Previous Page Next Page 
దావాగ్ని పేజి 29


    అర్థంకానట్లు చూసింది వినీల.

 

    "ఏమిటి?"

 

    "చీర విప్పెయ్:"

 

    "ఎందుకు?" అంది కొయ్యబారిపోతూ.

 

    "చెబుతాను" అంటూ కుర్చీలోంచి లేచాడు ప్రతాప్.

 

                                   *    *    *    *

 

    ప్రొఫెసర్ రామనాధాన్ని లేబొరేటరీ దగ్గర దింపేశాక జనరల్ భోజాతో అపాయింట్ మెంట్ కన్ ఫర్మ్ చేసుకోవడంకోసం కేప్టెన్ తోకాస్ కి ఫోన్ చేశాడు బాబూజీ.  

 

    "అపాయింట్ మెంటా? అది కాన్సిలైపోయిందిగా?" అన్నాడు తోకాస్.

 

     బాబూజీ భృకుటి ముడిపడింది.

 

    "ఏం? ఎందుకు?" అన్నాడు.

 

    "సార్ ది మూడ్ మారిపోయింది మీటింగ్ కాన్సిల్ చేసెయ్యమన్నారు. మీ ఇండియన్స్ కొంతమందికి మరణశిక్ష విధించారు కూడా మా కోర్టువారు. దాన్ని ఇవాళే అమలు చేయమన్నారు అయ్యగారు: భలే సంభరంగా వుంటుంది లెండి: ఊళ్ళో వున్న జనమంతా ఇవాళే సిటీ సెంటర్లోకి చేరతారు. అక్కడే వుంది గార్డెన్ ఆఫ్ డెత్. దానిలోనే జరుగుతుంది ఇదంతా: మీరూ రండి: తమాషా చూడొచ్చు" అని ఫోన్ పెట్టేశాడు తోకాస్.

 

    సాలోచనగా కాసేపు అలా ఉండిపోయాడు బాబూజీ.

 

    తర్వాత తల పంకించి లేచి వచ్చి కార్లో కూర్చున్నాడు.

 

    కొద్ది నిమిషాల్లో కారు గార్డెనాఫ్ డెత్ ముందాగింది. అక్కడ తండోపతండాలుగా ఉన్నారు జనం. చాలామంది మొహాల్లో ఎగ్జయిట్ మెంట్ కనబడుతోంది సర్కస్ చూడబోతున్నంత హుషారుగా ఉన్నారు వాళ్ళు. ప్రజలకు కూడా గుడ్డ ఇవ్వలేకపోయినా ప్రజల దృష్టిని ఆ సమస్యల మీద గురించి మరల్చటానికి ఇలాంటి ప్రదర్శనలు చాలా చేస్తూనే ఉంటాడు జనరల్ భోజా. అక్కడికొచ్చిన ఇండియన్ సంతతివారు మాత్రం దిగాలుపడి ఉన్నట్లు కనబడుతున్నారు చిత్రద్వీప్ వి ఐ పి లు చాలామంది మంచిమంచి బట్టలు వేసుకుని భార్యాబిడ్డలతో సహా వచ్చారు. జనసందోహాన్ని సోల్జర్స్ రెగ్యులేట్ చేస్తున్నారు.  

 

    గార్డెన్ లోకి నడిచాడు బాబూజీ.

 

    ముందుగా అతన్ని ఆకర్షించింది ఒక విశేషం.

 

    ఆ గార్డెన్ నిండా విగ్రహాలు విన్నాయి. స్త్రీల విగ్రహాలు, జెంట్స్ విగ్రహాలు: అతిసహజమైన భంగిమలతో.

 

    శవాలకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పూత పూయించి అలా విగ్రహాలుగా మార్చేయిస్తాడు జనరల్ భోజా" అన్నాడు ఒక భారతీయ మనిషి జనాంతికంగా. అనేసి, భయంగా అటూ ఇటూ చూసి జనంలో కలిసిపోయాడు అతను.

 

    అందరి మధ్యలో నిలబడి వున్నారు ముగ్గురు నిర్భాగ్యులు. ఒక పురుషుడు, అతడి భార్య, వాళ్ళ కొడుకు, రెండేళ్ళ పసివాడు.

 

    "నీ భార్య తిరుగుబోతని కోర్టు నిర్ణయించింది. అందుకని నువ్వు ఆమెకి ఉరివెయ్యాలని తీర్పు ఇచ్చారు" అన్నాడు ఒక అధికారి.

 

    ఆ మాటలు వినగానే దిక్కులు పిక్కటిల్లేటట్లు అరిచాడు ఆ పురుషుడు.

 

    "కాదు: నా భార్య పతిత కాదు."

 

    "అని కోర్టు నిర్ణయించింది. వెయ్: ఉరి వెయ్యి దాని మెడకి:"

 

    "నన్ను చంపినా సరే: నా భార్యకి అన్యాయం చెయ్యను"

 

    "నిన్ను చంపం: నీ కొడుకు కడుపులో తుపాకి బానెట్ దిగేస్తాం" అన్నాడు.

 

    "అమ్మో:" అని గావుకేక పెట్టిందా స్త్రీ.

 

    "వద్దు: వద్దు: నా కొడుకును చంపొద్దు" అని, "చూస్తారేం: నాకు ఉరి వెయ్యండి" అని ప్రార్థించింది తన భర్తను.

 

    "భారతీ:" అన్నాడు అతను గద్గదికంగా.

 

    ఒక సోల్జరు తుపాకిని పిల్లాడి దగ్గరకు తీసుకొచ్చాడు. దాని బుల్లెట్ మొన పిల్లాడి కడుపుకి తగులుతోంది.

 

    "అయ్యో: అయ్యో: నా కొడుకును వాళ్ళు చంపెయ్యక ముందే నన్ను చంపెయ్యండీ: చంపెయ్యండీ:" అని రోధిస్తోందా స్త్రీ.

 

    తెగించినట్లు ఆ సైనికుడివైపు చూశాడు భర్త.

 

    "సరే నా భార్యను చంపేస్తాను తర్వాత నేనూ చచ్చిపోతాను.

 

    కానీ నా కొడుకుని వదిలెయ్యాలి మీరు... చంపకూడదు. వాణ్ణి శాంతమ్మ పెంచుకొంటుంది."

 

    "సరే:" అన్నాడు అక్కడికి వచ్చిన జనరల్ భోజా నవ్వుతూ. అలా అంటూ అభయం ఇస్తున్నట్లు చేతిని ఎత్తాడు.

 

    కళ్ళు మూసుకొని భార్య మెడలో వురితాడు బిగించాడు భర్త. మూసివున్న అతని కళ్ళలో నుంచి ధారాపాతంగా కారిపోతున్నాయి కన్నీళ్ళు.

 

    అతను కళ్ళు తెరిచేసరికి ఆ వీరమాత ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.

 

    తర్వాత, సిద్ధంగా వున్న మరో త్రాటిని తన మెడకు తగిలించుకున్నాడు అతను ఉరి బిగుసుకుంటున్నప్పుడు ఒక్కసారి, చివరిసారిగా తన కొడుకువైపు చూశాడు.

 Previous Page Next Page