మేడమీద వాలుకుర్చీలో కళ్ళుమూసుకుని పడుకున్నాడు కృష్ణమోహన్. అతని మొహంలో గూడుకట్టుకున్న వేదన చూడగానే సరోజ చలించింది. అలికిడికి కళ్ళు విప్పి చూశాడు మోహన్. అతను చూడగానే తలదించుకుంది సరోజ. ఆమెను చూసి తప్పుచేసినవాడిలా తడబడుతూ ఏదో అనబోయాడు. ఆలోగ సరోజ "డాక్టరుగారూ క్షమించండి నన్ను. తొందరపడ్డాను..." అంది. ఆ మాటకిఅతను చెప్పబోయింది ఆపేసి నిట్టూర్చి ... "సరోజా - నీ వన్నా నన్నర్ధంచేసుకోవా!" అన్నాడు ఆవేదనగా.
"హు-అర్ధం ఎలా చేసుకోగలను - చనువుగా వుండాలంటారు - తీరా చనువు చూపి దగ్గిరవబోతే దూరం చేసేవారిని ఏమని అర్ధం చేసికోవాలో నా కర్ధం గాదు - నా హద్దులు దాటినందుకు మంచి శిక్షే వేశారు."
"సరోజా క్షమించు - నా మనసేం బాగులేదు...నీకెలా చెప్పాలో తెలియదు నాకు -నన్ను అర్ధంచేసికొని క్షమించగలిగితే క్షమించు" బాధగా అన్నాడు.
అతనివంక పట్టిపట్టి చూస్తూ- "ఏమిటండీ మీకు వచ్చిన కష్టం -మనసు బాగులేక పోవడం ఏమిటి- కొత్తగా మాట్లాడుతున్నారు. యీ మధ్య మీ రెందుకు యిలా వుంటున్నారు? మీకొచ్చిన లోటేమిటి!" ఆశ్చర్యంగా అడిగింది.
కృష్ణమోహన్ నిర్లిప్తంగా నవ్వాడు - "అది నీ కర్ధం కాదులే...సరే, యింతకీ డాన్స్ కి రావా నీవు?"
"పదండి వెడదాం - మీ యింట్లో వున్నంతకాలం మీ ఆజ్ఞ ఎలా జవదాటను!" కృష్ణమోహన్ మొహం వికసించింది. "ఆ....ఆమాత్రం తెల్సుకున్నావు గదా ఎప్పడూ నాకెదురు చెప్పకు." అన్నాడు నవ్వి.
రవీంద్రభారతిలో సరోజ పక్కన కూర్చుని నృత్యం చూస్తున్నంతసేపూ - మళ్ళీ మామూలు కృష్ణమోహన్ గా మారాడు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా వుంది మనసు అతనికి. చాలా కుతూహలంగా చూస్తూ నృత్యంలో లీనమయిన సరోజని చూసి "ఎలావుంది సరోజా" ఆప్యాయంగా అడిగాడు. ఆ గొంతులో మార్దవానికి సరోజ ఏదో అయింది.
"చాలా బాగుంది - థాంక్స్ మీరు తీసుకురాకపోతే యింత మంచి ప్రోగ్రాం మిస్సయ్యేదాన్ని" అంది అతని వంక చూస్తూ.
"అయితే నాకేదన్నా మంచి ప్రెజంట్ యీయాలి మరి. ఉత్తి థేంక్స్ చెపితే సరిపోదు" చిలిపిగా అన్నాడు. సరోజ గతుక్కుమని చూసింది. కొంటెగా మెరుస్తున్న అతని కళ్ళు చూడగానే సరోజ గుండె దడదడలాడింది. "ఏం కావాలో అడగండి" కాసేపటికి అనగలిగింది.
