Previous Page Next Page 
డి.కామేశ్వరి కథలు పేజి 29


    "వరాలూ, అమ్మబాబోయ్, ఈయనకి వండిపెట్టడం నావల్ల గాదే తల్లి. ఏం చేసినా ఎలా చేసిన వంక పెట్టకుండా తినడాయన, ప్రతిదానికి బర్రు బుర్రు కసురుకుంటూ మాట్లాడతారేమిటి - ఏదో ఓ నెల రెండు నెలలు పాటు, విశ్రాంతిగా - ఒక్క మనిషిగదా కాస్త పడకేసి పడేసి హాయిగా వుందామనుకున్నాను గాని ఇదేం మనిషి బాబూ, ఏమిటలా కసురుకుంటాడు ప్రతిదానికి, పెళ్లాం అనుకుంటాడా - 'పెరట్లో అంట్లు తోముతున్న వరాలు దగ్గిర మొర పెట్టుకుంది సీతమ్మగారు - రాజేశ్వరి వెళ్ళి పట్టుమని పదిరోజులు కాలేదు కాని, పది రోజులలోనే ఆయన తత్వం అర్థం అయి, ఆయన మాటతీరు ప్రవర్తన నచ్చక చిన్నపుచ్చుకుంది ఆవిడ -" నా వంటకి వంకలు పెడ్తాడేమిటి ఎన్ని శుభకార్యాలకి, పెళ్ళిళ్ళకి వండినదాన్ని - రోజుకి రెండొందలు సంపాదించుకుంటాను, ఈయనేమనుకుంటున్నారో నా గురించి ఏదంటే అదిపడి, వుంటాననుకుంటున్నారేమో-' ఉక్రోషంగా అంది.
    'అయ్య అంతే నమ్మ - పాపం అమ్మగారు నోరు మూసుకి పడివుంటుంది గనక ఈయన గారి ఆటలు సాగుతాయి - కాస్త నోరున్న ఆడదయితే యింట్లో ప్రతిరోజూ అగ్గిరాజేయకుండా అగ్గిరాజుకునేది. అమ్మ వెళ్లాక అయ్యకి తెలుసొస్తుంది. అమ్మ వంట బాగుందని, అమ్మ టిఫిను బాగుందని, అమ్మ వుంటే ఇల్లు శుభ్రంగా వుండేదని.. నన్నూ సతాయిస్తున్నాడు గదా యీ కుర్చీ లాగావు, ఆ మూల తుడవలేదు, బట్టలు తీసి బాగాలేదు అంటూ సాధించుకున్నాడుగా -" ఆ పాపం ఆవిడ ఓ రెండు నెలలు ఆయన్ని కనిపెట్టుకుని వండి పెట్టాలి అంటూ ఎక్కువ జీతం ఇస్తానంటే కాదనలేక వచ్చాను - ఇలా సాధిస్తే పోతా నేను గతిలేక పడాల్సిన ఖర్మ నాకేం లేదు' కోపంగా అంది సీతమ్మ.

