"ప్రభుత్వానికి డబ్బు ఖర్చవుతుంది. ఒక్క పని జరగదు. తాము అనుకున్న పనులు నెరవేరాయా - ఆఫీసరు ఆచరణలో పెట్టారా అన్నది పట్టించుకోకపోవడంవల్లే యిలా వుంది. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయ్యాక కాస్త నయం. ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు భయపడ్తున్నారు. ఫైళ్ళ క్లియరెన్స్, శ్రమదానాలు, ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాడు. కాని ఏం చేస్తాడు ఒక్కడూ...కిందనించి పైవరకు ప్రతి ఆఫీసు అలాగే వుంది." మునసబు అన్నాడు.
"పని జరగాలంటే అమెరికాలో మాదిరి ఒక్కొక్కపని ఒకరికి అప్పగించాలి. రిజల్ట్ ఓరియంటెడ్ గా ప్రతి ఆఫీసర్ ని, గుమాస్తాని ఒక్కొక్క పనికి బాధ్యుడిని చెయ్యాలి. ఎమ్మెల్యేలకి సంవత్సరానికి ఒకసారి తన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపనులు, వాటికి ఖర్చుపెట్టిన డబ్బు లెక్కలు చూపమనాలి. రూల్సు పెట్టడం కాదు అమలుజరిగేట్టు చూడ్డం ముఖ్యం. ఈ ముఖ్యమంత్రే ఓ పదేళ్లపాటు నిలిస్తే కాస్తయిన రాష్ట్రం అభివృద్ధిచెందుతుందన్న నమ్మకం నాకు కల్గుతుంది. కాని పార్టీలు, తగాదాలు, ముఠాలు, పార్టీ మార్పిడులు, అపోజిషన్ అంటే ఏపని చేసినా మంచైనా అపోజ్ చెయ్యాలి అనే తత్వం ఉన్న అపోజిషన్లు గోరంతలని కొండంతలు చేసి అవతలపార్టీ వారిని ఎప్పుడు దింపుదామా అని దారులు వెతికే రాజకీయ నాయకులు, వీటన్నింటి మధ్య ఓ పదేళ్ళు ఓ ముఖ్యమంత్రి నిలబడగలిగితే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఏ ప్రభుత్వము గట్టిగా ఏడాది కూడా నిలబడకపోతే వాళ్ళు మాత్రం ఏంచేయగలరు. మంచికో చెడుకో ఓసారి వాళ్ళని ఎన్నుకున్నాక ఓ ఐదేళ్ళపాటు వాళ్ళ పని వాళ్ళని చేయనిచ్చి ఇంకోసారి ఎలక్షను వచ్చినప్పుడు వాళ్ళు అప్పటివరకు చేసిన పనులు బేరీజు వేసుకుని సంతృప్తికాకపోతే అప్పుడు మార్చవచ్చు. అంతేగాని కుర్చీలో కూర్చున్నదగ్గిరనుంచి ప్రతి పని విమర్శిస్తే ఏంలాభంలేదు..." కేశవరావు విశ్లేషించాడు.
"ఏమిటోనండి రోజురోజుకీ రాజకీయాలు భ్రష్టుపట్టిపోతున్నాయి-" ప్రెసిడెంట్ నిర్లిప్తంగా అని కండువా భుజాన వేసుకుని లేచాడు.
"ఆ ప్రెసిడెంటుగారూ! రేపటినుంచి ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఈ ఆస్పత్రిలో కూర్చుంటాను. ప్రజలందరూ డాక్టరుగా నా సేవ ఫ్రీగా ఉపయోగించుకోవచ్చని అందరికీ తెలియజేయండి. నా చాతనయినంతవరకు యిక్కడ యివ్వగలిగినంత ట్రీట్ మెంట్ ఇక్కడ ఇస్తాను."
