండ్రతనంబుల గైకోకు తనయ అని మందలిస్తుంది,

    అయితే కుర్రాడు "నలగాము డెరుగును నాదు శౌర్యంబు-ఎదురెవ్వరే నాకు" అంటాడు. పేరు పేరున ప్రళయరుద్రుని, అర్జుని, భీముని, హనుమను, రాముని పోల్చుకుంటాడు. దానికామె ఆ అబ్బరాల కొడుక్కోసం అమ్మా అబ్బా ఎంత తపించారో చెబుతుంది. అయినా బాలుడు వినడు. ఆమె అతడ్ని అతని భార్య మాంచాల సెలవు తీసుకోమని చెప్పి పంపుతుంది. మగువ మాంచాల మరో మచ్చు తునక. ఆమె భర్తని దీవించి ఖడ్గం ఇచ్చి పంపుతుంది.

    అసలీ బాలచంద్రుడు.... గత జన్మల్లో లోహితుడు, ప్రహ్లాదుడు, సిరియాళుడు, అంగదుడు, కుశుడు, అభిమన్యుడు .... నట ఇదంతా బాలల కధ, బాల మనోహరమైన గాధ.

    ఘనుడైన శ్రీనాధ కవిరాజ రాజు
    చెన్నుని కృపచేత చిత్తముప్పొంగి
    బాలు విక్రమ ప్రావీణ్యమెల్ల
    జనులకి వివరించె....

    ఆసక్తితో దీనిని పాటించి చదివిన, వ్రాసిన వినిన బంధువులు, పుత్రులు, పౌత్రుళు హెచ్చ సకల శుభములు సమకూరు ఇక చదవండి.

                                                      ---*---
 

 Previous Page Next Page