పిచ్చయ్య చూచాడు. బాలయ్య గుండెలో వున్న బాధ అతనికి తెలుసు. ఊగిసలాడాడు. అతను కూడా అయినా ధైర్యం తెచ్చుకొని, "బాలయ్యన్నా! ఇట్లా సోచాయిస్తే ఫాయిద లేదు. అడుగు ముందుకువేసినమా! అంతే! బతకాల్నంటే బయటపడొద్దె నేనున్ననే నా పానం అడ్డమేస్త. ఆఖరికి నతేజేమెల్లుతదొ ఎరికేనా?" అని పెద్ద క్వశ్చన్ మార్కు వేశాడు.
బాలయ్య తేరుకున్నాడు. తన కష్టాల్ను మరిచాడు. పిచ్చయ్య లాంటివాడు తనవెంటనుండగా అగ్గిలోకైనా ఉరకవచ్చుననుకున్నాడు. కళ్లలో దృఢ నిశ్చయం గోచరించింది.
"ఇగో చూడండి సురుల్నే పుల్లన్న కిల్లిచ్చిన్నాడే లడాయి సురు అయింది. ఉళ్ళల్ల నుంచి దొరలెల్లకొడ్తే పట్నమొచ్చినం. ఈడకూడ బతకనిస్తలేరు. లడాయి సురు అయింది. దాదాలు వచ్చిన్రు. తోక ముడిచిపోయిన్రు. ఇప్పుడు గిట్ట మనం కిరాయిలిచ్చినమా తెల్లోరే సర్కల్ల గుడిసె లూడపీకుతరు. మనమే పోయిన మనుకోరి యాడున్నా ఆడ పీచా చేస్తరు. పట్నంలో నుంచి ఎళ్ళకొట్టెదన్క నిద్రపోరు. ఈ జాగ వానిది కాదాయె. మనది కాదాయె. జగా డొచ్చిందనుకో వానికిస్తే నాయంగాని పరాయోనికిస్తే నాయం అయితాదె! ఈడి ఆటలు సాగానియ్యకుంటే నాయం చేసినట్లయితది కలిసి కట్టుగుంటారే మరి?"
"ఉంటం" అన్నాయి గొంతులు ఒక్కుమ్మడిగా.
ధైర్యం వచ్చింది బాలయ్యకు. ఉత్సాహం పొంగింది. "ఈ దాద లియ్యాల్టితోటి పోయెటోల్లు కారు మల్లొస్తరు. ఏ రాత్రికొస్తరో ఏ పగలొస్తరో తెల్వదు. హమేష తయారుగుండాలె లారీలు తెచ్చి పెట్టుకోవాలె. ఎవనిమీద హమ్లా అయినా మందంత కలిసి కొట్టాలె. పానాల్తియ్యొద్దు. భగాయించాలె ఒప్పుకుంటారా?" అడిగాడు.
"ఒప్పుకుంటం" - ముక్తకంఠంతో పలికారంతా.
"సరే అయితే పన్లకు పోరి వచ్చేటప్పుడు లారీలు పట్టుకొచ్చుకోరి" అన్నాడు బాలయ్య.
"బాలన్నకీ జై" అన్నారంతా.
ఈ విషయమే మాట్లాడుకుంటూ ఎవరిళ్ళకు వారు వెళ్ళిపోయారు. కొందరు బాలయ్యను మెచ్చుకున్నారు. కొందరు పిచ్చయ్యను మెచ్చుకున్నారు. బాలయ్య చేసిన నిర్ణయాన్ని సహితం కొందరు విమర్శించారు కాని, అంతా పోరాటానికి సిద్ధపడ్డారు.
మైసమ్మ బువ్వకుండా, కారం ముద్దా తెచ్చి బాలయ్య ఇంట్లో పెట్టిపోయింది. పిచ్చయ్యా, బాలయ్యా ఆశ్చర్యపడి ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు.
13
సూరి సోఫాలో చేరగిలబడి సిగరెట్టు వెలిగించాడు. పక్కనే ఉన్న మ్యాగజైన్ తీశాడు. అది నగ్న యువతుల పటాలున్న ఆంగ్లపత్రిక. ఒక్కొక్కటే తిరగేస్తుండగా వెయిటర్ వచ్చాడు. శాల్యూట్ కొట్టి ఒక ఆల్బం అందించి మరొకమూలాన కూర్చున్న బట్టతల ఖద్దరు ఆసామీ దగ్గరికి వెళ్ళాడు. అతడు పత్రిక ముఖానికి చాటు పెట్టుకొని చదవటానికి ప్రయత్నిస్తున్నాడు. వెయిటర్ ను చూచి అతనివెంట వెళ్ళిపోయాడా ఖద్దరు సామి.