"డాక్టరుగారూ! బీదవాళ్ళకి వూరికినే వైద్యం చెయ్యండి. ఉన్నవాళ్ళదగ్గిర కాస్తయినా వసూలు చెయ్యండి. మందుల ఖర్చన్నా రావాలి కదా మీకు" మునసబు అన్నారు.
"మామయ్యా! ఓ సలహా చెప్పనా. ఇక్కడ ఒక హుండీలాంటిది పెడదాం. ఇక్కడికి వచ్చిన అందరూ ఎవరికి తోచింది వారు రూపాయైనా సరే వేయండి. బలవంతం లేదు అని రాసి పెడదాం. రెండు మూడు రోజులకోసారి పెట్టె తరిచి వచ్చిన డబ్బుతో మందులు అవి తెప్పించడానికి వినియోగిద్దాం. అన్నీ మీరే పెట్టుకోవాలంటే నీకూ కష్టం అవుతుంది. డాక్టరు ఫ్రీగాని మందులు, యింజక్షన్లు, బ్యాండేజీలూ, గ్లూకోజులు అవి బోలెడు ఖరీదు కదా."
"అలా చెయ్యండి డాక్టరుగారూ! ఎత్తుకోవాల్సినబరువుని మించి నెత్తిన పెట్టుకుంటే నడుం వంగిపోతుంది ఎవరికైనా. మీకెంత డబ్బున్నా అన్నింటికి మరీ మొహమాటపడకండి" ప్రెసిడెంటు అన్నారు.
"సరే, అలాగే చేద్దాం. ఈ వూరివారే కాక పక్క వూర్ల వాళ్ళు వస్తే రాబడి పెరగవచ్చు. ఆ డబ్బు మనం మళ్ళీ ఎలాగు ఆస్పత్రికే వినియోగిద్దాం. మూడునెలలకి ఒకసారి మీ సమక్షంలో తాళం వేద్దాం" కేశవరావు అంగీకరించి అన్నాడు.
* * *
"ఉగాదినాడు లక్ష్మీనరసింహాలయంలో కళ్యాణోత్సవాలు బాగా జరుగుతాయట. ఈసారి మనల్ని పీటల మీద కూర్చోమంటున్నారు అందరూ. ఉదయం ఆచార్యులుగారు వచ్చి వెళ్ళారు. మా ఆడవాళ్ళంతా పీటల మీద కూర్చుని కళ్యాణం చేయించండి అంటున్నారు. కళ్యాణం చేసేవారు పట్టుపంచెలు, అమ్మవారికి చీర, మంగళసూత్రాలు ఖర్చుపెట్టుకుంటారుట. ఆరోజు వూర్లో అందరికీ భోజనాలు కూడా పెడతారట. మిమ్మల్ని అడిగి చెపుతానన్నారు" మధ్యాహ్నం భోజనం చేస్తుండగా రాజేశ్వరి అంది.
"అడగడానికి ఏముంది. దేముడి కార్యం. వూర్లో అంతా ఎదురుచూసే మంచిరోజు. ఏదో ఈ విధంగా పదిమందికి అన్నదానం మంచిదేగా. సరే అని చెప్పేయ్."
"కొత్త పట్టుపంచెలు మా అన్నయ్య కొడుక్కి పెళ్ళికి మీకీ ఇచ్చినవి ఇంట్లో ఉన్నాయి. ఓ పట్టుచీర కొత్తది వుంది. చిన్న మంగళసూత్రాలు కొనాలి. ఇక్కడ దొరకవు. రంగాకి చెప్పాలి విజయవాడ నుంచి తెమ్మని" రాజేశ్వరి అంది.
"ఎలాగో స్కూలు ఫర్నిచర్ అది ఏమాత్రం పని జరిగిందో చూడడానికి వెళ్తున్నాడు. నాకూ కొన్ని మందులు కావాలి. వెళ్ళినప్పుడు తెప్పించు."