                                             *    *    *    *    *

    అమెరికాలో కొడుకింటికి వచ్చాక నిజంగా రాజేశ్వరికి శారీరకంగా మానసికంగా మంచి విశ్రాంతి దొరికినట్టు చాలా హాయిగా ఆనందంగా వుంది. మనవళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో గేమ్స్ ఆడుతూ, కథలు చెపుతూ ఏ బరువు బాధ్యతలు లేకుండా నిశ్చింతగా వుండడం ఎంతో నచ్చింది. కొడుకు కాపురం చూస్తుంటే భార్యభర్తలంటే ఇలా వుండాలి, ఇదీ అన్యోనత, ఇదీ సంసారం అంటే అన్పించింది. ఇద్దరూ ఉద్యోగస్తులు. యిద్దరు చెరోపని చకచక చేసుకుంటారు. కొడుకు పిల్లల బట్టలు ఇస్త్రీ చేసి వాళ్ల బూట్లు తుడిచి పిల్లల్ని రెడీ చేస్తాడు పక్కలు దులిపి వేసేస్తాడు పొద్దుటే - కోడలు ఫలహారం, వంటపని చూస్తుంటే మిగతా పనులు అతను చూసుకుంటాడు - ఏ చిన్న పొరపాటు చేసినా భార్యకి 'సారీ - వెరీ సారీ అంటూంటాడు - థ్యాంక్సులు సరేసరి - కోడలు వినోదినీ అంతే ఏదన్నా మర్చిపోతే 'అయ్యో సారీ అంటుంది. 'ఫర్ గెట్ ఇట్ ఓకే' అంటాడు తేలిగ్గా కొడుకు - చేయలేదే - మర్చిపోయావు - నామాట లెక్కలేదు అంటూ దెప్పుళ్ళు సాధింపులు వారిమధ్య లేవు. డిన్నరు టేబులు దగ్గర నలుగురూ సరదాగా ఆఫీసు కబుర్లు, స్కూలు కబుర్లు, స్నేహితుల గురించి చెప్పుకుంటారు - పిల్లల్ని కసరడం, తిట్టడం, కోప్పడం లాంటివి లేవు - ప్రేమగా నచ్చచెప్తారు - అలా అని తండ్రి తల్లి అంటే వాళ్ళకి ఎంత భక్తి, భయం - 'ఆ' అంటే ఆగుతారు. వంటలో లోటుపాట్లు వచ్చినా కొడుకు ఎంత సున్నితంగా హాస్యంగా ఎత్తిచూపుతాడు- 'అయ్యో' అంటుంది ఆ అమ్మాయి నవ్వుతూ. ఒక్కపూట వంటలో ఉప్పో, కారమో ఎక్కువైతే కావాలని చేసినట్టు, నేరం చేసినట్టు దుయ్యపట్టే భర్తతో పోల్చుకోకుండా వుండలేకపోయేది. ఏభైఏళ్ల సంసారం ఎప్పుడైనా ఇలాంటి చక్కని అనుభూతులు మిగిల్చిందా - ఇలా ఆప్యాయంగా దగ్గిర కూర్చుని కబుర్లాడుకున్నారా తము - ఒకరి అనుభవాలు ఒకరు చెప్పుకున్నారా! ఒకరి భావాలు ఒకరు పంచుకున్నారా - ఒకరి ఇష్టాలొకరు తెల్సుకున్నారా - ఎంతసేపు వన్ వే ట్రాఫిక్ లాగా ఆయన మాట, ఆయన పంతం, ఆయన ఇష్టాయిష్టాలు తప్ప భార్యగా ఆ ఇంట్లో సర్దుకు బతకడం తప్ప ఇలాంటి ఇచ్చిపుచ్చుకునే ఆనందం తన సంసారంలో ఏరోజు దొరకలేదు - అన్యోనత, అనురాగం అన్నపదాలకి అర్థాలే తెలీకుండా ఏభైఏళ్లు సంసారం చేసింది - అన్నింటికి మాదిరి దీనికి పెట్టిపుట్టాలేమో! అన్నింటిని మించిన సంపద భార్యాభర్తల మధ్య అన్యోన్యత అన్నది వీళ్ల సంసారం చూశాకే తెలుస్తూంది. పోనీ కోడలు అదృష్టవంతురాలు - కొడుక్కి తండ్రి వారసత్వం అబ్బలేదు - నయమే అనుకుంది.
    వచ్చి యిరవై రోజులు దాటాక 'మీ నాన్న ఎలా వున్నారో, నేలేని లోటు కాస్తయినా తెల్సిందో లేదో-' అంది భోజనాల టేబుల్ దగ్గర -
    'ఎలా వుండడానికి ఏముంది - వారం వారం ఫోను చేస్తున్నాగా, బాగానే వున్నారు'
    'ఆ బాగుండడం సరేలే-' నవ్వింది రాజేశ్వరి.
    'అమ్మా, కొన్నాళ్లు నాన్న సంగతి మర్చిపో, కనీసం ఇక్కడున్నన్ని రోజులు అయిన హాయిగా వుండు-' అన్నాడు నరేష్.