సన్నగా "ఐ లవ్ యు" అనే మాట వినిపిస్తూండగా ఆల్బం తిప్పుతున్నాడు. సూరి ఒక బొమ్మను చూచి క్షణంలో సగం చకితుడైనాడు. దీక్షగా చూచాడు. అదే బొమ్మ. ఆ బొమ్మ అక్కడ ఉంటుందని అతడు ఊహించనైనాలేదు. క్రింద రాత చూచాడు. "డెయిజీ" అని వ్రాసి ఉండడమేకాక, ఆమె వయసూ, జాతి మొదలైనవి కూడా వ్రాసివున్నాయి. డెయిజీ ఇక్కడికి రావాల్సిన అవసరంలేదు. మైకేల్ మంచి మంచి గిరాకీలు సంపాదించగల దిట్ట ఇక్కడికి ఎందుకు వచ్చిందీ అర్థంకాలేదతనికి. ఇంకా ఎన్నో ముఖాలు అంతకంటే అందమైనవి కనిపించాయి. వాటిల్లో ముసల్మానులు, హిందువులు, పారసీలు, ఇరానీలు, ఆంగ్లో ఇండియన్లు, గోవన్లు ఉన్నారు. అవన్నీ యువతుల పటాలు సూరిని ఎంచుకోవలసిందిగా కోరుతూ వెయిటర్ అందించిన ఆల్బం అది.
అంతమంది ఉన్నప్పటికీ డెయిజీనే ఎంచుకున్నాడు. సూరి ఆల్బం అక్కడపెట్టి ఏదో ఆలోచనలో నిమగ్నుడై సిగరెట్టు పీల్చి పొగ వదలుతున్నాడు. అంతలో వెయిటర్ వచ్చి నుంచున్నాడు "ఫార్టీ వన్" అని చెప్పాడు. వెయిటర్ ఆల్బం తీసుకొని నలభైఒక్కటి తీసి చూచాడు. "మంచి సెలక్షన్ సార్. నిన్ననే వచ్చింది భలే సరుకు" అని వెళ్ళిపోయాడు.
నలభై ఒకటవ నెంబరు గదిలో కిర్రుమని గంట మోగింది. మంచంలో పరుపుమీద బోర్లాపడుకొని దిండులో ముఖం దాచుకొన్న డెయిజీ తలెత్తి చూచింది. ఆకుపచ్చ బల్బు మూడుసార్లు వెలిగి ఆరిపోయింది.
కొంతసేపటికి తలుపు తెరుచుకుంది. సూరిని చూచి ముఖంలోని రక్తం మొత్తం దిగిపోయింది. డెయిజీకి 'గుడ్ ఈవినింగ్' అన్న సూరి మాటలు ఆవిడకు వినిపించలేదుగాని యాంత్రికంగా లేచి "గుడ్ ఈవినింగ్ సూరి!" అని చేయి అందించింది. సూరి కరస్పర్శ చేసిన మాట నిజమే కాని, కరస్పర్శవల్ల కలగాల్సిన ఆనందం కలుగలేదు. డెయిజీ చేతులు చల్లగా మంచులా ఉన్నట్లనిపించిందతనికి. ముఖం పాలిపోయింది. డెయిజీని ఎన్నుకొని పొరపాటు చేశాననుకున్నాడు. అయినా ఆవిడలో ఉత్సాహం కల్పించడానికి అన్నాడు. "రంభ, మేనక, ఊర్వశీ కూడా దుఃఖిస్తే స్వర్గం గతి ఏంకాను?"
డెయిజీ పేలవంగా నవ్వింది. విధిగా నవ్వాలన్నట్లుంది ఆ నవ్వు. సిగరెట్టు అందించాడు సూరి యాంత్రికంగా. అందుకుంది. సిగరెట్టూ అంటించుకొని పొగ ఊదుతూ మరొకసారి నవ్వింది డెయిజీ. ఆ నవ్వు మరీ కృత్రిమంగా అనిపించింది. సూరి చిరాకు పడ్డాడు. తాను ఇక్కడికి వచ్చింది వేడెక్కిన బుర్రకు విశ్రాంతి ఇవ్వడంకోసం. అమ్మాయిలతో హాయిగా నవ్వుతూ మాట్లాడి, వాళ్ళ కిలకిల నవ్వుల్లో అన్నీ మరిచిపోవాలని డెయిజీని మంచి మూడ్స్ లోకి తేవడానికి బెల్లుకొట్టి బ్రాందీ తెప్పించాడు.
గుక్క మింగుతూ అడిగాడు "మిస్ డెయిజీ! ఏదో కాలుజారి ఆకాశం నుంచి అవనికి అవతరించిన అందాలరాశిని నీ చిరునవ్వు కోసం నిఖిల సంపదలను నిలువునా దోచి ఇవ్వడానికి సిద్ధం అయ్యేవారు లక్షలమంది ఉన్నారు. అసలు నీవు ఉన్నావు కాబట్టే. ఇంకా అందమూ ఆనందమూ ఉన్నాయి. నువ్వెందుకున్నావ్ ఈ కూపంలోకి?" అడిగాడు.
డెయిజీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. జేబు రుమాలుతో తుడుచుకుని, "మిస్టర్ సూరి! నాలో మరో ప్రాణి మసలుతూంది" అన్నది.
వంట్లో ఉన్న రక్తం యావత్తూ జారి చీలమండల్లో చేరినట్లైంది. సూరికి ముఖం తెల్లబడిపోయింది. ఆకాశం నేలకూలినట్లూ, హిమాలయం కృంగిపోయినట్లూ, సముద్రం ఇంకిపోయినట్లూ, సూర్యచంద్రులు రాలిపోయినట్లూ అనిపించింది. ఏదో జరగరాని, జరగగూడని పని జరిగిపోయిందనిపించింది. స్త్రీకి ప్రాణమూ హృదయమూ ఉంటాయనే విషయం మన పూర్వీకులు అంగీకరించలేదు. ఆధునిక సాధారణ స్త్రీకి అవి ఉంటే ఉండచ్చనే విషయాన్ని అంగీకరించడానికి సిద్ధపడ్డారు కాని డెయిజీలాంటిది సహితం గర్భం దాల్చిందంటే ఎలా నమ్మడం? ఆవిడ అందరి చేతికి అందే ఆటబొమ్మలాంటిది లేదా, ఆనందం ఇచ్చే యంత్రం లాంటిది ఆవిడకు కడుపేమిటని ఆశ్చర్యం సూరికి.
"అదేమిటి డెయిజీ!" ఎంతో ఆశ్చర్యంగా అడిగాడు.
"అవును విచిత్రమే అయినా, అది వాస్తవం మా మైకేల్ లేడూ?"
"మీ డాడీ!"
"వాడా! వాణ్ణి నిజంగా నా తండ్రిలా చూచాను కాని, వాడు తండ్రి కాడు. రాక్షసుడు అని తేలింది వాడికి చెపితే నాలోని ప్రాణిని నాశనం చేస్తాడని చెప్పలేదు. మిస్టర్ సూరి! ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ టు బికమ్ మదర్ నేను ఆడదాన్ని! తప్పా ఆ కోరిక ఉండటం? నాకు పాప కావాలి సూరీ! నేను తల్లిని కావాలి. అందుకే ఆ రాక్షసునితో ఈ విషయం చెప్పలేదు. సుస్తీగా ఉందన్నాను. ఎక్కడికో వెళ్ళమన్నాడు వెళ్ళలే'నన్నాను. నానా బూతులు తిట్టాడు. నన్ను ఇంతదాన్ని చేసి చదివించినందుకు ఫలితం ఇదేనా అని ఏడ్చాడు. బ్రతిమిలాడాడు కాళ్ళు పట్టుకున్నాడు. మాట ఇచ్చి వచ్చానన్నాడు. నేను వినలేదు. ససేమిరా వెళ్ళనన్నాను. అతనికి కోపం వచ్చింది. కొట్టాడు. సహించుకున్నాను కనీసం ఏడవలేదు. దాంతో అతనిలో కోపం ఎక్కువైంది. చావబాదాడు. సహించలేక ఏడ్చాను. ఏడుస్తే మరీ బాదాడు గదిలో వేసి బయటినుంచి తాళంవేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు"
"ఎవరికో ప్రామిస్ చేసి వుంటాడు బ్రూట్!"
డెయిజీ ఆ మాటలు వినిపించుకున్నట్లే లేదు. సాగిపోతూంది, "గదిలో కూర్చున్నాను. వళ్ళంతా నొప్పులు వంటి నొప్పులను లెక్కచేయలేదు. నేను గెలిచాను అదే సంతృప్తితో అన్నీ భరించాను. ఆలోచించాను, ఏంచేయాలని? ఈరోజు తప్పుకున్నమాట నిజమే కాని, మైకేల్ బారినుండి తప్పుకోటం సాధ్యమా? ఎంతకాలమని సుస్తీగా ఉందనే నెపం చెప్పగలను? తెలిసిందా, మైకేలు నాలోని ప్రాణిని బ్రతకనియ్యడు. వేరే ఎక్కడైనా ఉండిపోదామనుకున్నాను కాని, ఎక్కడున్నా వస్తాడు. మైకేలు బ్రతిమలాడో, కాళ్ళు పట్టుకొనో, బెదిరించో తీసికెళ్తాడు లేదా, తానే వచ్చి నా దగ్గర మకాం చేస్తాడు. ఏదైనా ఆశ్రయం దొరికితే బావుండుననుకున్నాను. రాజారావు దగ్గరికి వెళ్ళాను. విషయం వివరంగా చెప్పాను. తన ఆశ్రయంలో ఉండనిమ్మన్నాను 'గెట్ అవుట్' అన్నాడు"