Previous Page Next Page 
మధుపం పేజి 29


    "ఐసీ , అది గురువారందా, శుక్రవారం కూడా అదే సినిమా ఆడిందా ...." అరా తీశాడు.
    "లేదు సార్ , నా దియేటర్లో ప్రతి శుక్రవారం మారిపోతుంది. ఈ సినిమా గురువారంతో అయిపొయింది" అన్నాడు.
    సునీల్ వర్మ కళ్ళు మెరిశాయి. చిన్న క్లూ దొరికినందుకు సంతోషించాడు. ఆలోచనలో పడి సంఘటనలు మనసులో పెర్చసాగాడు.

                                           *    *    *    *
    "మిస్టర్ సుధాకర్ చిన్న ప్రశ్న శుక్రవారం విజయవాడలో మీరేం సినిమా చూసామన్నారు మాట్నీకి వెళ్ళి" సునీల్ వర్మ క్యాజువల్ గా అడిగినట్లు అన్నాడు.
    ఇన్ స్పెక్టర్ హైదరాబాదు తిరిగి వచ్చిన మూడు నాలుగు రోజులు సరోజ పనిచేసే ఆఫీసులో ఫ్యూను మొదలు, మేనేజరు వరకు అందరిని రకరకాల ప్రశ్నలు అడిగాడు. ఆఫీసులో , ఆమె డెస్క్ డ్రాయరు కీ తెప్పించి క్షుణ్ణంగా పరిశీలించాడు. అందులో దొరికిన ఒక డైరీ స్వాధీనం చేసుకుని ఇంటికెళ్ళి రాత్రంతా చదివి చాలా విషయాలు అర్ధం చేసుకున్నాడు. అందులో దొరికిన రెండు మూడు ఫోటోలలో వ్యక్తిని గూర్చి ఆఫీసు వారిని వాకబు చేసి రూడి చేసుకున్నాక అతన్ని కలుసుకు మాట్లాడాక చాలా వరకు అతనికి కధ అర్ధం అయింది. సుధాకర్ ఇంటికెళ్ళి యింటరాగేషన్  మొదలుపెడుతూ మొదటి ప్రశ్న వేశాడు.
    సుధాకర్ కాస్త బెరుకుగా చూసి "అల్లరి రాముడు" అన్నాడు ఎందుకడిగాడా అనుకుంటూ.
    "ఐసీ , ఆ సినిమాలో రెండు మూడు సీన్లు చెప్పగలరా?"
    "మరింత తెల్లపోతూ, "ఎందుకు సార్ , అలా  అడుగుతున్నారు" అన్నాడు భయంగా.
    'ఊరికే, మీరు సినిమా చూసినట్టు ఋజువు కోసం, రొటీన్ ప్రశ్న " - అన్నాడు తేలిగ్గా.
    సుధాకర్ గుర్తు తెచ్చుకుని రెండు మూడు సీన్లు చెప్పాడు.
    "టి.వి లో అడ్వర్టైజ్ మెంట్ లో పదేపదే దంచుతున్నారు ఈ సీన్లు అవి గుర్తు పెట్టుకున్నారా. లేక ఇంతకుముందే చూశారా " - కాస్త వ్యంగ్యంగా అడిగాడు ఇన్ స్పెక్టర్.
    సుధాకర్ కలవరపడి "సార్ అదేమిటి ?" అన్నాడు.
    "ఎందుకడిగానంటే శుక్రవారం ఆ దియేటర్లో ఆ సినిమా లేదు గదా - ఎలా చూసారో నని సందేహం వచ్చి అడిగాను "- కూల్ గా అన్నాడు.
    సుధాకర్ తెల్లపోయాడు.
    "ఇంతకీ మీరు ఈ టిక్కెట్టు కౌంటర్లో నే కొన్నారా?"
    సుధాకర్ నుదుటి చెమట తుడుచుకుంటూ , "కాదు సార్, నేను రెండు గంటల కెళ్ళేసరికి టిక్కెట్లు అయిపోయాయని కౌంటరు మూసేశారు. గేటు దగ్గర ఎవరో బ్లాక్ లో అమ్ముతుంటే ....."
    'అదీ సంగతి , అక్కడే పప్పులో కాలేశారు మీరు. ఆ బ్లాకులో అమ్మేవాడు మీకు టోపీ పెట్టి క్రితం రోజు మిగిలిన టిక్కెట్టు అమ్మాడు."
    "నిజమా సార్, అందుకే ఆ వెధవ దొంగచూపులు చూస్తూ డబ్బివ్వగానే గబగబ మాయం అయిపోయాడు " - ఏదో ఇంకా చెప్పబోతూ ఇన్ స్పెక్టర్ మొహం చూసి ఆగిపోయాడు.