    'బాగుంది ఎలా మర్చిపోతారు - ఏభై ఏళ్ల అనుబంధం - చెప్పినంత సుళువుగాదు అంది కోడలు వినోదిని.
    'పోనీ నీకంత అనిపిస్తే ఫోనుచేసి మాట్లాడు' అన్నాడు తేలిగ్గా.
    "వద్దు - వద్దు - వూరికే అన్నా- అసలు ఆయన ఎలా ఫీలవుతున్నారో - మనసులోనైనా మిస్సవుతున్నారో లేదో అన్న ఆలోచనతో అలా అన్నా అంతే -" నవ్వుతూ అంది రాజేశ్వరి.
    'మన ఇండియన్స్ ఈ సెంటిమెంట్లు, యీ బలహీనతలే పెళ్ళిళ్ళని నిలబెడుతున్నాయనుకుంటాను, ఓ విధంగా చూస్తే మైనస్ పాయింటు, మరో విధంగా ప్లస్ పాయింటు. "నిజమే - మన పెళ్లిలో వుండే పవిత్రతో, సెంటిమెంటో గాని కొట్టుకున్న, తిట్టుకున్నా భార్యభర్తల బంధం వీడిపోకుండా వుండడం అన్నింటికన్నా గొప్పదనుకుంటా -' అంది వినోదిని. ఏమిటోరా ఇదీ పెట్టిపుట్టడం అంటారే... చేసుకున్న వాడికి చేసుకున్నంత అన్నట్లు భార్యభర్తల అన్యోన్యత అన్నదీ ఓ అదృష్టమే - దానికి నేను నోచుకోలేదనుకోవాలి -
    'అమ్మా - అసలు నీవు నాన్నని మార్చడానికెప్పుడూ ప్రయత్నించలేదా - ఆయన ప్రవర్తన నీకు నచ్చలేదు, మార్చుకోమని సూచించలేదా -" ఏదో సామెత చెప్పినట్టు రామాయణం అంతా విని రాముడికి సీతేమవుతుందని అడుగుతున్నావు గత ఏభై ఏళ్లకి పైగా మీ నాన్నని చూస్తూ - ఆయన ఇతర్లని మాట మాట్లాడనిచ్చారా - ఎవరు చెప్పడానికి అవకాశం ఇచ్చారా. నాయనా ఓ అరవై ఏళ్లక్రితం ఆర్థికస్వాతంత్రం లేని భార్య భర్తకి ఎదురుతిరిగి నీ పద్ధతి మార్చుకో అని చెప్పే అవకాశం వుందంటావా - చెప్పినా ఆ భర్త సామరస్యంగా ఆ విషయం తీసుకుని తన్ని తాను మార్చుకునే ప్రయత్నం చేసే సామ్యత ఆనాటి మగవాళ్లల్లో వుండేదా - ఇంటి యజమానిగా, భర్తగా, భార్యల మనోభావాలకి గౌరవం ఇచ్చే ప్రసక్తి ఎక్కడ వుండేదిరా - అది నిజమే నరేష్ - అసలు మనదేశంలో భార్యభర్తల మధ్య అభిప్రాయబేధాలకి సగం కారణం కమ్యూనికేషన్ గ్యాప్ అంటాను-' వినోదిని అంది.  'నిజమేనమ్మా, ఈనాటి ఆడపిల్లల్లా నచ్చనిది మొకం మీద చెప్పే అవకాశం మాకానాడు లేదు - భార్య చెప్పడం భర్త వినడమా అన్న ఇగో ప్రతి మగవాడికి వుండేది అందరూ కాదులే అమ్మా. అంత నాన్నలా వుంటారా - అది ఆయన స్వభావం అనుకుంటాను - మా స్నేహితుల ఇళ్లలో నాన్నలు కొందరు బాగానే వుండేవారే -" నీవన్నది కొంత వరకు నిజమే - మగాళ్ళంతా చెడ్డవాళ్లని ఎలా అంటాం' - స్వతహాగా....., భార్యని అర్ధాంగిని గౌరవించేవారు లేరనను - కాని మొత్తం మీద ఆ శాతం చాలా తక్కువ. దానికి కారణం భార్య పూర్తిగా అన్నిటికి భర్త మీద ఆధారపడాల్సిరావడం - పూజు కొద్ది పురుషుడన్న మాట నిజం బాబూ - నా అదృష్టం యింతే - 'నిట్టూర్చి...' అందుకే కాస్తయినా మీ నాన్నకి నా విలువ తెల్సివచ్చిందో లేదో తెల్సుకోవాలని కుతూహలంగా వుంది-' అంది నవ్వి . రేపు ఆదివారం ఫోను చేస్తాగా - అప్పుడు నీవే అడుగు బుద్ధి వచ్చిందా' అని హాస్యంగా అన్నాడు నరేష్ -

                                                                              *    *    *    *    *

 Previous Page Next Page