Previous Page Next Page 
దావాగ్ని పేజి 30


    సరిగ్గా అదే క్షణంలో, ఆ తండ్రి అలా చూస్తుండగానే, రివాల్వర్ తీసి పిట్టని కాల్చినట్లు కాల్చేశాడు జనరల్ భోజా.

 

    వడివడిగా వచ్చేశారు కొంతమంది మనుషులు. ఆ ముగ్గురి శవాలనీ విగ్రహాలుగా మార్చడానికి తీసుకెళ్ళిపోయారు.

 

    సర్కస్ ప్రదర్శన ముగిసిన తర్వాత జనం ఇంటిదోవ పట్టినట్లు, చూసిన దృశ్యాలని చర్చించుకుంటూ కదిలారు జనం.   

 

    అది చూస్తున్న బాబూజీ గుండెల్లో గుబులు పుట్టింది.

 

    ఈ భోజా మహా కర్కోటకుడు. తనకి నచ్చని వాళ్ళని నిర్దాక్షిణ్యంగా నాశనం చేసెయ్యగలడు.

 

    ఇతని దేశంనుంచి యురేనియం త్రవ్వుకోవటం అంటే నిప్పుతో చెలగాటం లాంటిదే:

 

    ఇంతకీ ప్రొఫెసర్ రామనాధం ఏమని తెలుస్తాడో? ఆ రాతిలో యురేనియం ఉన్నట్లా? లేకపోతే అంతా అతని భ్రమేనా?

 

    సాలోచనగా వచ్చి కారు ఎక్కి, మళ్ళీ లేబొరేటరీకి పోనిమ్మని చెప్పాడు డ్రైవరుతో.

 

                                                                *    *    *    *

 

    అందరూ వెళ్ళిపోయాక "పద: మనమూ వెళ్దాం:" అని కదలబోయింది జెన్నిఫర్.

 

    "ఉండు: ఇంకో పది నిమిషాల్లో శవాలు విగ్రహాలుగా మారి వచ్చేస్తాయి. వాటిని ఇక్కడ పాతించేసి వెళ్ళిపోదాం" అన్నాడు జనరల్ భోజా. అలా చెబుతూ అతను ఆమెని ఆ గార్డెన్ లో ఉన్న ఒక పెద్ద గడియారం దగ్గరికి తీసుకొచ్చాడు.  

 

    హైద్రాబాద్ లోని సాలార్ జంగ్ మ్యూజియంలో ఉంది ఒక గడియారం. దానిలో ఒక గుడిసె బొమ్మ వుంటుంది. ప్రతి అరగంటకీ ఆ గుడిసె తలుపు తెరుచుకుని ఒక బొమ్మ మనిషి బయటకు వచ్చి, చేతిలో వున్న సుత్తిలాంటి దానితో గంటలు కొట్టి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు.    

 

    దాదాపు అలాంటిదే ఈ గడియారం, అయితే చాలా పెద్దది ఇందులోని మనిషి బొమ్మ నిజం మనుషులకంటే చాలా పెద్దదిగా ఉంది. ఈ మనిషి బొమ్మ చేతిలో సుత్తిలాంటిది కాదు.

 

    పదునైన కత్తి వుంది:

 

    ఓరగా రిస్ట్ వాచి వైపు చూసుకున్నాడు జనరల్ భోజా. ఇంక రెండు సెకండ్లట గంటలు కొట్టాలి గడియారం.

 

    గడియారంలోని గుడిసె తలుపు తెరుచుకుంది. యాంత్రికంగా అడుగులు వేస్తూ బయటికి వచ్చాడు బొమ్మ మనిషి. ముందుకు నడిచాడు.

 

    సరిగ్గా కత్తివేటు పడేచోట నిలబడి వుంది జెన్నీఫర్. జరుగుతున్న కుట్రని గ్రహించలేదు ఆమె.

 

    ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు భోజా. బొమ్మ మనిషి ఇంకా మూడు అడుగులు వేసి, కత్తితో ఒక్క దెబ్బ కొట్టాడంతే...  

 

    అంతే.

 

    ఫినిష్:

 

    దానితో ఈ జెన్నీఫర్ పీడ విరగడవుతుంది తనకు:

 

    "నాకు వజ్రాల కిరీటం చేయిస్తానంటివే: ఏమయిందీ?" అంది జెన్నీఫర్.

 

    బొమ్మమనిషి ఆమె వెనక్కి వచ్చి కత్తి పైకి ఎత్తాడు.

 

    కత్తి ఆమె కుత్తుకని కత్తిరించడమే ఇంక తరువాయి.

 

    "ఇంక నాకు స్వేచ్ఛ:" అనుకున్నాడు జనరల్ భోజా.

 

    అంతలో...

 

    వేటువేయబోతున్న బొమ్మమనిషి చెయ్యి గాల్లోనే ఆగిపోయింది.

 

    నిర్ఘాంతపోయాడు జనరల్ భోజా.

 

    ఏమయింది? ఏమయింది?

 

    కొద్దిక్షణాల తర్వాత అతనికి అర్థమయింది జరిగించి ఏమిటో.

 

    గడియారం చెడిపోయి, ఆగిపోయింది:

 

    మనసులోనే దాన్ని ఎన్నో విధాలుగా శపించాడు జనరల్ భోజా. తన గయ్యాళి భార్యను వదిలించుకోవడానికి గానూ అతను అతిజాగ్రత్తగా పన్నిన పన్నాగం ఆ విధంగా మెషినరీ ఫాల్టు వల్ల భగ్నమయింది.  

 

    "ఈ రోజుకి బతికి బయటపడిపోయావులే కానీ అప్పుడే ఏమయింది? ముందుంది ముసళ్ళ పండుగ:" అనుకొన్నాడు జనరల్ భోజా, మనసులోనే జెన్నీఫర్ ని అక్కడ నుంచి కారు దగ్గరికి తీసుకువెళుతూ.

 

    తృటిలో తనకు తప్పిపోయిన ప్రమాదం గురించి జెన్నీఫర్ కి అసలేమీ తెలియనే తెలియదు.

 

                                  *    *    *    *

 

    "సర్: నా ఊహ నిజమే అయింది:" అన్నాడు ప్రొఫెసర్ రామనాధం అత్యుత్సాహంగా.

 

    పెదిమలు తడి చేసుకున్నాడు బాబూజీ.

 

    "అంటే: ఆ మచ్చల రాయిలో యురేనియం ఉందా?"

 

    "అందులో సందేహం లేదు."

 

    ఎగిరి గంతేసింది బాబూజీ మనసు.

 

    "దీనిని గురించిన వివరాలు అన్నీ కలిపి, ఒక రికార్డు తయారు చేశాను చూడండి." అని అందించాడు ప్రొఫెసర్ రామనాధం.

 

    కంపిస్తున్న చేతులతో రిపోర్టుని అందుకుని చదివాడు బాబూజీ. లౌకిక విషయంలో ఉత్త దేభ్యం కావచ్చు గానీ, ఈ ప్రొఫెసర్ తన సబ్జెక్ట్ లో మాత్రం అఖండుడు. చాలా సమాచారం సేకరించాడు అతను కొద్దిసేపట్లో.

 

    రిపోర్టు సారాంశం ఇలా వుంది.

 Previous Page Next Page