Previous Page Next Page 
అహల్య పేజి 29


    గగనంలో ఎత్తున ఎగురుతూ ఉన్న గద్ద కింద భూమ్మీద ఉన్న పిల్లవాడి చేతిలోని పిండి వంటను లేదా తల్లిని చూసి దూరంగా చిన్న చిన్న కాళ్లతో ఎగిరెగిరి ఆడుకునే కోడి పిల్లనూ నిశిత దృష్టితో చూసి, అమిత వేగంతో రివ్వున నేలకు దిగి ఆ పదార్ధాన్ని లేదా ఆ పిల్లను నోట కరుచుకుని తిరిగి అదే వేగంతో పైకి ఎగిసిపోతుంది.


    రావణుడి దృష్టీ అలాంటిదే. అంత ఎత్తున అంతరాళంలో ఎగురుతున్న పుష్పక విమానంలో కూర్చుని ఉన్న రావణుడికి ఆ తపోనిష్టాగరిష్టురాలు స్పష్టంగా కనిపించింది. అతని సంకల్పమాత్రంతో పుష్పకం కిందకి దిగసాగింది.


    క్రమ క్రమంగా నేలను చేరుకుని ఓ సమున్నత స్థానంలో ఆగింది. రావణుడు పుష్పకం నుండి కిందకు దిగి అటుగా నడిచాడు.


    ఆమె మౌన ముద్రలో నిమీలిత నేత్ర అయి ధ్యానంలో ఉంది.


    ఆ విశాలమైన ఫాలభాగాన దివ్య తేజస్సు- నుదుట దిద్దిన కుంకుమ సాక్షాత్తూ శివుడి ఫాల నేత్రంలా భాశిస్తూ ఉంది. వినీల కేశపాశం వీపంతా కమ్ముకుని మరింత కిందకు సాగి వితర్ధికణు కమ్ముకున్నది.


    మూసిన ఆ కనులు ఆ కర్ణాంత విశాలంగా ఉన్నాయి. చెవులు శ్రీకారాలకి ఆకారం దిద్ది తీర్చగలవి అన్నట్టున్నాయి. నాసిక ధృడ చిత్తాన్ని కఠోర నియమాన్ని ప్రతిబింబిస్తున్నది. శ్వాసను క్రమబద్దీకరించి అంతర్ముఖి అయి ధ్యానిస్తూ ఉన్నదామె.


    ఆమె ధ్యాన సముద్రా ముద్రిత సౌందర్యం రావణుడి కన్నుచెదిరేలా చేసింది. మనస్సంతకుముందే చెదిరింది. నిగ్రహం అంతకు పూర్వమే చెదిరింది. ఆమె సౌందర్యానికి దాసుడైపోయాడు రావణుడు. మనస్సు చిక్కబుట్టుకోలేక- నిగ్రహాన్ని నిలుపుకోలేకపోయాడు. 'సుందరీ' అంటూ పిలిచాడు.


    ఆమెకా పిలుపు వినిపించలేదు.


                                     19


    నందనం వనం ప్రవేశించిన మహేంద్రుడిని అల్లంత దూరాన్నే చూసిన యక్షులు, గంధర్వులు, కింనరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, దేవతలూ చప్పున అక్కడి నుంచి కదిలి అదృశ్యమయ్యారు.


    ముల్లోకాల యేలిక తను ముచ్చటపడి అచ్చెరగణం అందచందాలను ఆస్వాదించడానికో, అచ్చర లేమలతో ముచ్చటించడానికో లేక శచీదేవితో వన విహారం సలపడానికో అదేదీ కాకపోతే ఒంటరిగా ఉద్యానవనంలో తిరుగాడుతూ కల్పవృక్షచ్చాయలో సేదతీరుతూ కల్పవృక్ష ఫలాన్ని ఆరగిస్తూ మందాకినీ సలిత శీతలత్వాన్ని అనుభవిస్తూనో సమయం గడపడానికి విచ్చేస్తాడు.


    ఆయన ఏకాంతాన్ని అభిలషిస్తూ వస్తే ఆ ఏకాంతానికి భంగం కలిగితే సహించలేడు. తీవ్ర శాపానికో కోపానికో గురికాక తప్పదు. శాపమంటే లోక బహిష్కరణే! అందుకే ఆ మహేంద్రుడు అల్లంత దూరాన నందనోద్యాన ముఖుడయి వస్తూంటే అందరూ తొలగిపోతారు.


