Previous Page Next Page 
పడుచుదనం రైలుబండి పేజి 29


    ఈలోపల మరోసారి 'హత్య...హత్య' అంటూ పెద్దగా అరిచింది సుందర సుకుమారి.


    లైటువేసి వీళ్ళు చూసేసరికి లక్ష్మి వాకిలి దగ్గరగా బోర్లాపడి ఉంది. లక్ష్మి నడుంమీద అటొక్కాలు ఇటొక్కాలు వేసి కూర్చుని తల అటు ఇటు కదలటానికి వీల్లేకుండా తలమీద రెండుచేతులు వేసి నొక్కి ఉంచింది సుందర సుకుమారి.


    ఆ సీను ఏమిటో ముగ్గురికి అర్థంకాలేదు.


    ఈలోపల సుందర సుకుమారి పెద్దగా అరచిన అరుపులకి హోటల్ సిబ్బంది లేచారు. మిగతా రూముల్లో వాళ్ళు లేచారు. కంగారుపడ్తూ పరుగుపరుగున అందరూ వచ్చారు.


    బయటవాళ్ళ గోలకి వందన వెళ్ళి తలుపులు తీసింది. గదిలో జొరబడుతూ "ఏమైంది? ఏమైంది?" అని కంగారుగా, ఆత్రుతగా అడిగారు బయటవాళ్ళు.    


    వందనకి మాత్రం ఏం తెలుసు? సుందరసుకుమారిని అడిగేలోపలే వాళ్ళంతా వచ్చి దబదబా తలుపులు బాదటం జరిగింది. వెంటనే తలుపులు తియ్యకపోతే అదో గోలని చెప్పి ఆ కంగారులో తలుపుతీసింది వందన.


    ఆ వచ్చినవాళ్ళు కూడా లక్ష్మి నడుంమీద కూర్చున్న సుందర సుకుమారిని చూశారు. "ఓహో ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు కాబోలు" అనుకుంటూ ఉండగానే వాళ్ళకి గుర్తుకు వచ్చింది. 'హత్య హత్య' అన్న కేకలు వినేకదా అక్కడికొచ్చిందని"


    హత్య జరిగిన దాఖలాలు ఎక్కడా లేవు. రక్తం మడుగు అంతకన్నా లేదు. సుందర సుకుమారి దేహం కింద పైకి లేవడానికి విశ్వప్రయత్నం చేస్తూ లక్ష్మి గిలగిల కొట్టుకుంటోంది.


    అందరూ వచ్చేసరికి సుందర సుకుమారికి ఇంకా లక్ష్మి పారిపోలేదన్న ధైర్యం వచ్చింది. లక్ష్మి కొప్పు గట్టిగా పుచ్చుకొని పైకి లేపుతూ తాను పైకిలేచింది సుందర సుకుమారి.


    బోర్లాపడటంవల్ల లక్ష్మి ముఖానికి దెబ్బ తగిలినట్టుంది. నుదుట మీద వికృతంగా...పెద్ద నిమ్మకాయంత బొప్పికట్టి వుంది.


    "ఏమయిందే సుందరీ!" వందన ముందుకొచ్చి అంది.


    బయటినుంచి వచ్చినవాళ్ళకి ఎంత తెలుసో__రూమ్ లో వున్న వీళ్ళకి అంతే తెలుసు" అమాయకంగా వుండే ఆమె నెత్తిన ఇదెక్కి కూర్చుందేమిటి!" అనుకుంది అంతే. కాస్త పక్కకిచూస్త చెప్పకుండానే నిజం తెలిసేది.


    "నాకెందుకో నిద్ర మెలకువ వచ్చింది. పైకి లేవబోతూ పక్కకి తిరిగి చూశాను. దీనిపేరు 'లక్ష్మి' అని చెప్పింది. దీనిపేరు లక్ష్మో...వెంకమ్మో...పుల్లమ్మో...మాకు తెలీదు. పెద్ద మోసగత్తె. మన పెట్టెలు, బ్యాగ్ లు గాలించి డబ్బు మూటగట్టుకుంటున్నది. ఏం చేయాలని ఆలోచిస్తూ-చూస్తూ పడుకున్నాను.


