Previous Page Next Page 
ఆఖరి మలుపు పేజి 29


    లేచి నిలబడ్డాడు.


    కృష్ణాజీ ఏ ఊరికి ట్రాన్స్ ఫర్ అయ్యి వెళ్తున్నాడో తనకి తెలుసు.


    తనూ అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి.


    జరిగినదంతా ఆయనతో చెప్పాలి.


    ఆనందరావు తన తండ్రితో కలిసి చేసిన మోసం గురించి వివరంగా చెప్పాలి.


    అసలు విషయం తెలియకపోతే, కృష్ణాజీ తనని గురించి చాలా చెడ్డగా అనుకుంటాడేమో!


    అలా అనుకోగానే మనసుని మెలేసినట్లయ్యింది రాజాకి.


    పది నిమిషాల్లో హైవే రోడ్డు మీద వున్నాడు రాజా.


    పది నిమిషాల్లో పది లారీలు కనబడ్డాయి. రాజా చేతులు ఊపుతున్నా ఒక్క లారీ కూడా ఆగలేదు.


    ఇలా కాదని, తను వేసుకున్న ఎర్ర చొక్కా విప్పాడు రాజా. ఊపడం మొదలెట్టాడు.


    ఈసారి వచ్చిన మొదటి లారీనే సడెన్ బ్రేకుతో ఆగింది.


    "ఏమయ్యిందిరా ఛోక్రే?" అన్నాడు లారీ డ్రైవర్.


    "ఓవర్ లోడింగు లారీలని పట్టుకుంటున్నారు" అన్నాడు. రాజా మొహంలో భావాలు బయటపడకుండా స్ట్రెయిట్ ఫేస్ పెట్టి. అంతా ఉత్తదే.


    లారీ డ్రయివర్ కి నిలువుగుడ్డు పడ్డాయి. "అరె! తౌబా! తౌబా! ఇదీ ఇప్పుడే రావాలి?" అన్నాడు. ఈ ట్రిప్పులోనే అతని బ్యాక్ టైరు బరస్ట్ అయ్యింది. యాక్సిల్ విరిగింది. అతను డిస్పరేట్ గా వున్నాడు.


    "బైపాస్ రోడ్ లో వెళ్తే చెకింగ్ గోల ఉండదు" అన్నాడు రాజా.


    "సరే!" అన్నాడు డ్రైవరు.


    "ఎందాకా?" అన్నాడు రాజా.


    చెప్పాడు లారీ డ్రైవరు.


    "నన్ను ప్రక్క టవున్లో దింపుతావా?"


    "అసలే ఓవర్ లోడ్ అంటున్నావు. నువ్వు కూడా ఎక్కితే?"


    "వాళ్ళకి దొరకంగా!"


    "సరే ఎక్కు!"


    లాఘవంగా కమ్మీ పట్టుకుని లారీలోకి ఎక్కాడు రాజా.


    "థాంక్స్!" అన్నాడు జేబులోనుంచి సిగరెట్ ప్యాకెట్ తీసి డ్రైవర్ కి అందించాడు.


    "కాలుస్తావా?"


    డ్రైవర్ ఒక సిగరెట్ అందుకుని, ప్యాకెట్ రాజాని తిరిగి ఇచ్చెయ్యబోయాడు.


    "వద్దు! ఇవాళ్టినుంచే నేను సిగరెట్లు మానేశా!" అన్నాడు రాజా అగ్గిపెట్టి కూడా అందిస్తూ.


                                     * * * *


    సరిగ్గా ఆ టైంలోనే....


    మాస్టారు ఆనందరావు గారింటికి వెళ్ళాడు కృష్ణాజీ.


    నిజానికి అతను ఆ పాటికి కొత్త ఊరికి వెళ్ళిపోయి పోస్టింగ్ తీసుకుని వుండాల్సింది. టెలిఫోనిక్ ఆర్డర్సు వచ్చాయి...అతన్ని ఇప్పుడు వున్న పోస్టులో నుంచి రిలీజ్ చెయ్యమనీ, కొత్త ప్లేస్ కి అర్జెంటుగా పంపెయ్యమనీనూ!


    కానీ ఒక్కరోజు టైం అడిగాడు కృష్ణాజీ.


    వెళ్ళే ముందు యింకొక్కసారి రాజాని చూసి, ఇంకొన్ని జాగ్రత్తలు చెప్పాలనిపించింది.


    అందుకే ఆనందరావుగారి ఇంటికి వచ్చాడు.


    అక్కడ కనబడిన సీన్ అతన్ని ఆశ్చర్యచకితుడిని చేసింది.


    మాస్టారి మొహానికంతా కట్లే!


    ఆయన కుడికాలుకి బాండేజ్ చేసి వుంది. చేతిలో ఒక కర్రని ఊతం కోసం పట్టుకుని వున్నాడు ఆయన.


    నుదురు చిట్లించి అడిగాడు కృష్ణాజీ -


    "మాస్టారూ! ఏమయ్యింది?"


    వేదాంతంగా నవ్వాడు ఆనందరావు.


    "చెప్తాను. కానీ మీరు నాకొక మాట ఇవ్వాలి."


    ప్రశ్నార్థకంగా చూశాడు కృష్ణాజీ.


    "అసలు సంగతి తెలిసిన తర్వాత రాజాని ఏమీ అనకూడదు. వాడు పసిగుడ్డు! తప్పులు పసివాళ్ళు కాక పెద్దలు చేస్తారా? మనం మనసులో పెట్టుకోకూడదు"


    కృష్ణాజీ మొహం జేవురించింది.


    "ఏమిటి? మిమ్మల్ని ఈ స్థితికి తెచ్చింది ఆ కుర్ర వెధవా?" అన్నాడు.


    "ఏం చేశాడు?" అన్నాడు మళ్ళీ.


    "అదిగో! అప్పుడే కోపం వస్తోంది మీకు! అందుకే ముందే అన్నాను. రాజాని ఏమీ అనకూడదని!"


    ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకుంటూ, నిదానంగా అన్నాడు కృష్ణాజీ-


    "మాస్టారూ! మీది మెతక మనసు. ఈ ప్రపంచంలో మంచి తప్ప మరేదీ లేదనుకునే మృదుస్వభావం. క్రిమినల్సు సంగతి మీకేం తెలుస్తుంది? ఆ విషయాలు నాకొదిలెయ్యండి. ఎవరితో ఎలా ఉండాలో నాకు తెలుసు. ఏం జరిగిందో చెప్పండి!"


    బాధని నటిస్తూ అన్నాడు మాస్టారు. ఆయన అభినయంలో ఆస్కార్ అవార్డు అందుకోవలసినవాడు.


    "కృష్ణాజీ గారూ! పసిపిల్లాడి గురించి పొరబాటు అభిప్రాయం ఏర్పరుచుకోవద్దని ముందే చెప్పాను. మనం ఈ ప్రస్తావన యింతటితో మానెయ్యడం మంచిది. దెబ్బలదేముంది దేవుడి దయ వుంటే వారం తిరిగేలోగా తగ్గిపోతాయి."

 Previous Page Next Page