    ఇంద్రుడు మహేంద్ర దర్పంతో నందనోద్యానం ప్రవేశించాడు. పై నుంచి వీచే పిల్ల తెమ్మెరలకు పరవశించాడు. వైకుంఠం వెళ్ళి వచ్చిన వ్యగ్రత అంతా క్షణాల్లో మాయమయింది. ఇంద్రసఖి మనస్సులో ప్రవేశించింది. ఆ వెంటనే ఇంద్రసఖి గుర్తుకురాగానే అహల్య... అహల్య వృత్తాంతం అంతా గుర్తుకువచ్చింది. మనస్సంతా చేదు తిన్నట్లయింది.


    'అహల్యా! అహల్యా!' అనుకున్నాడు.


    ముల్లోకాల ఏలిక తను- ముగ్గురు మూర్తుల తర్వాత సమస్త లోకాలకూ అధినేత తను- తన ఆయుధం వజ్రాయుధం. వజ్రాయుధం సాటిలేని ఆయుధం.


    తన ఏనుగు ఐరావతం- ఆ తెల్ల ఏనుగు ఏనుగులన్నింటిలోనూ శ్రేష్ఠతనం. తన సభ సుధర్మ. అలాంటి సభ ఆ విష్ణువుకే లేదు. మరి ఇంకొకరి మాట ఎందుకు తలవాలి?


    తలవాల్చి తదితర దేవతలంతా తన చరణాలకు ప్రణమిల్లుతున్నారు. ఏ యజ్ఞంలో అయినా సరే 'ఇంద్రాయ స్వాహా' అనక తప్పదు. అంతటి గొప్ప పదవి తనది. అంతటి గొప్ప శక్తి తనది. అంతటి గొప్ప పేరు ఉంది తనకు.


    కానీ కానీ అవన్నీ ఇప్పుడు వ్యర్థం అనిపిస్తున్నాయి. అహల్య అందం ముందు అవన్నీ దిగదుడుపే కదా!


    ఆ అహల్య కోసం తను ఇలా వగచి, వంతల పాలవుతున్నాడు! మరి ఆ అహల్య ఎలా ఉందో తాను వెళ్ళి సర్వం చక్కగా కనుక్కుని వస్తానన్నది ఇంద్రసఖి. హూ! ఇంద్రసఖి! పేరెంత చక్కగా పెట్టుకున్నది? తన దాసి, తన దూతి, తన శచీదేవికి చెలిమి కత్తె.


    దాని పేరేమిటో! ఎన్నడూ పేరు గురించి తలచి పిలవాల్సిన అవసరం రానేలేదు. భూలోకం వెళుతూ తను ఇంద్రసఖిగా పరిచయమవుతానన్నది. వెళ్ళింది. వచ్చింది. ఏం వార్త తెచ్చిందో?


    అసలు ఆ అహల్యకు తను గుర్తున్నాడా?


    ఆ గౌతమాశ్రమంలో నిత్యం వచ్చీ పోయే జడదారులతో, వారికై చేసే సేవలతో ఆపై గౌతముడి సేవలో అప్పుడు సత్యలోకంలో జరిగిన సంగతులు నెమరు వేసుకునే తీరిక ఉంటున్నదా తనకు?


    'ప్రభూ!'


    ఆ పిలుపుకి తన ఆలోచనల్లోంచి బయటపడి చూశాడు ఇంద్రుడు. ఎదురుగా దూతి. ఆమెని చూడగానే ఇంద్రుడి ఆశలు ఆలోచనలు ఉవ్వెత్తున ఎగిశాయి.


    'ఏమే! ఏమయిందే సఖీ! సఖీ ఏమన్నదే. తాను క్షేమమా! మా క్షేమం అడిగిందా? ఆమె సుఖంగా ఉందా? మా సుఖ సంతోషాల గురించి ఏమన్నా అడిగిందా? ఆశ్రమంలో ఆమెకెలా సాగిపోతున్నది?

 Previous Page Next Page