నేనేమీ చెప్పనని కేవలం ఆమె ఈయన్ని తిరస్కరించిన కారణం తెలుసుకుంటానని ఆవిడని వప్పించాను.
సుశీల ఇంటికి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకున్నాను.
ఆమె చకితురాలై, నా రాకకి కారణం అర్ధంకానట్టు తెల్లబోయి చూసింది.
"కూర్చోండి చాలా సంతోషం. ప్రకాష్ పెళ్ళి చేసుకున్నాడన్నమాట. నాకు తెలియదు." అంది నవ్వుతూ.
ఆమెని చూశాక ప్రకాష్ కాదు. ఏ మగవాడన్నా ఆమెని ప్రేమించకుండా వుండలేని అందం ఆమెది. అన్నీ కలిసిన అంతటి అపురూప సౌందర్యాన్ని చూసి చకితురాలి నయ్యాను. ఆమె ముందు అందగత్తెగా పేరుపొందిన నేను వెలవెలబోయాను. అంతటి అందం ఆమెకి ఎక్కడనించి వచ్చిందో! పాలుగారే బుగ్గలు. విసనకర్రలా కనురెప్పలు. అంతంతకళ్ళు, కొనదేరిన ముక్కు, చిన్ననోరు. అతి లేత తమలపాకులవంటి ఆ చేతులు... అబ్బ! ఏ భాగం చూసినా దేవుడు ప్రత్యేక శ్రద్ధతీసుకొని చేసిన శిల్పంలా వుంది. ఆమె తండ్రి ఏదో ఆఫీసులో గుమాస్తాలు. ఇల్లు నిరాడంబరంగా వుంది. ఇల్లే కాదు. ఆమె కూడా చాలా నిరాడంబరంగా వుంది. ఆమె అలంకరణలో ఏదో కొట్టొచ్చినట్లు లోపం కన్పించింది. ఆమె నుదుట బొట్టులేదు.
"మీరిలా నన్ను వెతుక్కుంటూ రావడం చాలా ఆశ్చర్యంగా వుంది. నా గురించి మీకెలా తెలుసు? మీ రాకకి ఏదైనా ప్రత్యేక కారణం వుందా?" కాసేపటికి అడిగింది.
అసలు సంగతి దాచి లాభంలేదని సూటిగా అడగదలచింది అడిగాను.
"మీరు ప్రకాష్ ని నిరాకరించారని విన్నాక -సామాన్య కుటుంబంలోంచి వచ్చిన మీరు ఒక ధనికున్ని, చదువు, సంపాదనవున్న వ్యక్తిని తిరస్కరించడానికి పురికొల్పిన కారణం తెలుసుకుందామని వచ్చాను."
సుశీల ఆశ్చర్యంగా చూసింది. "మీ కెలా తెల్సింది? ప్రకాష్ చెప్పాడా?" ఆమె మొహంలో ప్రసన్నత మాయమయింది.
"ప్రకాష్ చెప్పలేదు. మా అత్తగారు మాటల్లో అన్నారు."
"జరిగిపోయిన సంగతులు ఇప్పుడెందుకులెండి. అవి తలుచుకోవాలని నాకు లేదు. చెప్పడం నాకు, వినడం మీకు మంచిదికాదు." ముభావంగా అంది.
"ప్లీజ్! ఆ విషయంతో నా భవిష్యత్తు ముడిపడి వుంది. దయచేసి ఏం జరిగిందో చెప్పండి?"
సుశీల ఆశ్చర్యంగా చూసి. "అంటే....?" అంది.
"అంటే వివరంగా చెప్పలేను. కాని ఆయన ప్రవర్తనకి- మీ తిరస్కారానికి సంబంధం వుండవచ్చని నా అనుమానం. భర్తని గురించి అంతకంటే చెడుగా చెప్పలేను .... మీ తిరస్కారంతో ఆయన అహం దెబ్బతిని వుంటుంది. ఆ కోపం కసి మీమీద తీర్చుకోలేక మరొకరికిమీద తీర్చుకుంటున్నారు. అసలు మీరెందుకు ఆయన లాంటి వ్యక్తిని తిరస్కరించారు?" సుశీల మొహం కఠినంగా మారింది.
"ఆస్థి-అంతస్తుకంటే నా ఆత్మాభిమానం ముఖ్యమనిపించి తిరస్కరించాను. డబ్బు ఎర చూపించిన ఆ అహంభావిని నేనే కాదు. వ్యక్తిత్వం వున్న ఏ ఆడపిల్లయినా తిరస్కరిస్తుంది..." మొహం ఎర్రబడగా ఆవేశంగా అంది.