"డబ్బిస్తే ఆలయంలో వంటలు అవీ ఆచారిగారే ఏర్పాటు చేస్తామన్నారు."
"మరీ మంచిది. మనకు శ్రమ వుండదు. ఇంతకీ ఉగాది ఎప్పుడు?"
"ఇంకా పదిరోజులపైనే వుందిలెండి. ఎవరు చేస్తారన్నది తేల్చుకోవడానికి వచ్చారు ఆయన. మా ఆడవాళ్ళు అదే నా స్టూడెంట్స్ నిన్ననే అన్నారు మీరే ఈ ఏడాది చెయ్యాలని."
"ఓ! నీ స్టూడెంట్స్... మీ అమ్మలక్కలా? ఇంతకీ వాళ్ళ చదువెలా సాగుతుంది. రెండు నెలలు అయిందిగదా ఏమన్నా ప్రోగ్రెస్ వుందా" కుతూహలంగా అడిగారు.
"చాలా, నేనే అనుకోలేదు యింత బాగా పికప్ చేస్తారని. సాధారణంగా రోజూవారి దినచర్యలో మాట్లాడుకునే ఇంగ్లీషులో సంభాషించగల్గుతున్నారు. నేను తెలుగులో ఓ వాక్యం చెప్పి ఇంగ్లీషులో చెప్పమంటే కొందరు బాగానే చెప్తున్నారు. గ్రమేటికల్ మిస్టేక్స్ కొంచెం చెప్తున్నారు. కాని మొత్తం మీద ఫరవాలేదు. ఇప్పుడిప్పుడే చిన్నచిన్న వాక్యాలు రాయించడం మొదలుపెట్టాను" రాజేశ్వరి వివరించింది.
"స్కూలు పిల్లలు ఎలా వున్నారు? ఇదివరకు కుంటే ప్రోగ్రెస్ వుందా?"
"పాపం వాళ్ళతో ఏం ప్రాబ్లెం లేదు. చక్కగా చదువుకుంటున్నారు. టీచర్ మరింత బాగా చెప్తారు. ఇదివరకు మాకింత బాగా ఎవరూ చెప్పలేదు అంటున్నారు పాపం. కాస్త శుభ్రంగా తయారై వస్తున్నారు. సుగుణా యిప్పుడు పాఠాలు చెప్పడంలో ప్రాక్టీసు అయింది. ఐదో క్లాసులో పదకొండు మందీ యిప్పుడు రెగ్యులర్ గా వస్తున్నారు. మళ్ళీ ఏడాది ఆరో క్లాసు ఆరంభించుదాం. వాళ్ళ మీద శ్రద్ధాశక్తులు కనపరుస్తుంటే వాళ్ళూ శ్రద్ధగా చదువుతున్నారు."
"నీకేమన్నా స్ట్రెస్ అవుతున్నావనిపిస్తుందా. అలసట అనిపిస్తే ఒక క్లాసు తీసుకుని వచ్చాయి. కావలిస్తే యింకెవరినన్నా అపాయింట్ మనం స్వయంగా చేద్దాం. ఇంట్లో పని, స్కూలు, మధ్యాహ్నం, రాత్రి చదువులు నీకు ఓవర్ స్ట్రెస్ అవుతుందేమో."
"అబ్బెబ్బే లేదండి. ఐ యామ్ ఎన్ జాయింగ్ ఇట్. ఓన్లీ థింగ్, ఎండలు కాస్త ముదురుతున్నాయిగా కాస్త వేడి ఉక్క అనిపించి చిరాకు తప్ప పిల్లలకి చదువు చెప్పడంలో అలసట ఏమీలేదు. ఓ మంచి పని చేస్తున్నానన్న తృప్తి వుంది."
"ఈసారి స్కూలు బాగుచేయించినప్పుడు అన్ని గదుల్లో ఫ్యాన్లు పెట్టిద్దాం" అభయం ఇచ్చినట్లన్నారు.
* * *