"యురేనియం ఏ ఫారంలోనైనా దొరకవచ్చు. ఇది రాగితో కలిసి ఉండవచ్చు అపార్ టైట్ మాగ్నటైట్ రూపంలో వుండవచ్చు. లేదా చివరికి మామూలు గ్రానైట్ లో కూడా దొరకవచ్చు.
కానీ ఇది ఎక్కువగా దొరికేది యురానిమైట్ అనే ఖనిజంలో. లేదా పిచ్ బ్లెండ్ అనే ఖనిజంలో.
'ఎక్కువగా దొరకడం' అనే ప్రయోగం బహుశా సరికాకపోవచ్చు. ఎందుకంటే యురేనియం ఒకచోట, ఒక ఖనిజంతో దొరికిందీ అంటే అది లక్షలలో కొన్ని భాగాలు మాత్రమే వుందన్నమాట. దీన్ని P.P.M. అంటే పోర్టికల్స్ పర్ మిలియన్ లతో కొలుస్తారు. ఎక్కువ దొరకడం అంటే 05దగ్గర నుంచి 1.5 శాతం వుంటుందన్నమాట. ఇండియాలో ఇది బీహార్ లోని సింగ్ భమ్ థ్రస్ట్ బెల్టులో జాదూగూడా దగ్గర దొరుకుతుంది అక్కడ 4మిలియన్ టన్నుల ఖనిజం లభ్యం కావచ్చని అంచనా. అన్ని మిలియన్ల టన్నులలో నుంచి అతికొద్ది మోతాదులో వున్న యురేనియం మాత్రమే లభ్యం అవుతుంది.
ఇప్పుడు మన వర్క్ సైట్ లో వుపయోగిస్తున్న ఈ మచ్చల రాళ్ళని లేబర్ కాంట్రాక్టర్ ఇక్కడికి సమీపంలోనే వున్న ఒక కొండ మొదలులో నుంచి త్రవ్వించి తెప్పిస్తున్నాడు.
అత్యాశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ రాళ్ళలో యురేనియం ఇంతకుముందు ఎవరూ కనీవినీ ఎరుగనంత మోతాదులో, అంటే ఖనిజంలో నూటికి పది వంతులు వుంది. ఇది అద్భుతం. ఆ ప్రాంతంలో వున్న రాళ్ళు మరికొన్ని కూడా తెప్పించి చూశాను నేను.
ఎంత తక్కువ లెక్ఖ వేసుకున్నా ఒక యాభై మిలియన్ల తన్నులకి తక్కువ వుండదు ఇక్కడ వున్న ఈ ఖనిజం.
ప్రపంచంలో యురేనియం అమ్మకం అంతా దాదాపు బ్లాక్ మార్కెట్లోనే జరుగుతుంది.
దీని అమ్మకాన్ని కంట్రోల్ చేయటానికి ఐక్యరాజ్యసమితి తాలూకు కొన్ని ఏజెన్సీలు వున్నాయి. అయినా బ్లాక్ మార్కెట్ వ్యాపారం యధేచ్చగా సాగిపోతూనే వుంది.
ఒక్క అవున్సు బరువు వున్న యురేనియం విలువ కొన్ని లక్షల రూపాయలు వుంటుంది.
ఆ లెక్ఖన యాభై మిలియన్ల టన్నులలో ఇక్కడ దొరికే యురేనియం విలువ...
ఆ సంఖ్యని చూసేసరికి బాబూజీ కళ్ళు బైర్లు కమ్మాయి.
అంత డబ్బు తన సొంతంకావడం అన్నమాట నిజమే అయితే...
దానితోపాటు...
ఎంత పవరు:
యురేనియం... ఆటంబాంబులు తయారు చేయడానికి పనికివచ్చే యురేనియం... ప్రపంచంలో ఎవరిదగ్గరా లేనంత తన దగ్గర వుంటే...
ఈ ప్రపంచాన్ని శాసిస్తాడు తను:
తాత్కాలికంగా తనే దేవుడయిపోయినట్లు భావన కలిగింది బాబూజీకి.
"ఇది మన ఆఫీసు కాపీ:" అని ఇంకో కాపీ అందించాడు ప్రొఫెసర్ రామనాధం.
రామనాధం చేతిలో రిపోర్టు తాలూకు మరో కాపీ వుండడం గమనించాడు బాబూజీ.
"అదేమిటి?" అన్నాడు.
"ఇది ట్రిప్లికేట్ కాపీ: జనరల్ భోజా సెక్రెటేరియట్ కి పోతుంది."
"ఎందుకు?"
"ఆయన కొత్త ఆర్డరు పాస్ చేశాడు.
"ఏమని?"
"ఇక్కడ వున్న ఇండియన్ కంపెనీలు, ఇక్కడ ఎలాంటి పరిశోధనలు జరిపినా, వాటి వివరాలతో కూడిన కాపీ ఒకటి తన ప్రభుత్వానికి పంపాలని."
బాబూజీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.
చిత్రద్వీప్ ఇంత భారీయెత్తున యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు జనరల్ భోజాకి తెలిసిపోతే, ఇంక తనకు దక్కేది ఏముంది?
సీరియస్ గా అన్నాడు బాబూజీ.
"ప్రొఫెసర్ రామనాధం: మీరు ఏ పరిశోధన తాలూకూ వివరాలు జనరల్ భోజాకి పంపినా నాకు అభ్యంతరంలేదు కానీ ఈ యురేనియం నిక్షేపాలు గురించి మాత్రం జనరల్ భోజాకి ఎట్టిపరిస్థితులలోనూ తెలియకూడదు."
"అదెలా సాధ్యమవుతుందీ" అన్నాడు ప్రొఫెసర్ రామనాధం. "జనరల్ భోజా అంటే నాకూ జుగుప్స ఉంది. అయినా కూడా రూలు రూలే: మనం రూల్సు అతిక్రమించడానికి వీల్లేదు. వీళ్ళ రూల్స్ పాటించడము మనకి ఇష్టం లేకపోతే ఇక్కడ పనుల్ని మానెయ్యడం ఒక్కటే మార్గం" అన్నాడు తెగేసి చెబుతూ.
ప్రొఫెసర్ రామనాధం వైపు అంచనా వేస్తున్నట్లు చూశాడు బాబూజీ.
ఈ ప్రొఫెసర్ వున్నాడే, ఇతను చదువుకున్న మూర్ఖుడు:
తనకు తోచిందే చేస్తాడుగానీ, ఎదుటివాడు చెప్పేది వినిపించుకోడు.
కానీ ఇతని మూర్ఖత్వం వల్ల, అద్భుతమైన అదృష్టం చేయి జారిపోతుంటే తను చూస్తూ ఎలా ఉండగలడు?