"అంతకంటే వివరంగా చెప్పగలరా?" అన్నాను.
ఆ నీచుడి గురించి మాట్లాడాలంటేనే నాకు అసహ్యం. క్షమించండి. మీ భర్త నిలా అన్నందుకు కష్టపెట్టుకోకండి. కాని అతని నిజస్వరూపం తెలిస్తే మీరూ అసహ్యించుకుంటారు. కాలేజీలో నాకు బాగా సీనియర్. నా అందం నాకు శత్రువయింది. ప్రతి మగాడి దృష్టి నా మీదే. రక రకాల పేర్లు ఏడిపించడం, పిల్లికూతలు, గోడలమీద పేర్లు, అల్లరి ఇవన్నీ నాకు తప్పేవిగావు. ఇలా నన్ను ఆటపట్టించే వాళ్ళందరికి లీడర్ ప్రకాష్. అతని కుడిభుజం శ్యాం. డబ్బుంది. అందం వుంది. ప్రతి ఆడపిల్లా తనంటే పడి చస్తుందనుకునేవాడు ప్రకాష్. ఆడపిల్లల్ని చులకనగా చూసి ఏడిపించడం, ఏ అమ్మాయన్నా తిరగబడితే ఇక ఆ పిల్ల అవస్థ దేముడికెరుక. వెధవ పోజులు పెడుతూ తిరిగే ఆ ప్రకాష్ ని చూస్తే నాకు వళ్ళు మండేది. దానికి తోడు అతని లేకిబుద్ధులు చూసి మరింత కోపం వచ్చేది. ఎన్ని అన్నా నన్ను కానట్టు విననట్టు దులుపుకుని పోయేదాన్ని. ఒకసారి జుత్తు కత్తిరించాడు వెనుకనుంచి. మరోసారి చీరలాగాడు - అతన్ని నేను కేర్ చేయడంలేదని అతన్ని చూసి అసహ్యించుకుంటానని గమనించాడు గాబోలు, ఓ రోజు అతని కుడి భుజం శ్యాంతో నాకు కబురు పంపాడు వంటరిగా వున్నప్పుడు.
"మీరంటే ప్రకాష్ కి చాలా ప్రేమండి. మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు..." అన్నాడు వెకిలిగా నవ్వి.
"ఆహా, మిత్రుడి తరఫున రాయబారం వచ్చావా?" అన్నాను హేళనగా.
"లేదండి. మీరు అతని ప్రేమ గుర్తించడం లేదని చెపుతున్నాను."
"ఓహో...అంత ప్రేమ వున్నవాడు అతనే చెప్పవచ్చుగా ఆమాట! ప్రేమిస్తున్నానని మరొకడిచేత కబురు పంపేంత రసహీనుడన్న మాట."
"బాగుంది. అతని అంతస్తు....మీ అంతస్తు ఎక్కడ? అయినా ప్రేమకి యివన్నీ హద్దులుండకూడదని, అసలు మీ ఉద్దేశ్యం ఏమిటో? ఆహా- అతనిలాంటివాడని పెళ్ళాడడం ఏ అమ్మాయికైనా భాగ్యమే అనుకోండి! అయినా..."
ఆయనగారు కబురంపగానే, ఆయనలాంటి గొప్ప వాడు పెళ్ళాడుతానని అనగానే సంతోషంతో మూర్చపోతా ననుకుని-అతన్ని వెంటనే అంగీకరిస్తానన్న నమ్మకంతో శ్యాంతో కబురంపాడన్నమాట. నాలాంటి బీదదాన్ని తనంతట తను అడగటం నామోషి. అనుకున్నాడు గాబోలు- అతని అహంకారం తలుచుకోగానే వళ్ళు వుడికింది. కోపంగా ఆవేశంగా కళ్ళెర్రజేసి "షటప్! మీ ఫ్రెండుగారికి లక్షలుండవచ్చు కాని ఆయనగారు కోరిందే తడవుగా అడిగిందే భాగ్యం అని ఆనందపడిపోయి పెళ్ళాడేంత దౌర్భాగ్యురాలిని కానని మీ ఫ్రెండుకి చెప్పు. పెళ్ళి కాకపోవచ్చు. మీ ఫ్రెండులాంటి శ్రీమంతుడ్ని పొందలేకపోవచ్చు. కాని ఆడదాన్ని గౌరవంగా చూడని మీ జులాయి ఫ్రెండుని, అలాంటి అహంభావిని మాత్రం నేను పెళ్ళాడనని తెలియచెయ్యి. వెళ్ళు! మరోసారి యిలా వచ్చావంటే ప్రిన్సిపాల్ కి చెపుతా" అని తిట్టిపంపాను.