"ఏం కావాలా" అని క్షణం ఆలోచించి..."యిప్పుడు కాదు. సమయం వచ్చినప్పుడు అడుగుతాను. ప్రామిస్ చేశానని మరచిపోకు" అన్నాడు. సరోజ నిట్టూర్చింది. కృష్ణ మోహన్ నవ్వుతూ ఏదో కామెంట్స్ చేస్తూ సరదాగా మాట్లాడుతూనే వున్నాడు అంతసేపూ అతనలా సంతోషంగా సరదాగా సరోజ సరోజ అంటూ చనువుగా మాట్లాడుతూంటే సరోజకి బావ గుర్తువచ్చాడు. ప్రక్కన కూర్చున్న అతని స్పర్శ ఆమెకి పాత రోజులు గుర్తురాసాగాయి. అంతలోనే ఆమెలో ఏదో నిస్పృహ, నిరాశ. కృష్ణమోహన్ బావ ఎలా అవుతాడు....తనకేం అవుతాడు!?....ఆశలు పెంచుకునే అవకాశం కూడాలేదు!- అని తెలిసినా యీ మనసు అతని పట్ల ఎందుకు ఆకర్షితురాలవుతుంది! అతనిలో బావని చూసుకోవడం దానివల్ల మరింతగా బాధపడడం. యింతేగా తనకు మిగిలింది! నిట్టూర్చింది సరోజ తనకి తెలియకుండానే.
"ఏమిటి సరోజా -అలా వున్నావు. యింతసేపు సరదాగా వున్నావు. యింతలో మళ్ళీ మూడ్ ఏమిటి మారిపోయింది." ఆమెని గమనిస్తున్న అతను అడిగాడు. సరోజ తల దించుకుంది, "చెప్పు సరోజా" అన్నాడు మళ్ళీ.
"ఎందుకు చెప్పడం, మీరేం ఆర్చగలరా, తీర్చగలరా-వూరికే పెద్ద ఏదో చేసేవారిలా ఎందుకు అడుగుతుంటారు?" ఆమెకి తెలియకుండానే కాస్త కరకుగా అంది.
ఆమె కోపాన్ని అర్ధమైనట్లు చూస్తూ, "అవును నిజమే నేనేం తీర్చగలను. సారీ క్షమించు" అన్నాడు. ఆ మాటకి సరోజ మనస్సు చివుక్కు మంది. "నీకేం కావాలి సరోజ ఏదన్నా చేస్తాను నీకోసం. చెప్పు." అనకూడదూ. ఎందుకంటాడు. తనమీద జాలి తప్ప అతనికి మరో అభిప్రాయం ఏం లేదు. కాస్త సరదాగా మాట్లాడితే ఏదో వెర్రిమొర్రి ఆశతో భ్రమపడి పొంగిపోతుంది తను.
సరదాగా వచ్చిన మూడ్ చెడిపోయింది సరోజకి. ఆమె హావభావాలు గమనిస్తున్న కృష్ణమోహన్ నిస్సహాయంగా నిట్టూర్చాడు.
ప్రోగ్రాం అయిపోగానే యిద్దరూ బయటికివచ్చారు.
గుంపులో యిటు అటు మనుష్యుల మధ్య సరోజని ముందు నడిపిస్తూ కారు దగ్గరకి వచ్చి కృష్ణమోహన్ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు.
కారు దగ్గిర నిల్చున్న గీతని చూడగానే యిద్దరూ సర్పద్రష్టుల్లా అచేతనంగా నిలబడిపోయారు. గీత కారునానుకొని నిల్చుంది. మెరుస్తున్న కళ్ళతో కృష్ణమోహన్ ని సరోజని కళ్ళు కదపకుండా మార్చి మార్చి చూసింది. ఆమె మొహం నల్లగా మాడిపోయివుంది. ఆమె కళ్ళు అసూయా ద్వేషాలను కక్కుతున్నాయి.
కృష్ణమోహన్ ఒక్కక్షణం అచేతనుడై తర్వాత నెమ్మదిగా తేరుకున్నాడు. "గీతా" అన్నాడు ఆశ్చర్యంగా ముందుకు అడుగువేసి, సరోజ గీతని ఆ విధంగా చూడగానే బిక్క చచ్చిపోయినట్లు, దోషిలా తలదించుకుంది.
"గీతా, నీవు....నీవు-" తడబడ్డాడు కృష్ణమోహన్.
"నేనెలా వచ్చాననా అడగడం, నాకెలా తెలిసిందనా ఈ ఆశ్చర్యం - ఏం దొంగతనం బయటపడిందని భయంగా వుందా!"తీక్షణంగా చూస్తూ కఠనంగా అంది గీత.