    ఈ దొంగ ముం__సర్దుకోవడం అయిపోయింది. నెమ్మదిగా వాకిలికేసి నడుస్తున్నది. తలుపుతీసి బయటికెళ్ళిందంటే మనకి అందకుండా ఇది పారిపోతే పారిపోయింది. మన సొమ్ముక్కూడా కాళ్ళొస్తాయని ఇంకేమీ ఆలోచించలేదు నేను. ఎగిరి మంచంమీదనుంచి దూకాను. రెండోసారి ఎగిరి దాన్నెత్తిన పడ్డాను. ఇది బ్యాలెన్స్ తప్పి దబేల్ న పడిపోయింది. పారిపోవడానికి వీలులేకుండా నడుంమీద కూర్చున్నాను.


    ఇంత జరిగినా మీరెవరూ లేవలేదు. మీ ముగ్గురిలో ఒక్కరైనా లేస్తారేమోనని పిలిచాను. పగలంతా తిరిగి తిరిగి బాగా అలసిపోవడం జరిగింది కదా! లేచే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఈ మాయలేడే నా పట్టునుంచి తప్పించుకు పారిపోవాలని ఒకటే గింజుకొంటున్నా ఇంకా లాభంలేదని ఉపాయంగా "హత్య హత్య" అంటూ పెద్దగా అరిచాను. ఆ దెబ్బతో మీతోపాటు వీళ్ళంతా కూడా పరుగున వచ్చారు సుందర సుకుమారి జరిగిందంతా వివరంగా చెప్పింది.


    ఆ లక్ష్మి నిజంగా దొంగే. పట్టుబడ్డందుకు బిక్కచచ్చిపోయి గోడవారగా నుంచుంది.


    ఎవరో వెళ్ళి పోలీసులకి ఫోన్ చేశారు. ఆ ఫోన్ చేసిన ఆయనే "పోలీసులు రాబోతున్నారు" అని చెప్పాడు.


    పోలీసులు వచ్చేలోపల అందరూ లక్ష్మినే చూస్తూ పనిలో పని స్నేహితురాళ్ళను కూడా చూస్తూ దొంగతనాలు__మోసాలను గురించి రకరకాల కబుర్లు మొదలుపెట్టారు.


    పదినిమిషాలు గడవకముందే ఇన్ స్పెక్టర్ విశ్వనాథరెడ్డి ఇద్దరు పోలీసులను వెంటబెట్టుకుని వచ్చాడు.


    ఇన్ స్పెక్టర్ విశ్వనాథరెడ్డి వస్తూనే ఆ రూమ్ లో వున్నవాళ్ళని మాత్రమే వుంచి మిగతావాళ్ళని బయటికి పంపించేశాడు.


    లక్ష్మిని చూస్తూనే "ఓ ఇదా! పంకజం దొంగతనాలు__మోసాలు చేయడంలో ఆరితేరిన ఘటం. దీని మొహము...కళ్ళు, ఒళ్ళు అవతలివారిని మోసగించడానికి భలే ఉపయోగపడతాయి. అమాయకంగా నటిస్తూ మాటలతో మనుషులని వలలోకి లాగి ఎన్నిరకాలుగా మోసాలు చేయవచ్చో-అన్ని రకాలుగాను మోసం చేస్తూంటుంది. ఇది మా పాత కష్టమరే" ఇన్ స్పెక్టర్ విశ్వనాథరెడ్డి అన్నాడు.


    పంకజం ఈమధ్య గుండూరావ్ గాడి దగ్గర చేరింది. అప్పుడే అనుకొన్నాను "ఇది ఏదో పెద్ద పనే చేయబోతున్నదని" పోలీస్ కానిస్టేబుల్ కనకారావు అన్నాడు.


    "గుండూరావ్ దగ్గర చేరిందా? మరి నాకెందుకు చెప్పలేదు. గుండూరావ్ అంటే పోటీలు పెడుతుంటాడు వాడేనా!" ఖంగుమనే స్వరంతో అడిగాడు ఇన్ స్పెక్టర్ విశ్వనాథరెడ్డి.


    "నాకు మొన్ననే తెలిసింది సార్! టు నాట్ టు మొన్న సాయంత్రమే నా చెవిన ఈ విషయం వేశాడు. ఇది ఏదో ఒక నేరం చెయ్యకపోదు-దీన్ని పట్టుకోక పోము__" అనుకుంటూ ఉండగానే వెంటనే పట్టుబడింది సార్"


    కానిస్టేబుల్ కనకారావు వినయంగా చెప్పాడు.

 Previous Page Next Page