    "అంటే, గురువారం టిక్కెట్టుతో దియేటర్లో ని సినిమా శుక్రవారం చూసారన్న మాట," మిస్టర్ సుధాకర్ ఈ చిన్న స్లిప్ ఇచ్చి దొరికిపాయావు నీవు. హడావుడిలో టిక్కెట్టు సాక్ష్యానికి వుండాలనుకున్నావు కాని కౌంటరు మూసేయగానే దిగాలుపడి, బ్లాక్ టిక్కెట్టు అమ్మేవాడు కనపడగానే ప్రాణం లేచి వచ్చినట్టు వాడెం టిక్కెట్టు ఇచ్చాడో చూసుకోకుండా జేబులో పెట్టేసుకున్నావు. సినిమా చూసే ఉద్దేశం లేదు కనుక ధియేటర్ లోకి వెళ్ళకుండా రైలు స్టేషన్ కి వెళ్ళి పోయి హైదరాబాద్ వెళ్ళే మొదటి ట్రైను కనపడగానే 3.30 కి ఫలక్ నామా ఎక్స్ ప్రెస్  ఎక్కేశావు. ఏమ్ ఐ కరెక్ట్ ?" వ్యంగ్యంగా అన్నాడు.
    సుధాకర్ మొహంలో కత్తివేటుకి నెత్తురు చుక్క లేనట్టు తెల్లపదిపోయింది. గాభారపడి ఏదో చెప్పబోయాడు.
    ఇన్ స్పెక్టర్ చేత్తో వారిస్తూ "ఇంకేం బకాయింపు వద్దు .... ఈ చిన్న ఆధారంతో నేను అంతా ఊహించాను. ఉత్త ఊహే కాదు మీ ఆవిడ ఆఫీసు కెళ్ళి అందరితో మాట్లాడి, ఆవిడ డైరీ స్వాధీనం చేసుకున్నాను. అందులో దొరికిన ఫోటోలు, డైరీ సాక్ష్యం చాలు కధంతా తెలియడానికి , నీ భార్యని నీవు చాలా తెలివిగా ప్లాన్ చేసి హత్య చేశావు. ఆ కధంతా నిజం వప్పుకుంటూ నీవే చెప్తావా, నన్ను చెప్పమంటావా " ఇన్ స్పెక్టర్ కఠినంగా అన్నాడు.
    సుధాకర్ కుర్చీలో కూలబడి మొహం చేతులతో కప్పుకున్నాడు. మనిషి నిలువెల్ల వణికిపోతున్నాడు.
    "కమాన్ టెల్ మీ - ఎందుకు చేశావు ఇలా? ఇష్టం లేకపోతే నీ భార్య మోసం చేసిందనుకుంటే డైవోర్స్ ఇవ్వాల్సింది. హత్య చేస్తే నీకు శిక్ష పడ్తుందని తెలీదా? లేక చాలా తెలివిగా చేసి తప్పించుకోగలననుకున్నావా? - జరిగినదంతా చెప్పి నేరం ఒప్పుకో " కఠినంగా అన్నాడు.
    సుధాకర్ మొహం ఎర్రబడింది. కోపంతో ఊగిపోతూ , "అవును, చంపాను. నేనే చంపాను. నన్ను మోసం చేసి ఇంకొకడితో కులుకుతుంటే తట్టుకోలేక నేనే కసికొద్దీ చంపాను. నన్ను పెళ్ళాడి నా జీవితం నాశనం చేసిందాన్ని."
    "నీకు నీ భార్య మీద అనుమానం ఎందుకు వచ్చిందసలు ? ఎప్పుడు కనిపెట్టావు ఇంకొకరితో సంబంధం ఉందని? చెప్పు - ఇంక దాని లాభం లేదు. ముందునుంచి నాకెందుకో ఈ హత్య కేవలం నగలు డబ్బు కోసం అంటే నమ్మలేకపోయాను. కానీ నమ్మించడంతో బోల్తా పడ్డాను. కానీ ఎక్కడో లింకు అందలేదన్నది తడ్తూనే ఉంది నాకు. అపార్ట్ మెంట్ వ్యవహారం . నీళ్ళ టాంకరు వచ్చే సమయం, వాచ్ మెన్ గెట్ వేసే టైము ఇవన్నీ క్షుణ్ణంగా తెలిసిన ఎవరో టైము చూసుకుని చేశారు. ఆ ఎవరు? బయటివాళ్ళా, కాంప్లెక్స్ వాళ్ళా - అసలు హత్యకు మోటివ్ ఏమిటి అన్నది అంతుబట్టలేదు. ఎప్పుడూ నేరస్తుడు చిన్న పొరపాటు ఎక్కడో చేసి తప్పటడుగు వేస్తాడన్నది నిజం . ఆ నిజం ఇప్పుడూ నిజమయింది. నీ ఖర్మ కాలి ఆ టిక్కెట్టు తారీఖు చూసుకోకుండా కొనడం, దియేటర్లో ఏ సినిమా ఆడుతున్నది సరిగా చూడకుండా హడావుడిలో పొరపాటు చేసి దొరికిపోయావు. చెప్పు నీ భార్య మీద నీకు అనుమానం ఎప్పుడొచ్చింది? ఎలా తెలిసింది - ఆమెకు ఇంకొకరితో  సంబంధం ఉందని ?"

 Previous Page Next Page